ఆఖరి ఆశల కోరకం కూడా
రాలిపోయాక
ఈ లోకానికి చెల్లు చీటీ
రాయాలనుకున్నపుడల్లా
ఇదేమిటీ తప్పుకదా
ఇంత బేలవైపోయావేమని
ఒడిలో పడుకోబెట్టుకుని
బుగ్గలపై కన్నీటిని తుడిచే
కన్నతల్లిలా కవిత్వం
*
అవసరమున్నప్పుడే
మాటల వీణలు మీటి
ఆతర్వాత మౌనం మైనం బొమ్మలుగా మారాక
విరక్తి వాక్యాన్నైనపుడు
శ్రావణ సాంధ్యవేళ
మెడచుట్టూ పూసిన
చందన స్పర్శలా కవిత్వం.
*
కన్నుపొడుచుకున్నా
కానరాని అమావాస్య నిశీధిలో
దిగులు చీకట్ల మెట్లపై
దొర్లి దొర్లి పడిపోయినపుడు
చేయిపట్టి పైకి తెచ్చిన
యయాతిలా కవిత్వం .
*
అపజయాల ఇసుక తుఫాన్లో
అలుపెరగక పయనిస్తున్నా
అదను చూచి దారికాచి
కుంగుబాటు సర్పం కాటేసినపుడు
కార్తీక మాసం తొలి వేకువవేళల
నది అలలపై కదిలేదీపంలా కవిత్వం.
*
స్పర్శ కోల్పోయిన
తుప్పు పట్టిన ఇనుప హృదయంలో
మొలిచిన రాతి చెట్ల పాషాణ వనానికి
శాప విముక్తి కలిగించి పరిమళించే
పూలతోటలా కవిత్వం.
*
అనంత శిశిరాలనుండి వసంతాలకు
అసత్యంనుండి సత్యానికి
తిమిరంనుండి వెలుగులకు
మృత్యువునుండి అమృతత్వానికి
స్వాగతించే కవిత్వమే అద్భుతం
నిజంగా ఈ అనాధ లోకంలో
తల్లి తండ్రీ
తోడూ నీడా బంధువు
సఖుడు మిత్రుడు
సమస్తం కవిత్వమే
కవిత్వమే
కవిత్వమే!