ప్రపంచంలో ఇంత పాపులర్ ఫోటో మరొకటి ఉందా?
ఈ రోజు అక్టోబర్ 9, చే గువేరా వర్థంతి
చూసిన ప్రతి యువకుడిని తనవైపు తిప్పుకునే వశీకరణ శక్తేదో ఈ ఫోటోకు ఉండి తీరాలి. ఎక్కడో లాటిన్ అమెరికాలో పుట్టి పెరిగి చనిపోయిన ఒక వ్యక్తి ఫోటో ఇది.అంతేకాదు, ఇతగాడి పేరు కూడా ఎవరూ సరిగ్గా పలకలేరు. అయినా సరే, ఈ ఫోటో ప్రపంచం మంతా స్కూటర్ల మీద, కార్ల మీద, లారీలమీద, గోడల మీద, టీషర్టుల మీద,మ్యూజిక్ అల్బమ్ ల మీద కనిపిస్తూ ఉంటుంది.
అంతేనా, కాదు, రాజకీయ పార్టీల మ్యానిఫెస్టోల మీద, క్యాలెండర్ల మీద, నోటు పుస్తకాల మీద, టీ మగ్ ల మీద, వైన్ గ్లాస్ ల మీద, విద్యార్థి ఉద్యమాల బ్యానర్ల మీద, బ్యారికేడ్ల మీద, పాప్ మ్యూజిక్ క్యాసెట్లమీద, సిడి కవర్ల మీద కనిపిస్తుంది. సిగార్ బాక్స్ ల మీద కనిపిస్తుంది. చివరకు కండోమ్ ల మీద కూడా ప్రత్యక్షమయిన ఫోటో ఇది.
మడోనా రిలీజ్ చేసిన అమెరికన్ లైఫ్ (American Life) అల్బ మ్ కవర్ ఫోటో కూడా మార్పింగ్ చేసిన ఈ ఫోటోయే.
ప్రపంచంలో ఇంత ప్రజాదరణ ఉన్న ఫోటో మరొకటి లేదు. పాపులారిటిలో మోనాలిసా, మారిలైన్ మోన్రో లు కూడా వెనకబడిపోయారు. ఎపుడో మూడు నాలుగు దశాబ్దాల కిందట, ‘వైరలయింది’ అనే మాట ఇంకా డిక్షనరీలోలోకి ఎక్కని రోజుల్లో తెగ వైరలయిన ఫోటో ఇది.
ప్రపంచం ఇంకా నత్త నడకన నడుస్తున్నరోజుల్లో, పోస్టు కార్డుల యుగంలో, జిరాక్స్ మిషన్ లు అనేవి ఎక్కడో నగరాలలో పట్టణాలలో తప్పమరొక చోట కనిపించని యుగంలో, యూట్యూబ్ , ఫేస్ బుక్, ట్విట్టర్, పింటరెస్టు,చాట్ షేర్, ఇమెయిల్ వంటివి కలలో కూడా కనిపించని యుగంలో ఈ ఫోటో వైరలయ్యింది.
టీషర్టు వేసుకునే ప్రతియువకుడి ఛాతీ మీదో, వెన్నుమీద, యువతరం పెన్ను, రెెబెల్స్ గన్నుమీద, కౌంటర్ కల్చర్ మరిజువానా పొట్లాల మీద, సిరింజిల మీద నిటారుగా నిలబడిన ఫోటో ఇది. ప్రపచంలో అత్యధిక సంఖ్యలో పునర్ముద్రణ పొందిన ఫోటో ఇది. ఇప్పటి సోషల్ మీడియా ఏజ్ భాషలో చెబితే, ‘మోస్టు రిప్రోడ్యూస్డ్’, ‘షేర్ డ్’ ఫోటో ఇది.
ఇతగాడి పూర్తి పేరు తెలియకపోయినా, ఆయన ఆదర్శం అర్థం కాకపోయినా, ఆయన పుట్టినవూరు, చచ్చిన చోటు తెలియకపోయినా, ఆయన పేరెలా పలకాలో తెలియకపోయినా, యువకుడనే వాడు ప్రపచంలో ఏమూల ఉన్నా ఈ ఫోటో ను చూసి ఉంటాడు. ప్రపంచంలో ప్రతివూర్లో ఏదో ఒక రూపంలో ఈ ఫోటో కనిపిస్తుంది.
ఇలాంటి ఆరాధన హోదా (cult status) తెచ్చుకున్న ఫోటో మరొకటి భూమ్మీద లేదు. ఏ దేవుడి బొమ్మకు కూడా ఈ హోదా దక్కలేదు. ఇక ముందు అ లాంటి ఫోటో రాదు. అలాంటి వ్యక్తి పుట్టడు. ఎందుకంటే ఆపరిస్థితులు లేవు. మళ్లీ రావు. కాబట్టి ప్రపంచంలో ఇలాంటి ఫోటో ఇదొక్కటే ఉంటుంది. అందుకే ఈ ఫోటోని ఎంత చూసినా తనివి తీరదు.
కులం, మతం, దేశం, జాతీయత అనే తేడాలేకుండా మనిషిలో, ఏ మూలనో నక్కి నక్కి కూలబడి, ఎపుడో ఒక సారైనా మెరుపులాగ మెరిసే రెబెలియన్ నేచర్ (తిరుగుబాటుతత్వానికి)కి, స్వేచ్ఛా కాంక్షకు, స్వాతంత్య్రపిపాసకు, విముక్తి ఆరాటానికిి ఈ ఫోటో ప్రతీక.
లింగ వ్యత్యాసం లేకుండా ప్రతివారు ఎపుడో ఒక సారి రెబెల్ గా మారి తీరాల్సిందే. అది ఇంట్లో కావచ్చు, బజారున కావచ్చు. లేదా అర్థమూ పర్థమూ లేని భావాజాలానికి, పనికి మాలిన పెత్తనానికి, నియంత్వానికి, అణచేసే అధికారానికి, అలుముకున్న అవినీతికి వ్యతిరేకంగా కనీసం మనుసులో నైనా ఏదో ఒక సారి, ఒక క్షణమయినా ఎవరైనా రెబెల్ కావచ్చు. ఈ ఆగ్రహం హాఫ్ లైఫ్ (half-life) క్షణమేయినా సరే రెబెలే. అక్షణికపు రెబెలియన్ కు ఈ ఫోటో ద్యశ్యరూపం అని ప్రపంచమంతా గుర్తించినందునే ఈ ఫోటో సర్వత్రా కనిపిస్తుంది. కవ్విస్తుంది. ప్రేరేపిస్తుంది.
అందుకే ఈ ఫోటో రెబెలైన ప్రతి మనిషికి నచ్చింది. నచ్చుతుంది కూడా.
కొత్తభావాలతో రాజకీయ పార్టీలు పెడుతున్నవారికీ, ఈ ఫోటోలొ నుంచి పెల్లుబుకుతన్న రెబెలియన్ స్ఫూర్తి నిస్తుంది. కొందరు ఈ ఫోటోలో తిరుగుబాటుదారుని చూస్తారు. తిరుగుబాటు చేసి మానవాళి మంచి కోరాడు కాబట్టి మరికొందరు ఆయనలో మహర్షిని చూస్తారు. సెయింట్ చే (St Che) గా పూజిస్తారు.
జీవితకాలమంతా ఆయన క్యాపిటలిజాన్ని ఎదిరించింది, దోపిడీ లేని సమాజం స్థాపించాలనుకున్నది సాయుధంగా మాత్రమే.
తమాషా ఏంటంటే, సాయుధ పోరాటయోధుడు ఇపుడు శాంతియుత పోరాటానికికూడా ప్రతీకగా నిలబడ్డారు. ఈ ఫోటో నుంచి ప్రపంచం ఇపుడు కొత్త సందేశం తీసుకుంటూ ఉంది. ఆయుధంగా కాకపోతే నిరాయుధంగానా నైనా అన్యాయాన్ని ‘ప్రశ్నించు’ అనే పిలుపుని ఈ ఫోటోలో ఇపుడు చూస్తున్నారు. అందుకే ఈకాలపు శాంతియుత పోరాటానికి కూడా ఆయన ప్రేరణ అయ్యారు.శాంతి దూత అవుతున్నారు.
ఇంతకీ ఈ పోటోలోని వ్యక్తి పూర్తి పేరు ఏమిటో పేరు తెలుసా?
ఈయన పేరు పొట్టిగా చే గువేరా (Che Guevara). పలకాల్సింది చే గె వారా (che gay-vara) అని. ఈ స్పానిష్ పేరెలా పలకాలో యూట్యూబ్ లో వినండి . ఇతగాడి పూర్తి పేరు ఎర్నెస్టో గువారా డి లా సెర్నా( Ernesto Guevaraa de la Serna). పుట్టింది జూన్ 14, 1928 రోసారియో అర్జెంటీనాలోె. ఆనాటి ప్రపంచమంతా వీస్తున్న గాలి సోకి క్యూబన్ విప్లవ వీరుడయ్యారు. క్యూబా విప్లవం తర్వాత అక్కడి ప్రభుత్వం లో మంత్రి కూడా అయ్యారు. చదవింది వైద్యం. చేసింది విప్లవం. ఎక్కడైనా సరే విప్లవానికి తోడ్పడాలనుకున్నాడు. ఆ మహాప్రస్థానంలో ఉన్నపుడే అమెరికా సాయంతో బొలీవియా సైన్యం ఆయనను పట్టకుంది. 1967 అక్టోబర్ 9న ( లా హిగేరా, బొలివియాలో) చంపేశారు. 1997లో ఆయన అస్తికలను బొలీవియా ప్రభుత్వం క్యూబాకు సమర్పించింది.
ఈ ఫోటో తీసిన వ్యక్తి ఎవరు?
ఆయనకు అమరత్వం అందించిన ఈ ఫోటో తీసిన ఫోటోగ్రాఫర్ ఎల్బర్టో కోర్డా (Alberto Korda) ఆయన పూర్తి పేరు ఎల్బెర్టో డీయాజ్ గుటియేరెజ్ ( Alberto Díaz Gutiérrez) క్యూబాలో ఫోటో గ్రాఫర్ గా ఉండేవాడు.
కోర్డా ఒక రైల్వేకార్మికుడి కుమారుడు. యువకుడిగా ఉన్నపుడు ఇది అదీ అనకుండా అడ్డమయిన చిన్న చిన్న పనులు చేశాడు. అనుకోకుండా ఒక ఫోటోగ్రాఫర్ దగ్గిర అసిస్టెంటుగా కుదిరాడు. కుదురుగా నిలబడ్డాడు. తర్వాత చాలా పెద్ద ఫోటోగ్రాఫర్ అయ్యాడు. అది ఫోటోగ్రఫీ ప్రపంచానికి బాగా తెలుసు. ఆయన మాంచి రసికుడు. ఫ్యాషన్ ఫోటోగ్రఫీ అంతు చూసినవాడు. ఆయన ఫోటోగ్రాఫర్ జీవితం ప్రారంభమయింది అడ్వర్టయిజ్ మెంట్లకు పోటోలు తీయడంతో.ఇలా మెల్లిగా హవానా వీక్లిలో రెగ్యులర్ ఉద్యోగంలో చేరాడు. క్యూబా మొట్టమొదటి ఫ్యాషన్ ఫోటోగ్రాఫర్ అయ్యాడు. ఆయనకు 1959లో పామ్ డి ప్లేటా ( Palma de Plata) అవార్డు కూడా లభించింది. అందమయిన మోడల్స్ ఫోటోలు తీస్తూ తీస్తూ ఒక అమ్మాయి అందాలను కెమెరాలోంచి చూపించి పిచ్చెక్కించాడు. దాంతో నటేలియా మెండెజ్ అనే పిల్ల ఆయన వలపులో పడిపోయింది. తర్వాత పెళ్లాడింది.
క్యూబా రెవల్యూషన్ మొదలయినపుడు ‘రెవల్యూషన్’ అనే ప్రతిక వచ్చింది. ఈ ‘రెవల్యూషన్’ తో కోర్డా ప్రేరణ పొందాడు. రెవల్యూషన్ కోసం పనిచేయాల్సిందేనని నిర్ణయించుకున్నాడు. 1959 లో ఫిడెల్ క్యాస్ట్రో అమెరికా వెళ్లినపుడు అఫిషల్ ఫోటోగ్రాఫర్ గా వెళ్లాడు. అపుడాయన తీసిన ఫోటోలుకు ఎంతపేరొచ్చిందంటే అప్పటినుంచి క్యాస్ట్రో ఎక్కడివెళ్లినా కోర్డాయే ఫోటోగ్రాఫర్ .
చే ఫోటో ఎలా వెలుగులోకి వచ్చిందంటే…
1964 మార్చి 4 ఒక ఫ్రెంచి సరుకుల రవాణ నౌక లాకోబర్ ( La Cobre ) హవానా రేవులో అన్ లోడ్ చేస్తున్నపుడు పేలిపోయింది.. దీని వెనక అమెరికా సిఐఎ హస్తముందని చెబుతారు. బెల్జియంలో తయారయిన గ్రనేడ్లు, రైఫిల్స్ ని క్యూబాకు తెచ్చిన నౌక ఇది.
క్యూబాకు బెల్జియం ఆయుధాలు రావడం ఇష్టంలేని అమెరికా సిఐఎ కుట్ర జరిపి దీనిని పేల్చేసిందని క్యాస్ట్రో విమర్శ.ఈ పేలుడులో సుమారు వందమంది పైగా చనిపోయారు. మరుసటి రోజు వారి సంతాప సభ జరిగింది.దీనికి పిడెల్ క్యాస్ట్రో హాజరయ్యారు. అక్కడ ఫోటోలు తీసేందుకు కోర్డా స్టేజ్ మీద ఉన్నపుడు ‘చే’ కనిపించాడు. చే ముఖ కవళిక ఆయన తెగ నచ్చింది. టకీ మని రెండు పోటోలు కొట్టేసి వెళ్లిపోయాడు.
తాను సభ మీద తాను తీసిన ఫోటోలన్నింటిని ఎడిటర్ ముందుపెట్టారు. ఆయన కొన్నింటినే ఎంపిక చేసుకున్నారు. అందులో చే ఫోటో లేదు. రిజెక్టయిందన్న మాట. దీనితో ఆవి రెండు కోర్డా సొంత కలెక్షన్ లో ఉండిపోయాయి.
తర్వాత మూడేళ్లకకు 1967 లో ఒక రోజు పొద్దునే ఎవరో వ్యక్తి కోర్డా ఇంటి తలుపుతట్టాడు. తీరా చూస్తే ఆయన ఇటలీ పబ్లిషర్ గియాన్ ఫ్రాంకో ఫెల్ట్రినెల్లి(Gianfranco Feltrinelli). ఆయనకు మాంచి చే ఫోటోలు కావాలి. ఎక్కడెక్కడో వెదుకుతున్నాడు. కోర్డా దగ్గిర కచ్చితంగా ఉంటాయని ఎవరో చెప్పారు. కోర్డా దగ్గిర ఉన్న ఆ రెండు రిజెక్టెడ్ ఫోటోలను చూసి వాటిలో ఏదో వశీకరణ శక్తి ఉందని అనుకున్నాడు. మరే ఫోటో వద్దు ఇవి చాలు అని వెళ్లిపోయాడు.
ఆ యేడాదే అక్టోబర్ లో ‘చే’ని అమెరికా గూఢచారులు బొలీవియా ఆర్మీ కలసి చంపేశాయి. ఆ వార్త ఫెల్ట్రినెల్లిని కలచేసింది. తన దగ్గిర ఉన్న రెండు ఫోటోల్లోనుంచి ఒక ఫోటోని పోస్టర్ గా అచ్చేసి పంచాడు. అంతే. అది సూపర్ హిట్టయ్యింది. ప్రపంచంలో మోస్టు పాపులర్ ఫోటో అయింది. అంతేనా, ఫెల్ట్రినెల్లి ని ఆమాంతం వశపర్చుకున్న ఆ ఫోటో మాంత్రిక శక్తి అప్పటి నుంచి ఈ రోజు దాకా చూసిన ప్రతివాడిని తన వైపు లాక్కుంటూ ఉంది. ఈ పాపులారిటీకి కోర్డా రాయల్టీ తీసుకోలేదు. ఎందుకంటే… “This photograph is not the product of knowledge or technique. It was really coincidence, pure luck” అని కోర్డా అభిప్రాయపడ్డారు. ఆ ఫోటోయే ఇది.