నగరపు ఊపిరితిత్తులపై బుల్డోజర్లా...
కంచె గచ్చిబౌలి లో బుల్డోజర్లతో 400 ఎకరాల అడవిని నరుకుతున్న దృశ్యాన్ని చూసి చలించి వంగల సంతోష్ కుమార్ రాసిన కవిత;
By : The Federal
Update: 2025-04-05 00:50 GMT
-వంగల సంతోష్
అవును
ఇప్పుడు
ఎక్కడైనా బుల్డోజర్లతోనే
పాలన కొనసాగిస్తున్నారు
డేగ కండ్లతో వేటాడుతూ
వెంబడిస్తూనే వస్తున్నారు
హైదరాబాద్ పచ్చిమ నగరానికి
ఊపిరితిత్తులపై బుల్డోజర్లు దూసుకొస్తున్నాయి
పచ్చని అడవి అందాలను
తెగ నరుకుతూ
స్మశానాలుగా తీర్చిదిద్దబోతున్నారు
కంచె గచ్చిబౌలి
ఇప్పుడు కానరాకుండా పోతుందా..?
ఓ మనిషి
ఏమైంది నీకు
నీ ఉచ్చ్వాస నిచ్చ్వాసల
ఊపిరిని తీస్తున్న
ఈ బుల్డోజర్ల పాలనను
ఎదురించ లేకుంటివి.?
నీ శరీరపు ఊపిరితిత్తులను
తీస్తుంటే చలనం లేకుంటివి..?
ఈ కాంక్రీట్ జంగల్ మాయలో
మనిషి మరమనిషిగా మారిన తీరును చూసి
ప్రకృతి తల్లి తల్లడిల్లుతున్నది.
అడవి అందాల మీద బుల్డోజర్ల దాడితో
స్మశానాలుగా తీర్చదిద్దబోతున్నారు.
ఎన్ని వందల పక్షులో
వాన కురిస్తే పించం విప్పి
పురివి ఆడే నెమళ్ళను ఏ చూడాలి
ఆకు అలికిడి విని
అడుగు చప్పుడుతో
చెంగు చెంగు పరుగు తీసే
లేళ్ళు ఏడ కానవస్తాయి
పొద్దు పొడుపు కిరణాలతో
కిలకిల మంటూ రాగాలు తీసే
తీరొక్క పక్షుల కూతల
వినసొంపును ఏ చెవులతో
వినగలము నగరపు వాసి..?
తొలకరి చినుకుతో
పరవశించే పుడమిలో
చిగురించే తీరొక్క చెట్లతో
సోయలుగా పారె నీటి కాల్వలను
ఈ కాంక్రీట్ జంగల్ లో ఏడ చూడగలం మనం
ఇన్ని అందాలను బలిపెట్టుతూ
స్మశానాలను తీర్చదిద్దబోతున్నారు
చదువుల కోవెలలో ఉద్యమిస్తుంటే
ఒకడు రాజాదర్బార్ లా అంటాడు
హక్కుల కోసం అడుగుతుంటే
ఇంకొకడు గుంట నక్కలంటాడు
ప్రశ్నల కొలిమిని సంధిస్తే
మరొకడు నక్సలైటంటాడు
ఇన్ని ఆంక్షలను దాటుకుంటూనే
విశ్వవిద్యాలయాలు దేశ ప్రగతి
ముఖ చిత్రాన్ని తీర్చిదిద్దుతున్నారు.
ఇప్పుడు
కంచె గచ్చిబౌలి అయినా
దండాకారణ్యమైన
అన్యాక్రాంతం అవుతున్న అడవులను
కాపాడుకో వాల్సిన చోట గొంతులన్నీ కలవాలి
ముందు తరాల భవిష్యతు కోసం
మనం అడుగులు వేయాలి..