'వనపర్తి ఒడిలో' గురించి వి.వి. ఏమన్నారు!
'ఖడ్గ సృష్టి' కి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు ప్రకటించినపుడు తీసుకోవద్దని అంటే, ఇల్లు తాకట్టు నుంచి విడిపించుకోవడమెలా అన్నాడు శ్రీశ్రీ.అపుడేమయింది?;
‘వనపర్తి ఒడిలో' పుస్తకం చదివి వి.వి. నాకు రాసిన లేఖ ఇది. గత ఏడాది ఈ పుస్తకం అచ్చయింది.
‘వనపర్తి ఒడిలో' పుస్తకాన్ని ఇటీవలనే వి.వి. కి పంపడంతో, వారు వెంటనే చదివి, అనాటి అనేక విషయాలను మరొక సారి తలపోసుకున్నారు. అనాటి చరిత్రలో కొన్ని కీలకమైన ఘట్టాలుగా నిలిచిపోయిన డాక్టర్ రామనాథం హత్య గురించి, డాక్టర్ బాలకృష్ణయ్య గురించి, వారిని కోట్నీస్ తో పోల్చడం గురించి, జ్వాలాముఖి గురించి, శ్రీశ్రీ గురించి కూడా ప్రస్తావించారు.
‘వనపర్తి ఒడిలో' గురించి కొన్ని విలువైన వ్యాఖ్యానాలు చేశారు. అవి వారి మాటల్లోనే చదవండి.
'వనపర్తి ఒడిలో' చదివి
రాఘవ శర్మ గారికి,
వనపర్తి ఒడిలో చదివాను. స్థూలంగా రాఘవాచారి గారి ప్రశంసతో, ఆయన ప్రాథమ్యాన్ని ప్రస్తావించిన విషయాలతో నాకు ఏకాభిప్రాయం ఉంది.
వనపర్తి పాలిటెక్నిక్ లో 1966 ఉక్కు ఉద్యమం గురించి మీరు రాసింది చదివి ఏక కాలంలో ఎన్ని భావాలు కలిగాయో వివరంగా రాయలేను కానీ, ఒక్క సారి ఆ ప్రశాంత రాజసౌధం ఎందుకు అంతగా కల్లోలమయి ఉంటుందో! అప్పుడు నేను జడ్చెర్లలో ఉన్నాను. (1965 ఆగస్టు నుంచి 68 సెప్టెంబర్ మధ్య) జడ్చెర్ల లో మా కాలేజీ విద్యార్థులు, ఏ సంబంధం లేని ఆర్ట్స్, సైన్స్, కామర్స్ కాలేజీ విద్యార్థులు ఎందుకంత మిలిటెంటుగా స్పందించారో ఇప్పుడు చారిత్రిక భౌతికవాదంలోకి వెళ్ళి ఆలోచించండి.
అది మహత్తర శ్రామిక వర్గ సాంస్కృతిక విప్లవం(చైనా)తో ప్రభావితుడైన కె.ఎస్. ఆర్.ఈ.సీ. లో విద్యార్థులను సమీకరించి, సంఘటిత పరిచి, ఒక ఆర్థిక డిమాండును మిలిటెంట్ వర్గపోరాట దృష్టితో ఎంత బాగా నిర్వహించవచ్చునో చేసిన రాజకీయ ప్రయోగం. ఆయన, ఎస్.ఎం రాజకీయ (విప్లవ) పురోగమనంగా చూశాను. వివరంగా రాజకీయంగా '50 ఏళ్ళ ఆర్ ఎస్ యూ' అనుభవాలకు నేను రాసిన ముందుమాట చదవండి. ఇది అప్పుడు రాష్ట్రంలోని అన్ని ఇంజినీరింగ్, పాలిటెక్నిక్ కాలేజీలకు ప్రత్యేకించి మిగతా కాలేజీలకు జనరల్ గా ఒక డైరెక్షన్ ఇచ్చింది. అందులో నుంచే (ఆర్.ఈ.సీ. నుంచి) ముక్కు సుబ్బారెడ్డి, మువ్వా రవీంద్రనాథ్, మల్లికార్జుర శర్మ వంటి వారే సిపీఐ (ఎంఎల్)గా నిర్మాణమయ్యారు.
నేను జడ్చెర్లలో జరుగుతున్న ఉద్యమం గురించి ఆశ్చర్యపోయే వాణ్ణి. జిల్లాలోనే వనపర్తి గురించి, అందులోనూ పాలిటెక్నిక్ గురించి ఆరాతీయకపోవడం నా అవగాహనాలోపమే. పోనీ ఈ ముందుమాట రాయకముందైనా మీ పుస్తకం చదివి ఉంటే, బహుశా మీ పుస్తకం నుంచి కొంత తీసుకుని రాసేవాణ్ణి. ఇక ముందు ఎప్పుడైనా అవకాశం వస్తే మీ పుస్తకం నుంచి కోట్ చేయడం గురించి తప్పక మీ అనుమతి తీసుకుంటాను.
ప్రత్యేక తెలంగాణా ఉద్యమంలో లుంపెన్ శక్తులు అని మీరు రాసినవి-రాఘవమ్మ బ్రహ్మానంద రెడ్డి-వంటివి చంద్రలత కూడా రాసింది. ఆ విషయంలో రాఘవాచారి గారితో నాకు ఏకీభావం. మీరు దృఢంగా ఉద్యమాన్ని బలపరచడం వల్ల ఉందిగానీ - నేను హైదరాబాదులో సత్తెమ్మ నరసింహారావు కాలేజీ గోడమీద మాత్రమే ఆ నినాదం చూశాను.
సికిందరాబాదులో కొల్లిపర నరసింహారావు, చిరంజీవి, హైదరాబాద్ లో నరేశ్ (సత్యం) వంటి వాళ్ళు నిర్వహించిన చోట - రాజ్ భవన్ ముందు జరిగిన పోలీసు కాల్పుల గురించి, మొత్తంగా ప్రత్యేక తెలంగాణా ఉద్యమం గురించి లోకేశ్వర్ రాసిన 'సలాం హైదరాబాద్' నవల చదవండి. ఉత్తర తెలంగాణాలో పూర్తిగా, వరంగల్ కేంద్రంగా కే.ఎస్., ఎస్.ఎంల మార్గదర్శకత్వంలో నడిచింది. గుంటూరు పొగాకు వ్యాపారి ఏటూరు నాగారంలో పత్ర గోవిందరావు పేటలలో ఆక్రమించిన భూముల గురించే కాక, స్థానిక ముచుమతుర్రి అగ్రహారీకుల భూములు స్వాధీనం చేసుకొమ్మని రాసిన నినాదాలు నేను చాలా కాలం వరకు హనుమకొండ నక్కల గుట్ట గోడలమీద చూశాను.
మీరు కాళోజీ 'ఇది నా గొడవ' చదివే ఉంటారు. ఆయనా అరెస్టయ్యాడు 68-69 ఉద్యమంలో. కె.జి. సత్యమూర్తి, చక్కిళ్ళ ఐలయ్య, (కె.ఎస్. నాయకత్వంలోని సీపీఐ(ఎంఎల్)లో రాష్ట్ర కమిటీ సభ్యులు) అరెస్ట్ అయ్యారు. అంతర్జాతీయ కార్మిక వర్గ ఐక్యత చెప్పేక మ్యూనిస్టులు ప్రత్యేక తెలంగాణా కావాలనడం ఏమిటి? అన్నారు. ఆయనా దానికి వాళ్ళు ఇది మీరు సాధించి ఆగిపోతారు. మేము మీరు ప్రస్తావించిన ఐక్యత కోసం పోరాడుతూనే ఉంటామని అన్నారు. అయితే కాళోజీ ఏమన్నారంటే 'రెండున్నర జిల్లాల రెండున్నర కులాల ఆధిపత్యం' అనే మాటతో మనకు పూర్తిగా ఏకీభావం ఉండడం చివరి దాకా ఉపయోగపడింది.
ఇంక 72లో నైతే చెన్నారెడ్డి వరంగల్లో ప్రత్యేక తెలంగాణా సభ(నేను ప్రారంభోపన్యాసం చేయాల్సి వచ్చింది. ఆయన తోడల్లుడు ప్రొఫెసర్ సుదర్శన రెడ్డిని వెళ్ళొద్దని చెన్నారెడ్డి వారిస్తే) అది నక్సలైట్లు నడుపుతున్నారని భయపెట్టించాడు. ఒక్క మాటతో ఇప్పటి మావోయిస్టు పార్టీ నాయకత్వం- ఉపాధ్యాయులు, విద్యార్థులు, ఉన్నారు. అమరులయిన వారు అందరూ ప్రత్యేక తెలంగాణా ఉద్యమం నుంచి వచ్చిన వారే. ఎందుకంటే ప్రత్యేక తెలంగాణా ఉద్యమంలో ప్రజా వెల్లువను పసిగట్టినవాడు లెనిన్.
ఉత్తర తెలంగాణా జిల్లాల్లో రాఘవమ్మ గారి పయిన గోడల మీద నినాదాలు ఎక్కడా చూడలేదు.
నేనింకా 1965లో జడ్చెర్లకు రాకముందే, 1965లోనే ఢిల్లీలో స్నేహమైన (హరగోపాల్ గారు ప్రస్తావించిన) దేవరాజు నరహరి నాకు వనపర్తి, బుద్దారంల గురించి ఎంత ఊరించి ఊరించి చెప్పేవాడో. వనపర్తిలో పేదల డాక్టర్ బాలకృష్ణయ్య గురించి, ఆయన ఇంటి ముందు, క్లినిక్ ముందు క్యూకట్టే జనం గురించి, ఉంటే పైసా, లేకుంటే ఉచితం గురించి ఎంత చెప్పేవాడో.
జడ్చెర్లలో ఉండగా ఆయనను చూడడానికి వెళ్ళాను. 1966లో సృజన అక్కడే ప్రారంభించాం గనుక ఆయనతో స్నేహం అక్కడే ఏర్పడింది. చనిపోయే దాకా ఆయన ఇంట్లో ఉండే కాంపౌండర్ సకల వ్యవహారాలను చూసే కిట్టు మా విరసం సభ్యుడే. ఇంక ఆయనకు, నాకు విప్లవ రాజకీయాలు ఒకే కాలంలో పట్టుబడ్డాయి. కాకపోతే ఆయన సీపీ రాజకీయ నాయకత్వాన్ని స్వీకరించాడు. ఆయన ఏర్పాటు చేసిన చోటనే వనపర్తిలో పొలిటికల్ క్లాస్ చెప్పాను. ఆయన ఇంటి ముందే బహిరంగసభలో రాజేంద్ర బాబు ఏర్పాటు చేసి, జిల్లా అంతటా తిప్పినపుడు- ఎన్నికల రాజకీయాల రొంపిలో చేరావని కాశీపతి, బాలకృష్ణయ్యలను విమర్శించాను. ఆయన భారత-చైనా మిత్రమండలికి రాష్ట్ర కార్యవర్గ సభ్యుడుగా ఉన్నారు. 74లో సికింద్రాబాద్ కుట్రకేసులో అరెస్టయ్యాము.
భారత-చైనా మిత్రమండలి కార్యదర్శి కె. వి. రమణారెడ్డి అరెస్టయ్యాక మాదాల నారాయణ స్వామి కార్యదర్శి. సహ కార్యదర్శి కాశీపతి. అయితే 76లో మావో మరణం, డెంగ్ చేతిలోకి అధికారం పోయాక మాకు చైనా రాజకీయాలపట్ల ఆసక్తిపోయి, మేమంతా ఆ రాష్ట్ర కార్యవర్గంలో కొనసాగలేదు. ఒంగోలులో జరిగిన ప్రథమ మహాసభల్లో మాది మొదటి కార్యవర్గం.
శ్రీశ్రీ ఇల్లు వేలం కాకుండా 10 వేల రూపాయల ఆర్థిక సహాయం బాలకృష్ణయ్య చేశారు 1972లో. విరసం ఏర్పడిన తొలి రోజుల్లోనే కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు 'ఖడ్గ సృష్టి' కి వచ్చినా తీసుకోవద్దని అంటే, ఇల్లు తాకట్టు నుంచి విడిపించుకోవాలన్నాడు. ఆ సభకు నేను వచ్చాను. ఆ సభలో జ్వాలాముఖి మతతత్వ శక్తులపై నిప్పులు చెరిగాడు. మీకు, నాకు, రాఘవాచారికి ఆయన టీడీపీలో చేరడం తీవ్ర అభ్యంతరకరం.
అయితే కోట్నీస్ తో ఎట్లా పోలుస్తారు? కోట్నీస్ పేదల డాక్టరైనందుకు కాదు, యుద్ధరంగంలో ప్రజా విముక్తి సైన్యంలో గాయపడిన వారికి చికిత్స చేసినందుకు. కమ్యూనిస్టు అంతర్జాతీయ సేవాభావం కోసం అమరుయ్యాడు. అటు పేదల డాక్టరు, ఇటు యుద్ధరంగంలో క్షతగాత్రులకు సేవచేసి మూల్యం చెల్లించినందుకు డాక్టర్ రామనాథంను స్మరించుకోవాలి. అలాగే ప్రజావైద్యుడైనందునే పోలీసులు పట్టపగలే చంపిన డాక్టర్ ఆమడ నారాయణను స్మరించుకోవాలి.
మీరు ఉత్తమ జర్నలిస్టు. నిత్య లేఖకులు గనుక వనపర్తి ఒడిలోను, బడిలోనూ కూర్చుని ఇంత అద్భుతంగా రాశారు. మీ జ్ఞాపక శక్తికి, వనపర్తి పట్ల మీ వల్లమాలిన ప్రేమకు మాత్రం హ్యాట్సాఫ్.
అభినందనలతో
వి.వి.