మట్టిగోడల మధ్య అరుదైన ‘బ్యాంకు’: మాచునూర్ సీడ్ బ్యాంక్
రేపటి తరాలకు స్వచ్ఛమైన ఆహారాన్నీ అందించేందుకు మహిళలే నడుపుతున్న బ్యాంక్;
మా విత్తనాలు కొనండి అధిక దిగుబడిని సాధించండి అని ఊదరగొట్టే విత్తనాల కంపెనీల ఆటలేవీ ఈ పల్లెల్లో సాగవు. తెగుళ్ల నివారణకు మా క్రిమి సంహారక మందులనే వాడండి అనే ప్రకటనలకూ మార్కెట్ లేదక్కడ. పాత విత్తనాలను పరిరక్షించి, బహుళ జాతి కంపెనీలకు ఎంట్రీ లేకుండా చేయగలగడమే పల్లెమహిళలు సాధించిన విజయం.
సీడ్ బ్యాంక్ లోపల విత్తనాలు
‘ మా ఊర్ల దాదాపు 3000 లకు పైగా రైతులు చిరుధాన్యాలు మాత్రమే పండిస్తారు.’ అని చెప్పింది లచ్చుమమ్మ. మాచునూరులో చెట్లమధ్య ఉన్న మట్టిగోడల బ్యాంక్ వైపు నడుస్తూ.
సీడ్ బ్యాంకు మేనేజర్ లచ్చుమమ్మ.
‘ వర్షాధారం తప్ప వేరే దారి లేదు అందుకే కరువు పంటలే పండిస్తాం. మేం బయట నుండి ఎరువులు,విత్తనాలు తెచ్చుకోము. మా సొంత విత్తనాలు ఉన్నాయి. జీవ ఎరువులు తయారు చేసుకొని వాడతాం.’ అని చెక్కతలుపులు తీసి లోపలకు తీసుకెళ్లింది.
వెదురు బుట్టలు వరుసగా పేర్చి ఉన్నాయి. కొన్ని మట్టితో అలికి ఉన్నాయి. వాటి మూతలు తీసి దోసిళ్లలో అనేక రకాల విత్తనాలు తీసి చూపిస్తూ వాటి పేర్లను, ఆహార విలువలను చెప్పింది.
‘ దీనిని సీడ్ బ్యాంక్ అని పిలుచుకుంటాం. మా పూర్వీకులు సాగుచేసిన విత్తనాలనే ఇప్పటికీ వాడుతున్నాం. ’ అని ముత్యాల్లా మెరుస్తున్న జొన్నవిత్తనాలను చూపిస్తూ ఇవి ‘అత్తకోడళ్ల జొన్నలు ’ అని చెప్పింది.
ఏ రైతు లైనా ఇక్కడికి రావాల్సిందే!
కొన్నినెలల క్రితం ఆదిలాబాద్ జిల్లాలో రైతన్నలు విత్తనాల దుకాణాల ముందు పడిగాపులు పడటం, గంటల తరపబడి భారీ క్యూల్లో నిలబడే ఓపిక లేక చెప్పులు గుర్తుగా పెట్టి వెళ్లడం వార్తల్లో చూశాం. కానీ ఇలాంటి సమస్యలు లేని ఊరే మాచునూరు.
మాచునూరు విలేజీ
ఇక్కడ విత్తనాలే కాదు ,ఎరువులు కూడా వారే తయారు చేసుకుంటారు. బయట నుండి ఒక్క విత్తనం కూడా వారి పొలాల్లోకి రాదు. నకిలీ విత్తనాలు సమస్య అనేదే కనపడదు.
దేశంలో ఏ రైతుకు ఏ విత్తనం కావాలన్నా వీరిని వెతుక్కుంటూ వస్తారు!
ఈ అరుదైన కృషి వెనుక ఆడవాళ్ల పట్టుదల దూరదృష్టి ఉంది.
మట్టిగోడల బ్యాంకు ఎక్కడుందీ ?
ఎవరైనా బ్యాంకులో పదో పరకో దాచుకుంటారు లేదూ అంటే లాకరు తీసుకుని నగా నట్రా పెట్టుకుంటారు. కానీ, తెలంగాణలోని సంగారెడ్డి జల్లా , రaరాసంగం మండలం, మాచునూరులో మట్టిగోడలతో కట్టిన బ్యాంకులో మాత్రం విత్తనాలను ఈతబుట్టల్లో భద్రపరుస్తారు. వినడానికే విడ్డూరంగా ఉన్న దీని పేరు మాత్రం సీడ్ బ్యాంక్ !! రేపటి తరాలకు స్వచ్ఛమైన ఆహారాన్నీ , ఆరోగ్యాన్ని అందించే అరుదైన ఈ బ్యాంక్‌ని పల్లె మహిళలే నిర్వహిస్తారు.
అతివృష్టి అనావృష్టి వల్ల పంటలు దెబ్బతినడం సర్వసాధారణం. అదే సమయంలో విత్తనాల కొరత ఏర్పడుతుంది. దానికి తోడు నకిలీ విత్తనాల సమస్యలు కూడా ఎపుడూ ఉండేవే. ఇలాంటి సమయంలో రైతులకు అండగా ఉండి ,పంటల సాగు ఆగకుండా, ఆహార కొరత లేకుండా, అనేక రకాల విత్తనాలను భద్రపరుస్తారు.
విత్తనాల కోసం పొలాల దగ్గరకు వెళ్తారు !
వ్యవసాయం తప్ప వేరే ఉపాధి లేని ఆ చుట్టుపక్కలంతా కరువు ప్రాంతమే. అతితక్కువ వర్షపాతం, అందుకే వరి,చెరకు లాంటి ఎక్కువ నీరు అవసరమయ్యే పంటలు పండిరచడం కస్టం కాబట్టి, చిరు ధాన్యాలు, పప్పు దినుసుల సాగు చేస్తున్నారు. పాత కాలపు పంట గింజలను భద్రపరచడం వీరి పూర్వీకుల నుండి వస్తున్న సంప్రదాయం. వాటినే రైతులు తిరిగి పండిస్తున్నారు. దానికి కొనసాగింపే,మాచునూరులోని సీడ్ బ్యాంక్.
సీడ్ బ్యాంకు నిర్వహిస్తున్న మహిళలకు సత్కారం
ఇదే ప్రాంతపు రైతులు లక్ష్మమ్మ,నర్సమ్మలు బ్యాంక్ మేనేజర్లుగా వ్యవహరిస్తూ, విత్తనాలను డిపాజిట్ చేసుకొని, అవసరమైన వారికి ఇక్కడి నుంచే సరఫరా చేస్తారు. వీరు విత్తనాల సేకరణలో చాలా శ్రద్ధగా ఉంటారు. రైతుల పొలాల దగ్గరకు వెళ్లి వారు సాగు చేస్తున్న విధానాలను పరిశీలించి, నాణ్యమైన విత్తనాలను మాత్రమే తీసుకుంటారు. ఇలా 75 గ్రామాల మహిళా రైతులతో విత్తనాల ఒప్పందంలో భాగంగా వారు ఇక్కడ విత్తనాలను డిపాజిట్ చేస్తారు. మనం బ్యాంకుల్లో ఎవరి అకౌంట్లో వారు డబ్బులు డిపాజిట్ చేసినట్లు విత్తనాలను డిపాజిట్ చేసుకోవచ్చు. వీరంతా 15 నుంచి 20 రకాల పంటలను పూర్తి సేంద్రియ పద్ధతిలోనే సాగు చేస్తున్నారు. ఎక్కడా రసాయన ఎరువులు, పురుగు మందుల జోలికి వెళ్లరు. ప్రతి గ్రామంలో రైతులతో సంఘాలను ఏర్పాటు చేసి ప్రకృతి సాగు, విత్తన శుద్ధి పై వారికి అవగాహన కల్పిస్తున్నారు.
‘‘ విత్తన నాణ్యతపై పంటల దిగుబడి ఆధారపడి ఉంటుంది. నాణ్యమైన విత్తనం అంటే జన్యుపరమైన అసలు లక్షణాలు, మొలకశాతం, మొలకెత్తే శక్తిని కలిగి ఉండి పైరు ఏకరీతిగా పెరుగుతుంది. అలాంటి వాటివల్ల అధిక దిగుబడులు సాధించవచ్చు. విత్తనోత్పత్తి పంటల్లో కోత తర్వాత విత్తనాన్ని నూర్చి తగిన తేమశాతం వచ్చే వరకు ఎండబెట్టి విత్తనశుద్ధి చేసి నిల్వ చేసుకోవాలి.’’ అంటారు పీడ్ బ్యాంకు నిర్వహిస్తున్న మహిళలు.
బ్యాంక్ మేనేజరు లచ్చుమమ్మ
మాచునూరు గ్రామస్తురాలు లక్ష్మమ్మ చదువుకోలేదు స్కూలు అనేది ఒకటి ఉంటుందని కూడా తెలియని బాల్యం ఆమెది. ఆమెకు మాత్రమే కాదు ఆ ప్రాంతంలో అందరిదీ అదే జీవనశైలి. రోజుకింత వండుకోవడం, పొలానికి వెళ్లి సేద్యం చేసుకోవడమే వారికి తెలిసింది.
సొంత విత్తనాల సేద్యం
అది కాకుండా ఆమెకి తెలిసిన మరో సంగతి మన నేల మనకిచ్చిన వివిధరకాల వంగడాలను కాపాడుకోవడం చాలా ముఖ్యం అని. అందుకే పండిరచిన ప్రతి పంట నుంచి కొంత తీసి విత్తనాలను భద్రంగా దాచేది. తన నేలలో పంట నుండి తీసినవి కాబట్టి అక్కడి వాతావరణాన్ని తట్టుకుంటాయి. ఆమె అవగాహన గుర్తించిన డెక్కన్ డెవలప్ మెంట్ సొసైటీ ఈ విత్తన బ్యాంక్ నిర్వహణను ఆమెకు అప్పగించారు.
ఈతాకుల గాదెలు...
‘‘ విత్తనాలు చెడిపోకుండా ఉండేందుకు మూడు అంచెలుగా భద్రపరుస్తాం. ఇరువై ఏండ్ల క్రితం మచునూరు అడవీ ప్రాంతంలో ప్రారంభమైన ఈ విత్తన బ్యాంకు ద్వారా ఇప్పటివరకూ వందలాది ఎకరాలకు విత్తనాలు అందించాం. ఈతాకులు, నారతో అల్లిన పెద్ద బుట్టలు తయారు చేసి, వాటి అడుగున వేపాకులు,బూడిద వేసి పైన విత్తనాలు వేస్తాం. మూడు అంగుళాల మందంలో మూడు పొరలుగా మరోసారి బూడిద,వేపాకులు వేసి విత్తనాలు వేపి మూత పెట్టి, పశువుల పేడ,ఎర్రమన్నుతో అలుకుతాం. రెండేళ్లు వరకు విత్తనాలు చెక్కు చెదరకుండా ఉంటాయి. నల్ల,ఎర్ర వడ్లు విత్తనాలపై జామాయిల్ ఆకులు వేసి నిలువ చేస్తాం. 70 రకాల వరకు ఇక్కడ విత్తనాలున్నాయి.’’ అంటోంది లక్ష్మమ్మ. జొన్నలో నాలుగు రకాలు, మినుములు, నువ్వులు, సజ్జల లో మూడురకాల ,బొబ్బర్లలో నలుపు, తెలుపు , ఎరుపు రకాల విత్తనాలు ఉన్నాయంటోంది ఆమె. ఎకరానికి సజ్జలు ,రాగుల విత్తనాలు రెండు కిలోలు సరిపోతాయి.
‘‘ ఇలా విత్తనాలు జాగ్రత్త పరచడం తమ పూర్వీకుల నుండి వస్తున్న సంప్రదాయం. మా నేలలో మా విత్తనాలే పండిస్తాం, బయట నుండి ఒక్క గింజ కూడా తేము... మా దగ్గర తీసుకున్న విత్తనాలు నాటే ముందు పశుమూత్రంతో శుద్ది చేయాలి. ’’ అంటారు ఈ విత్తన బ్యాంకు నిర్వహిస్తున్న మరో మహిళ చంద్రమ్మ.
కొన్నేళ్ల క్రితం డెక్కన్ డెవలప్ మెంట్ సొసైటీ రైతులకు అవగాహన సదస్సులు నిర్వహించింది. దానికి హాజరైన లక్ష్మమ్మ వ్యవసాయి నిపుణులు చెప్పిన విషయాలను అర్థచేసుకోవడంతో పాటు ఆచరణలోనూ పెట్టింది. ఆ సదస్సులో ఆమె కొత్తగా రసాయన ఎరువుల అవసరం లేని ప్రకృతి పంటలనే పండిరచాలని తెలుసుకున్నానంటారు.
విత్తనాలను బండ్లమీద ప్రదర్శిస్తున్న డిడిఎస్ బృందం
తనకున్న ఎకరంన్నర పొలంలో దేశీయ వంగడాలను ఉపయోగించి అద్భుతమైన ఫలితాలను రాబడుతోంది. పరిసర గ్రామాల నుంచి ప్రధానంగా చిరుధాన్యాల విత్తనాలను సేకరించి, సంరక్షించి మంచి దిగుబడులు సాధిస్తున్నారు.
తన బృందంతో తండాల్లో రైతులను కలిసి, లోకల్ విత్తనాలను కాపాడాల్సిన అవసరాన్ని వివరిస్తున్నారు. 3 వేల రైతుకుటుంబాల్లో, రసాయన ఎరువులను వాడకుండా, సేంద్రియ చైతన్యం తెస్తున్నారు. భవిష్యత్తు తరాలకు ఆహారాన్ని అందించేందుకు భద్రపరుస్తున్న ఈ విత్తన బ్యాంకును ఆహార మార్పులను అధ్యయనం చేయడానికి కూడా కొందరు విజిట్ చేస్తున్నారు. ఈ రోజు గడిస్తే చాలని ఆలోచించకుండా రాబోయే ఉపద్రవాలనూ దృష్టిలో పెట్టుకుని సీడ్ బ్యాంకును నిర్వహిస్తున్న ఈ పల్లె మహిళల ప్రయత్నం పదిమందికి ఆదర్శం కాదా!