హరప్పన్ లలో ఆత్మన్యూనత ఛాయలు
ఒక సాంస్కృతిక మహా సంగ్రామం. హరప్పనుల గాథ. అధ్యాయం 8. మూలం: The Greatest Battle of Culture (The Story of Harappans) by Bethi Panigrahi. తెలుగు: ఆడెపు లక్ష్మీపతి
ఒకవైపు సాంస్కృతిక వినిమయం దిన దిన ప్రవర్థమానమవుతోంది; మరోవైపు హరప్పనులలో వాళ్లకి తెలియకుండానే ఒక అభిప్రాయం వేళ్ళూనుకో నారంభించింది. తమ కన్నా ఆర్యులు ఎక్కువ తెలివి మంతులు, అధిక సంస్కారవంతులు, మరింత నాగరీకులు..అని వాళ్ళు భావించడం మొదలెట్టారు. ఈ భావన నిశ్శబ్ద చీకట్లో సన్నని గొణుగుడు లాగా వాళ్ళ మస్తిష్కాల్లో ఇంకిపోయింది, ఫలితంగా తమ సామర్థ్యం మీద తమకే అనుమానం, అభద్రతా భావన అంకురించసాగాయి.
‘‘వాళ్ళు అది ఎలా చేస్తారో నాకు తెలీడం లేదు..’’ అన్నాడు ఒక హరప్పన్ మరొకరితో. ‘‘నక్షత్రాలు, గ్రహాలకు సంబంధించి వాళ్ళ విజ్ఞానం విస్తృత మైనది, దేవుళ్ళ తో వాళ్లకు నేరుగా సంబంధం ఉన్నదేమో ననిపిస్తున్నది.’’
‘‘ఔను. వాళ్ళ కవిత్వం విన్నావా ?’’ బదులిచ్చాడు మరొక హరప్పన్. ‘‘అది శబ్ద సౌందర్యం తో కూడిన పాండితీ ప్రకర్షలా వీనుల విందు లాంటి సంగీతంలా వుంది. దానితో పోలిస్తే మన సొంత కథలు, పాటలు మరీ మొరటుగా కనిపిస్తాయి.’’
‘‘నీ ఉద్దేశమేమిటో నాకు అర్థమైంది.. ’’ సంభాషణలో జత కలుస్తూ మూడో వ్యక్తి అన్నాడు, ‘‘వాళ్ళ తత్వవేత్తలు విపణి వీధిలో చర్చలు చేస్తుండగా చూశాను. మనకు కనీసం అర్థంకాని భాషలో వాళ్ళు మాట్లాడుతున్నారని పించింది. మనం ఉత్త వర్తకులం, వృత్తి పని వాళ్ళం, వాళ్ళ విజ్ఞానం స్థాయికి మనం సరి తూగము అని నా అభిప్రాయం.’’
హరప్పనుల రాజు బాగుహర నిటారుగా నిలబడి ఎదురుగా వున్న గుంపు నుద్దేశించి కంచు కంఠం తో ఇలా ప్రకటించాడు. ‘‘హరప్పనులమైన మనకు- మనకే సొంతమైన సామర్థ్యాలు, విజ్ఞానం వున్నాయి. మన స్వీయ నవకల్పనలతో, సొంత కళను, సంప్రదాయాలను మేళవించి మనందరికీ ఎంతో గర్వకారణమైన నాగరికతను నిర్మించాము. వేరే వాళ్ళతో మనల్ని పోల్చుకోగూడదు. మన సాఫల్యాలను సగర్వంగా ప్రస్తుతించుకోవాలి.’’
బాగుహర అలా ప్రకటించినా కూడా హరప్పనులు అనుమానాలు వీడలేదు. తెలివి తేటలు, సంస్కృతి విషయంలో ఏదైతే అంతరం వుందని భావించారో దాన్ని పూరించేందుకు వాళ్ళు ఆచారాలు, వస్త్రధారణలో ఆర్యులను అనుకరించడం ప్రారంభించారు, అపరిచిత పదాలను పలకడం కష్టమైనా వైదిక మంత్రాలని చదివారు.
వెనుకటి నుంచి ఉంటున్న వాళ్ళ సమస్యాత్మక స్థితి హరప్పనులను అలా మార్చింది. గతంలో వాళ్ళు విధ్వంసకరమైన వరదలు ఎదుర్కొన్నారు ; అప్పుడు నగరాలు, ఊళ్లు మునిగిపోయి ప్రజలు నిర్వాసితులైనారు. నిస్సహాయక పరిస్థితిలో వాళ్ళు ఆర్యుల ఆచారాల వేపు మొగ్గు చూపారు, ప్రాచీన కర్మకాండ లలో, మంత్రోచ్చాటనలో ఉపశమనం పొందే ప్రయత్నం చేశారు.
కాలక్రమేణా, వాళ్ళు వైదిక కర్మ కాండలు బాధల నుంచి విముక్తి కలిగిస్తాయనీ, వాటి గురించిన పరిజ్ఞానం వున్నఆర్యులు తమ కన్నా అధికులు అని విశ్వసించడం మొదలెట్టారు.
ఆర్యులపై చంబా దాడి తర్వాత ఈ న్యూనతాభావం మరింత పెరిగింది. హరప్పనుల ఆలోచనలను అపరాధభావన, కలవరం ఆక్రమించాయి. వాళ్ళు మొదటి నుంచీ శాంతికాముకులు గానే వున్నారు, చంబా దాడి నాటి రక్తపాతం, హింస తాము నమ్మిన విలువలను తుంగలో తొక్కాయని బాధపడ్డారు.
ఆర్యుల స్థాయిని అందుకోవాలని ఎప్పటి నుంచయితే హరప్పనులు ఆరాటపడ్డారో అప్పట్నుంచి వాళ్ళు తమ సొంత అస్తిత్వానికి, ప్రత్యేకతకు దూరం కాజొచ్చారు. వాళ్ళ ఒకప్పటి వైభవోపేత సాంప్రదాయాల స్థానాన్నిక్రమంగా ఆర్యుల ఆచారాలు, విశ్వాసాలు ఆక్రమించాయి. హరప్పనుల గాథలు, పాటలు, కవిత్వం విస్మరణకు గురై వాటి స్థానంలోకి ఆర్యుల సాహిత్యం, కళలు ప్రవేశించాయి. ఆర్యుల విజ్ఞానం ఉన్నతమైనదని భావించడం మూలాన హరప్పన్ తత్వవేత్తలకు, పండితులకు విలువ పడిపోయింది.
ఈ విశ్వాసం నివురు గప్పిన నిప్పులా ఉండి, ‘సాంస్కృతిక శోషణం’ పేరుతొ ఆర్యులు దీన్ని తమ లాభానికి వాడుకునే అవకాశం కోసం ఎదురు చూస్తోంది.
ఈ పరిణామంతో మహాదానందపడిన ఆర్యులు ఇదే పంథా అనుసరించాల్సిందిగా హరప్పనులను ప్రోత్సహించారు. ఆ ప్రాంతం మీద తమ ప్రభావాన్ని స్థిరపరచుకునేలా ఆర్యులు తమ విజ్ఞానాన్ని, అనుభవ నైపుణ్యాన్ని హరప్పనులతో పంచుకునేందుకు స్వతంత్రంగా ముందుకు వచ్చారు.
ఫలితంగా, ఆర్యుల సంస్కృతి పట్ల ఎనలేని మోజు పెంచుకున్న హరప్పనులు వెర్రిగా వాళ్ళ ఆచారాలను, విశ్వాసాలను అవలంబించారు. వైదిక మంత్రోచ్చాటన వల్ల, ఆర్య జీవన విధాన ఆచరణ వల్ల భవిష్యత్తులో సంభవించబోయే ఉత్పాతాలనుంచి రక్షణ పొందగలమని వాళ్ళు భావించారు.
అలా కొత్త సంస్కృతిని స్వాయత్తం చేసుకున్నా కొద్దీ హరప్పనుల సొంత, విలక్షణ సంస్కృతి కను మరుగైంది. వాళ్ళ ఒకప్పటి గొప్ప సంప్రదాయాలు ఇప్పుడు నాసిరకపువిగా కనపడి వాటి స్థానంలోకి ఆర్యుల ఆచారాలు, విశ్వాసాలు వచ్చిచేరాయి.
ఆ విధంగా, ఆర్యులతో బౌద్ధిక, సాంస్కృతిక సమానత్వం సాధించాలనే తపనలో పడిపోయిన హరప్పనులు తమకు తెలీకుండానే సొంత గుర్తింపుకి తిలోదకాలిచ్చారు. (సశేషం)