హరప్పాలో సామరస్యపూర్వక కొత్త శకానికి నాంది

ఒక సాంస్కృతిక మహా సంగ్రామం. హరప్పనుల గాథ. అధ్యాయం 11. మూలం: The Greatest Battle of Culture (The Story of Harappans) by Bethi Panigrahi. తెలుగు: ఆడెపు లక్ష్మీపతి

Update: 2024-11-18 07:05 GMT

క్షమాపణలు చెప్పిన ఆర్యులు పునరుద్ధరణ కి నడుం బిగించడంతో సామరస్య పూర్వక కొత్త శకానికి ఆ ప్రాంతంలో పునాది రాయి పడింది. అణచివేత లక్ష్యంతో వచ్చిన ఆర్యులు మనసు మార్చుకుని నిజాయితీగా స్నేహ హస్తం సాచడం చూసి హరప్పనులు వారిని మరోమారు నిండు మనసుతో స్వాగతించారు.

ఇరు సమాజాల వారు భుజం భుజం కలిపి హరప్పనుల కోల్పోయిన సాంస్కృతిక వారసత్వాన్ని తిరిగి నిర్మించడానికుపక్రమించారు. ఆర్య పండితులు ప్రాచీన ప్రతుల్ని అనువదించి పరిపక్షించే పనిలో హరప్పన్ ఋషులతో తోడుగా నడిచారు ; హరప్పన్ కళాకారులు నష్టపోయిన కళా కృతులను పునః సృజించడంలో ఆర్యజాతి వృత్తి నిపుణులకు సహకారం అందించారు.

ఒక రోజు, వాళ్ళు ఒక కొత్త దేవాలయ నిర్మాణ పనిలో వుండగా ఒక హరప్పన్ కళాకారుడు సమీపం లోని ఆర్యజాతి వృత్తి నిపుణుడి వేపు తిరిగి, ‘‘ఒక ఆర్యుని పక్కన నిలబడి కలిసి పని చేస్తానని నేనెప్పుడూ అనుకోలేదు ; కానీ మనం కలిసి పనిచేస్తున్నందుకు నాకు చాలా సంతోషంగా వుంది,’’ అని అన్నాడు.

ఆర్యజాతి వృత్తి నిపుణుడు నవ్వుతూ బదులిచ్చాడు. ‘‘నేను ఇప్పటికే మీనుంచి చాలా విషయాలు నేర్చుకున్నాను. మన ఇరు సమాజాల ప్రజలు ఒకరి నుంచి మరొకరు ఎంతో నేర్చుకోవాల్సి వుంది.’’

ఒక నూతన సాంఘిక జీవన విధానం స్థాపించేందుకు హరప్పన్ రాజు బాగుహర, ఆర్యజాతి ముఖ్యులు కలిసి కట్టుగా శ్రమించారు ; సాంస్కృతిక భిన్నత్వాన్ని సమాదరించడం, పరస్పర అవగాహనని ప్రోత్సహించడం... ఆ విధానంలోని ముఖ్యాంశాలు. తగాదాలు పరిష్కరించడం, సహకారాన్ని ఇతోధికం చేయడం లక్ష్యంగా ఇరు సమాజాల నుంచి స్త్రీలు, పురుషులతో కూడిన ఒక జ్ఞానుల సమితిని ఏర్పాటు చేశారు. ఆ సమితి ఆ ప్రాంతానికి ఆశాదీపంగానూ, క్షమ-పరస్పర గౌరవం –విస్తృత అవగాహన లతో సాధించగలిగిన సత్ఫలితానికి ప్రతీకగానూ రాణించింది.

బాగుహర సమితి సమావేశంలో ప్రసంగిస్తూ, ‘‘మిత్రులారా, దీనిని మన ప్రధాన కర్తవ్యంగా భావించాలి. హరప్పనులు, ఆర్యులు కలిసి పెరిగే, భిన్నత్వాన్ని గౌరవించి ఒకరి నుంచి ఒకరు నేర్చుకునే ఒక కొత్త తరాన్ని మనం సృష్టిద్దాం. మన పిల్లలు గత ఇక్కట్లను మరచి శాంతిగా, సామరస్యంగా జీవించే భవిష్యత్తుని నిర్మించుదాం..’’ అన్నాడు.

సమితి సభ్యులు అంగీకారంగా చప్పట్లు కొట్టారు, అందరి ముఖాల్లో ఒక కృత నిశ్చయ భావన వెల్లివిరిసింది. అదంత సులభం కాదని వాళ్లకి తెలుసు, అయినా అ కలని నిజం చేయడానికి కంకణ బద్ధులై పోయారు.

రాకుమారి ఆర్మిత ఇలా అన్నది: ‘‘మన తప్పిదాల నుంచి మన పిల్లలు గుణ పాఠాలు నేర్చుకునేలా చూడాలి. భయ, ద్వేషాల సంకేతాలను గుర్తు పట్టడం, వాటికి వ్యతిరేకంగా పోరాడటం.. నేర్పించాలి. అన్యాయాన్ని ఎదిరించి న్యాయం పక్షాన నిలబడగలిగే ధైర్యం వాళ్లకి నూరిపోయాలి.’’

వరుణ్ ఆమెతో ఏకీభవిస్తున్నట్టుగా తలూపాడు. ‘‘మనం వాళ్లకి క్షమాగుణం, ఎదుటివాళ్ళను అర్థం చేసుకునే స్వభావం బోధించాలి. మన ప్రజలు చాలా ఏళ్లుగా భయం, ద్వేషం దుష్ఫలితాలు అనుభవించారు. గాయాలు నయం చేసుకుంటూ కలిసి ముందుకు సాగవల్సిన తరుణం ఆసన్నమైంది.’’

‘‘పిల్లల చదువులు, మానసిక వికాసం పర్యవేక్షించేందుకు హరప్పన్, ఆర్య నాయకులతో కూడిన ఒక సంయుక్త సమితిని ఏర్పాటు చేయాలని నా ప్రతిపాదన. మనందరి కోసం మరింత ఉజ్వలమైన భవిష్యత్తు నిర్మించేందుకు మనం కలిసి కట్టుగా పని చేయాలి..’’ అన్నాడు బాగుహర.

సమితి సభ్యులు అతని ప్రతిపాదనని బలపరిచారు. అమితమైన ఆశ, అంకిత భావాలను ప్రకటిస్తూ సమావేశం ముగిసింది, ఎట్టకేలకు హరప్పనులు, ఆర్యులు శాంతి, సామరస్యం కోసం ఒక మార్గం ఎంచుకుని, దాని వెంటే నడవడానికి కృత నిశ్చయులైనారు.

సమితి సమావేశ మందిరం నుంచి బయటకు వస్తూ ఆర్మిత వరుణ్ వేపు చూసి అన్నది.‘‘ఒక ఉమ్మడి లక్ష్యం దిశగా మనం పని చేస్తున్నందుకు నాకు సంతోషంగా వుంది. మన ఇరు వర్గాల పిల్లలు శాంతి సౌభాగ్యాల కొత్త యుగాన్ని ఆవిష్కరిస్తారని విశ్వసిస్తున్నాను.’’

వరుణ్ మందహాసం చేశాడు. ‘‘రాజకుమారీ, నేనూ అదే ఆశిస్తున్నా.. సమైక్యంగా మనం ఘనకార్యాలు సాధించగలం.’’

సామరస్యానికి అంకురార్పణ జరిగి రాజ్యం సుభిక్షమై వర్ధిల్లింది. పంటలు విరివిగా పండాయి, నదులు ఎడతెగకుండా పారాయి, ఆకాశం తేటగా ప్రకాశించింది. ఒకప్పుడు వర్గాలుగా చీలి వున్నఆ ప్రాంత ప్రజలు ఇప్పుడు ఉన్నతమైన మానవ విలువలు పాదుకొన్నకొత్త జీవన విధానాన్ని అవలంబించి దాని మాధుర్యాన్ని ఆస్వాదించారు.

మాతృ దేవతా మూర్తిని కొలుచుకునే ఒక పర్వదినాన ఆర్మిత ఇలా ప్రకటించింది: ‘‘గత కాలపు చీకటి నుంచి బయటపడి మనం చాలా దూరం ప్రయాణించాం. మరింత ఉజ్వలమైన భవిష్యత్తు దిశగా మన ప్రయాణం ఇలాగే కొనసాగిద్దాం.’’

సంవత్సరాలు గడిచాయి, దేశం సుభిక్షంగా వర్ధిల్లింది. వర్తక, సాంస్కృతిక వినిమయం ఇతోధికమైంది ; విజ్ఞానం, వికాసం అన్వేషణలో హరప్పనులు, ఆర్యులు ఏకతాటిపై నడిచారు. కోల్పోయిన హరప్పనుల వారసత్వం పునరుద్ధరించబడింది, వారి సంస్కృతి ఆ ప్రాంత వైభవోపేత చరిత్రలో విడదీయరాని భాగమై పోయింది.

హరప్పనులు వ్యవసాయంలో తమ అనుభవనైపుణ్యాన్ని ఆర్యులతో పంచుకున్నారు; అధునాతన సాగునీటి మెళకువలు, పంట మార్పిడి పద్ధతులతో పాటు రాళ్ళ మయమైన బంజరు నేలల్లో పంటలు పండించే విధానాలు నేర్పించారు. ఈ విజ్ఞానం తమ సాగు విధానాల్ని మెరుగు పర్చుకునేందుకు ఆర్యులకు ఎంతగానో ఉపకరించింది. దిగుబడులు పెరిగి ఇరు వర్గాల వర్గాల సంపదను వృద్ధి చేసి ఆహార భద్రత పెంచింది.

ప్రత్యుపకారంగా, ఆర్యులు పశుపోషణ, లోహపని ముట్ల కి సంబంధించిన విజ్ఞానాన్నిహరప్పనులకు అందించారు, దీనితో సాంస్కృతిక మారకం ఇంకా పెరిగింది.

అలా హరప్పనులు, ఆర్యులు ఎల్ల కాలం నిలిచి వుండే శాంతి, సామరస్యాలను పాదు కొల్పారు. ఒకప్పటి వారి కల్లోలభరిత గతం స్థానాన్ని ఇప్పుడు క్షమ, సహకారస్ఫూర్తి, మనిషిలోని సహజాత పురోగమన, పరివర్తనా సామర్థ్యం ఆక్రమించాయి. (సశేషం)

Tags:    

Similar News