నిద్రిస్తున్న ఆత్మకు మేల్కొలుపు పాడండి...
తిరుప్పావై పాశురం : 7కు ప్రొఫెసర్ మాడభూషి శ్రీధర్ వ్యాఖ్యానం
నిద్రలో ఉన్న ఆత్మను మేల్కొనాలి. ఆశీర్వచన సందేశాన్ని ఇస్తున్నదీ ఉపనిషత్తు. లేవండి మేల్కొనండనే పిలుపు అన్నది గోదాదేవి.
‘‘ఉత్తిష్ఠతా జాగ్రతా ప్రాప్య వరన్నిబోధతా
క్షురసన్న ధరా నిశితా దురతయా దుర్గమా పతః తత్ కవయో వదన్తి’’
అంటే గమ్యం చేరేవరకు ఆగవద్దు. జాగృతులు కండి.
అందమైన తమిళ భాష
శెన్ తమిళ్ అంటే అందమైన తమిళ భాషలో భక్తి, భగవత్కీర్తన, ఆచార్య వైశిష్ఠ్యం, భాగవత కథలు, రామాయణ ప్రస్తావన కలగలిపి ఓ ఎనిమిది పంక్తులలో కుదించి, గేయం తో అలరించడం ఎవరికి సాధ్యం.
గోదా దేవి మహాకవయిత్రి. శెన్ తమిళ్ అంటే అందమైన తమిళ భాషలో భక్తి, భగవత్కీర్తన, ఆచార్య వైశిష్ఠ్యం, భాగవత కథలు, రామాయణ ప్రస్తావన కలగలిపి ఓ ఎనిమిది పంక్తులలో కుదించి, గేయం తో అలరించడం ఎవరికి సాధ్యం. కేశవుని కీర్తన విని మనసు తెరవమని బోధిస్తున్నది. తిరుప్పావై 7వ పద్యానికి తెలుగు భావార్థం చూడండి.
అదిగోవినలేదా కీచుకీచు పిట్టల కిలకిలారావములు
భారద్వాజ పక్షుల మధుర సంభాషణలా నిక్వణాలు
కుండలలో చిక్కగా నిండిన మజ్జిగల చర్రు చర్రున
నిలువెత్తు కవ్వాల యవ్వనులు చిలుకు సవ్వడులు
ఊగెడు గోపికల కేశాల రాలిన పూలవాసనాలు తాకలేద
వగలు నగలు నగవులు కలిసి దీపించు వెల్గులు చేరలేద
పీతాంబరుని వేడక ఈ పిచ్చినిదురేలనే పిచ్చిపిల్ల
మనము తెరచి మాధవుడినె తలచెదము తనివిదీర
(దీని అర్థం ఇది. భరద్వాజ పక్షులు పగలు విడిపోదుము కదా అనుకొని తెల్లవారుజాము సమయానికే వాళ్లంతా కలిసి అన్నివైపులా ఏవేవో మాట్లాడుకుంటున్నారు. ఆ ధ్వని వినబడడంలేదా. కొప్పులో పూవులు ముడిచికొన్న తరువాత గోపికలు యశోద కవ్వములతో పెరుగు చిలుకుతున్నారు. చేతికి కంకణాలు చప్పుడు చేస్తున్నాయి. మెడలో ఆభరణాల ధ్వని కూడా వస్తున్నది. అంత పనిచేయడం వల్ల అలసి పోయి అలంకరణ పడిపోయి, పూవులు పడిపోయి సుగంధాలు బయట పడుతున్నాయి. ఆ ధ్వని ఆకాశానికి వినబడడం లేదూ. ఓ నాయకురాలా! ఆ శ్రీ కృష్ణుడు అవతరించి, శత్రువులను ఓడిస్తూ, తన ఎంతో వాత్సల్యంలో మనను ప్రేమిస్తూ ఉంటే, ఆ దశలో కృష్ణుని కీర్తనలు చేస్తూ ఉంటే ఇంకా వినబడడం లేదా? నిద్రలేవండి. తలుపు తీయండి. రండి అని పిలుస్తున్నారు.)
వైష్ణవ ఆళ్వారులకు గోద పిలుపు
ఆరో పద్యం నుంచి పదిమంది గోపికలను పదిమంది వైష్ణవ ఆళ్వారులకు ప్రతీకగా నిదుర లేపుతూ వారిని పిలుస్తున్నారు గోదమ్మ. నిన్న అస్మద్గురుభ్యోన్నమః, ఈ రోజు అస్మత్పరమ గురుభ్యోన్నమః అని ఎవరికి వారు తమ గురువులను సంస్మరించుకోవాలి.
నిన్న తన తండ్రి పెరియాళ్వార్ ను మేల్కొలిపి ఈ రోజు కులశేఖరాళ్వారుకు సుప్రభాతం పాడుతున్నారు. ఆళ్వారుల రత్నమాలలో కులశేఖరులు మధ్య నాయకమణి వంటి వారు. తేశముడైయాయ్ అనే పదం కూడా క్షత్రియుడైన కులశేఖరుడి తేజస్సును సూచిస్తూ ఉన్నది. ఆయన మలయాళుడైనందున మలయాళ పదం ఆనైచ్చాత్తు అని గోదాదేవి ఉపయోగించారు. నాయకప్పెణ్పిళ్లాయ్ అంటే గురువునకు గురువైన పరమాచార్యుడని అర్థం. కనుక అస్మత్పరమ గురుభ్యోన్నమః అని ఈ పాశురంరోజున స్మరించుకోవాలి.
‘గోవింద దామోదర మాధవా’ అని అమ్ముతున్నదా గోపిక
గోపికలు నిరంతరం శ్రీ కృష్ణ ధ్యానంలో ఉండే పరమ భక్తులు. ఎంత భక్తులైనా నిత్యకృత్యములు చేయాల్సిందే కదా. కనుక వారు పెరుగు చిలుకుతూనే ఉంటారు. వాచిక (మాట) కాయిక (చేత) మానసిక (మనసుతో) వ్యాపారము (పను)లనన్నింటిని శ్రీకృష్ణునికే అర్పిస్తున్నారు. భక్తి వారికి జ్ఞానం వల్ల వచ్చింది కాదు. వారి పల్లె లో కృష్ణుడే అవతరించడం వల్ల వారితో కలిసి జీవించడం వల్ల భక్తి వచ్చింది. మేము కృష్ణునికే చెందినవాళ్లం అనీ, మేం చేసేవన్నీ ఆయనకే అని అనుకుంటూ చేస్తారు. ఒక గోపికకు పిచ్చెక్కినట్టు కృష్ణభక్తి పెరిగితే వీరి పనిపెట్టాలని ఒక అత్త పాలూ పెరుగు తట్టలు నెత్తిన పెట్టి అమ్ముకు రమ్మని పంపిందట. ఆ ‘గోపిక పాలు పెరుగూ’ అని అరవడానికి బదులు ‘గోవింద దామోదర మాధవా’ అని అమ్ముతున్నదట. అదీ వారి తన్మయత్వం. చల్ల చేసేప్పుడుకూడా కృష్ణనామమే. దీపపు నీడలో నిలబడి కనబడకుండా కృష్ణుడు కవ్వాన్ని పట్టుకుంటే బరువెక్కింది ఎందుకు అని ఆలోచించకుండా ఎక్కువ బలం ఉపయోగించి కవ్వం తిప్పి చెమటలు చిందించి అలసిపోతారు. అప్పుడు తాను చరచరా కవ్వం తిప్పి వెన్నరాగానే తిని వెళ్లిపోతాడట. ఈ దధిమధన వృత్తాంతం క్షీరసాగర మథన మంత విశిష్ఠమయింది. ఆ కవ్వం చిలికిన చప్పుడు వినబడలేదా అని గోపికలుఅడుగుతున్నారు.
కవ్వము చిలుకు సవ్వడులు
గోపికలు వెన్న చిలుకుతూ ఉంటే చేతుల గాజులు గలగల మంటున్నాయి. వారి జడల్లోని పుష్పాలు రేపల్లె అంతటా గుబాళిస్తున్నాయి. కవ్వముతో పెరుగు చిలికే శబ్దం వినబడలేడా. ఓ పెద్ద నాయకురాలా! నీవు ముందుండి మమ్మల్ని వెంట తీసుకెళ్లవలసింది పోయి హాయిగా నిద్ర పోతున్నావా అంటున్నారు. గోపికలు స్మరించే శ్రీకృష్ణ నామాలను మేం పాడుతుంటే నీవు నిద్రపోతున్నావేమి అని అడుగుతున్నారు. చిన్ని రూపంలో వచ్చాడు మనకోసం, అందుకే ఆయన "మూర్తి" మన కోసం ఒకరూపు దాల్చి మన కోసం వచ్చినవాడు.
జ్ఞాన తేజస్సు
భగవత్ నామ సంకీర్తనచే తేజస్సు కల్గిన దానా నీ తేజస్సును మాకూ పంచి ఇవ్వు అంటూ మనలోని భగవత్ జ్ఞానమే మనకు తేజస్సును కలగ జేస్తుందని గోదమ్మ వివరిస్తున్నారు.
గోవులంటే వాక్కులు, వేదములు, ఆ గోవులిచ్చే పాలు భగవత్ స్వరూప గుణ విభూతులు. గురువుద్వారా తెలుసుకుని మనసులో దృఢముగా నాటుకొనేట్టు గుర్తుచేసుకోవడం పెరుగు. ఆ అనుభవరూపమగు పెరుగును, భగవత్ సంబంధమనే కవ్వానికి, భగవత్ ఫ్రీతి అనే త్రాడు గట్టి చిలికితే అవి పనులు. ఫలితాలు - ప్రేమతో భగవంతుడికే అర్పించే మనస్సు ఏర్పడుతుంది అది వెన్న వంటిది. భగవంతుడి ఎడబాటు అనే వేడి సోకితే ఆ వెన్న కరిగిపోతుంది.
భగవంతుడే సముద్రం. పాలంటే భగవంతుని స్వరూపగుణ విభూతులు. వాటిని మననం చేయడమే మథించడం. భగవంతుడి యందు బుద్ధి నిలపాలనే పట్టుదలే మందర పర్వతం. మథనంలో దైవశక్తులు అసురశక్తులు కూడా సాయ పడతాయి. దైవ శక్తులు జయించి భగవత్కటాక్షంచేత అమృతత్వాన్ని పొందుతారు, అసుర శక్తులు నశిస్తాయి. సముద్రమధనం చేసినప్పుడు మూడు ధ్వనులు వచ్చాయి. సముద్రంలో మందరము పెట్టినపుడు, సముద్రం ఎత్తు కావడం వల్ల సముద్రంలోకి వెళ్లక నదుల నీళ్లు వెనక్కితిరిగిపోతున్న ధ్వని ఒకటి, వాసుకి అనే పామును మందరపర్వతానికి కట్టి లాగుతున్నప్పుడు రాపిడికి వచ్చే ధ్వని మరొకటి, కొండ తిరుగుతున్నప్పుడు సముద్రంలో సుడులుసుడులుగా తిరిగే చప్పుడు మూడోది.
గోపికలుచిలికేప్పుడు వారి పాట, వారి ఆభరణాల ధ్వని, చిలికే పెరుగు ధ్వని మూడు వస్తూ ఉంటాయి. మనచుట్టూ లోకంలో ఉండే విషయాలనుంచి విషయవాసనలు మనలోకి ప్రవహిస్తూ ఉంటాయి. భగవంతుని యందు బుద్ధి నిలిపినపుడు ఈ వాసనలు లోపలికి రాలేక వెనక్కి పోతుంటాయి అప్పుడొక ధ్వని. శ్రధ్ద అనే వాసుకితో కట్టి భగవత్ప్రాప్తి కామన అనే అధ్యవసాయముతో మనలోని దైవాసుర శక్తులు అటూ ఇటూ లాగితే ఒక ధ్వని వస్తుంది. మనం మననం చేయడం వల్ల భగవత్ స్వరూప గుణ విభూతులు పొంగి పొరలుతాయి. అది మూడో ధ్వని. పరమాత్మ ప్రాప్తికోసం శ్రవణ మనన నిధి ధ్యానములే మథనము అని క్షీరసాగర మథనం వంటి రెండు మూడు ప్రతీకలను గోదమ్మ ఈ పాశురంలో చూపారు.
దధిమథనం ఒక యజ్ఞం వంటి పవిత్ర కార్యం. గోపికలు తెల్లవారుజామున లేచి స్నానం ముగించి కురులు అలంకరించుకుని పూలు ముడిచి, బొట్టు పెట్టుకుని పాడికుండను పట్టుకుంటారు. చిలకడం మొదలు పెడతారు. వారి ధ్యానము తపస్సు అదే. వెన్నతీసే పని ఇది అని శ్రీ భాష్యం అప్పలా చార్యుల వారు వివరించారు. ఈ పాశురంలో రెండో గోపికను నిద్రలేపారు.