రచయిత కాశీభట్ల వెళ్లిపోయాడు...

అపుడపుడు దేశాటనకు వెళ్లినా తిరిగొచ్చే వాడు. ప్రతిపర్యటనలో కొత్తసత్యాలు తెలిశాయనే వాడు. ఈ సారి ఏ సత్యం వెదుకుతూ వెళ్లాడో తెలియదు, ఇక రాడన్నది మాత్రం ఆఖరు సత్యం.

Update: 2024-08-19 07:27 GMT

కాశీభట్ల వేణుగోపాల్ రచయిత, కవి, మిత్రుడు, తాత్వికుడు అందరిని విడిచి కర్నూలు నుంచి వెళ్లిపోయాడు.చాలా కాలం అనారోగ్యంతో సతమతవుతూనే, మిత్రులకు స్వాగతం పలుకుతూ,కబుర్లు చెబుతూ, ఓపికగా  వింటూ పుస్తకాలు చదువుతూ హాయిగా ఉండేందుకు ప్రయత్నించాడు. కాని, ఈ తెల్లవారుజామున ఆయన తిరుగురాని లోకానికి వెళ్లిపోయినట్లు తెలిసింది. దేశాటన ఇష్టపడే వేణు తిరిగిరాకుండా వెళ్లిపోయాడని మిత్రుడు సలీమ్ బాషా ఫోన్. ఒక్కమాటలో చెబితే కాశీభట్ల కన్నుమూశాడు. ఆయన వయసు డెబ్బై యేళ్లు. 1954 జనవరి 2న కర్నూలులో జన్మించాడు. ఆయన సాహిత్యాభిమానం సంస్కృత కావ్యాలతో మొదలయింది, అది అభ్యుదయ, విప్లవ సాహిత్యాల మీదుగా చుట్టూరు ఉన్న జీవన సమరాల్లోకి, అంతరంగంలోకి మళ్లింది.



వేణుగోపాల్ చదవంతా కర్నూలు, బెనారస్ లలో సాగింది. బెనారస్ హిందూ విశ్వవిద్యాలయం నుంచి ఫిలాసఫీలో ఎమ్మెచేశాడు. బహుశా అక్కడి నుంచే తాత్వికుడిగా మారాడేమో. తనకుంటూ ఏవీ వద్దు అనే స్థాయికి వచ్చాడు. పెళ్లి చేసుకోలేదు. ఎవో చిన్న చిన్న ఉద్యోగాలు చేశాడు. సంపాదన మీద ఎపుడూ దృష్టిపెట్టలేదు. గడవడమెలాగా అంటే, గడుస్తున్నది గా అనేవాడు.

2024 జనవరిలో ఒకరోజు కర్నూలులో ఉన్నపుడు కలవడానికి వస్తున్నట్లు ఫోన్ చేస్తే, ఫోన్ చేయడం కాదు, తప్పకుండా రావాలి అన్నాడు. ఒక రోజు వస్తున్నానని చెప్పి వెళ్ల లేకపోయాను. మరుసటి ఫోన్ చేస్తే ఈ రోజైనా రా నీతో కొద్దిసేపు మాట్లాడాలి అన్నాడు. మేం వెళ్లి కూర్చున్నామో లేదో, ఎవరో ఒక వ్యక్తి వచ్చిన ఒక సంచి ఇచ్చివెళ్లాడు. ‘నీ కోసమే’ అన్నాడు మూట చేతికిస్తూ.

‘నేను ఒకటొకటే అన్నింటికి దూరవుతున్నాను. మందుకు వీడ్కోలు చెప్పాను,’ అన్నాడు.

కర్నూలులో ఎవరో తెలిసిన ఎక్స్ ఆర్మీ మిత్రుడినుంచి వాట్ 69 తెప్పించాడు. సోఫాలో పెద్దమనిషి తరహాలో కూలబడి పోయాడు. మాటలు పొడిగా వస్తున్నాయి. ఏమయినా రాయవచ్చుగా ‘ది ఫెడరల్ ’ కు అని అడిగాను. ‘రాసే ఓపిక లేదు. నీకోసం రాస్తాను. కథ రాయాలా, కవిత రాయాల, మరేదయినా రాయాలా, రాస్తున్నాను, పోబ్బా’ అన్నాడు, బాటిల్ చేతికిస్తూ. సంచిలో మిరపకాయ బజ్జీలు కూడా కూడా ఉన్నాయి. ఒక బజ్జీ చేతికిచ్చాను. తిండిమానేసినందునే బతుకుతున్నాను. ఏమీ తినలేను, ఏం తింటానో, ఎపుడు తింటానో కూడా చెప్పలేను అన్నాడు. ‘చిత్రంగా ఉందికదూ, బతికేందుకు తిండిమానేశాను. ప్రపంచమంతా తిండికోెసం పోరాటం జరగుతూ ఉంది.నేను తిండిమానేసేందుకు పోరాటం చేస్తున్నాను. ఏమి తిన్నా పడటంలేదు. అదొక హింస,’ అన్నాడు.




కర్నూలు నంద్యాల చెక్ పోస్టు దగ్గిర పొదరిల్లు లాంటి ఇంట్లో ఒక్కడే ఉంటున్నాడు. ఒకటొకటే చనిపోతున్న మొక్కలు, పుస్తకం ఆయనకు తోడు. బుక్ లేకుండా చేతులెపుడూ ఖాళీగా కనిపించవు. ‘ చాలా చెట్లుండేవి, ఒకటొకటే పోతున్నాయి. ఇవి కూడా ఎక్కువ రోజులుండకపోవచ్చు,’ అన్నాడు.

ఆ రోజు 1974లో వచ్చిన తొలిక థ ‘రంగనాయకి లేచిపోయింది’ గురించి చాలా సేపు చెప్పాడు. అది ఒక సంఘటనకి కథా రూపమని చెప్పాడు. ఒకమ్మాయి లేచిపోతే, లోకం ఏమనుకుంటుందో , వాళ్లు అనుకున్నది అనుకున్నట్లే రాశాను అది కథయింది. ఇలాంటి కథలవెనక ఉన్నసంఘటనల గురించి రాయవచ్చుగా అన్నాను. రాస్తాను అని చేతిలో చెయ్యేసి మరీ చెప్పాడు.

ఆయన తొలి నవల ‘నేను-చీకటి’ ఆ తర్వాత చాలా నవలలు కథలు కూడా రాశాడు. ‘తపన’, ‘రంగులగదీ’, ‘దిగంతం’ కథలతో రచయితగా స్థిరపడ్డాడు.. ‘రాళ్ళెత్తిన కూలీ’ తనకు నచ్చిన కథ. ‘కాశీ భట్ల కథలు’, ‘ఘోష’ లు కథా సంపుటాలు.

రెన్నెళ్ల కిందట ఫోన్ చేశాను. వద్దామనుకుంటున్నాను. ఏమ్మాట్లాడలేదు. ఆ బాటిల్ అట్లే ఉంది. అన్నాడు. అలసిపోయినట్లు స్పష్టంగా కనబడుతూ ఉంది. నేను వెళ్లాలనుకుంటూనే ఉన్నాను. వెళ్లలేకపోతున్నాను.  కొద్ది సేపటి కింద మా ఇద్దరి మధ్య వారది లాంటి సలీమ్ బాషా ఫోన్ చేసిచెప్పారు. కాశీభట్ల 'పోయాడబ్బా’ అని.


Tags:    

Similar News