‘బ్రిక్స్’ దేశాలకు వార్నింగ్ ఇచ్చిన డొనాల్డ్ ట్రంప్

అమెరికా వ్యతిరేక విధానాలను అనుసరిస్తే పది శాతం టారిఫ్ విధిస్తామని హెచ్చరిక;

Update: 2025-07-07 05:36 GMT
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి బ్రిక్స్ దేశాలకు వార్నింగ్ ఇచ్చాడు. అమెరికా వ్యతిరేక విధానాలతో జతకట్టే దేశాలపై వాషింగ్టన్ 10 శాతం సుంకాన్ని విధిస్తుందని హెచ్చరించారు. బ్రెజిల్ వేదికగా బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశం జరుగుతోంది. ఈ సమావేశాలను ఉద్దేశించే ట్రంప్ వ్యాఖ్యలు చేశారు.

‘‘బ్రిక్స్ కానీ మరే సంస్థ కానీ అమెరికన్ వ్యతిరేక విధానాలతో జతకట్టే ఏ దేశానికైనా అదనంగా పది శాతం సుంకం విధిస్తాము. ఈ విధానానికి ఎటువంటి మినహయింపులు ఉండవు’’ అని ట్రంప్ ట్రూత్ సోషల్ లో పోస్ట్ చేశారు. అయితే అమెరికా వ్యతిరేక విధానాలు అంటే ఏమిటో అమెరికా అధ్యక్షుడు పేర్కొనలేదు.
జూలై 9 గడువుకు ముందే బ్రిక్స్ సభ్యదేశమైన భారత్ తో స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందాన్ని కుదుర్చుకోవడానికి ప్రయత్నిస్తున్న తరుణంలో ట్రంప్ ప్రకటన వెలువడింది.
ప్రపంచ దేశాలపై ట్రంప్ టారిఫ్ వార్ ప్రకటించిన తరువాత భారత్- అమెరికా మధ్య వాణిజ్య ఒప్పందాలు కుదుర్చుకోవడానికి సిద్ధమయ్యాయి. దీనిపై చర్చోపచర్చలు జరుగుతున్నాయి. తుది ముసాయిదా ఖరారు కావడానికి సిద్దం అయిందని విదేశాంగ ప్రతినిధులు చెబుతున్నారు. 
సుంకాల పెంపుపై బ్రిక్స్..
ప్రపంచ దేశాలపై విపరీతమైన టారిఫ్ లు విధించడాన్ని, ఇరాన్ పై విధిస్తున్న ఆంక్షలను బ్రిక్స్ ఖండించింది. అయితే ఈ ప్రకటనలో ఎక్కడా అమెరికా, ట్రంప్ పేరు ప్రస్తావించకుండా పరోక్షంగా వాషింగ్టన్ విధానాలను విమర్శించింది.
ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న సుంకాల పెరుగుదల గురించి తీవ్రమైన ఆందోళనలను లేవనెత్తింది. ఇది ప్రపంచ వాణిజ్య సంస్థ నియమాలకు విరుద్దంగా ఉందని పేర్కొంది. సుంకాలు ప్రపంచ వాణిజ్యాన్ని తగ్గించే అవకాశం ఉందని, ప్రపంచ సరఫరా గొలుసుపై తీవ్రమైన అనిశ్చితి తీసుకొచ్చే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేసింది.
నాటో సైనిక కూటమి 2035 నాటికి ఏటా జీడీపీలో 5 శాతం పెంచాలనే నిర్ణయాన్ని బ్రెజిల్ అధ్యక్షుడు లూయిజ్ ఇనాసియో లులా డ సిల్వా విమర్శించారు. ‘‘శాంతికంటే యుద్ధంలో పెట్టుబడి పెట్టడం ఎల్లప్పుడూ సులభం’’ అని శిఖరాగ్ర సమావేశం ప్రారంభంలో లూలా అన్నారు.
ఈ సమావేశానికి ఇరాన్ అధ్యక్షుడు మసౌద్ పెజేష్కియాన్ బదులు తన ప్రతినిధిగా విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చిని పంపారు. బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశానికి రష్యా అధ్యక్షుడు పుతిన్, చైనా అధ్యక్షుడు షీ జిన్ పింగ్ హజరుకాలేదు.
ముఖ్యంగా చైనా ప్రెసిడెంట్ ఈ సమావేశాలకు రాకపోవడం అనేక ఊహగానాలను ప్రాధాన్యం ఏర్పడింది. ఈ సమావేశంలో ఇరాన్ పై దాడులను బ్రిక్స్ ఖండించింది. కానీ ఎక్కడా కూడా అమెరికా, ఇజ్రాయెల్ పేరు ను ప్రస్తావించలేదు.
ఉగ్రవాదంపై చర్యలుండాలి: మోదీ
ప్రపంచ సహకార, బహుళ ధ్రువ ప్రపంచానికి చోదకశక్తి, ఉత్ప్రేరకంగా పనిచేయాలని ప్రధాని మోదీ బ్రిక్స్ దేశాలకు పిలుపునిచ్చారు. ఆ కూటమి ఆదర్శంగా వ్యవహరించాలని, గ్లోబల్ సౌత్ అంచనాలను అందుకోవాలని కోరారు.
రియోడీ జనీరో వేదికగా జరుగుతున్న 17 వ బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశంలో ‘బహుపాక్షికత, ఆర్థిక వ్యవహరాలు, కృత్రిమ మేధస్సు బలోపేతం’ అనే అంశంపై జరిగిన సెషన్ ఆయన మాట్లాడారు.
ఉగ్రవాదంపై పోరాటం కోసం భారత ప్రధానమంత్రి కూడా బలమైన వాదనను వినిపించారు. చెడుకు వ్యతిరేకంగా ప్రపంచం ఐక్యంగా నిలబడాలని పిలుపునిచ్చారు.
బ్రిక్స్ వైవిధ్యం బహుళ పక్షాలు భాగస్వామ్యంగా ఉండటం వలనే సాధ్యమైందని పేర్కొన్నారు. ప్రపంచ పాలన, అభివృద్ది సహకారంలో బ్రిక్స్ దేశాలు ప్రమాణాలను నిర్దేశించాలని అన్నారు.
‘‘గ్లోబల్ సౌత్ మన నుంచి ఆశలు పెట్టుకుంది. వాటిని నెరవేర్చడానికి మనం ఉదాహారణ ద్వారా నాయకత్వం వహించాలి. పరస్పర లక్ష్యాలను సాధించడానికి అన్ని భాగస్వామ్య పక్షాలతో భుజం భుజం కలిపి పనిచేయడానికి భారత్ సిద్ధంగా ఉంది’’ అని మోదీ చెప్పారు.
ఉగ్రవాదంపై ద్వంద్వ ప్రమాణాలను అమలు చేయడానికి వీలులేదని అన్నారు. జమ్మూకాశ్మీర్ లో పహల్గామ్ లో జరిగిన ఉగ్రవాద దాడిని మోదీ ఉటంకించారు. ప్రపంచానికి ఇస్లామిక్ ఉగ్రవాదం పెను సవాల్ గా మారిందని అన్నారు.
Tags:    

Similar News