రష్యా దిగుమతుల గురించి తెలియదన్న అమెరికా అధ్యక్షుడు ట్రంప్
భారత్‌పై సుంకాలకు వ్యతిరేకంగా నిక్కీ హేలీ హెచ్చరిక..;
రష్యా(Russia) నుంచి తమ దేశం యురేనియం, ఇతర ఎరువులను దిగుమతి చేసుకుంటున్న విషయం తనకు తెలియదని అమెరికా(America) అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్(Donald Trump) అన్నారు. అయితే రష్యా నుంచి ముడి చమురును కొనుగోలుచేస్తోన్న భారతదేశంపై అధిక సుంకాలు విధిస్తామని ఆయన బెదిరించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. లాస్ ఏంజిల్స్‌లో నిర్వహించే 2028 ఒలింపిక్స్ గురించి మాట్లాడేందుకు వైట్‌హౌస్‌లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ట్రంప్ మాట్లాడారు. అమెరికానే స్వయంగా మాస్కోతో వాణిజ్యం చేస్తోందని భారత్ చేస్తున్న వాదన గురించి అడిగిన ప్రశ్నకు "నాకు దాని గురించి తెలియదు. పరిశీలించాలని" అని సమాధానమిచ్చారు.
రష్యా నుంచి అమెరికా చేసుకుంటున్న దిగుమతుల లెక్కేంత?
ఉక్రెయిన్‌ను రష్యా ఆక్రమించిన మూడేళ్ల తర్వాత కూడా రష్యా నుంచి అమెరికా బిలియన్ల డాలర్ల విలువైన వస్తువులను దిగుమతి చేసుకుంటూనే ఉందని రికార్డులు చెబుతున్నాయి. 2022 జనవరి నుంచి అమెరికా $24.51 బిలియన్ల రష్యన్ వస్తువులను దిగుమతి చేసుకుంది. వీటిలో $1.27 బిలియన్ల ఎరువులు, $878 మిలియన్ల పల్లాడియం, $624 మిలియన్ల విలువ చేసే ప్లూటోనియం, యురేనియం ఉన్నాయి.
'ద్వంద్వ ప్రమాణాలు'
రష్యా నుంచి చమురు కొనుగోలు చేసినందుకు భారత్‌పై ఆంక్షలు విధిస్తామని అమెరికా బెదిరించడంపై యూరోపియన్ యూనియన్ (EU) ద్వంద్వ ప్రమాణాలు పాటిస్తున్నాయని భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ ఇటీవల ఆరోపించింది. ఉక్రెయిన్‌తో యుద్ధం ప్రారంభించిన తర్వాత కూడా వారు రష్యా నుంచి దిగుమతి చేసుకున్నారని పేర్కొంది.
అధిక సుంకాల ముప్పు
రష్యా నుంచి ఇంధనాన్ని కొనే దేశాలపై 100 శాతం సుంకాలు విధిస్తారా? అని ట్రంప్‌ను అడిగిన ప్రశ్నకు ఆయన సూటిగా సమాధానం ఇవ్వలేకపోయారు.
"నేను ఎప్పుడూ శాతం గురించి చెప్పలేదు. రేపు రష్యాతో సమావేశం ఉండబోతుంది. ఏమి జరుగుతుందో చూద్దాం" అని పేర్కొన్నారు.
రష్యా-ఉక్రెయిన్ దేశాలు యుద్ధాన్ని ముగించడమే ఈ చర్చల లక్ష్యమని, రష్యా దాని వాణిజ్య భాగస్వాములపై సుంకాలు విధించాలా? వద్దా? అనేది బుధవారం (ఆగస్టు 6) మాస్కోలో అమెరికా ప్రత్యేక రాయబారి స్టీవ్ విట్‌కాఫ్ జరిపే చర్చలపై ఆధారపడి ఉంటుందని ట్రంప్ అన్నారు.
ట్రంప్‌ను విమర్శించిన నిక్కీ హేలీ..
రష్యా నుంచి చమురు కొనుగోలు చేసినందుకు భారత్‌పై సుంకాలను పెంచుతామని అధ్యక్షుడు ట్రంప్ మంగళవారం చేసిన బెదిరింపు వ్యాఖ్యలను ఐక్యరాజ్యసమితిలో అమెరికా మాజీ రాయబారి నిక్కీ హేలీ తప్పుబట్టారు. "భారత్ లాంటి బలమైన మిత్రదేశం"తో సంబంధాలను పాడుచేసుకోవద్దని హేలీ అమెరికన్ అధ్యక్షుడికి సూచించారు.
"రష్యా నుంచి భారత్ చమురు కొనుగోలు చేయకూడదు. కానీ అమెరికా ప్రత్యర్థ దేశాలైన రష్యన్, ఇరాన్ నుంచి చమురును భారీగా కొనుగోలు చేస్తున్న చైనాకు 90 రోజుల సుంకాల విరామం ఇచ్చింది. చైనాకు అనుమతి ఇవ్వకండి. భారత్ లాంటి బలమైన మిత్రదేశంతో సంబంధాన్ని పాడుచేసుకోకండి" అని నిక్కీ హేలీ పేర్కొన్నారు.