హిందువులు శంఖం ఊదాల్సింది అందుకు కాదు, మరెందుకు?
గిట్టుబాటు ధర లేని హిందూ రైతులను పట్టించుకోరా?;
-పి ప్రసాద్ (పిపి)
హిందూ మతాన్ని నమ్మి అనుసరించే కోట్లాది మంది రైతులు తమ భూముల్ని దున్ని పండించిన పంటలకు గిట్టుబాటు ధర లేదు. వారికి రుణమాఫీ లేదు. వారి ఆత్మహత్యలు ఆగలేదు. ఎన్నికల్లో వారికిచ్చిన హామీలు అమలు జరగడం లేదు. ఐనా హిందూమతాన్ని అనుసరిస్తూ నష్టపోయే రైతుల మేలు కోసం పోరాడతామని నిన్న హిందూ శంఖారావ సభలో హిందూ మత సంస్థలు ఎందుకు శంఖం ఊదలేదు?
హిందూ దేవుళ్ల పట్ల భక్తిపరులై, హైందవ మతం పట్ల విధేయులై, తాము హిందువులుగా చాటిచెప్పుకునే అశేష కార్మిక, శ్రామిక జనాల హక్కుల్ని 'హైర్ & ఫైర్' పేరిట నేడు సర్కార్లు కాలరాస్తున్నాయి. పర్మినెంట్ ఉద్యోగాల స్థానంలో కాంట్రాక్టు, అవుట్ సోర్సింగ్ నియమకం చేస్తున్న స్థితి వుంది. 8 గంటల పనిదినాన్ని 12 గంటల పనిదినంగా మార్చేస్థితి వుంది. లేబర్ కోడ్లతో లేబర్ ని బజారు పాలు చేసే పరిస్థితి వుంది. రాముణ్ణి కొలిచే మెజార్టీ హిందు మత కార్మికులు పని చేసే విశాఖ ఉక్కు ఫ్యాక్టరీతో సహా రైల్వే, టెలికాం, భీమా, కోల్, స్టీల్ వంటి విలువైన ప్రభుత్వ సంస్థల్ని బడా కార్పొరేట్లకి అమ్మివేసే పరిస్థితి వుంది. ఐనా వీటి పరిరక్షణ కోసం బాదిత హిందువుల తరపున పోరాటం చేస్తామని హిందూ మత సంస్థలు శంఖం ఎందుకు ఊదలేదు?
హిందూ మతస్తులైన లక్షాలది మంది టీచర్స్, లెక్చరర్స్, ఉద్యోగులు, సాఫ్ట్ వేర్ ఎంప్లాయిస్ కష్టార్జితమైన వేతనాల నుండి హిందూ మతం పేరు చెప్పుకొని ఢిల్లీ పీఠం ఎక్కి పాలిస్తున్న మోడీ సర్కార్ లక్షల కోట్ల ఆదాయ పన్ను వసూలు చేస్తున్నది. హిందూ ఉద్యోగవర్గాల నుండి ఇలా పన్నుల్ని లూటీ చేసే విధానానికి వ్యతిరేకంగా హిందూ మత సంస్థలు ఎందుకు శంఖం పూరించలేదు?
దేవాలయ భూముల్ని తరతరాలుగా దున్ని సేద్యం చేసే హిందూ మతానికి చెందిన పేద కౌలు రైతుల్ని భూముల నుండి వెళ్లగొట్టడానికి ఇటీవల వ్యూహాలు తెల్సిందే. ఆ భూముల పరిరక్షణ కోసం వారు జీవన్మరణ పోరాటం చేస్తున్నారు. వారికి ఆ భూములకు పట్టాలు ఇవ్వాలంటూ హిందూ మత సంస్థలు ఎందుకు శంఖం ఊదలేదు?
దళిత భజగోవిందం పేరిట దళిత వాడల్లో కూడా రామాలయాల్ని నిర్మించే పనిని హిందూ మత సంస్థలు ఇటీవల చేపట్టాయి. దళితులు కూడా హిందువులలో అంతర్భాగమని అవి చెబుతున్నాయి. ఐతే హిందూ దేవాలయాల్లో దళితులకి కూడా ప్రవేశ హక్కు కోసం ఎందుకవి శంఖం ఊదలేదు?
కల్యాణ వానవాసి పేర శ్రీరాముడు నడిచిన అడవులకు సైతం వెళ్లి ఆదివాసీల్ని ఆర్గనైజ్ చేసే కర్తవ్యాన్ని ఇటీవల హిందూ మత సంస్థలు చేపట్టాయి. ఆదివాసీ తెగలు కూడా హిందూ మతంలో భాగమని చెబుతున్నాయి. పైగా అవి రాముడు చెలిమి చేసిన తెగలని, వారే అరణ్యవాస జీవితంలో రాముణ్ణి కాపాడారని వారిని ఉత్సాహపరిచి హిందువులలో కలిపే ప్రక్రియ చేపట్టాయి. ఆ రాముడు నడిచిన దండకారణ్యం నేడు రక్తసిక్తమౌతోంది. ఆ రాముణ్ణి కాపాడిన ఆ ఆదివాసీల మనుగడ ప్రమాదంలో పడింది. ఆ దండకారణ్య శాంతి కోసం, ఆదివాసీ తెగల పరిరక్షణ కోసం నిన్నటి హిందూ శంఖారావ సభలో అవి ఎందుకు శంఖం పూరించలేదు?
సీత పుట్టిన నేలపై సీతమ్మ చెరలు ఎవరికీ రాకూడదని ప్రచారం చేసే హిందూ సంస్థలు నిర్భయ నుండి అభయ వరకు స్త్రీలపై కొనసాగే వరస అత్యాచారాలకు వ్యతిరేకంగా పోరాటం సాగిస్తామని ఎందుకవి శంఖం ఊదలేదు?
సామాన్య హిందువులు అడిగే ఇలాంటి ప్రశ్నలకు నిన్న గన్నవరం సమీపాన భారీ స్థాయిలో జరిగిన హిందూ శంఖారావ సభా నిర్వాహక సంస్థలు ఈ తరహా జవాబులు ఇచ్చి వుండాల్సింది. ఎందుకు అవి ఇవ్వలేదని ప్రశ్నలు అడగడం నేడు బాదిత హిందూ మత ప్రజల వంతు కావడం సహజం.
కొసమేరుపు
మేము ఏ మతానికి చెందిన వాళ్ళం కాదు. అన్ని మతాల సారం ఇంచుమించు ఒకటే అని నమ్మిన వాళ్ళం. అదే సమయంలో ప్రజలకు వ్యక్తిగతంగా తాము నమ్మిన దేవుళ్ళతో పాటు మతాల్ని అనుసరించే హక్కు ఉందని నమ్మిన ప్రజాస్వామిక వాదులం. నిన్నటి శంఖారావ సభకి గల ఎజెండా గూర్చి మా అభిప్రాయాలు మాకు ఉన్నాయి. ఆ ప్రశ్నల్ని హిందూ సంస్థలకు మేం సంధించడం లేదు. అవి ప్రజల్ని చైతన్య పరచడం కోసం వినియోగిస్తాం. ఒకే ఒక్కమాటలో చెబితే ఇది హిందూ దేవుళ్ళ పవిత్రత కోసం, హిందూ మత పరిరక్షణ కోసం చేసేది కాదని చెప్పగలం. ఇది ప్రభుత్వ రంగ సంస్థలు, పరిశ్రమల ప్రైవేటీకరణ తో వేలకోట్ల సంపాదన రుచి మరిగిన కార్పొరేట్ శక్తుల కోసమేననీ, ఇది దేవాదాయ, ధర్మాదాయ శాఖ నిర్వాహణలో గల లక్షల ఎకరాల విలువైన భూముల్ని, సత్రాల్ని, ఆలయాల స్థలాల్ని, ఆస్తుల్ని, ఆభరణాల్ని, ధన కనక వస్తు రాశుల్ని, హిందూ మత భక్తకోటి నుండి అందే అపురూప కానుకల్ని ప్రభుత్వ రంగం నుండి కబ్జాచేసే లక్ష్యంతో అంబానీ, ఆదానీ వంటి బడా కార్పొరేట్లు తెర వెనక ఉండి నడిపించే ప్రైవేటికరణ ప్రక్రియ అని చెప్పగలం. ఇది చివరకు హిందూ శంఖారావ సభా వేదికపై నుండి గర్జించిన హిందూ పీఠాధిపతుల్ని కూడా అరటితొక్కగా వాడుకొని ఆదానీ, అంబానీ వంటి కార్పొరేట్ సంస్థలు కబ్జా చేస్తాయని స్పష్టంగా చెప్పగలం. మా మాటను పక్కకు పెట్టండి. హిందూ శంఖారావ సభ నిర్వహించిన హిందూ మత సంస్థల దృష్టిలో అన్యమతస్తులైన ముస్లిం క్రిస్టియన్లు, బౌద్ద, జైన్ల, పార్సీల మాటల్ని కూడా పక్కకు పెట్టండి. హిందూ సంస్థల ప్రతినిధులు నిన్న సభలో ఏ హిందూ మత ఉద్దరణ కోసం శంఖం ఊదారో అదే హిందూ మతాన్ని అనుసరించే కార్మిక, కర్షక, కూలీ వంటి వర్గాల ప్రజలతో పాటు బడుగు, బలహీన, దళిత, ఆదివాసీ, స్త్రీ సమూహల ప్రజలకు జవాబుదారీ తనంతో స్పందించాల్సి వుంది. ఆ సంస్థల బాధ్యత ఏదైనా హిందూ మతాన్ని నమ్మి అనుసరించే ప్రజలతో సహా సమస్త ప్రజలకు మనకు తెల్సిన నిజాల్ని చెప్పి చైతన్యపరుద్దాం