తెలుగు జాతి గుండె చప్పుడు
జాతి అస్తిత్వాన్ని పట్టుకునే సాహసయాత్రే ‘తెలుగు జాడలు’పుస్తకం;
- నూకా రాంప్రసాద్ రెడ్డి
యే భాష కైనా బతుకు ముఖ్యం.బతుకు పోరాటంలో వలసలను అనివార్యం చేశారు. ఈ జీవన గమనంలో ఒక జాతి అస్తిత్వం ప్రశ్నార్థకంగా మారుతున్న నేపథ్యంలో వెతికి పట్టుకునే సాహస యాత్ర ఈ పుస్తకం.
శ్రీలంక చరిత్రలో తెలుగు రాజుల ఘట్టం కళ్లకు కట్టినట్లు చిత్రించారు రచయిత ఆర్ ఎం ఉమామహేశ్వరరావు. శ్రీలంక చివరి రాజుల గురించిన అన్వేషణ ఆద్యం గుండెల్ని పిండేస్తుంది.
మారిషస్, మలేషియా దేశంలోని అనేక అనేక అంశాలు చదువుతున్నంత సేపూ, ఆనందం,ఆశ్చర్యం ఒకేసారి తబ్బిబ్బు చేస్తాయి. మన సంస్కృతిని ఎంతో త్రికరణ శుద్ధిగా పాటిస్తూ, తెలుగుదనాన్ని బతికిస్తున్న సోమినాయుడు, సోమన్న సోమయ్య లకు చెప్పడం చాలా చిన్న మాట అనిపిస్తుంది. తెలుగు వాళ్ళ స్వాభిమానం గురించి ప్రశ్నించిన డివి శ్రీరాములు కు వెయ్యి వీరతాళ్ళు వెయ్యాల్సిందే. . ఆయన లేవనెత్తిన అంశాలు ప్రతి తెలుగు వాడూ ఆత్మ పరిశీలన చేసుకోవాల్సినవే.
రబ్బర్ తోటల్లోకి పనిచేయడానికి కూలీలుగా వెళ్లిన మన పూర్వీకుల వివరాలు చదువుతూ ఉంటే అక్షరాలనీ తడి తడిగా తగులుతాయి. అక్కడ మన బంధం తెగిపోకుండా బర్మా నాయుడు చేసిన కృషి కొనసాగాలన్న ఆశ, ఇక్కడి మనుషుల్లో ఉత్తేజం నింపుతుంది.
హోసూరు ప్రాంతంలో తెలుగు భాష అంతరించే అంశాలను నివేదిస్తూ, దానికి అక్కడివారు తీసుకున్న ప్రత్యామ్నాయ పరిస్థితులను కనువిప్పు కలిగించేలా విశ్లేషించారు. యోగి వేమనను జాతీయ కవిగా గుర్తించాలని కేవలం చర్చలకే పరిమితమైన విషయాన్ని రచయిత సందర్భానుసారంగా గుర్తు చేస్తూ, చురక వేస్తారు. తమిళనాడులో తెలుగు అంతరించిపోతున్నప్పటికీ వేమన పద్యం నిత్యం వర్ధిల్లుతున్నదన్న నగ్న సత్యాన్ని మన కళ్ళ ముందుంచారు. అక్కడ వేమన పద్యం పలుకకుండా పెళ్లి జరగదని, దేవుడు ఊరేగడని, శవం కాటికి చేరదని సహా నిరూపిస్తారు.
తెలుగు మీద ఎంతో ప్రేమ ఉంటే తప్ప ఇంత శ్రమకు పూనుకోవడం సాధ్యం కాదు. జర్నలిస్టుగా, కథకుడిగా, పరిశోధకుడిగా ప్రసిద్ధి చెందిన ఆర్ఎం ఉమా మహేశ్వరరావుకు ఇద్దరు వజ్రాల వంటి స్నేహితులు దొరికారు. వారిలో ఒకరు తెలుగు తెలిసిన వారందరికీ సుపరిచితులు స. వెం. రమేశ్, మరొకరు నిత్యసంచారి, నెల్లూరు వాసి అడపాల సుబ్బారెడ్డి. వీరిద్దరి కృషి ఈ పుస్తకంలో కనిపిస్తుంది. తెలుగు మూలాల గురించి అధ్యయనం,చేయాల్సిన వాళ్లకు, పరిశోధకులకు ఈ పుస్తకం ఒక దిక్సూచి.
" నేలకొరిగిన మహా వృక్షానికి మిగిలిన ఆఖరి ఆనవాలు"లా మనం మిగిలిపోకూడదనే ఆవేదన, ఆగ్రహం ఈ పుస్తకమంతా కనిపిస్తుంది.
ఎప్పుడో నిద్రలోకి జారుకున్న మనల్ని తట్టి లేపి, కంటిమీద కునుకు లేకుండా చేయడంలో నిస్సందేహంగా విజయం సాధిస్తుంది.
ఈ పుస్తకంలోని వ్యాసాలన్నీ కేవలం వ్యాసాలు కావు.
మన పూర్వీకుల ఆనవాళ్ళ డాక్యుమెంటరీ చిత్రాలు.
ఇవి తెలుగు జాడలు
తెలుగువారి అడుగుజాడలు
తెలుగు జాతి గుండె చప్పుళ్లు.
ప్రతి పేజీని అక్షరమంత ఆప్యాయంగా తీర్చిదిద్దారు. ప్రతి ఇంట్లో అపురూపంగా ఉండవలసిన పుస్తకమిది.
మరో ప్రత్యేకత ఏమిటంటే ఈ పుస్తకం అమ్మకాలపై వచ్చే ప్రతి రూపాయీ తెలుగు నెరవు అనే సంస్థకు అందుతుంది. శ్రీలంక మూలవాసులైన తెలుగుజాతి అహికుంటికల జీవనాన్నిస. వెం రమేశ్ నేతృత్వంలో దృశ్య రూపంలో చిత్రీకరించి,భద్రపరిచే పనికి ఈ మొత్తాన్ని వినియోగిస్తారు. వెల రు. 250 ప్రతులకు: కళా చిత్ర ప్రచురణలు, మన్నారు పోలూరు సూళ్లూరుపేట, తిరుపతి జిల్లా—524121 ( ఫోన్ నెంబర్లు 8886066501
8179866501)సంప్రదించవచ్చు.