నదీమ తల్లి భయం (Saturday Poem)
మూలం: ఖలీల్ జీబ్రాన్ , అనుసృజన : రాఘవ
By : రాఘవ
Update: 2024-07-06 05:00 GMT
ఒక నది చెప్పింది కదా,
సముద్రంలో సంగమించే ముందు
ఒణికిపోయానని,
వెనక్కి తిరిగి
ప్రయాణించి వచ్చిన దారినంతా చూసుకున్నానని.
ఎత్తైన పర్వత శిఖరాల నుంచి
ఊళ్ళను, అడవులను దాటుకుంటూ
మెలికలు తిరిగిన రోడ్డునుంచి
దీని ముందుకు చేరాను.
ఇక్కడికొచ్చి,
ఇక ఎప్పటికీ కనిపించకుండా
అదృశ్యం కావడం తప్ప
ఇక ఏమీ లేదు
వేరే మార్గం లేదు
వెనక్కి వెళ్ళలేను
ఎవ్వరూ వెనక్కి వెళ్ళ లేరు.
మనుగడ కోసం వెనక్కి వెళ్ళడం సాధ్యమే కాదు.
సముద్రంలో ఇక సంగమించిపోక తప్పదు.
ఇక్కడి నుంచి అదశ్యమైపోతున్నానన్న భయం పట్టుకుంది.
సముద్రంలో కలసిపోతున్నందుకు కాదు,
సముద్రమై వస్తున్నందుకు