దేవుడు కూడా...

మనిషి ఎటోవోయిండు మచ్చలను మిగిల్చి అంటు నిమ్మ రాంరెడ్డి వ్యక్తం చేసిన ఆవేదన ఈ కవిత

Update: 2024-11-01 09:53 GMT
గాజాలో ఇజ్రేల్ సృష్టించిన బీభత్సం.

-నిమ్మ రాంరెడ్డి


దడేలుమని కూలిపోతున్న వంద అంతస్తుల భవన శకలాలకింద
మట్టిరేణువులను ముద్దాడుతున్నారు
ఎంతైనా జన్మనిచ్చినవి కదా
వేల యేండ్ల నుంచి

శాశ్వత నిద్రవోతూ
స్వయంవిచ్ఛిన్న దుర్ఘంధ ఆయుధాలుగా మారి రక్షిస్తున్నారు తాతముత్తాతల మూలాలను
పేగుబంధాన్ని తెంచగలరేమో కాని
ప్రేమబంధాన్ని తెంచతరమా

అక్కడ గడ్డిపోచకూడా గజగజ వణుకుతుంది
కాల్చేస్తరేమోనని
ఉంటే అంటుకొని అడివి తగలవెడతదని భయం

అక్కడ
నిద్రవోయినోళ్లకు నిద్రలోనె మర్యాద
పురిట్లున్నోళ్లకు పురిట్లోనే మోక్షం
ఎక్కడ చూసినా
భయకంపిత జపమే
ఏది విన్నా
విద్వంసక రచనే

ఎన్ని తలలు తెగితే
అంత పెద్ద విజయం
ఎంత లోనికి దూకితే
అంత పరాక్రమం

ఉద్వేగం ఉప్పొంగుతుంది
విద్వేషం రాజిల్లుతుంది
మనిషి ఎటోవోయిండు
మచ్చలను మిగిల్చి

వారెవ్వా సైన్స్
నువ్వు తోపు పో
పంచభూతాల పీకవిస్కుతున్నవ్
పంచభూతాల్లో కలిపేస్తున్నవ్
కనిపెట్టినోన్ని
కన్నోన్ని

వారెవ్వా ! ఓ శాస్త్రజ్ఙా!
నిద్రవోకు కనిపెట్టేదాకా
ఒక్క క్షణంలో మటాష్ గావాలె
నొప్పిండద్దు నోరుదెరువద్దు
నువ్వూ నేను అంతా
దేవుడు కూడా


Tags:    

Similar News