అందరిని అలరించిన ఆ గొంతు మూగబోయింది!

" బెహనో భాయియోన్.. .. మై అప్కా అమీన్ సయాని అని వినిపించిన గొంతు 91 సంవత్సరాల వయసులో నిన్న రాత్రి (20.2.24) ఏడు గంటలకి శాశ్వతంగా మూగబోయింది. వివరాలు

Update: 2024-02-21 11:21 GMT

1952 నుండి 1994 వరకు నాలుగు దశాబ్దాల పాటు, ప్రపంచంలోనే అత్యంత సుదీర్ఘకాలం నడిచిన బినాక గీత్ మాల ప్రోగ్రాంలో ప్రతి బుధవారం రాత్రి 8 గంటలకి రేడియో సిలోన్ లో ప్రసారమయ్యే (తర్వాత వివిధ భారతిలో) " బెహనో భాయియో.. .. మై అప్కా అమీన్ సయాని ( సోదరీ సోదర మణులారా నేను మీ అమీన్ సయాని..") అని వినిపించిన గొంతు 91 సంవత్సరాల వయసులో నిన్న రాత్రి (20.2.24) ఏడు గంటలకి శాశ్వతంగా మూగబోయింది. నాలుగు దశాబ్దాల పాటు రేడియో ఉన్న ప్రతి ఇంట్లో అందరిని పలకరించి, అలరించిన ఒక కమ్మని కంఠం ఆగిపోయింది.


అమితాబ్ కే అపాయింట్మెంట్ ఇవ్వలేదు

బినాక గీత్ మాల అంటే అమీన్ సయాని అని రేడియో శ్రోతలు భావించే గొంతు. అ గొంతు వినటానికి శ్రోతలు ఎన్ని పనులు ఉన్నా మానుకొని రేడియో చుట్టూ చేరే వాళ్ళు, అమీన్ సయాని ఎన్నో కార్యక్రమాలు చేసినప్పటికీ, బినాక గీత్ మాల మాత్రం ప్రత్యేకమైనది. రేడియో వ్యాఖ్యాతగా, జాకీగా తనదైన శైలిలో శ్రోతలకు అత్యంత ఇష్టమైన హిందీ ప్రోగ్రాం " బినాక గీత్ మాల" నడిపించిన అమీన్ సయాని, ఒకప్పుడు అత్యంత బిజీగా ఉన్న రేడియో ప్రజెంటర్. వారానికి 20 ప్రోగ్రాములతో ఎడతెగక నడిపించిన గొంతు. ఎంత బిజీ అంటే, రేడియో వ్యాఖ్యాత కావాలని రేడియో స్టేషన్ కు వచ్చిన అమితాబచ్చన్ కు అపాయింట్మెంట్ ఇవ్వనంత! అంటే అమితాబచ్చన్ సినిమాల్లో ప్రయత్నం చేయటానికి ముందు, రేడియో ప్రెసెంట్ కావాలనుకున్నాడు. ఎన్నిసార్లు వచ్చినా అమీన్ సయాని అమితాబచ్చన్ కి అపాయింట్మెంట్ ఇచ్చేవాడు కాదు. ఒకసారి రిసెప్షన్ లో తన సెక్రెటరీ ద్వారా అపాయింట్మెంట్ తీసుకోమని చెప్పించాడు.

1971లో "ఆనంద్" సినిమా చూసిన తర్వాత అమితాబ్ నటన చూసి అమీన్ సయాని ముగ్దుడు అయిపోయాడు. తన దగ్గరికి ఆడిషన్ కోసం వచ్చిన కుర్రాడు ఇతనేనని అప్పుడు తెలియదు. ఒక ఫంక్షన్ లో అమితాబచ్చన్ " నేను సినిమాల కోసం ప్రయత్నం చేస్తున్న సందర్భంలో, రేడియో జాకీ కావాలని మూడుసార్లు రేడియో స్టేషన్ కు వెళ్లినప్పటికీ, కనీసం ఆడిషన్ కోసం కూర్చుని కూడా చెప్పలేదు" అని చెప్పినప్పుడు అమీన్ సయాని ఆశ్చర్యపోయాడట. తర్వాత అమితాబ్ ను అమీన్ సయాని ఇంటర్వ్యూ చేసినప్పుడు, ఈ విషయం ఇద్దరం గుర్తు చేసుకుని నవ్వుకున్నామని" అమీన్ సయాని ఓ సందర్భంలో చెప్పాడు.

ఆ తర్వాత, 1974 లో వచ్చిన అమితాబచ్చన్ దీవార్ సినిమా అడ్వర్టైజ్మెంట్ కు అమీన్ సయాని గాత్రం చక్కగా సరిపోయింది. దాంతోపాటు ఎన్నో సినిమాల రేడియో ప్రకటనల్లో అమీన్ సయాని గొంతు వినిపించింది. శ్రోతలను, ప్రేక్షకులను అలరించింది.

అమీన్ సయాని రేడియోలో ఎన్నో మనోరంజక ప్రోగ్రాములు చేశాడు ఎస్ కుమార్ ఫిల్మీ ముఖద్దమా, సారీడాన్ కే సాథీ (ఆల్ ఇండియా రేడియో మొదటి ప్రాయోజిత కార్యక్రమం), శాలిమర్ సూపర్ జోడి సితారే, మరాఠా దర్బార్ అగర్బత్తి వారి సీతారో కే పసంద్ లాంటి ప్రోగ్రాములకి తన గొంతుతో, విభిన్నమైన యాంకరింగ్ తో పాపులర్ చేశాడు.

విభిన్నమైన శైలి, సంబోధన

అమీన్ సయాని సృజనాత్మకతకు ప్రాధాన్యత ఇచ్చేవాడు. శుద్ధమైన హిందీ, విభిన్నమైన మాడ్యూలేషన్, సరైన ఉచ్చారణ, మాట విరుపు అన్ని ప్రత్యేకంగా ఉండేలా చూసుకునేవాడు. హిందుస్తానీ లో సరైన ఉచ్చారణ కోసం అమీన్ సయాని సెయింట్ జేవియర్ కాలేజీలోని రేడియో సాంకేతిక శిక్షణ విభాగంలో కొంతకాలం శిక్షణ తీసుకున్నాడు. అది చాలా వరకు లాభించింది అంటాడు అమీన్ సయాని. సాధారణంగా అందరూ " భాయియోన్ ఔర్ బెహనో" అంటారు. కానీ అమీన్ సయానీ "బెహనో ఔర్ భాయియోన్" అంటాడు. అది చాలామంది అభిమానులు సంపాదించి పెట్టింది

అమీన్ సయాని ఒక ప్రత్యేకమైన మాడ్యులేషన్ తో శుద్ధమైన హిందీలో చేసినా అనౌన్స్మెంట్స్, ప్రకటనలు, సమకూర్చిన జింగిల్స్(దాదాపు 19000!), ప్రయోక్తగా, వ్యాఖ్యాతగా, సంధాన కర్తగా దాదాపు 54 వేల ప్రోగ్రాములు చేసినట్లు లింకా బుక్ ఆఫ్ రికార్డ్స్ లో నమోదయింది. ఈ శతాబ్దపు ఉత్కృష్టమైన (ఔట్ స్టాండింగ్) కార్యక్రమం అయిన బినాక గీత్ మాల యాంకర్ గా బాంబే అడ్వర్టైజింగ్ క్లబ్ ద్వారా గోల్డెన్ అబ్బి అవార్డు కూడా అమీన్ సయాని సొంతం చేసుకున్నాడు.

ప్రపంచవ్యాప్తంగా భారత దేశానికి చెందిన రెండు గొంతుకలు ప్రజల మనసుల్లో శాశ్వతమైన స్థానాన్ని పొందాయి. ఒకటి మాటల మాంత్రికుడు అమీన్ సయానిది. రెండోది పాటల కోయిల లతా మంగేష్కర్ ది.
8 దశాబ్దాల పాటు ఒక గొంతు తనదైన శైలిలో రేడియోలో, ప్రకటనల్లో, సినిమాల్లో వినపడడం అసాధారణమైన విషయం.

 రేడియోకి చావు లేదు

రేడియో ఉన్నంతవరకు అమీన్ సయాని ప్రజల మనసులో ఉంటాడు. అమీన్ సయాని మాటల్లోనే చెప్పాలంటే. "ఈ డిజిటల్ మీడియా యుగంలో, అది ఎంత శక్తివంతమైనప్పటికీ, రేడియోని మాత్రం చంపలేదు" ఇది నిజమేననిపిస్తుంది. రేడియో ఉన్నంతకాలం, అమీన్ సయాని ని మర్చిపోవడం సాధ్యం కాదు. ఆ గొంతు శాశ్వతమైనది, అజరామరమైనది.


Tags:    

Similar News