దేవుడు సామాన్యులను పట్టించుకుంటాడా?

తిరుప్పావై పాశురం : 8, గోదాదేవి ఇచ్చిన సమాధానం

Update: 2024-12-26 07:32 GMT

గోపిక అడిగారు: దేవాదిదేవనై అతన్ని దేవాదిదేవుడని కీర్తిస్తారు కదా...మనవంటి సామాన్యులను పట్టించుకుంటాడా..

భాగవత కథ: గోద: దేవాదిదేవుడే అయినా మన శత్రువులను నిర్మూలించడం కోసం ఈ లోకంలో మనలో ఒకడిగా అవతరించాడు కదా, మన కోరిక తీర్చడా.. శెన్ఱునామ్ శేవిత్తాల్ ఆవా వెన్ఱు అరుళ్ .. మనమే ఆ పరమాత్మను సమీపించి సేవిస్తే... అరెరే నేను వచ్చి సేవించవలసింది కదా... మీరే నావద్దకు నడిచి వచ్చారే అని బాధపడి మనను ఆదుకుంటాడు శ్రీకృష్ణుడు.

రామాయణ గాధ: దండకారణ్యంలో రుషులంతా శ్రీ రాముడి వద్దకు వచ్చి అడవిలో రాక్షసుల బాధల నుంచి రక్షించమని కోరుతారు. అపుడు... అయ్యో నేను వచ్చి మీతో మాట్లాడాల్సింది పోయి మీరే నావద్దకు వచ్చేదాకా ఊరుకున్నానే అని బాధపడ్డాడు. భక్తులు ఇబ్బంది పడడం ఆయన ఓర్చుకోలేడు. తనకు శరణాగతి చేసిన భరతుడి ప్రార్థన నెరవేర్చలేకపోయినందుకు బాధపడ్డాడు. తనకోసం వచ్చిన గుహుని చూసి నాకోసం నడచి వచ్చావా, ఇంతకన్న ఏం చేయాలి అని రాముడు ఆలింగనం చేసుకున్నాడు. తనకంటూ సుఖదుఃఖాలు లేని నిర్వికారుడే అయినా ఇతరులకోసం ఆనందాన్ని ఆవేదనను పొందడం దోషం కాదు. ఇతరుల బాధలు చూసి బాధపడడం ఏ విధంగా సాధ్యమవుతుంది. కనుక త్వరగా బయలుదేరి వెళ్దాం, బ్రాహ్మీ ముహూర్తంలో వెళితే తప్పక ఆర్తితో ఆదరిస్తాడాయన అన్నారామె. ఈ పాశురంలో హస్తగిరి నాథుడైన దేవాదిదేవుడు, అంటే కాంచీపురం వరదరాజస్వామిని కీర్తిస్తారు.

తెలుగు భావార్థ గీతిక

తూరుపుదెలవారు గోధూళివేళ గోవులు కదిలినాయి

దూడలవెంట ఉదయకిరణాల మెరయు గడ్డిమేయ

నీతోడ కలిసిపోవ నీయింటి వాకిట నిలిచినాము

భక్తిమణిదీపమా మావెంట రావమ్మ హరిని జేర

పఱై పరములగోరెడు నోము నోచుదామని చెప్పుదాము

కేశిరాకాసి నోరు జీల్చి. చాణూరముష్ఠుల గూల్చి

లోకాల నాధుడే మాధవుడు మనమధ్య నిలిచె

కృష్ణ సంస్పర్శస్నానాలుజేయ రావమ్మ కృష్ణవేణి.

శ్రీభాష్యం అప్పలాచార్యుల వారి రచించిన అంశాన్ని వారి భాషలోనే చూద్దాం. ‘‘తూర్పుదిక్కు తెల్లవారుచున్నది. చిన్న బీడులోనికి మేయుటకు విడువబడిన గేదెలు విచ్చలవిడిగా పోవుచున్నవి. మిగిలిన పిల్ల లందరును గూడ వ్రతస్థలమునకు పోవుటకై బయలుదేఱి, అట్లు పోవుటయే తమకు ప్రయోజన మనునట్లు పోవుచున్నారు. ఆ పోవువారిని ఆపి మేము నిన్ను పిలుచుటకు నీ వాకిట వచ్చి నిలిచినాము. కుతూహలము కలదానా ! ఓ పడతీ ! లేచి రమ్ము ! కృష్ణగుణములను కీర్తించి వ్రతమున కుపక్రమించి వ్రతసాధనమగు పరను పొంది, కేశి యను రాక్షసుని చీల్చి చంపినవానిని, మల్లురను మట్టుపెట్టినవానిని, దేవతలకు ఆదిదేవుడైనవానిని మనము పోయి సేవించినచో అయ్యో ! అయ్యో ! మీరే వచ్చితిరే ! యని బాధపడి మన మంచి చెడ్డలను విచారించి మనలను కటాక్షించును’’.

(ఈ భావాన్ని చూపే శిల్పం ఇది.)

ఆచార్యుని (గురువుగారు) ఇంటి ముఖద్వారం ముందు నిలిచి వేచి ఉండడం శిష్యుడికి ముఖ్యప్రయోజనం. అశ్వము అహంకారానికి ప్రతీక. చాణూర ముష్ఠికులు కామక్రోధాలకు తార్కాణాలు. ఆచార్యుడు కటాక్షిస్తేనే కదా వీటి అడ్డు తొలగించుకోగలుగుతాం. ఆచార్యుడి దయద్వారా పరమాత్ముడే వీటిని తొలగిస్తాడు. ఈ పాశురం అంతరార్థంలో నమ్మాళ్వారులను మేల్కొలుపుతున్నారు. కోదుకులముడయ పావాయ్ అని సంబోధన. అంటే వ్యామోహము కల పిల్ల అని దీనికి అర్థం.

సాయంత్రం వార్ధక్యం, రాత్రి మరణం

ఉదయం బాల్యానికి సంకేతం. పగలు యవ్వనం, సాయంత్రం వార్ధక్యం, రాత్రి మరణం, మళ్లీ ఉదయం అంటే మళ్లీ జననం, నవ జీవనం అని దాశరథి రంగాచార్య ఈ పాశుర సారాంశాన్ని వివరించారు.

గోదమ్మ నమ్మాళ్వార్ ను, మూడో గోపికను, మేలుకొలుపుతున్నారు. ‘‘అస్మత్సర్వ గురుభ్యోన్నమః అనే ఆచార్య నమస్కార మంత్రాక్షరాలు అంతర్లీనంగా వెలిగేపాట. సూర్యునికి ఉషస్సే కన్న తల్లి. ఉదయం బాల్యానికి సంకేతం. పగలు యవ్వనం, సాయంత్రం వార్ధక్యం, రాత్రి మరణం, మళ్లీ ఉదయం అంటే మళ్లీ జననం, నవ జీవనం అని దాశరథి రంగాచార్య ఈ పాశుర సారాంశాన్ని వివరించారు. మమ్మల్ని మంచి మార్గాన నడపమని ప్రార్థించే పద్యాలు ఇవి. ఇది మన వేద సంప్రదాయం.

తెల్లవారిందా... అంటూ కృష్ణుని కోసం ఎదురుచూస్తున్నారు

ఈ పాశురంలో ఇంటిలోనున్న గోపికకు ఇంటిబయటనున్న గోదాదేవి ఆమె సహచర గోపబాలికలకు మధ్య సంవాదం వివరించారు.

గోద: కృష్ణుడు మనను కలవడానికి నిర్ణయించిన సమయం వచ్చింది. ఈ సమయంలో నిద్రపోవచ్చాఅని మనవాళ్లు అడుగుతున్నారు

గోపిక: ఆ సమయం సమీపించిందా, మీకే విధంగా తెలిసింది?

గోద: కీళ్ వానమ్ వెళ్లెన్ఱు... తూర్పు తెల్లవారింది కదా..

గోపిక: కృష్ణవిరహం కారణంగా ఈ రాత్రి సహింపరానిది. ఆ రాత్రి తొలగిపోయి సూర్యుడికోసం ఎప్పుడు వస్తాడో అని ఎదురుచూస్తున్నారు కనుక మీకు అదేధ్యాస. మీ ముఖాలే సూర్యబింబాల వలె ఉంటాయి. మీ ముఖ కాంతులతో కూడా దిక్కులు తెల్లబడి ఉంటాయి. అదీగాక మీకు పాలు పెరుగు మజ్జిగ వంటి తెల్లని పదార్థాలు చూసీ చూసీ అంతా తెల్లగా ఉందనుకుంటూ ఉంటారు.

గోద: ఎరుమైశిఱు వీడు....పరందన కాణ్ ...పశువులు ఉదయాన్నే అప్పుడే మొలిచి, లేత గడ్డి మేయడం కోసం పొలాలకు చేరుకున్నాయి. తెల్లవారితేనే కదా పశువులు మేతకు బయలుదేరేది.. (శిఱు వీడు అంటే అప్పుడే మొలిచి, మంచు కురిసిన లేతగడ్డి, అది తినడానికి పశువులను వదలడం, పెఱువీడు అంటే ఎక్కువసేపు గేదెలను మేయడానికి వదలడం)

పెరియాళ్వార్ ల పుత్రిక గోదాదేవి తన కులానికి తగినట్టు యజ్ఞయాగాదుల భాష, వేద మంత్రాల ఘోష గురించి మాట్లాడకుండా పశువులను మేపడం వంటి విషయాల గురించి లోతుగా చర్చిస్తున్నదంటే ఆమె మహాభక్తులైన గోపబాలిలకతో ఎంతగా తాదాత్మ్యం చెందిందో తెలుస్తుంది.

గోద: ఆ పశువుల వెంట మన గోపీకృష్ణుడు కదిలి వెళ్లిపోతే ఇక మనం ఎవరిని చూస్తాం. మనం జీవించడం మాత్రం ఎందుకు? ఇంక నిద్ర చాలించు, బాగా ఎక్కువైంది లే.

గోపిక: గేదెలింకా మేతకు వెళ్లలేదు. మీ ముఖ కాంతులు సోకి తొలగి పోయే చీకటి పొరలు, మబ్బులను మీరు గేదెలనుకుంటున్నారు. ముఖ కాంతులవల్ల తెల్లవారిందనుకోవడం అన్యథా జ్ఞానం. చీకటి గుంపులు గేదెల్లా ఉన్నాయనుకోవడం విపరీత జ్ఞానము. (1. ఉన్న ధర్మం లేదనుకోవడం, లేని ధర్మం ఉందనుకోవడం, సర్పరజ్జు రజ్జుసర్ప భ్రాంతి,పామును తాడనుకోవడం, తాడును పాము అనుకోవడం అన్యథా జ్ఞానం. 2. ఒక వస్తువును ఇంకొక వస్తువుగా భావించడం, పరమాత్మ పరమాత్మకాదని మరొకటని భావించడం విపరీతజ్ఞానం. ఉన్నది ఉన్నట్టు అనుకోవడం యథార్థ జ్ఞానం. తెల్లవారుఝాము సత్వగుణ ప్రధానమైన యథార్థ జ్ఞానం, మధ్యాహ్నం రజోగుణ ప్రభావం వల్ల 3. అన్యథా జ్ఞానం, రాత్రి తమో గుణ ప్రభావం వల్ల విపరీతజ్ఞానం కలిగే కాలాలు)

గోద: సరే మాది అన్యథా జ్ఞానమూ, విపరీత జ్ఞానమూ అనుకో, నీవు జ్ఞానంలో శ్రేష్ఠమైనదానివి కదా, తెల్లవారలేదనడానికి నీవే ఏదయినా దృష్టాంతరం చెప్పు చూద్దాం.

గోపిక: మనగోకులంలో అయిదు లక్షల మంది గోపికలుంటే, కనీసం వేయి మందైనా వచ్చినట్టు లేదనుకుంటా.

గోద: మిక్కుళ్ల పిళ్లెగళుమ్ .. నీవు తప్ప మిగిలినవారు రావడం, వెళ్లడం కూడా జరిగిపోయింది.

గోపిక: అయితే నాతో పనిలేదన్నమాట. పోనీ నన్ను లెక్కచేయలేదనుకోనా.

గోద: అట్లా అని కాదు. వారంతా కలిసి సందడిగా ఉండడం, నీవు వున్నావో వెళ్లావో తెలియకపోవడం వల్ల వెళ్లిపోయిఉండవచ్చు కదా..నీపట్ల అలక్ష్యమేమీ లేదులే..

గోపిక: ఏం పని మీద వెళ్లారో..

గోద: పోవాన్ పోగిన్ఱారై... అర్చిరాది మార్గంలో శ్రీ వైకుంఠానికి వెళ్తున్నవారి వలె, శ్రీ కృష్ణుడిని బృందావనంలో చూడడానికి వెళ్తున్న అక్రూరుడి వలె తిరుమల యాత్రకు వెళ్తున్న వారి వలె, వెళ్లడమే ప్రయోజనం... వేరే పనిగురించి కాదు.. (అంటే జీవి ఆత్మగా చేరుకునే శ్రీవైకుంఠ యాత్ర, తిరుమల యాత్ర, అక్రూరుని బృందావన యాత్ర ఒకటే అని గోద వివరిస్తున్నారు)

గోపిక: నన్ను వదిలి వెళ్లిపోయినారు కదా ఇక నేను వచ్చి మాత్రం ప్రయోజనం ఏమిటి?

గోద: వాళ్లు వెళ్లిన కారణం తెలుసుకదా.. వెళ్తున్న వారితో నీవు ఇంకా రాలేదని చెప్పాం. అంతే వారు నిర్ఘాంతపోయి కదలకుండా ఉండిపోయారు. ప్పోగామల్ కాత్తు.. కదలకుండా ఉండాలని ఎవరూ కాపలా పెట్టలేదు.. తిరువాణై నిన్నాణై అంటూ ఆజ్ఞాపించిందీ లేదు. నీవు రాలేదని వినగానే కాళ్లకు సంకెళ్లు పడ్డట్టు ఆగిపోయారు తెలుసా... ఉన్నైక్కూవువాన్ వందు నిన్ఱోమ్... వాళ్లని అక్కడే ఆగమని చెప్పి నిన్ను పిలుచుకుని పోవడానికి మేం వచ్చాం. శ్రీకృష్ణదర్శనం కోసం వెళ్లడమే వారి ప్రయోజనమని వారు భావించినట్టు, నిన్నుపిలుచుకుని పోవడమే ప్రయోజనమని మేము భావించి నీవాకిటికి వచ్చాం.

లంకలో వానరసైన్యంతో విడిసిన శ్రీరాముని సైన్యం చెంతకు రావడానికి లంకనుంచి విభీషణుడు బయలుదేరి సముద్ర ఉత్తర తీరాన ఆకాశంలో నిలబడ్డాడు. శ్రీరాముని చూడగానే విభీషణుడు స్తంభించినట్టు మేమూ నిలబడిపోయి నీకోసం చూస్తున్నాం తెలుసా..

గోపిక: మీరంతా వచ్చిఉన్న తరువాత నా ఒక్కదాని ఇంటిముందు మీరు ఆగిపోవడం దేనికి. నేను మీతో కలవకుండా నిద్రపోతున్నది తెలిసి కూడా ‘నీవు లేకుండా మేం జీవించలేం’ అని చెప్పడానికి నాలో ఉన్న గొప్పతనం ఏమిటి?

గోద: కోదుగల ముడైయపావాయ్...సాక్షాత్తూ శ్రీకృష్ణుడే స్వయంగా నిన్ను ప్రశంసించగల ప్రీతిపాత్రమైన గోపికవు నీవు కదా.. నీ ఇంటికి వచ్చి నీవాకిట నిలబడి, నీ పేరు పిలిచే అర్హత మాకుందా...శ్రీకృష్ణుని అభిమానం పొందినదానివి కనుక నీవు మాకు కూడా చాలా ఇష్టమైన దానివి. మాగురించి శ్రీకృష్ణుడికి చెప్పి పురుషాకారం కట్టుకుంటావని వచ్చాం. పావాయ్ నీవు ఒక స్త్రీవి అయిఉండి స్త్రీల వేదనను అర్థం చేసుకోవా, శ్రీ కృష్ణుని వలె నీవూ ఉండవచ్చా... ఎఝుందిరాయ్.. నీవు మాతో రావాలని కాదు, కాని నీవు లేచి వస్తుంటే కనిపించే నీ అద్భుత సౌందర్యాన్ని చూడాలని ఆశిస్తున్నాం. మేం ఇంటికి వచ్చిపిలుస్తే మీరు నిద్ర మేల్కొన్నారనే గౌరవాన్ని మాకు దక్కించు.

గోపిక: లేచి మనం ఇప్పుడు పొందే ప్రయోజనం ఏమిటో...?

గోద: పాడి... అంటే ఇంతకుముందు పొందిందే మళ్లీ పొందుతాం. ఊళ్లో పెద్దలు మనలను శ్రీకృష్ణుడినుంచి వేరుచేయడం వల్ల మనసులోనే శ్రీ కృష్ణుడిని అనుభవిస్తూ వచ్చాం. ఆ శ్రీ కృష్ణానుభవం వల్ల ఏర్పడిన ఆనందాన్ని బయటపడకుండా కాపాడుతూ వస్తున్నాం. ఇప్పుడు ఊళ్లో ప్రజలు అనుమతిస్తున్నారు. ఒక నిర్భయంగా శ్రీ కృష్ణానుభవం పొందుదాం, నోరారా శ్రీకృష్ణవైభవం పాడుకుందాం. ప్పఱై కొండు... వ్రేపల్లె ప్రజలకోసమే కదా మన నోము. ఇట్రెపఱైకోళ్వానన్ఱుకాణ్ గోవిందా... నామాట్చెయ్ వోమ్ అని చివరి గీతంలో చెప్పారు కదా...

గోపిక: శ్రీ కృష్ణుడు మనకు పఱై ఇస్తాడా?

గోద: మావాయ్ పిళందానై... గుఱ్ఱంరూపంలో వచ్చిన రాక్షసుడిని ఇంకా మన శత్రువులైన ఎందరో రాక్షసులను సంహరించి తనను తానే మనకిచ్చుకున్న మహానుభావుడు, పఱై ఇవ్వకుండా ఉంటాడా?

గోపిక: అది పాత మాట. ఇప్పుడు మధురానగరానికి పోయివచ్చిన వాడు. అక్కడ నగరస్త్రీలను చూచి వచ్చిన వాడు. మనల్ని ఎప్పుడో మరిచిపోయి ఉంటాడు. మన కోరికను తీరుస్తాడా?

గోద: మల్లరై మాట్టియ... అక్కడ మల్ల విశారదులైన చాణూర ముష్టికులను సంహరించిన శ్రీకృష్ణముఖారవిందం చూడమని అక్కడ మనలను పోలిన మహిళలకు తనను తాను ఉపకరించుకున్నవాడు మనలను మరుస్తాడా?

ఇద్దరి మధ్య మాట్లాడుకున్నట్టు కనబడే ఈ చర్చ ఎంత గంభీంగా గోదాదేవి ఏ 8 పంక్తులతో వివరించడం అద్భుతం కదా.

Tags:    

Similar News