కొళికోడ్ గుండెతడి
రచయిత యక్కలూరి శ్రీరాములు పర్యటన జ్ఞాపకం
1997డిసెంబర్ లోకేరళ ‘కొళికోడ్’ (కాలికట్)లో ఒక నెలంతా స్థానికచిత్రకారులతో గడిపాను. ఎలాగంటే. ఎందుకంటే...
అల్ ఇండియా ఖాదీ ఎగ్జిబిషన్ కోసం మా ఇన్సిట్యూట్ నుంచి నన్ను పంపించడానికి ఏర్పాట్లు చేశారు. హిందీ ఆంగ్లం అంతో ఇంతో ఎంతో కొంత నాకు వస్తుందని, దేశంలో ఎక్కడికెళ్లినా పదిమందిలో నెగ్గుకు రాగలనని ఇన్సిట్యూట్ లోని వారు నా గురించి అనుకోవడం, నాముందుకూడా అనడం నేను విన్నాను. సరే! నాకెలాగూ కొత్తకొత్త ప్రదేశాలు తిరగాలని, ఆయా ప్రాంతాల మనుషుల జీవితాలు చూడాలని అభిలాష. అది నా జీవితానికి సంతృప్తి. ఓరకంగా నన్నునేను చెప్పుకోవాలంటే నేను ఓ బాటసారి... వివిధ ప్రదేశాలు తిరిగే ఓ విహారి.
ఈ సారి ఏకంగా ఒక నెలరోజులు కేరళలో గడపడానికి అవకాశం కలిగింది. ఎగ్జిబిషన్ రేపనగా ఆ గ్రౌండ్లో కలియతిరుగుతున్నాను. ఓచోట నాకాళ్ళు ఆగిపోయాయ్. ఓ దృశ్యం వైపు నా చూపులు లాక్కెల్లాయ్. అక్కడే నిలబడి చూస్తున్నా. అదేమిటంటే...‘గాంధీ దండి యాత్ర’ దృశ్యాన్ని నలుగురైదుగురు చిత్రకారులు చిత్రీకరిస్తున్న విధానం. దాని తదేకంగా గమనిస్తూ నిలబడ్డాను. నేను అలాగే చాలాసేపు నిలుచున్నది చూసి ఓ చిత్రకారుడు నవ్వాడు. మలయాళంలో పలుకరించాడు. నేను హిందీలో పలికాను. తను నను హిందీలో ఎక్కడనుంచి వచ్చారని అడిగితే ఆంధ్రప్రదేశ్ నుంచి అని చెప్పాను. మాటలు కలిసాయ్. ఎగ్జిబిషన్ లో చిత్రాలన్నీ చిత్రించడానికి మమ్మల్ని సెలెక్ట్ చేసుకుని కాంట్రాక్ట్ ఇచ్చారని చెప్పాడు. మీరు వేస్తున్న చిత్రం చాలా బాగా వేస్తున్నారని వారు అడగకనే కితాబిచ్చాను... నవ్వాడు. అతనిపేరు తాజు. పరిచయమయిన ఆ రోజునుంచి ఎగ్జిబిషన్ ముగిసే వరకు ప్రతిరోజు వారు ఆర్ట్స్ వేస్తున్న గదికి వెళ్ళి కాసేపు గడిపి ఆ పిదప కడలి తీరానికి వెళ్ళి రాత్రిళ్ళు కొబ్బరిచెట్ల ఆకుల పట్టలపైనుంచి అరేబియా సముద్రంపై జాబిలి జాలువార్చే వెన్నెలతో కేరింతలు కొట్టే చిన్నపిల్లలలాంటి అలల్నిచూస్తూ
‘తాజు’ మాటలువింటూ.....నాకు కొద్దిగా తెలిసిన హిందుస్తానీలో నేను చెప్పే షాయిరీలకు తానుస్పందిస్తూ రేయిలోనిహాయిని అస్వాదిస్తుంటే కాలం తెల్లారేది.
ఓరాత్రి అర్ధరాత్రి సమయంలో పోలీసులు వాన్ లో వచ్చారు. మలయాళంలో ఎదో అడుగుతున్నారు. తాజు సమాధానం చెబుతున్నాడు. నన్నుచూస్తూ ఏదో అడగుతున్నారు. నే నేనెక్కడినుంచి వచ్చానో తాజు వారికి చెప్పాడు. నాఅభిరుచిని మలయాళంలో వివరించినట్టుంది (మలయాళం నాకురాదు కదా!)
పోలీసులు వెళ్లిపోయారు... మమ్మల్ని అక్కడినుంచి వెళ్లిపొమ్మని చెప్పలేదు...
ఒకరోజు తాజు వారింటికి నను పిలుచుకెళుతున్నాడు. వెళ్లేదార్లంతా. నేలంతా ఆకుపచ్చదనం. అరటిచెట్లు... ఇంటికి ఇంటికి మధ్య చాలా దూరాలు. వారి ఇంటి పరిసరాలు కూడా అరటిచెట్లమధ్య పచ్చపచ్చగాకలకలలాడుతోంది. కాలికట్ కి పన్నెండు కిలోమీటర్ల దూరంలో....
మధ్యాహ్నం రొండుగంటలయ్యింది. మేం వెళ్లిన మరో అరగంటకు తాజు... ఇద్దరు చెల్లెల్లు బావలు బిలబిలా వచ్చారు. నన్ను వారికి పరిచయంచేయకనే... నాతో వాళ్ళు కలివిడిగా మాటాడుతున్నారు. బహుశా నాగురించి తాజు ఇదివరకే వారికి చెప్పివున్నాడనిపించింది . తాజు అమ్మ నన్నుచూసి నవ్వింది...ఆమెకు మలయాళం తప్ప హిందీ ఉర్దూ రాదు...
ఆనవ్వులో బంధాలకు భాషతో పనేముందనిపించింది. ఆ అమ్మలో మా అమ్మే కనిపించింది...పిదప ఇంటిబయటతోటలోకేమో వెళ్ళిపోయింది ...
ఇల్లు చిన్నదే కానీ డైనింగ్ హాల్ చాలాపెద్దది. తాజు చిన్నచెల్లెలు నాపక్కన వచ్చి కూచుంది...
తాజు చెల్లెళ్లకి హిందీ ఉర్దు కలగలిపిన హిందుస్తానీ వస్తుందని వారిమాటలతో తెలిసిపోయింది. తాజు చెల్లెళ్లు నాతో మాటాడుతూనేవున్నారు... బావలు మౌనంగా వున్నారు... కారణం...వారికి మలయాళం తప్ప మరో భాష కొజికోడి(కాలికాట్)-గుండెతడిరాకపోవడమే... మధ్యమధ్యలో నేనుచెప్పేది తాజు, తాజు చెల్లెళ్ళు తర్జుమాచేసిచెబుతుంటే నవ్వుతూ ఆస్వాదిస్తున్నారు.
మధ్నాహ్నం గడిచిపోతోంది. నాకేమో ఆకలి వేస్తోంది. నాలుగుగంటల పైనే అయ్యింది. అప్పుడు డైనింగ్ టేబుల్ మీదికి వాళ్ళమ్మ తిండి సర్దుతూ ఉంటే తాజు పింగాణీ ప్లేట్లు అందరి ముందుపెట్టి తనుకూచున్నాడు. అందరికి పెద్ద పాత్రలోఉన్న అన్నం వడ్డించి నాకుమాత్రం చిన్న గున్న గిన్నెలో ఉన్న అన్న వడ్డించింది. అప్పుడుచెప్పాడు.... తాజు...!
"మీరు మా లావుబియ్యం తినరని అమ్మకి తెలిసి సిటికి పోయి మీరుతినే సన్నబియ్యం తెచ్చి వండింది. అందుకే భోజనం లేట్ అయ్యింది " నాకళ్ళలో నీళ్ళగిర్రునతిరిగాయ్. అమ్మంటేమిటోతెలిసి.... అన్నంలో...రసం కలుపుకుని తింటూ అప్పడం కొరికి తింటున్న నావైపు అందరూచూస్తున్నారని తెలుస్తోంది... బహుశా నేను అప్పడం కొరికితింటున్న శబ్దానికేమో అనుకుంటున్నాను. అప్పుడు తాజు చెప్పాడు ... రసం అన్నం పై అప్పడం పెట్టి వత్తి... నలిపి నలిపి కలుపుకుని తింటే ఎంతరుచిగా వుంటుందోనని. ఓహ్... అందుకా! నన్నువాళ్ళుచూశారనుకొని తాజు చెప్పినట్టు చేసాను. తింటుంటే నిజమే చాలారుచి అనిపించింది... అప్పటినుంచి ఇప్పటిదాకా అలా తినడమేఅలవాటుగామారింది....
భోజనం కాగానే అరటిపళ్ళు తిన్నాం....
పాటలుపాడే కార్యక్రమం మొదలయ్యింది ...
తాజు చెల్లెళ్లు హిందీ సినిమాల్లో నివి తలోపాట పాడారు...
తాజు బావలూ మలయాళం సినిమాల్లోని పాటలు పాడారు... తాజుకి పాడటం రాదని లొడలొడా మాటాడం మాత్రమే వచ్చని జోక్ చేసి నవ్వుతూ కూచున్నాడు... నన్ను పాడమన్నారు... కొన్ని షాయరీలు చెప్పి నాకు పాటలు రావని చెప్పినా వినలేదు ...
ఎదో ఒకపాట మీభాషలోనివైనా పాడమన్నారు...
"దేవసభాతలం...."ఆంటూ ఒకటి "ప్రమదవనంనాదం..." మరోటి "హిస్ హైనెస్ అబ్దుల్లా" మలయాళం సినిమాలోని పాటలలో పల్లవి చరణాలు పాడగానే వాతావరణం నిశ్శబ్దంగామారింది . కాసేపటికి అందరూచప్పట్లు కొడుతూనే వున్నారు. తాజు మొహంలో ఆశ్చర్యం ....
తాజుని వాళ్ళచెల్లెల్లు బావలూ ఒకరి తరువాతొకరు ఎదో బిలబిలాఅడుగుతుంటే ...
బిక్కమొహమేసుకుని నా వైపుచూసి "ఇన్నాల్లూ చెప్పలేదేం.... మలయాళం నీకు వస్తుందని... వీళ్ళందరూ నన్ను అదే ప్రశ్నిస్తున్నారు...అయినా ఇలాచేసావేం...చూడు నేను బకరానయ్యా ...." నవ్వుతూనే అన్నాడు .
"తాజు... నిజంగా మలయాళం నాకు రాదు ... అయితే మలయాళంలో మంచిపాటలున్న సినిమా ఆడియో క్యాసెట్లు కావాలంటే ఒకరోజు షాప్ కి తీసికెళ్ళి " హిస్ హైనెస్ అబ్దుల్లా " "సరిగమలు" ఆడియో కేసెట్స్ నన్ను నువ్వు తీసుకొమ్మంటే తీసుకున్నానుకదా! రోజూ ఆ పాటలు వింటూ కొన్ని చరణాలు నేర్చుకున్నా ...అంతే... ఇప్పుడు మీరు పాడమంటే ఇలా తెలిసీతెలియక పాడాను " అందరివైపుచూస్తూ అన్నాను ....
"ఎక్కడా పొల్లు పోలేదు ... అద్భుతంగా పాడారు... మీపాటలు...విని మీకు మలయాళం రాదంటే ఎవరూనమ్మరు"అంటూ అందరూ మరోసారి అభినందనలు తెలియచెబుతుంటే.... నవ్వుతూ.
అందరికి వీడుకోలు పలుకుతూ పొద్దుమునిగేవేళ తాజుతో కాలికట్బయలుదేరా...................************** కాలికట్...తాజు....పదేళ్ల తరువాత ఓ రోజు ఫోన్ చేశాడు...! అత్యవసరంగా కోయంబత్తూర్ వచ్చేయమన్నాడు! ఎందుకు ఏమని అడగలేదు... వెంటనే బయలు దేరాను. రైల్వేస్టేషన్ దగ్గర ఓ హోటల్ కి పిలుచుకెళ్ళాడు. రూంలోవున్ననలుగురికి నన్ను పరిచయం చేశాడు... భోజనాలువచ్చాయి... రాత్రి తొమ్మిదయ్యింది అప్పుడు చెప్పాడు "ఆ నలుగురూ సినిమా నిర్మాతలని నన్ను రెండు సినిమాలు చేయమని అడగడానికి పిలిపించుకున్నారని... కారణం.... నేను(తాజు)బొంబాయి బాలివుడ్ లో కొన్నేళ్ళు పని చేసాను కదా! అందుకు నన్ను వీళ్లు అడిగితే మీ పేరు చెప్పాను!" తాజు. సబ్జెక్టు గురించి చర్చ మొదలయింది."మీఇష్టం మీకు ఏది నచ్చితే అది చేయమన్నారు" ''వాత్స్యాయని కామసూత్ర.... ఆదిశంకరాచార్య...ఈ రెండు సినిమాలు నా సబ్జెక్ట్స్ అని వాత్స్యాయని కామసూత్ర.... ఖజురహోలో... ఆదిశంకరాచార్య తను పుట్టి...దేశమంతా తిరిగిన ప్రదేశాల్లో తీద్దాం.... నటులు కొత్తవారిని తీసుకుందాం" చెప్పాను. "ఓహ్...టూ డిఫరెంట్ సబ్జెక్ట్స్.... మైండ్ బ్లోయింగ్..... సరే... రేపే...త్రివేండ్రం అడ్రస్ (వారి స్వస్థలం) నుంచి నూతననటీనటులు కావాలని ప్రకటన ఇస్తాం...మీరే సెలెక్ట్ చేసుకోండి... సినిమాలు మొత్తం మీచేతుల్లో పెడుతున్నాం... మేము కేవలం నిర్మాతలం... ప్రకటన తేదీ మీకు తెలియచేస్తాం మీరు త్రివేండ్రం వచ్చేయండి" ఎవరి రూముల్లోకి వాళ్లు వెళ్ళిపోయారు! వారంరోజులుదాటిన పిదప "సార్...నలుగురి నిర్మాతల్లో ఇద్దరి కుటుంబాల్లో కొన్ని అనుకోని సంఘటనలు జరిగాయి. సినిమాలు ఆలస్యమవుతాయేమో. అందుకే ఫోన్ చేస్తున్న," తాజు.
తరువాత....కథ... కంచికివెళ్ళినట్టుంది!
******
కొసమెరుపుఏమిటంటే... కాలికట్ లో చిత్రకారులతో గడిపినప్పుడు ఓబనియన్ మీద వారి పేర్లని రాసి వారు నాకు గురుతుగా ఇచ్చారు.... ఆ బనియన్ నేటికి భద్రంగా దాచుకుని అప్పుడప్పుడు వేసుకుంటున్నప్పుడు ఆనాడు గడిపిన కాలికట్ గుర్తులు గుండెను స్పృసిస్తుంటాయ్
"గడచిన సమయాలు ఎంతో ప్రియమైనవి............!
నడుస్తున్న కాలాలు మరెంతో విలువైనవి....!