ఆవగాయ అన్నం ఆరగించి వెళ్లిన దొంగల కథ....

బందరు దగ్గిర వేమవరం. దూరాన్నుంచి తైలవర్ణం చిత్రంలా కనిపించే ఊరు.మధ్య చెరువు, చుట్టూర ఇళ్లు, కొబ్బరి, తాటి చెట్లు. ఊరంతా పెంకుటిళ్లు: అమ్మ చెప్పిన ముచ్చట్లు : 5

Update: 2024-01-14 02:20 GMT


అమ్మ చెప్పిన ముచ్చట్లు-5


-రాఘవ శర్మ


“మా ఇంట్లో దొంగలు పడ్డారు" అన్నది మా అమ్మ.
“దొంగలు పడి ఏం ఎత్తుకుపోయారు?” అడిగాను నేను.
“ఏం ఎత్తుకుపోతారు వాళ్ళ పిండాకుడు.
మా అవకాజాడీలన్నీ పాడు చేసిపోయారు” అంది.
“అసలేం జరిగిందో చెప్పమ్మా" అన్నా.
ఇలా చెప్పడం మొదలు పెట్టింది.
"ఆ రోజుల్లో టిఫిన్లేం ఉన్నాయి!?
మా ఇంట్లో పొద్దున్నే పెద్ద వాళ్ళంతా పెద్ద పెద్ద ఇత్తడి లోటాల్లో ఒకటికి రెండు సార్లు కాఫీ తాగే వాళ్ళు.
ఆ ఇత్తడి లోటాలకు లోపల కళాయి పోసి ఉండేది.
మధ్యాహ్నం వరకు వాళ్ళకు భోజనం ఉండేది కాదు.
మేం కూడా ఒక సారి కాఫీ తాగే వాళ్ళం.
ఉదయం పూట పిల్లలకు చద్దాన్నాలు పెట్టే వాళ్ళు.
రాత్రి పడుకోబోయే ముందు పెద్ద కంచుగిన్నెతో అన్నం వండేది మా అమ్మ.
పొద్దున కాఫీలయ్యాక, స్నానాలు ముగించుకుని పిల్లలమంతా చద్దన్నం తినే వాళ్ళం.
చద్దన్నంలోకి అవకాయి వేసుకునే వాళ్ళం.
ఒక్కొక్కసారి, మాగాయి వేసుకుని, అందులో పెరుగేసుకుని తినేవాళ్ళం.
మాగాయన్నంలో పెరుగేసుకుంటే ఎంత బాగుండేదో!
చింతకాయ, ఉసిరికాయ కూడా ఉండేవి.
చివరికి చిక్కటి మజ్జిగ పోసుకుని కలుపుకునే వాళ్ళం.
ఆ చిక్కటి మజ్జిగకు చెయ్యంతా జిడ్డోడేది.
ఆ మజ్జిగన్నంలో అవకాయ ముక్క కొరుక్కునే వాళ్ళం.
అన్నం తిన్నాక కూడా అవకాయ ముక్క చీకుతూ ఉండేవాళ్ళం.
పుల్లపుల్లగా ఎంత బాగుండేదో!" అంటూ మా అమ్మ చెపుతుంటే ఆ దృశ్యం కళ్ళ ముందే జరుగుతున్నట్టు నోరూరేది.
మా అమ్మ చివరి రోజుల్లో కూడా చిన్న పిల్లలా అవకాయ ముక్కను పారెయ్య కుండా అట్టిపెట్టుకుని, పెరుగన్నంలో నంచుకుంటూ, ఆ ముక్కను చాలా సేపు చీకేది.
“ఇంక చాల్లేమ్మా” అంటే ఒదిలేది కాదు.
“ఉగాది దాటగానే మా అమ్మ పెద్ద పెద్ద జాడీలకు అవకాయ, మాగాయ వేసేది.
ఆయా సీజన్లలో దొరికే చింతకాయ, ఉసిరికాయ కూడా పెట్టేది. అవసరమైనప్పుడు చింతకాయ, ఉసిరికాయ కాస్త కాస్త తీసి నూరుకుంటే తప్ప వేసుకోవడానికి వీలు పడేదికాదు.
మధ్యాహ్నం భోజనంలో అందరికీ అవకాయ ఉండి తీరాల్సిందే.
రోజూ వేసుకుని తిన్నా ఏడాది పొడవునా సరిపోయేంత అవకాయ పెట్టేది మా అమ్మ.
ప్రతి ఏడాది అవకాయ పెట్టడం ఒక పెద్ద సందడిలా ఉండేది.
మా నాన్న ఊరగాయకు పనికొచ్చే మామిడి కాయలు తెప్పించేవాడు.
వాటిని కడిగి తుడిచి ఆరపెట్టే వాళ్ళం.
మా శేషన్నయ్య పెద్ద కత్తిపీటతో మామిడి కాయలు కొట్టేవాడు.
మేమంతా కూర్చుని దానిలో జీడి తీసేవాళ్ళం.
టెంకకు అతుక్కొని ఉన్న సన్నని పొరనుకూడా తీసేసేవాళ్ళం.
మా అమ్మ మెరపకాయలను పెద్ద పెద్ద రోకళ్ళతో దంపించేది.
అవాలను కూడా ఎండబెట్టి దంపించేది.
గానుగకు వెళ్ళి మా శేషన్నయ్య నువ్వుల నూనె తెచ్చే వాడు.
ఒక్కొక్క సారి వేరుశెనగ నూనె కూడా పోసేవాళ్ళం.
మడికట్టుకుని మా అమ్మ అవకాయ పెట్టేది.
కొన్ని రోజులకు తిరగ్గలిపేది.
కొత్తావకాయ పెడుతుండగానే ఎప్పుడెప్పుడు వేసుకుందామాని నోరూరేది.
వేసవి వచ్చిందంటే అవకాయ మాగాయ వేయడం ఒక పెళ్ళిపనిలా సాగేది.
మా ఇంట్లో పెళ్ళిళ్ళు వచ్చాయంటే అవకాయ మరింత ఎక్కువ పెట్టే వాళ్ళు.”

“అవకాయ, మాగాయ కావలసినప్పుడు మడికట్టుకుని ఒక చిన్న జాడీలోకి తీసేది మా అమ్మ.
అలా తీయడం అయిపోయాక మళ్ళీ 'వాసిన' కట్టే వాళ్ళు.
జాడీలకు మూతపెట్టి, దాని పైన ఉతికిన చీర చింపిన గుడ్డ కానీ, పంచె చింపిన గుడ్డ కానీ కప్పి, దాని మెడకు ఉరేసినట్టు గుడ్డ పీలికతో కట్టడమే 'వాసిన' కట్టడం.
ఎప్పుడు పడితే అప్పుడు అవకాయ జాడీలు ముట్టుకునే వారు కాదు.
ఇంట్లో ఎవరినీ తాకనిచ్చేవారు కాదు.”

వేమవరంలో సూర్యాస్తమయం


 


"వేసవి కాలం వచ్చిందంటే చాలు, అంతా ఆరుబయట పడుకునే వాళ్ళం.
ఒక సారి ఏమైందంటే, తెల్లారి లేచి చూసే సరికల్లా ఒంటింటి తలుపులు బార్లా తెరుచుకుని ఉన్నాయి.
ఇల్లంతా చిందరవందరగా తయారైంది.
దొంగలు పడ్డారని అర్థమైపోయింది.
మిగతా గదుల్లో కెళ్ళి చూశాం.
డబ్బుకానీ, బంగారం కానీ ఏమీ ఎత్తుకుపోలేదు”
“వంటింటిని చూస్తే మా అమ్మకు ఏడుపొచ్చేసింది.
చాలా అసహ్యకరంగా తయారుచేసిపోయారు.
మా అమ్మ నోటికొచ్చినట్టు వాళ్ళకు శాపనార్థాలు పెట్టింది.
దొంగలు ఎంతమంది వచ్చారో తెలియదు.
పొద్దున్నే మా చద్దన్నం కోసం పెద్ద కంచు గిన్నెకు ఒండి పెట్టిన అన్నమంతా అవకాయ వేసుకుని తినేశారు.
మాగాయి కూడా వేసేకున్నారు.
గరిటతో తీసుకోలేదు.
అంట చేతులతోనే అవకాయ, మాగాయ దేవుకుని తినేశారు.
ఎంగిలి చేతులతోనే దేవుకున్నారు.
అవకాయ, మాగాయ జాడీల్లో అన్నం మెతుకులున్నాయి.
ఆ జాడీలు ఎందుకు పనికొస్తాయి!
తిన్న కంచాలు చిందర వందరగా పడేసి పోయారు,” అని వివరించింది.
ఆ మాట వినేసరికి నేను నవ్వు ఆపుకోలేకపోయాను.
.ఛ“అలా నవ్వుతావేరా బాబు!?” అంది మా అమ్మ.
“నవ్వక ఏం చేయమంటావ్" అన్నా.
మళ్ళీ చెప్పడం మొదలు పెట్టింది.
“మాకు మళ్ళీ వచ్చే వేసవి వరకు అవకాయ లేదన్న దిగులు పట్టుకుంది.
ఆ అవకాయ జాడీలు ఎందుకూ పనికి రావు, పారేయడానికి తప్ప.
మళ్ళీకొత్త జాడీలు కొనుక్కోవాలి.
'ఆ దొంగ తొత్తుకొడుకులు ఎంగిలి చేసిన అవకాయ, ముట్టుకున్న జాడీలు మళ్ళీ ఎట్లా వాడతాం' అన్నది మా అమ్మ.
మనుషులను పిలిపించి జాడీల్లో మిగిలిన అవకాయనంతా హరిజనులకు పెట్టించేసింది.
ఇల్లంతా శుభ్రం చేయించింది.
ఎన్ని కొత్త కంచాలు, గ్లాసులు కొన్నదో తెలియదు.
మునసబు గారింట్లో దొంగలు పడ్డారనే సరికి పోలీసులు వచ్చారు.
'ఇది 'వాళ్ళ' పనే అయి ఉంటుంది' అని పోలీసులు తేల్చారు” అన్నది మా అమ్మ.
దొంగలుపడ్డం కాదు కానీ, ఏడాది పాటు మా చద్దన్నంలోకి అవకాయ, మాగాయ లేకుండా పోయాయి” అన్నది బాధపడుతూ.


 



 అవకాయ అన్నం తినిపోయిన వారి గురించి ఇది 'వారి' పనే అన్నారు పోలీసులు.

ఎవరీ 'వారు'? అన్నది ప్రశ్న.
'వారు' అంటే సెటిల్మెంట్లో ఉండే మనుషులు.
వారి వృత్తి దొంగతనాలు, దారి దోపిడీలు.
దొంగతనాలు చేసేవారిని, దోపిడీలు చేసేవారిని బ్రిటిష్ ప్రభుత్వం సంస్కరించాలనుకుంది.
వారందరికీ కుటుంబాలతో ఒకే దగ్గర నివాసమేర్పాటు చేసింది.
నెల్లూరు జిల్లాలో కప్పరాళ్ళ తిప్ప, ప్రకాశం జిల్లాలో స్టూవర్ట్ పురం ఇలా వెలిసినవే.
వారికి కనీస సదుపాయాలు, ఉపాధి కల్పించి, సంస్కరించాలనుకున్న ప్రభుత్వం ఆ ధ్యేయాన్ని చిత్త శుద్ధితో చేయలేదు.
ఎక్కడ దొంగతనం జరిగినా ఈ సెటిల్ మెంటు వారినే పట్టుకొచ్చి పోలీసులు చావబాదేవారు.
పోలీసులు కొందరిని కాల్చి చంపేసి అవార్డులు, రివార్డులు, ప్రమోషన్లు పొందారు.
ఈ 'సెటిల్ మెంట్ దొంగలు' సమాజం తయారుచేసిన నిర్భాగ్యులు.
ఇప్పుడు పరిస్థితి మారిపోయింది.
వారిలో చాలా మంది చదువుకుని మంచి మంచి ఉద్యోగాల్లో స్థిరపడిపోయారు.
నేను బాపట్లలో డిగ్రీ చదివే రోజుల్లో నా క్లస్ మేట్ ఒకరు స్టూవర్ట్ పురం నుంచి వచ్చేవాడు.
ఫస్టియర్లోనే అతనికి ఎస్టీ రిజర్వేషన్ కింది రైల్వేలో ఉద్యోగం వస్తే చదువు వదిలేసి వెళ్ళిపోయాడు.
స్టూవర్ట్ పురంలో దొంగతనాలు, దోపిడీలు చేసేవారిప్పుడు ఎవ్వరూ లేరని చెప్పాడు.
పదవ తరగతి పాసైతే చాలు ఉద్యోగాలు వచ్చేస్తాయని చెప్పాడు.
దొంగతనానికి వచ్చిన వీరు నగలు, డబ్బు దోచుకోకుండా, కేవలం ఊరగాయలేసుకుని అన్నం తినేసి ఎందుకు వెళ్ళిపోయారు?
కేవలం తిండి కోసం దొంగతనానికి వచ్చారంటే, తిండికి వారెంత మొహవాచారో!?
కాస్తో కూస్తో భూములున్న కుటుంబాలు తింటున్న అవకాయన్నానికి కూడా ఆశపడ్డారంటే వారి దీన స్థితి ఎలాంటిదో చెప్పాల్సిన అవసరం లేదు.
కరువు కాటకాలు సంభవించినప్పుడు, విపరీతంగా ఆహార సమస్య ఏర్పడినప్పుడు తిండి కోసం కూడా ఇలా దొంగతనాలు జరుగుతాయి.
తిండి తిన్నారు సరే, వంటింట్లో దొడ్డికి కూర్చుని పోవడమేమిటి?
'మాకు ఒక్క పూట కూడా తిండి దొరకని రోజుల్లో వీళ్ళు ముప్పొద్దులా ఎలా మెక్కుతారు!?' అన్న కసి వారి చేత ఆ పనిచేయించింది.
మళ్ళీ మా అమ్మ చెప్పడం మొదలు పెట్టింది.
“మా నాన్నకు వారసత్వంగా వచ్చిన మునసబుగిరి కాస్తా జారిపోతోంది.
మా పెద్దన్నయ్యకు టీచర్ ఉద్యోగం రావడంతో వేమవరం వదిలి వెళ్ళిపోయాడు.
మా రెండవ అన్నయ్యకు చదువు లేదు.
దాంతో మునసబుగిరి కాస్తా మా పెదనాన్న కొడుకులకు వెళ్ళిపోయింది.
నా పెళ్ళైన కొన్నేళ్ళకు మా కుటుంబం బందరుకు వచ్చేసింది.
కుటుంబం దెబ్బతింటుండేసరికి మా గంగులు మావయ్యకు వైరాగ్యం వచ్చింది.
భార్యను పుట్టింట్లో వదిలేసి సన్యాసుల్లో కలిసిపోయాడు.
ఎక్కడున్నాడో తెలియదు.
వేసవి సెలవులకని నేను, మా వారు బందరు వచ్చేసరికి పరిస్థితి దారుణంగా తయారైంది.
ఇద్దరు చెల్లెళ్ళు, ఇద్దరు తమ్ముళ్ళు, చిన్నన్నయ్య, అమ్మా, నాన్న, భర్త వదిలేసి వెళ్ళిపోయిన పెద్దక్కయ్య.
బందరులో ఉండి ఒక్కో ఎకరా, ఒక్కో ఎకరా అమ్ముకోవడం మొదలుపెట్టారు.
పొలం అమ్ముకున్న డబ్బులతోనే రోజులు గడుస్తున్నాయి.
మా ఆయన చాలా చోట్ల వెతికి చూసేసరికి మా గంగులుమావయ్య కాషాయ గుడ్డల్లో గంజాయి దమ్ములాగుతూ సన్యాసుల్లో కనిపించాడు.
మంచి మాటలుచెప్పి మా గంగుల మావయ్యను ఇంటికి తీసుకొచ్చారు.
మా గంగులమావయ్య మా అక్కయ్యను తీసుకుని గుడివాడ వెళ్ళిపోయాడు.
మానాన్న పోయాడు.
అప్పటికే మా సీతొదిన కూడా పోయింది.
మా పెద్ద తమ్ముడిని నేను వనపర్తికి తీసుకొచ్చాను.
మా చిన్నన్నయ్యే రైస్ మిల్లు డ్రైవర్గా రాత్రింబవళ్ళు పనిచేసి, అమ్మను, చిన్న తమ్ముడిని, ఇద్దరు చెల్లెళ్ళను పోషిస్తున్నాడు.
బాగా బతికిన కుటుంబంలో దుబారా, వ్యససనాల వల్ల ఆస్తి మొత్తం ఊడ్చుకుపోయింది.
చివరికి మాచిన్నన్నయ్య రెక్కల కష్టమే మిగిలింది.
కాస్తో కూస్తో చదువుకుని గవర్నమెంటు ఉద్యోగం సంపాదించిన మా పెద్దన్నయ్య తన దారి తాను చూసుకున్నాడు.
వ్యసనాలకు బానిసయ్యాడని మేమంతా బాధపడిన మా చిన్నన్నయ్య శేషన్నయ్యే కుటుంబాన్ని ఆదుకున్నాడు.” అంటూ మా అమ్మ గట్టిగా నిట్టూర్చింది.

(ఇంకా ఉంది)


 అమ్మచెప్పిన ముచ్చట్లు 4వ భాగం ఇక్కడ చదవవచ్చు




Tags:    

Similar News