నువ్వు మెల్ల మెల్లగా మరణించడం మొదలెడతావు; పాబ్లో నెరూడా

నువ్వు మెల్ల మెల్లగా మరణించడం మొదలెడతావు అంటారు పాబ్లో నెరూడా. ఆయన అంత మాట ఎందుకన్నారు, ఇంతకీ ఈ ప్లాబో ఎవరు, ఆయనకు నోబెల్ బహుమతి ఎందుకువచ్చిందీ?

Update: 2024-02-15 03:28 GMT
ప్లాబో నెరూడా, నోబెల్ బహుమతి గ్రహీత

(చిలకంపల్లి కొండారెడ్డి  వాల్ నుంచి)

నువ్వు దేశాలు తిరగనప్పుడు,

పుస్తకాలు చదవనప్పుడు,

జీవన నిక్వాణాలని వినిపించుకోనపుడు,

నిన్ను నువ్వు అర్థం చేసుకోలేనపుడు

నువ్వు మెల్ల మెల్లగా మరణించడం మొదలెడతావు.

నీ ఆత్మగౌరవాన్ని చంపుకున్నప్పుడు,

ఇతరులు నీకు సహాయంచెయ్యడానికి ఇష్టపడనపుడు

నువ్వు మెల్ల మెల్లగా మరణించడం మొదలెడతావు.

నువ్వు నీ అలవాట్లకు బానిసవైపోయినపుడు,

ఎప్పుడూ నడచినతోవల్లోనే నడుస్తూ ఉన్నప్పుడు…

నీ దినచర్యమార్చుకోనపుడు,

నువ్వు వేర్వేరు రంగులు ధరించలేనపుడు,

లేక, అపరిచితులతో మాటాడడానికి ఇష్టపడనపుడు.

నువ్వు మెల్ల మెల్లగా మరణించడం మొదలెడతావు:

నీ నేత్రాలను చెమరింపజేసి

నీ హృదయం త్వరగా కొట్టుకునేలా చేసే

అన్ని రసానుభూతుల్నీ

వాటి ఆవేశాల తీవ్రతలనీ విడనాడినపుడు;

నువ్వు మెల్ల మెల్లగా మరణించడం మొదలెడతావు:

అనిశ్చయమైన వాటికోసం నీ సురక్షితస్థిని ఒడ్డలేనపుడు,

నీ కలలను వెంటాడుతూ పోలేనపుడు,

జీవితకాలంలో కనీసం ఒక్కసారైనా

పారిపోడానికి

నిన్ను నువ్వు విడిచిపెట్టలేనపుడు

నువ్వు మెల్ల మెల్లగా మరణించడం తథ్యం!!!

ఎవరీ పాల్బో నెరూడా?

ప్లాబో నెరూడా చీలి కవి. నోబెల్ బహుమతి గ్రహీత. దౌత్యవేత్త. విద్యావేత్త. పాబ్లో నెరూడా చిలీలోని పారల్‌లో 1904 జూలై 12న జన్మించారు. బాల్యంలో ఎక్కువ భాగం చిలీలోని టెముకోలో గడిపారు. పూర్తి పేరు నెఫ్తాలీ రికార్డో రేయెస్ బసోల్టో. పాబ్లో నెరుడా అనే కలం పేరుతో ప్రసిద్ధి చెందారు. తల్లిదండ్రులు కూడా చదువర్లే. తమ కుమారుడు రాసే కవిత్వం పట్ల మాత్రం ఏమాత్రం ఆసక్తి లేదు. నెరుడా 13 ఏళ్ల వయసులోనే కవిత్వం రాశారు. 16 ఏళ్ల వయస్సులో జర్నలిస్టు అయ్యారు. రచయితగా మారారు. 1921లో ఫ్రెంచ్ నేర్చుకోవడానికి శాంటియాగో విశ్వవిద్యాలయంలో చేరారు. ఆ తర్వాత ఇక పూర్తి కాలం కవిత్వమే రాశారు. అందులో ఒకటి ఈ కవిత. పాబ్లో నెరూడా 20వ శతాబ్దపు చిలీ కవి. స్పానిష్ కవుల్లో గొప్ప రచయిత. అతని అత్యంత ప్రసిద్ధ రచనలలో వెయింటె పొయెయాస్ డి అమోర్ వై ఉనా కాన్సియోన్ డెస్పెరాడ (ట్వంటీ లవ్ పోయెమ్స్ అండ్ ఎ సాంగ్ ఆఫ్ డిస్పేయిర్ ) మరియు సియన్ సోనెటోస్ డి అమోర్ (100 లవ్ సోనెట్స్ ) ఉన్నాయి. ''ప్రజా కవి'', ''డారియో తర్వాత గొప్ప లాటిన్ అమెరికన్ కవి'' అని పేరు తెచ్చుకున్నారు. ఆయన రాసిన కవిత్వానికి నోబెల్ బహుమతి కూడా వచ్చింది. పాబ్లో నెరూడా మరణించిన 50 ఏళ్ల తర్వాత నేటికి కూడా పాబ్లో నెరూడా కవిత్వం ప్రపంచవ్యాప్తంగా మార్మోగుతుంటోంది. ఎంతగానో ప్రభావితం చేస్తూనే ఉంది.

చెకోస్లోవేకియా కవి పేరే నెరుడా...

13 ఏళ్ల వయసులో తాను రాసిన మొదటి కవిత Entusiasmo y Perseverencia. మూడేళ్ల తరువాత, అతను ''సెల్వా ఆస్ట్రల్'' అనే సాహిత్య పత్రికకు వ్యాసాలు రాయడం ప్రారంభించాడు. ఆ తర్వాత నెఫ్తాలీ తన రచనలను ప్రచురించడానికి ''పాబ్లో నెరుడా'' అనే కలం పేరును మొదట ఉపయోగించాడు. ఈ మారుపేరు చెకోస్లోవేకియా కవి జాన్ నెరుడా ప్రేరణతో పెట్టుకున్నారు. ప్లాబో కవిత్వం రాయడం తన కుటుంబ సభ్యులకు ప్రత్యేకించి తల్లిదండ్రులకు ఇష్టం లేకపోవడంతో ఆయన నెరుడా పేరుతో రాసేవారు. నెరూడా రచనలను తన ఉపాధ్యాయులు, సహచర విద్యార్థులు ప్రశంసించడం మొదలు పెట్టారు. తోటి చిలీ కవి గాబ్రియేలా మిస్ట్రాల్‌తో సహా ఆ తరంలోని గొప్ప రచయితలు మార్గనిర్దేశం చేయడంతో ప్లాబో నెరూడా దూసుకుపోయారు.

Tags:    

Similar News