ఓటు కోసం డబ్బు ఆశించే ప్రజల్ని ఎలా చూడాలి?

వానల్లో, ఎండల్లో, చలిలో రోజుకు 10 నుండి 12 లేదా 14 గంటలు శారీరక శ్రమ చేసే కూలీల్ని డబ్బుకు అమ్ముడు పోతున్నారంటూ "నాగరిక జనం" దూషిస్తుంటే మనస్సు చలించి పోదూ!

Update: 2024-03-23 15:11 GMT


-ఇఫ్టూ ప్రసాద్ (పిపి)


ఓటు కోసం డబ్బు ఆశించే ప్రజల్ని ఎలా చూడాలి?

మళ్లీ ఎన్నికలు వచ్చాయి. రాజకీయ పార్టీలు పోటీ చేయడం సహజమే! ఇవి ప్రధానంగా కార్పోరేట్ పార్టీల మధ్య ఎన్నికలు కావడం గమనార్హం!

ఎన్నికల్లో వందలు, వేలకోట్ల సొమ్మును మంచినీళ్ళుగా పారించడం మామూలే! ఈ ఎన్నికల్లో విశృంఖల అవినీతి, అక్రమాలు, శుష్క వాగ్దానాలు మామూలే! పార్టీల అభ్యర్థుల ఫిరాయింపులు సాధారణమే! గెలుపు, ఓటముల కబుర్లు కూడా సాధారణమే. వీటితో పాటు మరో సంచలన వార్త కూడా ప్రచారమౌతుంది. అదే ఓటరులైన సామాన్య ప్రజలు భ్రష్టు పట్టిపొయారనీ, వాళ్ళు ఎన్నికల వ్యవస్థను కూడా భ్రష్టు పట్టిస్తున్నారనీ తీవ్ర నిందా ప్రచారం కూడా భారీ ఎత్తున జరుగుతుంది.

అస్తమానం కాయకష్టం చేసే సామాన్య శ్రమజీవుల్ని పరమ దోషుల్ని చేయడానికి ఇదొక అవకాశం. అంతిమంగా ఫాసిజానికి బలం చేకూర్చే ప్రచారమిది.

పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థ సామాన్య ప్రజల వల్ల కలుషితమై పోతోందని నేడు కుహనా నాగరిక వర్గాలు కోడై కూస్తుండడం తెల్సిందే. ఇది తీవ్ర అభ్యంతరకర ప్రచారం. ప్రజల్ని ప్రేమించే నిబద్దత గల వారి మనస్సుల్ని నొప్పిస్తుంది. అలా మనస్సు తీవ్రంగా గాయపడ్డ వారిలో నేనొకణ్ణి.

1996, 1998, 1999 వరసగా 11వ, 12వ, 13వ లోక సభ ఎన్నికలు వరసగా రావడం పట్ల మధ్యతరగతి, విద్యాధిక, నాగరిక వర్గాలు ఒకరకంగా స్పందించాయి. శ్రామిక, పేద వర్గాల ప్రజలు మరోరకంగా స్పందించారు. సునిశితంగా గమనించా.

ఇలా తరచుగా మధ్యంతర ఎన్నికలు రావడం వల్ల అనవసరంగా వృధాగా డబ్బు ఖర్చు అవుతుందనీ, తద్వారా దేశ ఆర్ధికవ్యవస్థ తీవ్రంగా దెబ్బతింటుందని, అందువల్ల మన దేశానికి పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థ పనికి రాదనీ, అధ్యక్ష తరహ లేదా సైనిక పాలన అవసరమనీ మొదటి రకం ప్రజల నుండి ప్రతిస్పందన వ్యక్తం అయ్యేది.

ఇలా తరచుగా ఎన్నికలు వస్తే మంచిదని సామాన్య ప్రజలు స్పందించే వారు. దాన్ని వారొక వెసులుబాటుగా భావించారు. మానసిక శ్రమ చేసే విద్యాధిక ప్రజల మనస్సులు ఎందుకలా ఆలోచిస్తున్నాయి? అందుకు భిన్నంగా శారీరక శ్రమ చేసే కష్టజీవులు మరో విధంగా ఎందుకు ఆలోచిస్తున్నారు? ఈ ఉభయుల ఆలోచనా విధానం మధ్య ఇంత మౌలిక వైరుధ్యం ఎందుకుంది? తీవ్ర ఆలోచనకి దారి తీయించింది.

2004, 2009 లలో 14వ, 15వ లోక్ సభ ఎన్నికలు ఇంకా మానసిక సంఘర్షణకు దారితీయించాయి.

వానల్లో, ఎండల్లో, చలిలో రోజుకు 10 నుండి 12 లేదా 14 గంటలు చొప్పున శారీరక శ్రమ చేసే కూలీల్ని డబ్బుకు అమ్ముడు పోతున్నారంటూ "నాగరిక జనం" దూషిస్తుంటే మనస్సు చలించి పోయేది.

నెలకు ముపై, నలభై వేలు లేదా అంతకంటే ఎక్కువ జీతాలు తీసుకునే ఉద్యోగ వర్గాల ఆలోచనల వేరుగా ఉండేవి. తద్భిన్నంగా నిత్యం గానుగెద్దుల్లా శారీరక శ్రమ చేసినా రోజుకు కనీసం రెండు వందల రూపాయల కూలి కూడా పొందలేని బడుగు శ్రమ జీవుల ఆలోచనలు మరో రకంగా ఉండేవి. ఎందుకిలా ఉన్నాయనే ప్రశ్న మనసుల్ని తీవ్రంగా వెంటాడింది.

సమాజంలో సకల సంపదల్ని సృష్టించే శ్రామికవర్గాన్ని, దానికి మిత్రవర్గమైన ఉద్యోగ, విద్యాధిక మధ్యతరగతి వర్గాలతో దూషింపజేసేది ఎవరు? ఈ సందేహం కూడా మనస్సును వెంటాడింది.

శ్రామికవర్గాన్ని చులకనగా విమర్షిస్తుంటే భరించలేక, వారి పట్ల గల నిబద్ధమైన ప్రేమతో రకరకాలుగా ఆలోచించా. అంతర్మధనం చెందా. ఇలాంటి సందర్భాల్ని గూర్చి ఎంగెల్స్, లెనిన్ ఏం చెప్పారోనని వారు ఎన్నికలపై చేసిన రచనల్ని తిరిగి మరోసారి పరిశీలనగా అధ్యయనం చేశా. ఏమీ దొరకలేదు. ఐనా అన్వేషణ సాగింది.

తుదకు ఒక నిర్దిష్టమైన అవగాహనకు వచ్చా. ఆ ప్రకారం ఒక ఆలోచనాత్మక (THOUGHT PROVOKING) రైటప్ ని ఒక దినపత్రికకి రాద్దామనే నిర్ణయానికి వచ్చా. అది చేతిరాతలో చిత్తు ప్రతి తయారైనది. దాన్ని DTP చేయించక ముందే నేనొక పునరాలోచనలో పడి వెనక్కి తగ్గా. డబ్బు తీసుకొని ఓట్లు వేసే అవినీతికర పద్దతుల్ని విప్లవ పథంలో ప్రయాణించే ఫలానా ఇఫ్టూ ప్రసాద్ కూడా సమర్ధిస్తున్నాడనే విమర్శలు ప్రజాతంత్ర, వామపక్ష, లౌకిక, ప్రగతిశీల సమూహాల నుండి వెల్లువెత్తుతాయనే సందేహం కలిగింది. అలాంటి విమర్శల వల్ల రాజకీయంగా చులకన అవుతాననే భావం కలిగింది. ప్రచురణకు పంపలేదు. అది చేతిరాత చిత్తు కాపీగానే మిగిలిపోయింది.


మరో ఐదేళ్లు గడిచింది. ఈ అంశంపై ప్రేరేపణాత్మక వ్యాసం రాయాల్సిన ఆవశ్యకత ఉందనే భావం కొనసాగుతూ వచ్చింది. పైగా క్రమక్రమంగా బలపడుతూ వచ్చింది. 2014 ఎన్నికల సమయానికి అదొక కార్యరూపం ధరించింది. ఈ క్రింది పొడవైన హెడ్డింగ్ తో ఓ వ్యాసం రాశా.

రేపటి ఉద్యమాలకూ, విప్లవాలకూ పోటెత్తే చరిత్ర నిర్మాతలు ఓటుకు డబ్బు ఆశించే సామాన్య ప్రజలే!

పై ఐదు పేజీల వ్యాసం రాయనైతే రాశా. ప్రాచుర్యం ఎలా కల్పించాలి? సమస్య ఎదురైనది. ఆనాటికి సోషల్ మీడియా వున్నా, అందులో నా ప్రవేశం జరగలేదు.


ఎట్టకేలకు ధైర్యం చేసి ఒక దినపత్రికకి పంపాలని ఒక నిర్ణయం తీసుకున్నా. దాన్ని సంక్షిప్తం చేశా. 2014 మే నెలలో నోటుకు ఓటూ ఒక ముందడుగే! అనే శీర్షికతో పంపా. పోలింగ్ గడువుకు చాలా ముందే పంపా. కానీ దాన్ని ఆ పత్రిక ప్రచురణకు తీసుకోలేదు. నిరుత్సాహం కలిగింది. చేయగలిగేది లేదు. ఆ ఎన్నికల సమయంలో ప్రచారం చేయలేకపోయా.

మరో ఐదేళ్లు గడిచింది. 2019 లో 17వ లోక్ సభ ఎన్నికలు సమీపించాయి. అప్పటికి సోషల్ మీడియాలో ప్రవేశం జరిగింది. 2014 లో ఎన్నికల సమయంలో ఓ దినపత్రిక కోసం రాసిన రైటప్ ని సోషల్ మీడియాలో విడుదల చేశా. ప్రతిస్పందన అనూహ్యంగా లభించింది. ముఖ్యంగా ప్రగతిశీల సమూహాల నుండి విశేష సానుకూల స్పందన లభించింది.

మరో ఐదేళ్లు గడిచింది. నేడు 18వ లోక్ సభ ఎన్నికలు వచ్చాయి. మళ్లీ విడుదల చేద్దామని అనిపించింది. అందుకు ఈ క్రింది రెండు కారణాలు ఉన్నాయి.

1-గత ఎన్నికల (2019) నాటికి సోషల్ మీడియాని ఉపయోగించుకునే విస్తృతి చాలా తక్కువగా ఉంది. నేడు విస్తృతి పెరిగింది. ఇప్పుడు ఇంకా ఎక్కువ మందిలోకి తీసుకెళ్లే అవకాశం ఉంది.

2-ఫాసిస్టు రాజకీయ శక్తులు రాజ్యాంగం రద్దు చేసి, ప్రస్తుత పార్లమెంటరీ వ్యవస్థను సమూలంగా మార్చి, దేశాన్ని నగమైన ఫాసిస్టు రాజ్యంగా మారుద్దామని భావిస్తుండడం తెల్సిందే. వారి కుట్రలకు వ్యతిరేకంగా సామాన్య ప్రజల్ని సమీకరించడానికి ఎవరు అంగీకరించినా, కాదన్నా ఇదో సాధనమని దృఢంగా భావిస్తున్నా.








Tags:    

Similar News