మౌనం ఒక సందేశం

నేటి మేటి కవిత;

Update: 2025-07-10 02:53 GMT
Silence (1799-1801), Henry Fuseli

నువ్వు గుర్తుకు వచ్చినప్పుడు

మధువనుకుంటాను కానీ..

దుఃఖపు గుటకలు మింగుతాను.
**
నీ మీద మనసు విరిగిపోయింది
నువ్వు నాకు అందనంత దూరాన ఉన్నందుకు కాదు కానీ,
ఇంతగా గుర్తుకు వస్తున్నందుకు.!
**
చందమామ దాకా తీసుకెళతానన్నవాడు
భూమ్మీదే వదిలేసినందుకు దుఃఖం!
**
దిగులు మొఖమేసుకున్న రాత్రి,
కనిపించని ఆకాశపు మెట్ల మీదినుంచి,
వాకిట్లోకి మబ్బు జారినట్లు
ఎలా దిగుతుందో చూసావా,
నీ జ్ఞాపకంలా!
**
ఎప్పటిలా
అతను ఈ రాత్రి పాట పంపియ్యలేదు.
లోపలి సంగీతం మూగబోయింది!
**
పలకరించవా..సరే!
మౌనం కూడా సందేశమే.
మౌనం కూడా భాషే.
మౌనం కూడా ఒక వీడ్కోలే!
మౌనం కూడా నీ పాటే!
**
చంద మామ కావాలని భూమి ఆకాశాన్ని ప్రాధేయ పడినట్లు..
నువ్వు కావాలని ఈ జీవితాన్నిబ్రతిమిలాడుకుంటున్నాను.
**
వెన్నెల రాత్రి ఆకాశం పుస్తకంలా తెరుచుకుంది.
నిద్ర పట్టని ప్రేమికుల మీద నక్షత్రాలు కవిత్వం రాస్తున్నాయి!
**
బాల్కనీ నీ ఒంటరితనపు దుఃఖాన్ని తాగిందో,
అసలు బాల్కనీనే రాత్రి చంద్రుడ్ని ఎడబాసి దుఃఖిస్తుందో?
మొత్తానికి నువ్వూ,బాల్కనీ కలిసి ఒక యుగళ వియోగ గీతం!


Tags:    

Similar News

కదిలే దీపం