అమెరికాతో జరుగుతున్న వాణిజ్య యుద్దంలో మాతో కలిసి నడవండి: చైనా
భారత్ ను కోరిన చైనా ప్రతినిధులు;
By : The Federal
Update: 2025-04-09 11:50 GMT
చైనా - అమెరికా మధ్య వాణిజ్య యుద్ధం అవుతున్న తరుణంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. అమెరికా చేస్తున్న సుంకాల దుర్వినియోగానికి కలిసి కట్టుగా పోరాడాలని, ఐక్యంగా నిలబడాలని భారత్ ను కోరింది.
భారత్ లోని చైనా రాయబార కార్యాలయం ప్రతినిధి యూ జింగ్ ఈ మేరకు సామాజిక మాధ్యమం ఎక్స్ లో పోస్ట్ చేశారు. చైనా ఆర్థిక వ్యవస్థ బలాన్ని, ప్రపంచ వృద్దిలో దాని పాత్రను నొక్కి చెప్పారు.
చైనా- భారత్ ఆర్ధిక సంబంధం పరిపూర్ణమైనది. పరస్పర ప్రయోజనకరమైనదని ఆమె వ్యాఖ్యానించారు. ముఖ్యంగా గ్లోబల్ సౌత్ స్వరాలుగా, అభివృద్ది హక్కును కాపాడుకోవడానికి రెండు దేశాలు ఐకమత్యంగా ఉండాలని అన్నారు.
తీవ్రమవుతున్న సుంకాల యుద్ధం..
చైనాపై ట్రంప్ భారీగా సుంకాలు ప్రకటించడంతో ఉద్రిక్తతలు పెరిగాయి. దీనితో చైనా వస్తువులపై అమెరికా మొత్తం సుంకాలు 104 శాతానికి పెరిగాయి. ట్రంప్ మొదట్లో చైనా దిగుమతులపై 34 శాతం సుంకాన్ని విధించింది.
ప్రతీకారంగా బీజింగ్ కూడా అమెరికా వస్తువులపై అంతే స్థాయిలో సుంకాన్ని విధించింది. దీనికి ప్రతిస్పందనగా బీజింగ్ వెనక్కి తగ్గపోతే మరో 50 శాతం సుంకాన్ని విధిస్తామని ట్రంప్ ప్రతినబూనారు.
అమెరికా ఇలాగే చేస్తే చివరి వరకూ పోరాడుతామని చైనా వాణిజ్య మంత్రిత్వశాఖ ప్రకటించింది. ట్రంప్ సుంకాల విధానాన్ని తప్పు మీద తప్పు చేస్తున్నారని విమర్శించింది.
బీజింగ్ ఎగుమతులకు మద్దతుగా తన కరెన్సీ యువాన్ పై నియంత్రణ సడలించడం ద్వారా తన పెట్టుబడిదారుల ఆందోళనలను శాంతింపజేయడానికి చర్యలు తీసుకుంది.
నిశ్శబ్ధం..
చైనా, కెనడా వంటి దేశాలు అమెరికా సుంకాల పెంపును బహిరంగంగా వ్యతిరేకించినప్పటికీ, న్యూఢిల్లీ చాలా వరకూ దౌత్యపరమైన సంయమాన్ని పాటించింది.
విదేశాంగమంత్రి ఎస్ జైశంకర్ అమెరికా విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియో తో మాట్లాడి ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందాన్ని ముగించాలని కోరారు. ఉద్రిక్తతలను తగ్గించడానికి అమెరికా ఎగుమతుల్లో 55 శాతం సుంకాలను తగ్గించడానికి భారతదేశం వాషింగ్టన్ డీసీకి సంసిద్దతను తెలియజేసినట్లు సమాచారం.
కలిసి మాట్లాడుకుందాం..
‘‘వాణిజ్య, సుంకాల యుద్ధాలలో విజేతలు ఉండరు’’ అని యు జింగ్ చెప్పారు. అన్ని దేశాలు నిజమైన బహుపాక్షికతను సమర్థించాలని, రక్షణవాదాన్ని తిరస్కరించాలని, ప్రపంచ వాణిజ్య సంస్థ నేతృత్వంలోని ప్రపంచ వాణిజ్య నిబంధనలకు మద్దతు ఇవ్వాలని ఆమె పిలుపునిచ్చారు.
విభజించబడిన ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో న్యాయమైన వాణిజ్యాన్ని కాపాడుకోవడంలో చైనా, భారత్ కు భాగస్వామిగా నిలవాలని కోరారు. కానీ భారత్ దీనిపై ఎలాంటి స్పందన తెలపలేదు.