ప్రశాంత్ కిషోర్ అరెస్ట్, పాట్నాలో టెన్షన్ టెన్షన్

ఎన్నికల వ్యూహకర్త, జన్ సురాజ్ పార్టీ అధినేత ప్రశాంత్ కిషోర్ ను బీహార్ పోలీసులు అరెస్ట్ చేశారు. దీంతో పాట్నాలో టెన్షన్ నెలకొంది.;

Update: 2025-01-06 04:54 GMT
ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త, జన్ సురాజ్ పార్టీ అధినేత ప్రశాంత్ కిషోర్ ను బీహార్ పోలీసులు అరెస్ట్ చేశారు. దీంతో పాట్నాలో టెన్షన్ నెలకొంది. బీహార్ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్షను రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్న జన్ సురాజ్ పార్టీ అధినేత ప్రశాంత్ కిషోర్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. రెండ్రోజుల నుంచి ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న ఆయన్ను సోమవారం తెల్లవారుజామున 4 గంటలకు పాట్నా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గాంధీ మైదాన్ నుంచి ప్రశాంత్ కిషోర్ ను (పీకే) బలవంతంగా అంబులెన్స్‌లోకి ఎక్కించారు. ఈ సమయంలో ఆయన మద్దతుదారులు తీవ్రంగా ప్రతిఘటించారు.

పాట్నాలోని గాంధీ మైదానంలో BPSC 70వ ప్రాథమిక పరీక్ష రద్దు చేయాలనే డిమాండ్‌తో ప్రశాంత్ కిషోర్ నిరాహార దీక్ష చేస్తున్నారు. నిరాహార దీక్ష శిబిరాన్ని ఎత్తివేయాలని పోలీసులు హెచ్చరించినా పట్టించుకోకపోవడంతో పాట్నా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గాంధీ మైదానం ఖాళీ చేయించేందుకు, పోలీసులు ప్రశాంత్ కిషోర్‌తో పాటు కొంతమంది ఆందోళనకారుల్ని కూడా అదుపులోకి తీసుకున్నారు. ఆయన్ను నేరుగా ఎయిమ్స్‌కు తరలించారు. ప్రశాంత్ కిషోర్‌ను ఏ కారణంగా అదుపులోకి తీసుకున్నారన్న ప్రశ్న ఇప్పుడు ఉత్కంఠ రేపుతోంది.
ప్రశాంత్ కిషోర్ ను అరెస్ట్ చేయవచ్చునని ఆదివారం సాయంత్రమే మీడియా సంకేతాలు ఇచ్చింది. పాట్నాలో గార్డనిబాఘ్, గాంధీ మైదానాల్లో BPSC 70వ ప్రాథమిక పరీక్ష రద్దు డిమాండ్‌తో ఆందోళనలు కొనసాగుతున్నాయి. గార్డనిబాఘ్‌లో BPSC అభ్యర్థులు ఆందోళన చేస్తుండగా, గాంధీ మైదానంలో ప్రశాంత్ కిషోర్ నిరాహార దీక్ష చేపట్టారు. గార్డనిబాఘ్‌లో జరుగుతున్న ఆందోళనపై ఎటువంటి అభ్యంతరం లేదని, కానీ గాంధీ మైదానం ఖాళీ చేయాలని అధికారులు స్పష్టం చేశారు.
హైకోర్టు నిర్ణయం మేరకు గార్డనిబాఘ్‌ను నిరాహార దీక్షలు, ఆందోళనలకు అనుమతించిన ప్రదేశంగా గుర్తించగా, గాంధీ మైదానాన్ని నిషేధిత ప్రదేశంగా ప్రకటించారు. ఈ ఆదేశాల ఆధారంగా అధికారులు ప్రశాంత్ కిషోర్‌పై చర్యలు తీసుకొని అరెస్ట్ చేశారు. నిరాహార దీక్ష ప్రదేశం నుంచి నేరుగా ఎయిమ్స్‌కు తరలించిన పోలీసులు, ప్రశాంత్ కిషోర్‌కు వైద్య పరీక్షలు నిర్వహించి కోర్టుకు హాజరుపరుస్తారు.
Tags:    

Similar News