అమెరికాలో ఇప్పటికి ఎంతమంది అధ్యక్షులపై దాడులు జరిగాయంటే!

మహాకవి శ్రీ.శ్రీ. చెప్పినట్టు ఏ దేశ చరిత్ర చూసినా ఏమున్నది గర్వకారణం, బీభత్సరస ప్రధానం, పిశాచగణ సమవాకారం. అమెరికాలో 19 మంది తాజా, మాజీ అధ్యక్షులపై తూటాలు పేలాయి

By :  A.Amaraiah
Update: 2024-07-15 01:40 GMT

అమెరికా 45వ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు. యావత్ ప్రపంచం ప్రత్యేకించి అమెరికాలోని నల్లజాతీయులు ఊపిరి పీల్చారు. పెన్సిల్వేనియాలో జూన్ 13 సాయంత్రం జరిగిన హత్యాయత్నం తర్వాత ప్రపంచ నలుమూలల నుంచి ట్రంప్ కి ఓదార్పు సందేశాలు వెల్లువెత్తుతున్నాయి. సుమారు 18 గంటల పాటు చికిత్స పొందిన ట్రంప్ ఆసుపత్రి నుంచి తన విడిదికి చేరుకున్నారు. సోమవారం జరిగే రిపబ్లికన్ పార్టీ ర్యాలీలో యధావిథిగా పాల్గొంటానని ప్రకటించారు. ట్రంప్ పై తుపాకీ పేల్చిన 20ఏళ్ల శ్వేతజాతీయుణ్ణి సీక్రెట్ సర్వీసు ఏజెంట్లు కాల్చిచంపారు. ఎఫ్.బీ.ఐ. రంగంలోకి దిగింది. అంగుళమంగుళం గాలిస్తోంది. ట్రంప్ పై హత్యాయత్నం తర్వాత అమెరికాలో ఈ తరహా బీభత్స సంఘటనలను గుర్తు చేసుకుంటున్నారు. చర్చిస్తున్నారు.


అమెరికా విముక్తి చెంది ఇప్పటికి 248 ఏళ్లు.45 మంది అధ్యక్షులుగా పని చేశారు. ప్రస్తుత జో బైడెన్ 46వ అధ్యక్షుడు. ఆదేశాధ్యక్షులు, మాజీ అధ్యక్షులపై కాల్పులకూ సుదీర్ఘ చరిత్ర ఉంది. తొలి అధ్యక్షుడు అబ్రహాం లింకన్ తుపాకుల తూటాలకే బలయ్యాడు. జో బైడెన్ ఇంటిపైకి సాక్షాత్తు ఇండియన్ అమెరికన్ వర్షిత్ కందుల ఓ ట్రక్కునే నడిపాడు. ఇప్పటికి 19 మంది తాజా, మాజీలపై పై కాల్పులు జరిగాయి. వీటిలో 7 సంఘటనలు చాలా పెద్దవి. నలుగురు మరణించారు. ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. కాల్పులు జరిపిన వారిలో ఎక్కువ మంది పిచ్చివాళ్లనే విచారణాధికారులు చెప్పడం గమనార్హం. ట్రంప్ ను కాల్చిన వ్యక్తికి కూడా మతిస్థిమితం సరిగా లేదన్నట్టు తెలుస్తోంది.

నలుగురు అధ్యక్షుల హత్య...
1865లో అబ్రహం లింకన్, 1881లో జేమ్స్ గారీఫీల్డ్, 1901లో విలియం మెకిన్లీ, 1963లో జాన్ ఎఫ్. కెన్నెడీ హత్యకు గురయ్యారు. ప్రాణాలతో బయటపడిన వారిలో డోనాల్డ్ ట్రంప్‌ సహా ముగ్గురున్నారు. 1912లో థియోడర్ రూజ్‌వెల్ట్, 1981లో రోనాల్డ్ రీగన్, 2024లో డొనాల్డ్ ట్రంప్.
రూజ్‌వెల్ట్ పదవి విరమణ తర్వాత మూడేళ్ల తర్వాత 1912 అధ్యక్ష ఎన్నికల కోసం మిల్వాకీలో ప్రచారం చేస్తున్నప్పుడు కాల్పుల్లో గాయపడ్డారు. హంతకుడు జాన్ ష్రాంక్- రూజ్‌వెల్ట్‌ను .38-క్యాలిబర్ పిస్టల్‌తో ఛాతీపై కాల్చాడు. అయితే రూజ్‌వెల్ట్ జేబులో ఉన్న ప్రసంగ పాఠం ప్రతి, మెటల్ గ్లాసెస్ -రూజ్ వెల్ట్ ప్రాణాలను కాపాడాయి. ష్రాంక్ అరెస్టు అయ్యాడు. పిచ్చివాడిగా గుర్తించారు. జీవితాంతం జైలు జీవితం గడిపాడు.
రీగన్ అధికారం చేపట్టిన మూడు నెలల తర్వాత వాషింగ్టన్ డీసీ లో తీవ్రంగా గాయపడ్డాడు. జాన్ హింక్లీ జూనియర్- సిట్టింగ్ ప్రెసిడెంట్‌ సహా ముగ్గురిపైన నగర నడి వీధుల్లో ఆరు షాట్లు కాల్చాడు. రీగన్ పక్కటెముక విరిగిపోయింది. ఊపిరితిత్తులకు గాయమైంది. 12 రోజుల తర్వాత ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యాడు. నిందితుడు హింక్లీని అరెస్టు చేసి పిచ్చివాడని తేల్చారు.
2024 జూలై 13 న పెన్సిల్వేనియాలోని బట్లర్‌లో జరిగిన ప్రచార ర్యాలీలో డొనాల్డ్ ట్రంప్‌పై కాల్పులు జరిగాయి. మాజీ అధ్యక్షుడి చెవిపై నుంచి బుల్లెట్ దూసుకుపోయింది. హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆరోగ్యం బాగానే ఉంది. సీక్రెట్ సర్వీస్ ఏజెంట్లు ట్రంప్ ను కాపాడారు. ఈ హత్యాయత్నంలో షూటర్ తో పాటు మరో వ్యక్తి చనిపోయారు. కాల్పులు జరిపిన వ్యక్తి ఓ 20 ఏళ్ల యువకుడు. అతన్ని సీక్రెట్ సర్వీసు ఏజెంట్లు కాల్చి చంపారు.
అమెరికా అధ్యక్షులపై ఎన్ని హత్యాప్రయత్నాలు జరిగాయంటే?
కనీసం 19 మంది అమెరికా అధ్యక్షులపై హత్యాయత్నాలు జరిగాయి. వారిలో ఆండ్రూ జాక్సన్, అబ్రహం లింకన్, జేమ్స్ గార్ఫీల్డ్ విలియం మెకిన్లీ, విలియం హోవార్డ్ టాఫ్ట్, థియోడర్ రూజ్‌వెల్ట్, హెర్బర్ట్ హూవర్, ఫ్రాంక్లిన్ డెలానో రూజ్‌వెల్ట్, హ్యారీ ఎస్. ట్రూమాన్, జాన్ ఎఫ్. కెన్నెడీ, రిచర్డ్ నిక్సన్, గెరాల్డ్ ఫోర్డ్, జిమ్మీ కార్టర్, జిమ్మీ కార్టర్. హెచ్.డబ్ల్యు. బుష్, బిల్ క్లింటన్, జార్జ్ డబ్ల్యూ. బుష్, బరాక్ ఒబామా, డోనాల్డ్ ట్రంప్ మరియు జో బిడెన్ ఉన్నారు.
6వ అధ్యక్షుడు ఆండ్రూ జాక్సన్ పైన...
తొలిసారి అమెరికా 6వ అధ్యక్షుడు ఆండ్రూ జాక్సన్‌పై హత్యాయత్నం జరిగింది. 1835లో ఈ సంఘటన జరిగింది. రిచర్డ్ లారెన్స్ వాషింగ్టన్ డీసీలో జాక్సన్‌ను కాల్చడానికి ప్రయత్నించాడు. జాక్సన్‌ను లారెన్స్ రెండు పిస్టల్లతో కాల్చడానికి ప్రయత్నించాడు. ఆ రెండూ గురితప్పాయి. లారెన్స్ ను పిచ్చివాడిగా పరిగణించారు. మరణించే వరకు జైలు శిక్ష విధించారు.
అబ్రహం లింకన్ పై మూడు సార్లు కాల్పులు..
అబ్రహాం లింకన్ పై ఏకంగా మూడు సార్లు కాల్పులు జరిగాయి. చివరిసారి కాల్పులు జరిపిన నాన్ విల్కే్ బూత్ చేతిలో మరణించారు. అంతకు ముందు రెండు సార్లు లింకన్ పై కాల్పులు జరిగాయి. 1861లో లింకన్ ప్రెసిడెంట్ గా ఎన్నికైనప్పుడు కాన్ఫెడరేట్ సానుభూతిపరులు కొందరు ఆయన్ను చంపడానికి ప్లాన్ వేస్తారు. లింకన్ ఓ ప్రారంభోత్సవానికి వెళ్ళే మార్గంలో చంపడానికి పథకం వేశారు. అలాన్ పింకర్టన్ ఏజెంట్లు ఈ ప్లాన్ పసిగట్టి విఫలం చేస్తారు. 1864లో రెండోసారి కాల్పులు జరిపినపుడు ఆయన మరణం అంచులదాకా వెళ్లివస్తాడు. చివరకు మూడోసారి 1865లో వాషింగ్టన్ డీసీలోని ఫోర్డ్ థియేటర్‌లో అధ్యక్షుడు లింకన్‌ను జాన్ విల్కేస్ బూత్ కాల్పులు జరిపి హత్య చేస్తాడు.
జేమ్స్ గారీఫీల్డ్ హత్య..
1881లో అధ్యక్షునిగా ఉన్న జేమ్స్ గార్ఫీల్డ్ ను ఓ లాయర్ హత్య చేస్తాడు. వాషింగ్టన్ డీసీలోని బాల్టిమోర్, పోటోమాక్ రైల్‌రోడ్ స్టేషన్‌లో ప్రెసిడెంట్‌ని కాల్చి చంపుతాడు న్యాయవాది చార్లెస్ జె. గైటో. బుల్లెట్ గాయాలతో వచ్చిన ఇన్‌ఫెక్షన్లతో 79 రోజులు ఆస్పత్రిలో నరకయాతన అనుభవంచి కన్నుమూస్తాడు జేమ్స్ గారీఫీల్డ్. ఈ కాల్పులు జరిగి రెండేళ్లు కావడానికి రెండు రోజుల ముందు గైటోను వాషింగ్టన్ డీసీలో ఉరితీశారు.
విలియం మెకిన్లీ
విలియం మెకిన్లీ 1901లో హత్యకు గురయ్యాడు. అనార్కిస్ట్ లియోన్ క్జోల్గోస్జ్- మెక్‌కిన్లీపై రెండుసార్లు కాల్పులు జరుపుతాడు. వాటిలో ఒక బుల్లెట్ మాత్రమే అధ్యక్షుడిని తాకింది. కడుపులోంచి ఈ బుల్లెట్ దూసుకువెళుతుంది. మెకిన్లీ కోలుకుంటున్నారని వైద్యులు అనుకుంటారు. కానీ ఎనిమిది రోజుల తర్వాత గాయం కారణంగా అధ్యక్షుడు గ్యాంగ్రీన్‌తో మరణించాడు. పోలీసులు క్జోల్గోస్జ్‌ను అరెస్ చేశారు. కాల్పులు జరిపినప్పుడే పోలీసుల చేతిలో చావుదెబ్బలు తింటాడు. చావు తప్పినా విచారణ తర్వాత మరణశిక్ష విధించారు.విద్యుత్ కుర్చీ ద్వారా మరణశిక్షఅమలు చేస్తారు. మెకిన్లీ మరణం తరువాత అమెరికన్ కాంగ్రెస్ అంటే పార్లమెంటు - అధ్యక్షుల భద్రతకు సీక్రెట్ సర్వీస్‌ను నియమించేందుకు అనుమతి ఇచ్చింది.
విలియం హోవార్డ్ టాఫ్ట్
1909లో విలియం హోవార్డ్ టాఫ్ట్ ను ఓ కీలక సమావేశంలో హతమార్చేందుకు కుట్ర జరిగింది. మెక్సికన్ ప్రెసిడెంట్ పోర్ఫిరియో డియాజ్‌ని అమెరికా అధ్యక్షుడు హోవార్డ్ టెక్సాస్ రాష్ట్రంలోని ఎల్ పాసోలో మీటింగ్ లో కలుసుకున్నాడు. రెండు దేశాల మధ్య భూ వివాదాలపై చారిత్రక చర్చలు జరిగాయి. ఆసమయంలో హోవార్డ్ ను కాల్చేందుకు జూలియస్ బెర్గెర్సన్ అనే 52 ఏళ్ల వ్యక్తి దొంగచాటుగా పిస్టల్‌ను జేబులో పెట్టుకుని లోపలికి వస్తాడు. అయితే దాన్న టెక్సాస్ రేంజర్ సీఆర్ మూర్ పసిగట్టి హత్యాయత్నాన్ని నివారిస్తాడు.
థియోడర్ రూజ్‌వెల్ట్
అప్పటికే అమెరికా అధ్యక్షునిగా పని చేసిన థియోడర్ రూజ్‌వెల్ట్ 1912 అధ్యక్ష ఎన్నికల ప్రచారం కోసం మిల్వాకీ వెళతారు. అప్పటికి రూజ్ వెల్ట్ అధ్యక్ష పదవి నుంచి తప్పుకుని మూడేళ్లయింది. అక్కడ ఎన్నికల ప్రచారం చేస్తుండగా హంతకుడు జాన్ ష్రాంక్ కాల్పులు జరుపుతాడు. .38-క్యాలిబర్ పిస్టల్‌తో రూజ్‌వెల్ట్‌ ఛాతీపై ఒకసారి కాల్చాడు. అయితే రూజ్‌వెల్ట్ జేబులో ఉన్న ప్రసంగ పాఠం ప్రతులు, మెటల్ గ్లాసు ఆ బుల్లెట్‌ వేగాన్ని తగ్గిస్తాయి. దాంతో మాజీ అధ్యక్షుడు బతికిబయటపడ్డారు.
హెర్బర్ట్ హూవర్
1928లో చిలీ, అర్జెంటీనా సరిహద్దులకు సమీపంలోని అండీస్ పర్వతాలలో హెర్బర్ట్ హూవర్ పై హత్యాయత్నం జరిగింది. అధ్యక్షుడిగా ఎన్నికైన హూవర్‌ లక్ష్యంగా అర్జెంటీనా తీవ్రవాదులు ఆయన ప్రయాణించే రైలును పేల్చివేయాలని పథకం పన్నారు. వారి ప్రణాళిక అమలుకు ముందే బాంబర్ అరెస్టు అవుతాడు.
ఫ్రాంక్లిన్ డెలానో రూజ్‌వెల్ట్
అమెరికాకి రెండు సార్లకు మించి అధ్యక్షునిగా పని చేసిన ఫ్రాంక్లిన్ డెలానో రూజ్‌వెల్ట్ పై 1933లో పెద్ద హత్యాయత్నం జరిగింది. హంతకుల చేతి నుంచి తప్పించుకున్న రెండో రూజ్‌వెల్ట్ ఈయన. 1933లో తన ప్రమాణ స్వీకారానికి కొద్ది రోజుల ముందు గియుసేప్ జంకారా అనే వ్యక్తి ఐదు షాట్లు కాల్చాడు. కానీ ఏ ఒక్కటీ తగల్లేదు. అయితే నిందితుడు జంగారా చికాగో మేయర్ అంటోన్ సెర్మాక్‌తో సహా మరో ఐదుగురిని కాల్చి చంపాడు. సెర్మాక్ మరణానికి తానే బాధ్యుణ్ణంటూ జంగారా నేరాన్ని అంగీకరించాడు. ఎలక్ట్రిక్ కుర్చీలో కూర్చోబెట్టి ఉరితీశారు.
హ్యారీ ట్రూమాన్
1947లో హ్యారీ ట్రూమాన్ పై బాంబు దాడికి కుట్ర జరిగింది. అప్పటికింకా ఇజ్రాయెల్ దేశం ఏర్పడలేదు. జియోనిస్ట్ తిరుగుబాటుదారులుగా చెప్పుకునే లెహి సభ్యులు కొందరు ప్రెసిడెంట్ కి, ఇతర వైట్ హౌస్ అధికారులకు బాంబుల్ని పోస్ట్ లో పంపారు. ఈ సంఘటన మార్గరెట్ ట్రూమాన్ జీవిత చరిత్రలో వివరంగా ఉంది. 1950లో స్వతంత్ర ప్యూర్టో రికో కోసం ఇద్దరు కార్యకర్తలు కూడా ట్రూమాన్ ప్రాణాలను తీసేందుకు ప్రయత్నించారు. ఆస్కార్ కొల్లాజో, గ్రిసెలియో టోర్రెసోలా- ట్రూమాన్‌ను బ్లెయిర్ హౌస్ వద్ద చంపడానికి ప్రయత్నించారు. వైట్ హౌస్ పునర్నిర్మాణంలో ఉండడంతో ట్రూమన్ బ్లెయిర్ హౌస్ లో ఉంటున్నారు. ట్రూమన్ ను చంపే యత్నంలో ఈ జంట ముగ్గురు పోలీసు అధికారులను కాల్చి చంపింది. పోలీసులు తిరిగి జరిపిన కాల్పుల్లో టోర్రెసా అక్కడికక్కడే చనిపోగా కొల్లాజో కి పొత్తికడుపులో బుల్లెట్ గాయమైంది. చికిత్స తర్వాత కొల్లాజో బ్రతికి బయటపడ్డాడు. 1979లో అధ్యక్షుడు జిమ్మీ కార్టర్ అతని శిక్షను మార్చే వరకు జైలులో ఉన్నాడు. ట్రూమాన్‌కు ఎలాంటి హాని జరగలేదన్న కారణంగా జమ్మీ కార్టర్ అతనికి క్షమాభిక్ష పెట్టారు.
జాన్ ఎఫ్. కెన్నెడీ హత్య..
1963లో హత్యకు ముందు జాన్ ఎఫ్. కెన్నెడీని ఫ్లోరిడాలోని పామ్ బీచ్‌లో హత్యకు కుట్ర జరిగింది. 1960లో 73 ఏళ్ల రిచర్డ్ పాల్ పావ్లిక్ కెన్నెడీ కారును ఢీకొట్టి డైనమైట్‌తో పేల్చివేయాలని పథకం వేశాడు. చివర్లో ఏమైందో గాని పావ్లిక్ ఆ కుట్రను అమలు చేయలేకపోయాడు. అయితే ఆయన కారులో డైనమైట్ ఉన్నట్లు పోలీసులు కనిపెట్టారు. సీక్రెట్ సర్వీస్ పోలీసులు అరెస్టు చేస్తారు. పావ్లిక్‌పై విచారణ జరిగింది. కానీ 1963లో కెన్నడీపై డల్లాస్ లో కాల్పులు జరిగి చనిపోతాడు. ఆ తర్వాత పావ్లిక్ పై కేసును ఉపసంహరించారు. పావ్లిక్ 1966 వరకు ఆసుపత్రి
పాలయ్యాడు.
రిచర్డ్ నిక్సన్ పైన...
1972లో ఆర్థర్ బ్రెమెర్ ప్రెసిడెంట్ రిచర్డ్ నిక్సన్‌ను హత్య చేయడానికి ప్రయత్నించాడు. కానీ అతను మంచి షూటర్ కాకపోవడంతో చేసిన ప్రయత్నాలన్నింటా విఫలమయ్యేవాడట. ఇది జరిగిన ఒక నెల తరువాత అలబామా రాష్ట్ర గవర్నర్ జార్జ్ వాలెస్‌ను చంపడానికి బ్రెమెర్ ప్రయత్నించాడు. అక్కడా విఫలమయ్యాడు. బ్రేమెర్ జరిపిన కాల్పుల్లో గవర్నర్ నడుములు పడిపోయాయి. కాళ్లూ చేతులు చచ్చుపడిపోయాయి. ఈ నేరానికి బ్రెమర్ 35 ఏళ్ల జైలు శిక్ష అనుభవించాడు. 1974లో నిక్సన్ పై రెండో సారి హత్యాయత్నం జరిగిది. శామ్యూల్ బైక్ అనే వ్యక్తి విమానంతో వైట్ హౌస్ ను ఢీకొట్టి నిక్సన్‌ను చంపాలని ప్లాన్ చేశాడు. ఇద్దరు పైలట్లను కాల్చిచంపి బాల్టిమోర్-వాషింగ్టన్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఒక విమానాన్ని హైజాక్ కూడా చేశాడు. ఆ విమాన టేకాఫ్ కాకముందే పోలీసులు ఈ శామ్యూల్ పై కాల్పులు జరుపుతారు. చివరకు నిందితుడు శామ్యూల్ తన తుపాకీతో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.
గెరాల్డ్ ఫోర్డ్ పైన...
గెరాల్డ్ ఫోర్డ్ పై మూడుసార్లు హత్యాయత్నం జరిగింది. 1974లో లాస్ ఏంజిల్స్ విమానాశ్రయం (LAX) వద్ద బాంబు దాడిలో ముగ్గుర్ని చంపిన ఆల్ఫాబెట్ బాంబర్ అనే వ్యక్తి ఫోర్డ్ పై గ్యాస్ బాంబును విసిరివేస్తానని బెదిరించాడు. హైడ్రామా మధ్య నిందితుణ్ణి సీక్రెట్ సర్వీస్, సీఐఏ పోలీసులు అరెస్ట్ చేస్తారు. అంతరించిపోయిన యుగోస్లేవియా దేశస్థునిగా గుర్తించారు. ముహరమ్ కుర్బెగోవిచ్‌గా గుర్తించారు. కుర్బెగోవిక్‌కు జీవిత ఖైదు పడింి. ఇప్పుడు కూడా జైల్లో ఉన్నాడు.
1975లో మాన్సన్ కుటుంబానికి చెందిన ఓ మహిళ లినెట్ ఫ్రోమ్- ఫోర్డ్‌ను కాల్చడానికి ప్రయత్నించింది. కానీ తుపాకీ పేలలేదు. ఫ్రోమ్‌ని అరెస్టు చేసి జీవిత ఖైదు విధించారు. 2009లో విడుదలైంది. ఫ్రోమ్ సంఘటన తర్వాత 17 రోజులకి సారా జేన్ మూర్ అధ్యక్షుణ్ణి కాల్చడానికి ప్రయత్నించారు. కానీ గురితప్పింది. ఆమె రెండో షాట్ పేల్చడానికి ట్రిగ్గర్ మీద చేయి వేస్తున్న సమయంలో మాజీ మెరైన్ ఆలివర్ సిప్పల్ సారా చేయి పట్టుకుంది. దీంతో షాట్ మిస్సయింది. సారా కి జీవిత ఖైదు పడింది. 2007లో విడుదలైంది.
జిమ్మీ కార్టర్ పైన...
జిమ్మీ కార్టర్‌పై హంతకుడు జాన్ హింక్లీ జూనియర్ గురిపెట్టాడు గాని ఫెయిలయ్యాడు. ముందస్తు పథకంతో తుపాకీతో ముందుకురికిన హింక్లీ - కార్టర్ పై కాల్పులు జరుపుతాడు. తీవ్రంగా గాయపరిచాడు. కార్టర్ బతికిబట్టకట్టారు. నిందితుణ్ణి పిచ్చివాడిగా తేల్చారు. జైలు శిక్ష విధించారు.
సీనియర్ బుష్ పైనా కాల్పులు...
అమెరికాకి 41వ అధ్యక్షునిగా పని చేసి జార్జ్ హెచ్.డబ్ల్యూ. బుష్ (సీనియర్ బుష్)పై 1993లో కువైట్ లో దాడి జరిగింది. ఈ బుష్ సద్దాం హుస్సేన్ కోసం పనిచేస్తున్నట్లు అనుమానించిన కువైట్, ఇరాకీ తీవ్రవాదులు కువైట్ పర్యటన సందర్భంగా కారు బాంబును అమర్చి హత్య చేయాలనుకున్నారు. కువైట్ అధికారులు ఆ కుట్రను భగ్నం చేశారు.
బిల్ క్లింటన్ పై ఏకంగా ఐదు సార్లు...
అధికారంలో ఉన్నప్పుడు, లేనప్పుడు కూడా బిల్ క్లింటన్ హత్యకు ఐదు సార్లు కుట్ర జరిగింది. 1994లో రోనాల్డ్ జీన్ బార్బర్- క్లింటన్‌ను చంపడానికి పథకం వేశాడు. ఈ కుట్ర ఫెయిల్ కావడంతో అరెస్టై ఐదేళ్లు జైల్లో ఉన్నాడు. 1994లో ఫ్రాన్సిస్కో మార్టిన్ డ్యూరాన్ అనే వ్యక్తి వైట్ హౌస్‌పై 29 సార్లు కాల్పులు జరిపాడు. నానాతంటాలు పడి డురాన్ ను అరెస్ట్ చేసిన తరువాత 40 ఏళ్ల జైలు శిక్ష పడంది.
1994 నవంబర్ లో ఒసామా బిన్ లాడెన్ క్లింటన్‌ను హత్య చేసే బాధ్యతను రమ్జీ యూసఫ్‌కి అప్పగించాడు. అయితే ఈ యూసెఫ్ క్లింటన్ కి బదులు పోప్ జాన్ పాల్ IIను టార్గెట్ చేశాడు.
1996లో ఒసామా బిన్ లాడెన్ క్లింటన్ ను చంపడానికి మరో ప్రయత్నం చేశాడు. మనీలాలో పర్యటిస్తున్నప్పుడు ఓ వంతెన కింద బాంబు పెట్టి పేల్చేయమని కొందరు ఉగ్రవాదులకు పని అప్పగిస్తే సీక్రెట్ సర్వీస్ పోలీసులు పసి గట్టారు. అధ్యక్షుడి కాన్వాయ్ దారి మళ్లించారు. దీంతో ప్రాణగండం తప్పింది.
మాజీ అధ్యక్షునిగా ఉన్న 2018లో బిల్ క్లింటన్, హిల్లరీ క్లింటన్ ఉండే న్యూయార్క్‌లోని వారి ఇంటికి పైపు బాంబును పోస్ట్ చేశారు. సిక్రెట్ సర్వీస్ ఈ ప్యాకెట్ లో బాంబు ఉన్నట్టు కనిపెట్టింది. ఈ బాక్స్ ను ఎవరు పంపారో వారి వేలిముద్రలను పసిగట్టింది. సీజర్ సాయోక్‌ వేలి ముద్రలతో సరిపోల్చడంతో అతనికి 20 ఏళ్ల జైలు శిక్ష విధించారు.
జూనియర్ బుష్ పైనా...
తండ్రిపైన్నే కాకుండా కుమారుడిపైనా కాల్పులు జరిగిన అనుభవం జార్జ్ బుష్ కుటుంబానిది. జూనియర్ బుష్ గా పిలిచే జార్జ్ డబ్ల్యు. బుష్ పై ఒకసారి పదవిలో ఉన్నప్పుడు మరోసారి పదవిలో లేనప్పుడు కూడా దాడులు జరిగాయి. 2005లో జార్జియాలోని టిబిలిసిలో ప్రసంగిస్తున్నప్పుడు వ్లాదిమిర్ అరుత్యునియన్ అధ్యక్షుడు బుష్‌పై గ్రెనేడ్ విసిరాడు. పిన్‌ను లాగినప్పటికీ గ్రెనేడ్ పేలలేదు. అరుత్యునియన్‌ను అరెస్టు చేసి జీవిత ఖైదు విధించారు. 2022లో షిహాబ్ అహ్మద్ షిహాబ్- బుష్‌ హత్యకు ప్లాన్ చేశాడు.
బారక్ ఒబామాపై ఎనిమిది సార్లు...
అమెరికా 248 ఏళ్ల స్వతంత్ర చరిత్రలో తొలి నల్లజాతీయ అధ్యక్షుడైన బరాక్ ఒబామాను హతమార్చేందుకు కనీసం 8 సార్లు కుట్రలు జరిగాయి. 2008లో అమెరికాకి చెందిన మాజీ నావికుడు కోడె బ్రిటింగ్‌హామ్ ప్రెసిడెంట్ ఒబామా అంతర్గత శత్రువంటూ చంపడానికి ప్లాన్ చేశాడు. అది వికటించడంతో బ్రిటింగ్‌హామ్‌కి 8 ఏళ్ల జైలు శిక్ష పడింది. 2009లో ఇస్తాంబుల్‌లో ఒబామాను కత్తితో పొడిచి చంపేందుకు ఓ నకిలీ విలేఖరి ప్రయత్నం చేశాడు.
2011లో అమెరికా పశ్చిమ ప్రాంత రాష్ట్రమైన ఇడాహో నుంచి ఆస్కార్ రామిరో ఒర్టెగా-హెర్నాండెజ్ అనే వ్యక్తి వాషింగ్టన్ వచ్చి ఒబామా ఉండే వైట్ హౌస్ పై కాల్పులు జరిపాడు. ఈ కాల్పుల్లో ఎవరూ గాయపడలేదు గాని ఒర్టెగాకి మాత్రం 25 ఏళ్ల జైలు శిక్ పడింది. 2011, 2012 మధ్య దేశీయ టెర్రరిస్ట్ గ్రూప్- ఫియర్- ఒబామాను చంపడానికి ప్లాన్ చేసింది. ఈ ముఠాలోని నలుగురిని అరెస్టు చేశారు.
2012లో కొలరాడోలోని బౌల్డర్‌లో షాట్‌గన్‌తో ఒబామాను చంపడానికి కుట్రచేసినట్టు ఓ వ్యక్తి ఒప్పుకున్నాడు. 2013లో ఒబామాకు రిసిన్ అనే విషపదార్థం ఉన్న లేఖను మెయిల్ చేశారు. అది చేతికి తాకినా, పీల్చినా ప్రాణాంతకమే. 2013లో తెల్లజాతీయుల ఆధిపత్యవాదులు గ్లెండన్ స్కాట్ క్రాఫోర్డ్, ఎరిక్ ఫీట్ ఇంట్లో తయారుచేసిన రేడియేషన్ తుపాకీతో అధ్యక్షుడు ఒబామాను చంపడానికి కుట్ర పన్నారు. 2018లో పైప్ బాంబును ఒబామాకు పోస్ట్ చేస్తే సీక్రెట్ సర్వీస్ పోలీసులు అడ్డుకున్నారు.
జో బిడెన్ పై ఇండియన్ దాడి..
అమెరికా ప్రస్తుత అధ్యక్షుడు జో బిడెన్ పై ఓ ఇండియన్ అమెరికన్ హత్యకు కుట్ర పన్నాడు. 2023లో బిడెన్‌ను చంపాలనే ఉద్దేశ్యంతో వర్షిత్ కందుల అనే వ్యక్తి వైట్‌హౌస్ ఆవరణలోకి బాక్స్ ట్రక్కును నడిపాడు. సీక్రెట్ సర్వీసు పోలీసులు కందులను అరెస్టు చేసి విచారించారు. ఇంకా శిక్ష ఖరారు చేయలేదు.
ఇప్పుడు డోనాల్డ్ ట్రంప్...
డొనాల్డ్ ట్రంప్ పై ఇప్పటికే నాలుగు సార్లు హత్యా ప్రయత్నాలు జరిగాయి. 2016లో లాస్ వెగాస్‌లో ప్రెసిడెంట్ ట్రంప్‌ను చంపడానికి మైఖేల్ స్టీవెన్ స్టాన్‌ఫోర్డ్ అనే వ్యక్తి ఓ పోలీసు అధికారి నుంచి తుపాకీని లాక్కోవడానికి ప్రయత్నించి జైలు పాలయ్యాడు. అతను బ్రిటన్ వాడు కావడంతో ఆ దేశం పంపించారు. 2017లో గ్రెగొరీ లీ లింగాంగ్- ఫోర్క్‌లిఫ్ట్‌తో (బరువైన వస్తువుల్ని ఎత్తిపెట్టడానికి ఉపయోగించే ఆటో ట్రక్కు లాంటిది) గుద్ది చండానికి ప్రయత్నించాడు. ప్రెసిడెన్షియల్ కాన్వాయ్ లోకి ఈ వాహనంతో జొరబడి ట్రంప్‌ను చంపాలనేది తన ఉద్దేశంగా లీంగాంగ్ అంగీకరించడంతో 20 ఏళ్ల జైలు శిక్ష పడింది. 2017లో మనీలాలో జరిగిన ఆసియాన్ సదస్సు సందర్భంగా ఐఎస్‌ఐఎల్‌తో లింకున్న ఓ వ్యక్తి ట్రంప్‌ను చంపేందుకు పథకం వేశాడు. జూలై 13, 2024న, పెన్సిల్వేనియాలోని బట్లర్‌లో జరిగిన ర్యాలీలో 20 ఏళ్ల థామస్ మాథ్యూ క్రూక్స్‌ కాల్పులు జరిపాడు. పోలీసులు వెంటనే అతన్ని కాల్చిచంపారు. ట్రంప్ కి ప్రాణాపాయం తప్పింది.
Tags:    

Similar News