అరుణ్ గోయల్ రాజీనామా.. భగ్గుమంటున్న విభేదాలు
ఎన్నికల కమిషనర్ పదవికి అరుణ్ గోయల్ వాలంటరీ రిటైర్మెంట్ ఇచ్చారు. చీఫ్ ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్‌తో ఉన్న విభేదాలే ఇందుకు కారణంగా సమాచారం.
Update: 2024-03-12 10:18 GMT
సార్వత్రిక ఎన్నికలకు దేశం సన్నద్ధం అవుతోంది. పార్లమెంటు ఎన్నికలు ప్రశాంతంగా, పారదర్శకంగా జరిగేలా జాతీయ ఎన్నికల కమిషన్ పలు కీలక చర్యలు చేపడుతోంది. ఈ క్రమంలో జాతీయ ఎన్నికల సంఘంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఎన్నికల కమిషనర్ అరుణ్ గోయల్ తాజాగా తన పదవికి రాజీనామా చేశారు. ఆయన రాజీనామా ఎన్నికల శ్రేణులన్నికీ భారీ ఝలక్‌గా మారింది. కానీ ఆయన రాజీనామా నేపథ్యంలో అరుణ్ గోయల్‌కు చీఫ్ ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ మధ్య ఉన్న విభేదాలు భగ్గుమన్నాయి. ఫిబ్రవరి 15న అనూప్ పాండే పదవీ విరమణ తర్వాత వీరి మధ్య పలు అంశాల్లో విభేదాలు తలెత్తాయి. పలు అంశాల్లో వీరిద్దరి మధ్య భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేశారని, అవే విభేదాలుగా మారాయని సమాచారం.
అసలు సమస్య అదే
అరుణ్ గోయల్, రాజీవ్ కుమార్ మధ్య కీలక పాలసీలకు సంబంధించిన సమస్యలపై విభేదాలు లేవు. పోల్ సన్నాహక సమీక్షల కోసం రాష్ట్రాలకు వెళ్లే ఎన్నికల కమిషన్ బృందాల కూర్పు, అందులోని సిబ్బంది సంఖ్య, రాష్ట్రాల్లో వారు ఇచ్చే మీడియా బ్రీపింగ్‌లకు సంబంధించి భిన్నాభిప్రాయాలు ఉండేవని అవే వారి మధ్య పెద్ద పెద్ద సమస్యలుగా మారాయని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. రాజీవ్, అరుణ్ మధ్య భారీ స్థాయిలో విభేదాలు ఉన్నా ‘నిర్వచన్ సదన్’లో వారిపై అధికారికంగా ఎటువంటి అసమ్మతి కేసు నమోదు కాలేదని, వారు తమ మధ్య తేడాలను మాటల ద్వారా వ్యక్తీకరించేవారని సంబంధిత వర్గాలు చెప్పాయి.
కొన్ని సమస్యలు తీరాయి
అనూప్ పాండేతో కూడిన త్రిసభ్య కమిషన్ ఉన్న సమయంలో వీరి మధ్య పలు సమస్యలు సామరస్యంగా పరిష్కరించబడ్డాయి. సభ్యుల మధ్య భిన్నాభిప్రాయాలు ఏర్పడితే ఆ అంశాలపై కమిషన్ పలు డాక్యుమెంట్లు, రివైజ్‌డ్ నోట్స్‌ను కలిగి ఉండేది. కొన్ని సందర్భాల్లో గోయల్ సలహాలు, సూచనలు కూడా అంగీకరించబడినట్లు సమాచారం. ఇటీవల పశ్చిమ బెంగాల్‌లో జరిగిన సమీక్షలో ఇటువంటి అంశాలపైనే సీఈసీ, గోయల్ చర్చించుకోవడం కనిపించింది. కానీ ఆ తర్వాత కోల్‌కతాలో నిర్వహించిన తుది మీడియా బ్రీఫింగ్ సమావేశానికి వారు దూరంగా ఉన్నారు. ఇటీవల యూపీ, ఒడిశా, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్‌లో నిర్వహించిన మీడియా సమావేశాల్లో గోయల్ పాల్గొన్నారు.
రాజీనామా చేయాల్సిన అవసరం లేదు!
గోయల్, రాజీవ్ మధ్య ఉన్న విభేదాల కారణంగా లోక్‌సభ ఎన్నికల ముందు ఎన్నికల కమిషనర్ పదవికి రాజీనామా చేయాల్సిన అవసరం లేదని ఈ విభేదాల గురించి తెలిసిన వ్యక్తులు అభిప్రాయపడుతున్నారు. లోక్‌సభ ఎన్నికల బాధ్యతలను నిర్వర్తించిన తర్వాత విభేదాల అంశంపై ఒక నిర్ణయం తీసుకుని ఉండొచ్చని, అలా కాకుండా ఎన్నికల ముందు ఎలక్షన్ కమిషనర్ పదవి నుంచి తప్పుకోవడం సంఘం పనితీరుపై ప్రతికూల ప్రభావం చూపే అవకాశం ఉంది.
గోయల్ నేపథ్యం ఇదీ
అరుణ్ గోయల్.. 1985 బ్యాచ్ పంజాబ్ క్యాడర్ ఐఏఎస్ అధికారి. 2022 నవంబర్ నుంచి ఆయన ఎన్నికల కమిషనర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. నవంబర్ 2022లో ఆయన భారీ పరిశ్రమల మంత్రిత్వ శాఖ సెక్రటరీ పదవి నుంచి వాలంటరీ రిటైర్మెంట్ తీసుకున్నారు. ఆ తర్వాత కొద్ది రోజుల్లోనే ఎన్నికల కమిషన్‌లో చేరారు.