హారప్పనుల పశుపతి మంత్రశక్తి లో ఆర్యులు

ఒక సాంస్కృతిక మహా సంగ్రామం. హరప్పనుల గాథ. అధ్యాయం 13. మూలం: The Greatest Battle of Culture (The Story of Harappans) by Bethi Panigrahi. తెలుగు: ఆడెపు లక్ష్మీపతి

Update: 2024-11-20 08:12 GMT

హరప్పనులతో పూర్తిగా మమేకమైన ఆర్యులు వాళ్ళ నుంచి చాలా విషయాలు నేర్చుకునే క్రమంలో పశుపతి అనే విశిష్టమైన, అతి శక్తిమంతమైన దైవం పట్ల ఆకర్షితులయ్యారు, ఆ దైవమే శివుడు అని తర్వాత తెలిసింది. అనేక చేతులతో, ఒక్కో చెయ్యి విశ్వం యొక్క ఒక్కో పార్శ్వానికి ప్రాతినిధ్యం వహిస్తున్నట్టుగా, అతి భారీఆకారంలో ఆ దేవుడు చిత్రితమై వున్నాడు. ఆయన తీక్షణమైన చూపులు అజ్ఞానపు పొరలను చీల్చి జిజ్ఞాసువులకు అంతిమసత్యం సాక్షాత్కరింపజేస్తాయని అక్కడి వారి విశ్వాసం.

లయకారుడైన పశుపతి సకల విశ్వానికి ప్రభువు, స్థలకాలాల అధినేత, జీవన్మరణ చక్రాల సంరక్షకుడు. పవిత్రచిహ్నమైన త్రిశూలం విశ్వం యొక్క మూడు అంశాలకు ప్రాతినిధ్యం వహిస్తుంది : సృష్టి, సంరక్షణ, వినాశనం. అతని లయాత్మక నృత్యం లేదా తాండవం విశ్వశక్తుల మధ్య సామరస్యం, క్రమత ఎల్లప్పుడూ కొనసాగేలా సంతులనం చేస్తుంది.

సంవత్సరాలు గడిచిపోయాయి. భూమి మీద ఆర్మిత, భరద్వాజ, వరుణ్ ల ఆయుష్షు తీరింది. కరుణ, విజ్ఞానాల వారసత్వం మిగిల్చి వారు పరలోకం వెళ్ళిపోయారు. కాలక్రమేణా వారి గురించిన స్మృతులు మసక బారినాయి, కానీ హరప్పనులను కాపాడాలన్న వారి కృషి ఫలితం సజీవంగా వుంది ; అది సేద దీర్చే చల్లని గాలిలా యుగాల తరబడి వీచింది.

ఒక నవోషస్సు ఉదయించినట్టుగా, హరప్పనుల - ఆర్యుల మధ్య సహకారానికి సంబంధించి ఒక నూతన అధ్యాయం ఆరంభమై ఒక కొత్త భవిష్యత్తుకి. సుసంపన్న వారసత్వపు కొనసాగింపుకి భరోసా ఇచ్చింది.

జాబిల్లి కురిపించే వెండి వెలుగులలో జనసమ్మర్ద వీధులు, అంగళ్లు తెల్లగా మెరిసిపోతున్న చైతన్య వాహిని వంటి రాఖీగడి నగరంలో ఇంద్ర సేనుడనే యువ ఆర్యయోధుడు అందరి దృష్టిని ఆకర్షించాడు. నిశితమైన చూపుల గోధుమ వన్నె కళ్ళు, యుద్ధవిద్యల్లో ప్రవీణుడని సూచించే కండలు తిరిగివున్న దేహం, విశాలమైన భుజాలు, బలిష్టమైన దవడలు, నిటారైన నాసిక..అతడిని దృఢ సంకల్పుడైన క్షత్రియ యోధుడిగా చాటాయి. అతడి నరనరాల్లో నికార్సైన క్షత్రియ రక్తం ప్రవహిస్తోంది, అతని హావభావాలలో ఎవరికీ తలవంచని ధైర్య స్తైర్యాలు ప్రస్ఫుటమవుతున్నాయి.

గొప్పవాడినవాలనీ, ప్రపంచం మీద తన చెరగని ముద్ర వేయాలనీ అతడికి బాల్యం నుంచే తీవ్రమైన కోరిక. అనేక ప్రాచీన గ్రంథాలు తిరగేసి ప్రఖ్యాత వీరుల గాథలు చదివాడు, తాను కూడా వారి స్థాయిని అందుకోవాలని తహతహలాడుతున్నాడు. అతని దీక్షా సంకల్పాలు చూసి అతని తలిదండ్రులు, అధ్యాపకులు సైతం ఆశ్చర్యపోయేవారు ; ప్రతి పోటీలో, పరీక్షలో సునాయాసంగా నెగ్గగలిగే అతని ప్రతిభాపాటవాలు చూసి అతని సావాసగాళ్ళు విభ్రమంతో నోరెళ్ళబెట్టేవారు.

క్షత్రియ కుటుంబంలో పుట్టిన వాడైనందున పరువు ప్రతిష్టలు, కర్తవ్యం తన జీవితాదర్శాలుగా భావించాడు ఇంద్రసేనుడు. అతని కుటుంబం చాలా గౌరవప్రదమైనది, పలుకుబడి గలది కూడా. చిన్నతనం నుంచే అతడు యుద్ధవిద్యల్లో, నాయకత్వ కళలో శిక్షణ పొందాడు. కేవలం తన పూర్వీకుల అడుగుజాడల్లో నడవడం తనకు తృప్తి కలిగించదని భావించిన ఇంద్రసేనుడు, తన ఆశయానికి అనుగుణంగా ఎంచుకున్న మార్గంలో పోవాలని, తన భవిష్యత్తుని తానే నిర్మించుకోవాలని నిశ్చయించుకున్నాడు.

ఒకనాడు ఇంద్రసేనుడు ఒంటరిగా వేటకు వెళుతుండగా ఒక కొత్త వ్యక్తి ఎదురుపడ్డాడు, ఆ వ్యక్తే అతని జీవితాన్ని సమూలంగా మార్చివేసిన నాగశౌర్యుడనే హరప్పన్ సాధువు. ప్రాచీన కళల్లో ప్రవీణుడనని పరిచయం చేసుకున్న ఆ రుషి, ఇంద్రసేనుడిలో ఉత్తమ యోధుని లక్షణాలు గుర్తింఛి యుద్ధకళ రహస్యాలు, వ్యూహం, నాయకత్వ మెళకువలు నేర్పించాడు.

“నా యువ నేస్తం, ఇంద్రసేనా..” మృదువుగా అన్నాడు నాగశౌర్యుడు, “శివుడు అంటే నిజంగా ఏమిటో తుదకు నీకు అర్థమై వుంటుందనుకుంటా..”అరమోడ్పు కళ్ళతో అతడు చిన్నగా నవ్వాడు, అంగీకార సూచకంగా తల కొద్దిగా వాల్చి తలూపాడు.

కొత్త విషయాలు తెలుసుకున్నట్టుగా ఇంద్రసేనుడి కళ్ళు మెరిశాయి. అతడు ముందుకు వంగి అన్నాడు, “ఔను..నాగశౌర్య..శివ అంటే దేవుడు మాత్రమె కాదు, సృష్టి, వినాశానాల అనంత చక్రానికి ప్రతీక అని నేను అర్థం చేసుకున్నాను.” అతని మాటల్లో అబ్బురపాటు, అతని స్వరంలో స్థిర నిర్ణయం ప్రకటి తమైనాయి.

అతనితో ఏకీభవిస్తున్నట్టుగా మెరిసే కళ్ళతో తలూపాడు నాగశౌర్య.” ఔను ఇంద్రసేనా..నువ్వు నిజం గ్రహించావు. అయితే ఈ గ్రహింపు తో నీపై ఒక పెద్ద బాధ్యత కూడా వచ్చిపడుతున్నది. నీ విజ్ఞానాన్ని లోకంలో సంతులనం, సామరస్యత పాదుకునేందుకు వినియోగించాలి. “ ఇలా అంటున్నప్పుడు నాగశౌర్య స్వరం విజ్ఞానం, అనుభవం మేళవించుకున్న మందమారుతంలా సవ్వడి చేసింది.

శివుడి మర్మాల గురించి లోతుగా చర్చించాక వాళ్ళు ప్రపంచాన్ని కొత్త కోణంలో చూడనారంభించారు. తాము సాధించిన విజయాలు, సాఫల్యాలు మాత్రమే గెలుపుకి కొలప్రమాణాలు కావనీ, నిజమైన గెలుపుకి అర్థం ప్రాకృతిక ప్రపంచంతో, సాటి మనుషులతో సామరస్యంగా జీవించడమేనని వారికి తెలిసింది.

“దేవుళ్ళు అంటే ఎవరో మనకు బయట వున్నవారు కాదు, వాళ్ళు మనలోని వివిధ పార్శ్వాలే..” అన్నాడు ఇంద్రసేనుడు. అతని కళ్ళు తృప్తిగా మెరిశాయి.”శివుడు వినాశకుడు, అయితే పరివర్తకుడు కూడా. మార్పు మాత్రమె జీవితంలోని స్థిరాంకం అని మనకు గుర్తు చేస్తున్నాడు.” అయితే ఆ క్షణాన, మనసు చంచల స్వభావం గురించీ, అది తనలో తేగల మార్పు గురించీ అతడు గ్రహించలేదు.

“నిజమే..” అంగీకరించాడు నాగశౌర్య. “తదనుగుణంగా మార్పు చెంది, మనుషులుగా మన నిజమైన సామర్థ్యాన్ని నిరూపించే రీతిలో మనుగడ సాగించడమే మన అసలు సారం ..” అతని మాటలు మనసులకి ఆహ్లాదం కలిగించే చిరుజల్లులా వున్నాయి.

అదే సమయంలో, ఆర్య పూజారులు తమ సొంత దైవమైన రుద్రుడిని- శక్తి, సాహసం, వినాశనం, జీవన్మరణాల చక్రీయ స్వభావాలకి ప్రతిఫలనమైన శివుడిలో చూశారు. ఏ గుణాలనైతే చూసి వాళ్ళు రుద్రుడిని ఆరాధించారో అవే గుణాలు పశుపతిలో వున్నాయని, అతడు శిష్ట రక్షకుడు, దుష్ట శిక్షకుడు, లోక పరివర్తకుడు అని వాళ్ళు తెలుసుకున్నారు.

పశుపతి మార్మికతల లోతుల్లోకి వెళ్ళినా కొద్దీ ఆ శక్తిమంతుడైన దేవుడి గురించిన ప్రతీకాత్మకత, పౌరాణికత ఆర్యులకు బోధపడింది. జ్ఞానోదయ, మోక్షమార్గాల బాట నడిచే జిజ్ఞాసువులకు మార్గదర్శిగా, యోగ, ధ్యానాల పోషకుడిగా ఆయన పాత్ర గురించి తెలిసి వచ్చింది.

అలా, పశుపతి లేదా శివుడి ఆరాధన... ఆర్యుల ఆధ్యాత్మిక సాంప్రదాయంలో విడదీయరాని భాగంగా, సంస్కృతుల సమ్మేళనానికి నిదర్శనంగా, దైవాన్ని అర్థం చేసుకుని అనుసందానమయ్యే విశ్వజనీన అన్వేషణగా స్థిరపడింది. (సశేషం)

Tags:    

Similar News