నాగపూర్ నుంచి లుంబిని (నేపాల్) దాకా

కాంతి నల్లూరి బౌద్ధయాత్రా విశేషాలు

Update: 2024-11-16 03:00 GMT

15.10.24 న ఒంగోలులో రాత్రి 11గం.కు సంఘమిత్ర ట్రైన్ ఎక్కి ఆరెంజ్ సిటీ (గ్రీన్ సిటీ అని కూడా అంటారు.నాగపూర్)లో భారతదేశ కేంద్ర స్థానంలో ఉదయం తొమ్మిది గంటలకు దిగాల్సిన మేము 5 గంటల ఆలస్యంతో మూడు గంటలకి దిగాం.

ఏమీ తినకుండానే హడావుడిగా దీక్ష భూమి చూడడానికి పరుగుపెట్టాం. 1956 అక్టోబర్ 14న అశోక విజయదశమి రోజున అంబేద్కర్ దాదాపు ఆరు లక్షల మందితో బౌద్ధ మతమును తీసుకున్న ప్రదేశమే దీక్ష భూమి. దీక్ష భూమి అంటే (నిర్వహణ చేసిన నేల అనే అర్థంలో కూడా) దీ అంటే జ్ఞానము. క్ష అంటే పాపక్షయము. భూమి అంటే నేల. దీక్షభూమి లోఉన్న భవనo స్తూపాకారంలో ఉంటుంది. దమ్మ చక్ర స్థూపం అని కూడా అంటారు. ఇక్కడున్న బుద్ధ విగ్రహాo , అస్థికలు తైవాన్ నుండి వచ్చినవట. బ్రౌన్ రంగు బుద్ధ విగ్రహం, బంగారు వర్ణపు బుద్దుని, అశోకుని విగ్రహాలు, చెక్క (వుడ్)తో చేసిన స్తూప నమూన, స్తూపాకార గాజు నమూనా చాల బాగున్నాయి. ప్రింట్,ఎలక్ట్రానిక్ సమాచారము అంతగా లేని దాదాపు 50 ఏళ్ల క్రితం ఆరు లక్షల మంది దీక్ష భూమికి రావడం, ఒక క్రమశిక్షణతో ఉండడం మామూలు విషయం కాదు. దీక్ష భూమిలో అంబేద్కర్ కి సంబంధించిన అతిముఖ్యమైన ఫోటోలతో గ్యాలరీ ఉంది.

దీక్ష భూమి లోఅశోక విగ్రహం

 

దాదాపు 17 ఎకరాల స్థలములో ఉందట. ఇక్కడ స్తూపము సాంచి (అశోకుని) స్థూపం యొక్క ప్రతిరూపం లో నిర్మించబడింది. అంబేద్కర్ బుద్ధ దీక్ష తీసుకున్న రోజు ఖాళీ స్థలమే. అంబేద్కర్ దీక్ష చేసిన రోజును చారిత్రక గుర్తుగా ప్రపంచం లోనే అతి పెద్ద ఈ స్తూపాన్ని 1978లో ప్రారంభించి 2001 లో అప్పటి రాష్ట్రపతి కె. ఆర్ నారాయణతో ప్రారంభించబడింది.

అంబేద్కర్ నాగపూర్ లోనే ఎందుకు దీక్ష తీసుకున్నారు? అంటే. ఆర్యులు ఆర్యేతర్లైనా నాగాలను నాశనం చేయాలని భావించి వారిపై దాడులు కొనసాగించారు. బుద్ధుడు నాగజాతికి అండగా నిలిచాడు.ఇక్కడ బౌద్ధం ఎక్కువుగా వ్యాపించింది.ఇప్పటి కి నాగజాతి,బౌద్ధం ఎక్కువుగానే ఉంది. దీక్షభూమి తో మరింతగా ఉంది.

దీక్షభూమి నుంచి డ్రాగన్ ప్యాలస్ కు బస్ లో వెళ్ళేo. డ్రాగన్ ప్యాలెస్ ను నాగపూర్ ఆఫ్ లోటస్ టెంపుల్ అని కూడా అంటారట. మినిస్టర్ సులేఖ కుంభాలే ఇచ్చిన 20 ఎకరాల స్థలములో 1999లో నిర్మించబడింది. ఒంపులు తిరిగే అద్భుతమైన కట్టడం. జపాన్ కు చెందిన ఓగోవా (OGawa) అనే స్వచ్ఛంద సొసైటీ నిధులతో నిర్మించబడింది. ఆలయం చుట్టూ పచ్చని బైళ్ళు, తోటలతో ఆకర్షణీయంగా ఉంది. రాత్రిపూట లైటింగ్ తో దేదీప్యమానంగా ఉంది . ముదురు రంగు గోడలతో తెల్లని పాలరాయితో ప్రశాంతంగా ఉంది. ధ్యాన మందిరం కూడా ఉంది. రెండవ అంతస్తులో శ్రీ గందపు చెక్కతో చేసిన బుద్ధిని భారీ విగ్రహం ప్రత్యేక ఆకర్షణీయంగా ఉంది. ఈ డ్రాగన్ ప్యాలెస్ ఇండో జపనీస్ స్నేహానికి చిహ్నముగా పేరు పొందిందట.

విద్యుత్ దీపాల వెలుగులో డ్రాగన్ ప్యాలేస్ , డ్రాగన్ ప్యాలెస్ లోపల

 

దీనికి కొద్దిగా దూరంలో రెండు అంతస్తులతో ఉన్న అంబేద్కర్ విగ్రహ భవనం ఉంది ఇది (గుoబజ్ ఆకారంలో) గుండ్రంగా ఉంది కుర్చీలో కూర్చున్న అతిపెద్ద అంబేద్కర్ విగ్రహం ఉంది. ముఖ్యమైన కొన్ని ఫోటోలు ఉన్నాయి. భవనం చుట్టూ చాలా చెత్తా చెదారంతో మురికిగా ఉంది. డ్రాగన్ ప్యాలెస్ నిర్వహణకు దీనికి చాలా తేడా ఉన్నది.

నాగలోక్ లో రాత్రి బస చేశాo. నిలుసున్న అతి పెద్ద భారీ బుద్ధిని విగ్రహం ఇక్కడ ప్రత్యేకత. లైటింగ్ వెలుతురులో బుద్ధుడు విలవిల మెరిసిపోతున్నాడు. ఫోటోలు దిగారు పూజలు చేశారు. రకరకాల బుద్ధిని, అంబేద్కర్ని విగ్రహాల షాపు ఉన్నది. బుద్ధిజం మీద చాలా కోర్సులు ఉన్నాయట. నాగార్జున ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ ద్వారా రకరకాల బౌద్ధమత కోర్సులు నిర్వహిస్తున్నారు.

తిరుగు ప్రయాణంలో నేను చూడాలని గోల చేసి గోల చేసి చూసిన ప్రదేశం జీరో మైల్ స్టోన్. నాగపూర్ లో చెప్పుకోదగ్గ ప్రాంతం ("0 ,"స్టోన్) జీరో మైలురాయి. ఇది భారత భౌగోళిక కేంద్రంగా (కేంద్రము అని చెప్పడానికి ఎలాంటి ఆధారాలు లేనప్పటికీ) ఉంది. ఇక్కడ నుండే మన దేశంలోని వివిధ పట్టణాల దూరాలను లెక్కిస్తారు. గ్రేట్ త్రికోణమితి సర్వే ఆఫ్ ఇండియా కోసం బ్రిటిష్ వారిచే నిర్మింపబడినది. ఇక్కడ భారీ కట్టడాలు ఏమీ లేవు. జీరో స్టోన్ ఒక స్మారక చిహ్నంగా ఒక ఇసుకరాతి స్తంభం, నాలుగు ఇసుకరాయి గుర్రాలు చిన్న తోట, దాని వెనక సిటీ నిర్వహణ పాలక బిల్డింగులు ఉన్నాయి. జీరో మైల్ లవ్ ఆఫ్ ఇండియా (zero mile I ❤ of INDIA)అన్న పెద్ద బోర్డు ఉంది. ఎందుకో తెలియదు కానీ ఇది చూడాలని ఎప్పటినుంచో అనుకున్నాను. చూడగానే అనిర్వచనయమైన ఆనందాన్ని పొందాను. డాన్స్ చేయాలన్నంతా ఆనందాన్ని, మా వాళ్ళు ఏడుస్తారని (నవ్వుతారని) ఊరుకున్నాను. అప్పటికి నేను భారతదేశం మధ్యలో ఉన్నాను అని పెద్దగా అరిచాను.

నాగపూర్ జీరో మైల్ పాయింట్ దగ్గిర రచయిత్రి కాంతి నల్లూరి

 

టూరు లిస్టులో ఉన్న సీతాబుల్డి కోట, నాగపూర్ సెంట్రల్ మ్యూజియం, జలపాతం తిరుగు ప్రయాణంలో చూపిస్తానన్న నిర్వాహకుడు శివకుమార్ చూపించలేదు. ఓ ఇద్దరి స్వార్థం వల్ల. 1863లో స్థాపించబడ్డ ఈ మ్యూజియం చాలా పురాతనమైనది, చూడదగినది. నాగపూర్ లో చూడదగ్గవి (మా లిస్టులో లేనివి) చాలా ఉన్నాయి.

నాగపూర్ గురించి మరి కొంత : భారత్ లోని తూర్పు పడమరలను కలుపుతూ ఆరవ, ఉత్తర దక్షిణాలను కలుపుతూ ఏడవ జాతీయ రహదారులు నాగపూర్ కుండా వెళ్తాయి. నాగపూర్ మహారాష్ట్రకు రెండవ రాజధాని. అసెంబ్లీ శీతాకాల సమావేశాలు ఇక్కడ జరుగుతాయట. భారత్లో 13వ అతిపెద్ద నగరం (రాష్ట్రీయ స్వయంసేవక్, విశ్వహిందూ పరిషత్తుల కేంద్ర స్థానం. ,,, ఇక్కడ నుండే ఇప్పటి భారత దేశ పాలన సాగుతుంది. ఇది ఒక నియంతల, అబద్ధాల, రాజకీయ సింహాసనాల, పాసిస్ట్ భావజాల కేంద్రం)

నాగ్ నది ఒడ్డున ఉండటంవల్ల, నాగుల చేత స్థాపింపబడటం వల్ల నాగపూర్ గా పిలవబడుతుంది. దాదాపు పది సరస్సులతో లేక్ సిటీగా, ఆరంజి తోటలతో, ఉత్పత్తులతో ఆరంజి నగరంగా, బౌద్ధ నగరంగా, దీక్ష భూమిగా, చారిత్రక కట్టడాలతో చారిత్రిక పట్టణంగా పేరు పొందింది. నాగపూర్ లో ఏర్పాటు చేసిన స్లీపర్ బస్సు బాగా లేకపోవడంతో, వాదోపవాదనల అనంతరం బస్ మారుస్తాము అని మాట ఇచ్చిన తర్వాత 17.10.24 న 12: 30 కు నాగ్ లోక్ నుండి బయలుదేరి 18.11 24 న ఒంటిగంటకు మూవుకు (MHOW) చేరుకున్నాం. Mhow అంటే Milatary Head quorters of warriors. ఇది అంబేద్కర్ జన్మస్థలం. అంబేద్కర్ జ్ఞాపకార్థము విశాలమైన స్థలంలో రెండు అంతస్తుల ఓ పెద్ద బిల్డింగు. ఇక్కడ అంబేద్కర్ నిలువెత్తు విగ్రహం, పక్కనే సాంచి స్థూపమైన నాలుగు సింహాల స్తంభంఉంది. లోపల బుద్ధిని విగ్రహం ముందు బౌద్ధ బిక్షువు అంబేద్కర్ కు దీక్ష ఇస్తున్న విగ్రహాలున్నాయి. విగ్రహాల ముందు మౌనం పాటించి బౌద్ద పూజలు చేశారు. అంబేద్కర్ తల్లిదండ్రుల ఫోటోలు, కుటుంబ ఫోటోలు అతి ముఖ్యమైన సంఘటనల ముఖ్యమైన ఫోటోల గ్యాలరీ ఉంది. ఇది నాగపూర్ మిలటరీ కంటోన్మెంట్ ఏరియాలో ఉంది. పక్కనే మిలిటరీ మ్యూజియం ఉంది. పర్మిషన్ తీసుకోవాలి. తీసుకోలేదు. చూడలేదు.

 

19.10.24న మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్ కు ఈశాన్యంగా 46 కిలోమీటర్ల దూరంలో ఉన్న సాంచి స్థూపాన్ని చూడటానికి వెళ్ళాము. చిన్నప్పుడు పాఠాలు వింటున్నప్పుడు, ఎంఏలో సాంచి, సారనాద్ ల గురించి చదువుతున్నప్పుడు ఇవన్నీ ఇప్పుడు ఉన్నాయా, పెట్టాయా అనుకునేదాన్ని. పిల్లలకు పాఠాలు చెప్తూ జాతీయ చిహ్నము, ముద్ర, పీఠంపై ఉన్న ఏనుగు గుర్రాలు సత్యమేవ జయతే సూక్తి, అశోకుని ధర్మచక్రము రూపాయి బిళ్ళల మీద సూపిస్తూ చెప్పేదాన్ని. విద్యార్థులు కూడా అనేక ప్రశ్నలు వేసే వాళ్ళు. సాంచిలో అడుగు పెట్టగానే ఇవన్నీ గుర్తుకొచ్చి నువ్వుకొన్నాను. అరే పిల్లల్లారా! నేను ఇప్పుడు సాంచిలో ఉన్నాను. ప్రత్యక్షంగా చూస్తున్నాను. సంతోషంగా ఆనందంతో అనుకున్న.

సాంచిస్థూపం

 

సాంచి స్తూప సముదాయంలో మూడు

1 మహా స్తూపం

2. రెండవ స్తూపం

3. సా0చి విశ్వవిద్యాలయం

మౌర్య వంశ రాజైన అశోకుడు బౌద్ధ మతాన్ని స్వీకరించిన తర్వాత క్రీస్తుపూర్వం మూడో శతాబ్దంలో అర్ధగోళాకారపు (అర్థ అండాకారపు, బోర్లించిన బిక్ష పాత్రల కూడా ఉంది) మట్టిదిబ్బపై రాతి ఇటుకలతో బుద్ధిని వాస్తవ అవశేషాలు ఉంచి స్థూపాన్ని నిర్మించాడు. (ఈ రాతి ఇటుకలు 4..6 అంగుళాల మందంలో ఉన్నాయి) దీనినే మహా స్తూపం అంటారు. (స్థూపం ఒకటి అని కూడా) స్తూపం అంటే మట్టి దిబ్బ. రెండు అంతస్తులుగా ఉంది. నాలుగు తోరణాల ఎదురుగా ఉన్న మెట్లు ఎక్కి పైఅంతస్తు వరకు వెళ్ళవచ్చు. చిన్నగా ఉన్న అశోకుని నిర్మించిన స్థూపo పై శుంగవంశపు రాజైన అగ్నిమిత్రుడు అశోకుని అస్తికలు బూడిదను ఉంచి పెద్దదిగా నిర్మించాడట. 16.14 మీటర్ల ఎత్తు, 36.60 మీటర్ల (120 అడుగుల,గైడు డయామీటర్లుఅని చెప్పేడు) చుట్టుకొలతతో మూడు వలయాలుగా ఉంది. ఫోటోలో, స్తూపం పైన నల్లగా, ఉబ్బెత్తుగా కనిపిస్తున ప్రాంతంలో, దొంగలు బంగారం ఉన్నదని తవ్వినప్పుడు గుంతలు పడగా ఆ గుంతలను అలాంటి రాళ్ల ఇటుకలతో కాకుండా ప్యాచ్ వర్క్ ఉబ్బెత్తుగా చేశారు. ఇది, చారిత్రక కట్టడాల పట్ల మన పాలకుల, బౌద్ధ మతకుల నిర్లక్ష్యాన్ని అశ్రద్ధను తెలియజేస్తుంది.

స్థూపం చుట్టూ 3 బార్ల రెయిలింగ్ తో నాలుగు ద్వారాలతో అద్భుతమైన శిల్ప సంపదతో ఉన్నదానిని శాతవాహన వంశ రాజైన గౌతమీపుత్ర శాతకర్ణి నిర్మించాడట. నిలువుగా ఉన్న రాతిలో నుండి అడ్డంగా ఉన్న రాళ్ళను గూర్చినట్లుగా కనిపిస్తున్నది. చూడగానే చెక్క అనుకుంటాం. రాయి ని అలా వంచటం గ్రేట్ అనిపించింది.ఉత్తర దక్షిణ తూర్పు పడమర ద్వారాలు (బొమ్మల) చిత్ర లిపిలో బుద్ధిని జననం నుంచి మహా నిష్క్రమణ వరకు జీవిత చరిత్ర అద్భుతమైన శిల్పకళలో మలసబడింది. సాoచి, శిల్పకలకు పట్టం కట్టింది. ప్రతి తోరణం రెండు చతురస్రాకారపు రాతి స్తంభాలపై నిర్మింపబడినది. ద్వారాలన్నిటి పైన చిన్న కాళి కూడా లేకుండా జంతువులు, పూల దండలు వేస్తున్న ఐరావతాలు, చేతులు పైకి ఎత్తి స్థూపాల బరువును మోస్తున్న మరుగుజ్జులు (ఇవే లాఫింగ్ బుద్ధ బొమ్మలుగా అలంకార వస్తువులుగా మారినవి) నాట్య భంగిమలు, వృక్షాలు, లతలు, పువ్వులు, ధర్మచక్రాలు ఉన్నాయి. ప్రధాన ద్వారం పై బుద్ధిని పాదాలు, వాటిలోనే కాలచక్రాన్ని 24 గంటలు తెలియజేస్తూ చక్రము ఉంది. 24 గంటలు తిరుగమని బుద్ధిని ఉద్దేశ్యమని గైడ్ చెప్పాడు.

తోరణాలపైన, మరికొన్నిచోట్ల ప్రాకృత భాషలో బుద్ధుని సూక్తులు ఉన్నాయి. ఈ స్తంభాలు గ్రీకు బౌద్ధ శైలిలో ఉన్నాయి. దక్షిణ ద్వారానికి దగ్గరగా ప్రసిద్ధమైన నాలుగు సింహాల అశోకుని స్తంభం ఉంది. ఒరిజినల్ అశోకుని నాలుగు సింహాల స్తంభము రెండు భాగాలుగా సాంచి మ్యూజియంలో ఉంది.

2. రెండవ స్తూపం: బౌద్ధ మత అనునాయులైన మహమొగ్గన, సారీపుత్ర హస్తికులు పెట్టి నిర్మించినదట. వారి హస్తికులు ఇప్పటికీ బిల్డింగులో ఉన్నాయని చెప్పారు. అక్కడ చూసాం కానీ మాకు కనిపించలేదు. అక్కడున్న షాప్ అతన్ని అడిగితే పండుగ సందర్భాల్లో తెస్తారని చెప్పాడు. ఈ భవనము 1952లో కట్టబడింది. బౌద్ధ మతానికి చెందిన పుస్తకాలు, వస్తువులు అమ్ముతున్నారు. బుద్ధ విగ్రహంకు పూజలు జరుపుతున్నారు, చూడటానికి వెళ్లిన కొంతమంది. బుద్ధుడు చెప్పిన సూత్రాలను మరిచి బుద్ధుణ్ణి పూజించడం ఇది.

మహా,2వ స్తూపాల ఎదురుగా చిన్న చిన్న స్తూపాలు చాలా ఉన్నాయి. ఒక్కొక్కటి ఒక్కోక్క బిక్షువు అస్థికలతో నిర్మింపబడినదట. ఎదురుగా బుద్ధుని ఆలయం కూడా ఉంది. గబ్బిలాల వాసనతో ఉండటంవల్ల (ప్రభుత్వమే)మూసేసి ఉంది.చాలా పాల, సాలవృక్షాలు ఉన్నాయి.

3. సాంచి విశ్వవిద్యాలయం: మహా స్తూప ఉత్తర ద్వారం ఎదురుగా ఆనాటి సాంచి విశ్వవిద్యాలయం ఉంది. స్థూప మెట్లు దిగగానే ఎడమవైపున పెద్ద కోనేరు ఉంది. దీని నీటినే విద్యార్థులు ఆచార్యులు వాడుకున్నారట. చుట్టూ ఉన్న తోటలకు సాగునీటిగా కూడా. స్తూపం తోపాటు సాంచి విశ్వవిద్యాలయం కూడా అశోకుని, తరువాత కాలంలో ప్రసిద్ధి చెందినదే. రెండంతస్తులతో ఉండేదట. ఇక్కడ ఎదురెదురుగా 22 (22+22=44) రూములతో మధ్యలో ఖాళీ స్థలముతో (11+11 =22) ఉంది. ఇంత చిన్నదా అని అడిగితే, విద్యార్థులు కోర్సు పూర్తికాగానే వెళ్లిపోయేవారు అన్నారు.

ఆనాటి విశ్వవిద్యాలయం గదుల పైభాగం శిధిలoఅవ్వగా, అడుగుభాగం నాలుగు అడుగులు ఎత్తున ఉన్నవి. విద్యార్థుల కోర్సు పూర్తి అయినంతవరకు విశ్వవిద్యాలయంలోనే ఉండేవారట. ఇక్కడ విద్యనేర్చినవారే బౌద్ధ బిక్షువులుగా ప్రచారానికి వెళ్లేవారట.

బిక్షపాత్ర: విశ్వవిద్యాలయానికి కొద్ది దూరంలో ఓ మూలన రాతితో చేసిన ఓ పెద్ద పాత్ర ఉంది. తెచ్చిన భిక్షను ఈ పాత్రలో వేసి సామూహికంగా విద్యార్థులు తినేవారట. ఈ రాతి పాత్ర ఓ వైపున పగిలి, వర్షపునీరు నిల్వ ఉంది. విశ్వవిద్యాలయం చుట్టూ విశాలమైన ప్రాంతం ఉంది.

స్థూపాన్ని ఇక్కడ నిర్మించడానికి ఏదైనా కారణం ఉందా అని గైడ్ ను అడగగా, అశోకుని రాణి, దేవి విదర్భ రాకుమార్తె కనుక ఈ ప్రాంతంతో అశోకుని కి దగ్గర సంబంధం ఉందన్నాడు. ఈ స్థూపా నిర్మాణ సమయంలో రాణి దేవి, కుమార్తె విదర్శ పర్యవేక్షణ చేశారట.

సాంచి 1200 సంవత్సరం నుండి సుమారు 600 సంవత్సరాలు పాటు నిర్లక్ష్యం, అశ్రద్ధ చేయబడింది. ఈ కాలంలోనే చాలా శిథిలమైందట. 1851లో జనరల్ అలెగ్జాండర్ కన్నింగ్ హమ్ పునర్నిర్మాణ కార్యక్రమాలను చేయించాడట, తవ్వకాలలో బయటపడిన ఇటుకలతో.

సాంచి మ్యూజియంలో అశోకుని నాలుగు సింహాల స్థూపం.

 

స్థూపం ఉన్న దిబ్బ దిగివచ్చిన తర్వాత, గ్రామంలో సాంచి మ్యూజియం ఉంది. మ్యూజియంలో అశోకునికి, బౌద్ధ మతానికి చెందిన శిల్పాలు, ఆ కాలoనాటి వస్తు సామాగ్రి ఉన్నాయి. ఈ మ్యూజియంలోనే ప్రసిద్ధి చెందిన ఒరిజినల్ నాలుగు సింహాల స్తంభo రెండు భాగాలుగా ఉంది. సింహాలున్న పీఠం హై భాగము, నాలుగు అడుగుల స్టంభం ముక్క చూడగానే అనిర్వచనయమైన ఆనందం కలిగింది. సెక్యూరిటీగాడ్స్ తాకోద్దు అన్నా, వాటిని తాకి మైమరిచిపోయాను. స్తంభం ముక్కపై పాకృత(అనుకున్నాం) భాష చెక్కుచెదరకుండా ఉన్నది. ఈ మ్యూజియంలో ఫోటోలు తీసుకోవడానికి అనుమతి ఉంది. మ్యూజియము చాలాపెద్దగా, ప్రశాంతంగా, నీట్ గా, గ్రీనరీగా ఉంది. హోటల్ నుండి సాంచికి మినీ బస్సులో వెళ్లాం. సాంచికి 40, మ్యూజియం కి టికెట్ 5 రూపాయలు. మ్యూజియం మాత్రం ఒరిజినల్ గా దొరికిన వాటితో చాలా చాలా నచ్చింది. తనివి తీరా చూసాం ఓ ముగ్గురం.

ఉత్తరప్రదేశ్ లోని అంబేద్కర్ పార్కు, శ్రావస్తి మరికొన్ని వివరాలతో మరోసారి కలుద్దాం.

Tags:    

Similar News