‘థ్యాంక్స్ ఇండియా’ ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ ప్రశంసలు
భారత్ అందిస్తున్న సాయాన్ని మర్చిపోలేమని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెస్కీ అన్నారు. న్యూడిల్లీతో వాణిజ్యాన్నిపెంచుకునేందుకు సిద్దంగా ఉన్నామని ఆయన ప్రకటించారు.
By : The Federal
Update: 2024-03-21 06:08 GMT
భారత్ పై ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ ప్రశంసలు కురిపించాడు. ఆపద కాలంలో ఆదుకోవడంతో పాటు ఉక్రెయిన్ సార్వభౌమత్వాన్ని గుర్తించినందుకు ధన్యవాదాలు తెలిపారు. భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లాదిమిర్ జెలెన్ స్కీ ఫోన్లో మాట్లాడారు. స్విట్జర్లాండ్ లో జరగబోతున్న కీవ్ ప్రారంభ శాంతి శిఖరాగ్ర సమావేశానికి న్యూఢిల్లీ హజరుకావడం సంతోషించదగ్గ పరిణామమని అన్నారు. ఈ సమావేశానికి చైనా సైతం హజరవుతుందని సమాచారం.
స్విట్జర్లాండ్, భారతదేశం, ఉక్రెయిన్ అధికారులు ఈ వేసవిలో శాంతి శిఖరాగ్ర సదస్సులో పాల్గొనున్నారు. ఇదే విషయం పై చర్చించడానికి ఉక్రెయిన్ విదేశాంగ మంత్రి డిమిత్రి కులేబా వచ్చే వారం న్యూఢిల్లీ పర్యటనకు వస్తున్నారు.
మీ సాయం అమోఘం
వివిధ రంగాలలో తమ ద్వైపాక్షిక భాగస్వామ్యాన్ని మరింత పటిష్టం చేసుకునే మార్గాలపై ఇరువురు నేతలు చర్చించుకున్నారు. ఈ సందర్భంగా ఉక్రెయిన్ ప్రజలకు భారతదేశం నిరంతర మానవతా సహాయాన్ని అందించడాన్ని జెలెన్స్కీ ప్రశంసించారు.
ఫిబ్రవరి 2022 నుంచి, భారతదేశం ఉక్రెయిన్ పొరుగు దేశాలకు దాదాపు 100 టన్నుల సాయాన్ని అందించింది. ఇందులో వైద్య పరికరాలు, మందులు, టెంట్లు, టార్పాలిన్, దుప్పట్లు ఉన్నాయి.
"ఉక్రెయిన్ సార్వభౌమాధికారం, ప్రాదేశిక సమగ్రత, మానవతా సాయం, పీస్ ఫార్ములా సమావేశాలలో చురుగ్గా పాల్గొనడం కోసం భారతదేశం అందిస్తున్న మద్ధతుకు, ప్రధానికి నేను ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేశాను" అని జెలెన్ స్కీ సామాజిక మాధ్యమం ఎక్స్ లో ఒక పోస్ట్ చేశారు. న్యూఢిల్లీతో ఆర్థిక సంబంధాలను బలోపేతం చేసేందుకు కీవ్ ఆసక్తిగా ఉందన్నారు. ఇరు దేశాల అధికారులు కలిసి దీనిపై చర్చించుకుంటారని అన్నారు.
ముఖ్యంగా వ్యవసాయ ఎగుమతులు, విమానయాన సహకారం, ఫార్మాస్యూటికల్, పారిశ్రామిక ఉత్పత్తుల వ్యాపారంలో భారత్‌తో వాణిజ్యం, ఆర్థిక సంబంధాలను బలోపేతం చేయడానికి ఉక్రెయిన్ ఆసక్తిగా ఉందని జెలెన్స్కీ చెప్పారు. " భారతీయ విద్యార్థులను తిరిగి ఉక్రేనియన్ విద్యాసంస్థలకు స్వాగతించాలని కోరుకుంటుంది," అన్నారాయన. మొదట నుంచి భారత్, ఉక్రెయిన్- రష్యా యుద్దాన్ని వ్యతిరేకిస్తోంది. 21 వ శతాబ్దం యుద్దాల శకం కాదని ప్రధాని నరేంద్ర మోదీ ఇది వరకే ప్రకటించిన సంగతి తెలిసిందే.
ఇంతకుముందు భారత ప్రధాని నరేంద్రమోదీ రష్యా అధ్యక్షుడిగా ఎన్నికైనందుకు పుతిన్ కు అభినందనలు తెలిపారు.
రష్యా-ఉక్రెయిన్ వివాదంపై చర్చిస్తున్న సందర్భంగా ప్రధాని మోదీ, చర్చలు, దౌత్యం కోసం భారతదేశం స్థిరమైన వైఖరిని పునరుద్ఘాటించారని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ తెలిపింది.
రష్యా ఎన్నికల్లో పుతిన్ ఘనవిజయం సాధించి అధికారంపై ఇప్పటికే గట్టి పట్టు సాధించారు. సోమవారం (మార్చి 18) నాటి ఫలితాల ప్రకారం పోటీ చేసిన మరో ముగ్గురు అభ్యర్థులు పుతిన దరిదాపుల్లో కూడా లేరు.
పుతిన్ 2000, 2004, 2012 , 2018లో ఎన్నికైన నాలుగు సార్లు రష్యా అధ్యక్షుడిగా పనిచేశారు. ఇటీవల ముగిసిన రష్యా ఎన్నికలను పాశ్చాత్య దేశాలు "నమ్మలేని అప్రజాస్వామికం"గా పేర్కొన్నాయి.