పూల గొడుగు

నేటి మేటి కవిత: డాక్టర్ చెంగల్వ రామలక్ష్మి;

Update: 2025-04-15 05:06 GMT

ఒక పూల తోట నా వెంట ఉన్నట్లు

ముప్పై ఏళ్లుగా నాతో కలిసి నడిచింది
నన్ను నడిపించింది
ఆకుపచ్చని రంగుపై తెల్ల పూల
ఈ ముచ్చటైన గొడుగు

నిప్పులు చెరిగే రోహిణి కార్తె ల్లోను
పెనుగాలి తుఫాను ప్రళయాల్లోను
చిటపట చినుకుల హర్షానందంలోనూ
చిరు చిరు చెమటల లేలేత ఎండల్లోను
నన్ను రక్షణ కవచం లా కాపాడింది

నా ఇంటిని నడిపించే గొడుగునై
నేను చేసిన ఇన్నాళ్ల అవిశ్రాంత పోరాటం లో
ఈ పూల గొడుగు నాకు తోడై నీడై నిలిచిన
నా జీవన సహచరి
నా ఆత్మీయ నేస్తం
కోపం లోను, వేదన లోను
నాలో నేను, నాతో నేను సంభాషించేటప్పుడు
ఈ గొడుగు మౌన శ్రోత

రోజూ ఉదయానే రేకులు విప్పుకున్న మల్లెపువ్వులా
నా తలపై వికసించే గొడుగు
ఈ రోజు ముడుచుకున్న మొగ్గలా
గోడ మేకుకు వేలాడుతోంది
ఉద్యోగవిరమణ చేసిన నాలా
విశ్రాంతి తీసుకుంటోంది

ఇంక,ఎండల్లేని సాయం సంధ్యల్లోనో
వర్షం లేని ఆకాశం కిందో
అప్పుడప్పుడు ఎపుడో
ఒకసారి గుమ్మం దాటే
నా తల పై ఈ గొడుగు ఇంక పురి విప్పదు

అయినా, ఏళ్లనాటి అనుబంధం మా ఇద్దరిది
రోజూ ఒకసారి చేతిలోకి తీసుకున్నప్పుడు
నేను నిన్ను విడువను అని
ఈ పూలగొడుగు నాతో
చెపుతున్నట్లే ఉంటుంది.

-డాక్టర్ చెంగల్వ రామలక్ష్మి


Tags:    

Similar News

ఆటోగ్రాఫ్