మొదలైన జూబ్లీహిల్స్ ఉపఎన్నిక పోలింగ్
భారీగా భద్రత.. ఉత్కంఠభరితంగా పోరు.
జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఉపఎన్నిక పోలింగ్ ప్రారంభమైంది. 18 రోజుల పాటు అభ్యర్థులు నియోజకవర్గంలో ప్రచారం చేశారు. కాగా ఎవరి వ్యూహాలు ఎంత ఫలించాయి అన్నది తేల్చే పోలింగ్ మొదలైంది. పోలింగ్ కేంద్రాలన్ని చోట్లా భారీ భద్రత కల్పించారు అధికారులు. పోలింగ్ సమయంలో శాంతిభద్రతలకు ఎటువంటి విఘాతం కలగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు. ఈ ఉపఎన్నికలో కాంగ్రెస్ నుంచి నవీన్ యాదవ్, బీఆర్ఎస్ నుంచి మాగంటి సునీత, బీజేపీ నుంచి లంకల దీపక్‌తో పాటు మరో 55 మంది బరిలో ఉన్నారు. అయినప్పటికీ అసలు పోటీ మాత్రం ప్రధాన పార్టీల మధ్యనే సాగుతోంది. జూబ్లీహిల్స్ నియోజకవర్గాన్ని సొంతం చేసుకోవాలని మూడు పార్టీలు పట్టుదలతో ఉన్నాయి.
నియోజకవర్గాల పునర్విభజనలో 2008లో ఈ నియోజకవర్గం ఏర్పడితే 2009లో మొదటిసారి ఎన్నిక జరిగింది. మొదటి ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్ధి పీ విష్ణువర్ధనరెడ్డి గెలిచాడు. తర్వాత 2014 ఎన్నికల్లో టీడీపీ అభ్యర్ధి మాగంటి గోపీనాధ్ గెలిచాడు. తర్వాత జరిగిన రాజకీయ పరిణామాల కారణంగా గోపీ బీఆర్ఎస్ లోకి ఫిరాయించారు. 2018, 2023 ఎన్నికల్లో గోపి బీఆర్ఎస్ తరపున గెలిచారు. అయితే గెలిచిన కొన్నినెలలకే మరణించటంతో ఇపుడు ఉపఎన్నిక అవసరమైంది. తమ సీటును నిలబెట్టుకోవాలంటే గెలవాల్సిన అనివార్య బీఆర్ఎస్ కు ఏర్పడింది. అందుకనే సిట్టింగ్ సీటును నిలబెట్టుకునేందుకు బీఆర్ఎస్ ఇంతగా పోరాటం చేస్తోంది. నోటిఫికేషన్ రాక ముందే మాగంటి సునీతను అభ్యర్ధిగా ప్రకటించి, ప్రచారం కూడా మొదలుపెట్టేశారు.
గ్రేటర్ పరిధిలో రెండోసీటును ఎలాగైనా గెలుచుకోవాలని ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి పట్టుదలమీదున్నారు. అందుకనే ఎన్నికల నోటిఫికేషన్ కు ముందే మంత్రులు, ప్రజాప్రతినిధులు, వివిధ కార్పొరేషన్ల ఛైర్మన్లు, సీనియర్ నేతలను రంగంలోకి దింపి ప్రచారం చేయించారు. రేవంత్ ఐదు రోడ్డుషోలు. ఒక బహిరంగసభలో పాల్గొన్నారు. మంత్రులు, ఎంఎల్ఏలు, ఎంపీలు నియోజకవర్గంలోని బస్తీలు, కాలనీల్లోని ఇల్లిల్లు తిరిగి విస్తృతంగా ప్రచారం చేశారు.
ఓటర్ల వివరాలిలా..
నియోజకవర్గంలో మొత్తం 4,01,365 మంది ఓటర్లు ఉన్నారు. వారిలో పురుషులు 2,08,561 మంది, మహిళలు 1,92,779 మందిగా ఉన్నారు. అంతేకాకుండా 18 మంది సర్వీస్ ఓటర్లు, 25 మంది ఇతరులు, 123 మంది విదేశీ ఓటర్లు కూడా ఉన్నారు. మొత్తం 1,908 మంది వికలాంగులు, 6,859 మంది 18 నుంచి 1 సంవత్సరాల మధ్య వయసు గల వారు ఉన్నారు. అంటే వీరు తొలిసారి ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఇక సీనియర్ ఓటర్లలో 85ఏళ్లు పైబడిన వారు 2,134 మంది ఉన్నారు.
భారీగా భద్రత..
ఉపఎన్నిక కోసం పోలీసులు భారీ భద్రతను ఏర్పాటు చేశారు. ఎన్నికల అధికారులతో సమన్వయం చేసుకుంటున్నారు. డీసీపీలు, అదనపు ఎస్పీలు, ఏసీపీలు, ఇన్‌స్పెక్టర్లు, సబ్-ఇన్‌స్పెక్టర్లు, ఆర్మ్‌డ్ రిజర్వ్ పోలీసులు, హెడ్ కానిస్టేబుళ్లు, మహిళా కానిస్టేబుళ్లు, హోమ్ గార్డులతో సహా 1,761 మంది సిబ్బందితో పకడ్బందీగా భద్రతను ఏర్పాటు చేస్తున్నారు. శాంతి భద్రతలకు ఏమాత్ర విఘాతం కలగకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నారు. ఎనిమిది కంపెనీలను కలిగి ఉన్న 73 పారామిలిటరీ దళాల విభాగాలు మోహరించాయి. ఓటర్లకు జారీ చేసే ఓటరు సమాచార స్లిప్లు గుర్తింపు రుజువు కావు. అవి మార్గదర్శకంగా మాత్రమే పనిచేస్తాయి. ఓటర్లు EPIC కార్డ్ వంటి చెల్లుబాటు అయ్యే IDని లేదా ECI పేర్కొన్న 12 పత్రాలలో దేనినైనా తీసుకెళ్లాలి.
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో మొదటి రెండు గంటల్లో 9.2% పోలింగ్ నమోదు.
జూబ్లీహిల్స్ ఉపఎన్నికకు చేసిన భద్రతా ఏర్పాట్లను ఎన్నికల అధికారి కర్ణన్ పరిశీలించారు. ఇందులో భాగంగానే డ్రోన్ పనితీరును పరిశీలించారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల నేపథ్యంలో పోలింగ్ కేంద్రాలను సందర్శించారు కర్నన్. ఈ సందర్భంగానే ఉపఎన్నిక ప్రశాంతంగా జరుగుతుందని చెప్పారు. నియోజకవర్గంలోని ఆరు పోలింగ్ కేంద్రాల్లో ఈవీఎం సమస్యలు తలెత్తాయని, వాటిని త్వరితగతిన పరిష్కరించామని వెల్లడించారు.
‘ఎన్నికలు ప్రశాంతంగా జరుగుతున్నాయి.. షేక్‌పేటలో కూడా పోలింగ్ ప్రారంభమైంది.. 6 పోలింగ్ కేంద్రాల్లో సమస్యలు తలెత్తాయి.. సెట్ చేశాం.. గతంలో కంటే 40 పోలింగ్ కేంద్రాలు పెంచాం’ అని ఎన్నికల అధికారి కర్ణన్ తెలిపారు.
బోరబండ పోలింగ్ బూత్ లో బీఆర్ఎస్ కార్యకర్తపై బాబా ఫసియుద్దీన్ దాడి చేశారు. టేబుల్ పెట్టుకోకుండా దౌర్జన్యం చేయటంపై పోలీసుల తీరును బీఆర్ఎస్ అభ్యర్థఇ మాగంటి సునీత ఖండించారు. అధికార పార్టీ కి తొత్తులుగా మారి పోలీసులు కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ కార్యకర్తలపై దాడి చేసిన బెదిరించిన ఊరుకునే ప్రసక్తేలేదని హెచ్చరించారు. పోలీసులు ఎవరికి సపోర్ట్ చేయకుండా న్యూట్రల్ గా ఉండి ఎన్నికలను సజావుగా జరిగేలా చూడాల్సిన బాధ్యత వాళ్ళదని, కార్యకర్తలు ఎవరు భయపడకుండా ఓటర్లు స్వచ్ఛందంగా వచ్చి ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు.
జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో పోలింగ్ ఏర్పాట్లు కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ పరిశీలించారు. అనంతరం పోలింగ్ ప్రశాంతంగా జరుగుతోందని చెప్పారు. ‘‘ఏర్పాట్లను పరిశీలించడానికే పోలింగ్ కేంద్రంలోకి వెళ్లాను. మొదటి 45 నిమిషాలలోనే దాదాపు 70 నుంచి 100 ఓట్లు పోలయ్యాయి’’ అని తెలిపారు.
షేక్‌పేట డివిజన్‌లోని పోలింగ్ బూత్-28లో సినీ దర్శకుడు రాజమౌళి దంపతులు ఓటు హక్కు వినియోగించుకున్నారు.
జూబ్లీహిల్స్ నియోజకవర్గం లో మొత్తం 7 డివిజన్లు ఉన్నాయి.
రహమత్ నగర్....70,583 ఓట్లు, 72 పోలింగ్ బుత్ లు.
షేక్ పేట....70,546 ఓట్లు, 70 పోలింగ్ బుత్ లు.
ఎర్రగడ్డ....59,580 ఓట్లు, 63 పోలింగ్ బుత్ లు.
యూసఫ్ గూడ....58,599 ఓట్లు, 56 పోలింగ్ బుత్ లు.
వెంగళరావు నగర్...54,620 ఓట్లు, 58 పోలింగ్ బుత్ లు.
బోరబండ....52,754 ఓట్లు, 50 పోలింగ్ బుత్ లు
సోమాజిగూడ...32,300 ఓట్లు, 38 పోలింగ్ బుత్ లు.
బోరబండలోని బూత్ నంబర్–337లో కాంగ్రెస్‌ను పోలిన గుర్తు, సీరియల్ నెంబర్ 2 ఉన్న టీషర్టులు వేసుకొని కాంగ్రెస్ కార్యకర్తలు ఉన్నారు. దీనిపై బీఆర్ఎస్ కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయాన్ని అధికారుల దృష్టికి తీసుకొచ్చారు. ఈ క్రమంలోనే కాంగ్రెస్, బీఆర్ఎస్ కార్యకర్తల మధ్య గొడవ జరిగింది. వెంటనే జోక్యం చేసుకున్న పోలీసులు.. కాంగ్రెస్ కార్యకర్తల చేత టీషర్ట్‌లు తీయించారు.
జూబ్లీహిల్స్ షేక్‌పేట్ డివిజన్ BJYM ప్రెసిడెంట్ స్వస్తిక్‌పై కాంగ్రెస్ నాయకుల దాడి చేశారు. పోలింగ్ రోజు బీజేపీ నాయకులు బయట తిరుగొద్దని వార్నింగ్ ఇస్తూ దాడి పాల్పడ్డారు. కాంగ్రెస్ నాయకుడు సాయినాథ్ అలియాస్ లడ్డూతో పాటు మరో నలుగురు ఈ దాడిలో ఉన్నారు. ఈ ఘటనలో బీజేవైఎం అధ్యక్షుడు స్వస్తిక్ గాయపడ్డారు. తనపై దాడికి పాల్పడ్డ కాంగ్రెస్ నేతలపై ఫిలిం నగర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు స్వస్తిక్. తమ నేతపై దాడికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని బీజేపీ డిమాండ్ చేస్తోంది.
బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఎల్లారెడ్డి గూడా శ్రీ కృష్ణ దేవరాయ వెల్ఫేర్ సెంటర్ బూత్ నెంబర్–290లో తన ఓటు వేశారు.