TRUMP SPEED | వస్తూనే విరుచుకుపడిన ట్రంప్.. బైడెన్ విధానాలన్నీ రద్దు
పౌరసత్వ హక్కు రద్దు, ట్రాన్స్ జెండర్లకు ఎర్రజెండా, పార్లమెంటుపై దాడి చేసిన వారికి విముక్తి.. వంటి 30 జీవోలపై ఎడాపెడా సంతకాలు చేశారు.;
By : The Federal
Update: 2025-01-21 06:03 GMT
అమెరికా 47వ అధ్యక్షునిగా పదవీ బాధ్యతలు చేపట్టిన డోనాల్డ్ ట్రంప్ వస్తూనే శరపరంపరగా ఎగ్జిక్యూటివ్ ఆర్డర్లపై సంతకాలు చేశారు. తాజా మాజీ అధ్యక్షుడు జో బైడెన్ జారీ చేసిన 160 ఉత్తర్వుల్లో 78 విధానాలను రద్దు చేసేశారు. ట్రంప్ పాలనకు వ్యతిరేకంగా అమలు చేసిన బైడెన్ విధానాలను తక్షణం రద్దు చేయడం ద్వారా ట్రంప్ తన పాలనా శైలి ఎలా ఉండబోతోందో చెప్పకనే చెప్పినట్టయింది.
జనవరి 20వ తేదీ ఉదయం పదిన్నర గంటలకు ఆయన రెండోసారి అమెరికా అధ్యక్ష బాధ్యతలు చేపట్టారు. ప్రమాణ స్వీకారం చేసిన 6 గంటలలోపే ఆయన ఎడాపెడా ఎగ్జిక్యూటివ్ ఉత్తర్వులపై సంతకాలు చేశారు. వాటిలో ముఖ్యంగా వలసల నియంత్రణ, అమెరికాలో పుట్టిన వారందరికీ జన్మతహా వచ్చే పౌరసత్వ హక్కు రద్దు, పర్యావరణ నియంత్రణ, బైడెన్-కాలం నాటి విధానాల రద్దు చేయడం వంటివి ఉన్నాయి.
దేశీయంగా ఇంధన ఉత్పత్తిని ప్రోత్సహించడానికి ఫాసిల్ ఫ్యూయల్ తవ్వకాలను విస్తరించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఫెడరల్ ఉద్యోగ నియామకాలు (మిలిటరీ మినహాయించి) నిలిపివేస్తూ ఉత్తర్వు జారీ చేశారు. లింగ మార్పిడి సంబంధిత సేవలకు ఫెడరల్ నిధులను నిలిపివేశారు. అమెరికాలో ఆశ్రయం కోరే వారు - విచారణకు ముందుగా మెక్సికో లోనే ఉండాలని నిర్దేశించారు.
ఈ ఉత్తర్వులు ప్రధానంగా బైడెన్ కాలపు విధానాలను నియంత్రించడమో లేదా రద్దు చేయడంపై దృష్టి సారించినట్టు కనిపిస్తోంది.
ట్రంప్ మొదటి సారి 2016లో బాధ్యతలు చేపట్టినపుడు 220 కార్యనిర్వాహక ఉత్తర్వులను సంతకం చేశారు. ఆ తర్వాత వచ్చిన బైడెన్ 2020 నుంచి 2024 డిసెంబర్ 20 నాటికి 160 ఉత్తర్వులను జారీ చేశారు.
కొత్త అధ్యక్షుడు బాధ్యతలు స్వీకరించినప్పుడు కార్యనిర్వాహక ఉత్తర్వులను జారీ చేయడం ఆచారంగా వస్తోంది. వీటికి కాంగ్రెస్ (అమెరికన్ పార్లమెంటు) ఆమోదం అవసరం లేదు. ప్రెసిడెంట్ తన అధికారాన్ని వినియోగించేందుకు రాజ్యాంగం వీలు కల్పిస్తోంది. అయితే, వీటి ప్రభావం కొన్ని పరిమితులకు లోబడి ఉంటుంది.
78 ఏళ్ల ఈ రిపబ్లికన్ నాయకుడు తన రెండో అధ్యక్ష పదవీకాలాన్ని వడివడిగా ఎగ్జిక్యూటివ్ ఆర్డర్లను జారీ చేయడంతో ప్రారంభించారు. ఇవి టిక్‌టాక్ నిషేధం రద్ద మొదలు దేశీయ ఇంధన ఉత్పత్తి పెంపుదలకు వరకు ఉన్నాయి.
ట్రంప్ జారీ చేసిన ముఖ్య ఉత్తర్వులు...
1. పౌరసత్వ హక్కు రద్దు చేయాలని ప్రతిపాదించారు. వందేళ్లుగా అమెరికాలో అమలవుతున్న విధానం ఇది. దీన్ని ఒక్క కలంపోటుతో రద్దు చేశారు. అయితే ఇది అమల్లోకి రావడానికి చాలా అడ్డంకులను అధిగమించాల్సి ఉంది. రాజ్యాంగపరమైన చిక్కులు ఉన్నాయి.
2. ద్రవ్యోల్బణాన్ని ఎదుర్కోవడంలో ఫెడరల్ ఏజెన్సీలకు మార్గదర్శనం చేస్తూ ఒక సందేశాత్మక మెమోరాండంపై సంతకం చేశారు.
3. ఆలాస్కాలో ఆయిల్, సహజ వాయువు ఉత్పత్తిపై బైడెన్-కాలం నాటి నిబంధనలను రద్దు చేశారు.
4. కెనడా, మెక్సికో ఉత్పత్తులై 25% టారిఫ్‌లు అమలు చేయాలని ప్రతిపాదించారు. చైనా దిగుమతులపై అదనపు టారిఫ్‌ల గురించి ఇంకా వివరాలు అందలేదు.
5. మెక్సికో గల్ఫ్ పేరు "అమెరికా గల్ఫ్"గా మార్పు చేశారు.
6. డెనాలి పర్వతాన్ని "మౌంట్ మెక్‌కిన్లీ"గా పేరు మార్చి "అమెరికా మహత్త్వాన్ని" గౌరవించినట్టు ప్రకటించారు.
7. భవిష్యత్లో అమెరికా నూతన అధ్యక్షుల ప్రమాణ స్వీకారోత్సవం రోజున జాతీయ జెండాలను పూర్తి స్థాయిలో ఎగురవేసేందుకు, మాజీ అధ్యక్షుడు జిమ్మీ కార్టర్ మరణించిన రోజున జాతీయ జెండాలను అవనతం చేసేందుకు ఆదేశించారు.
8. బైడెన్-హయాంలోన ఇమ్మిగ్రేషన్ ఉత్తర్వులను రద్దు చేశారు. అక్రమ వలసదారులను తిరిగి పంపించేందుకు (డిపోర్టేషన్) ప్రాధాన్యత ఇచ్చే తన మొదటి పథకాన్ని పునరుద్ధరించారు.
9. యుఎస్-మెక్సికో సరిహద్దులో జాతీయ అత్యవసర పరిస్థితిని ప్రకటించి, యుఎస్ సైన్యాన్ని అక్కడ మొహరింపజేస్తారు. అలాగే శరణార్థులను, ఆశ్రయం కోరే వ్యక్తులను పరిమితి చేశారు.
10. అమెరికా శరణు కోరే వారు విచారణ పూర్తి అయ్యే వరకు మెక్సికోలోనే ఉండే విధానాన్ని పునఃప్రారంభించాలని ప్రకటించారు.
11. అమెరికాలో పుట్టిన ప్రతి ఒక్కరికి ఇచ్చే పౌరసత్వ హక్కును రద్దు చేయాలని ప్రతిపాదించారు. అయితే దీనికి ఇంకా చాలా చిక్కులున్నాయన్నారు.
12. బైడెన్ పరిపాలనలో వలసదారుల చట్టపరమైన ప్రవేశానికి ఉపయోగించిన CBP One యాప్‌ను రద్దు చేశారు.
13.పారిస్ వాతావరణ ఒప్పందం నుండి అమెరికా వైదొలుగుతుందని అధికారికంగా ప్రకటించారు.
14. జాతీయ ఇంధన అత్యవసర పరిస్థితిని ప్రకటించి, ఫాసిల్ ఫ్యూయల్ తవ్వకాల విస్తరణకు, బైడెన్ ఎలక్ట్రిక్ వాహన విధానాన్ని రద్దు చేయడానికి ఉత్తర్వులు జారీ చేశారు.
15. ఫెడరల్ ఉద్యోగులను నియమించడంపై నిషేధం విధించారు. అయితే మిలిటరీకి, కొన్ని అత్యవసర విభాగాలకు మినహాయింపునిచ్చారు. కొత్త ఫెడరల్ నిబంధనలను అమలు చేయడాన్ని నిలిపివేశారు. కొన్ని ఫెడరల్ ఉద్యోగాలను రాజకీయ నియామకాలుగా పునర్వర్గీకరించాలనే ప్రతిపాదన చేశారు. తద్వారా వారి తొలగింపు సులభతరం అవుతుంది.
16. ప్రభుత్వం ఖర్చులు తగ్గించేందుకు, కార్యక్రమాలను సమీక్షించేందుకు డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియెన్సీ (DOGE)కి అధికారం ఇచ్చారు. దీనికి ఎలాన్ మస్క్ నాయకత్వం వహిస్తున్నారు.
17. అన్ని ఫెడరల్ DEI (డైవర్సిటీ, ఈక్విటీ, ఇన్క్లూజన్) కార్యక్రమాలను రద్దు చేయించి, వాటికి సంబంధించిన కార్యక్రమాలను గుర్తించేందుకు సమీక్ష చేయాలన్నారు.
18. ట్రాన్స్‌జెండర్ల హక్కులను కుదించారు. ఫెడరల్ ప్రభుత్వం రెండు బయాలజికల్ లింగాలను మాత్రమే (పురుషుడు, మహిళ) గుర్తిస్తుందని ప్రకటించారు. తద్వార ట్రాన్స్‌జెండర్లను గుర్తించబోమని చెప్పకనే చెప్పినట్టయింది.
19. ఫెడరల్ జైళ్లలో, వలస శరణాలయాలలో, లైంగిక వేధింపుల బాధితుల కేంద్రాలలో బయాలజికల్ జెండర్ ఆధారంగా వేరు చేయాలని ఆదేశించారు.
20. లింగ మార్పిడి సేవల కోసం ఫెడరల్ నిధులను నిషేధించారు.
21. బైడెన్ పరిపాలనా కాలంలోని "రాజకీయ వ్యతిరేకుల"పై చట్టపరమైన చర్యలను నిలిపివేశారు.
22. 2021 జనవరి 6న క్యాపిటల్‌పై జరిగిన దాడికి సంబంధించి శిక్షింపబడిన లేదా అభియోగాలు ఎదుర్కొన్న 1,500 మందికి క్షమాభిక్షను ప్రకటించారు.
23. టిక్‌టాక్‌ను 75 రోజులు కొనసాగించేందుకు అనుమతిస్తూ ఉత్తర్వు జారీ చేశారు.
24. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) నుండి అమెరికా నిష్క్రమణకు సంబంధించి ఉత్తర్వు జారీ చేశారు.
25. అమెరికన్ పౌరుల స్వేచ్ఛా హక్కులను ఫెడరల్ అధికారులు రద్దు చేసే చట్టవిరుద్ధ చర్యలను నిషేధించే ఉత్తర్వు జారీ చేశారు.
26. బైడెన్ పరిపాలన కాలంలో స్వేచ్ఛా హక్కుల ఉల్లంఘనలపై విచారణకు అటార్నీ జనరల్‌ను ఆదేశించారు. వాటికి పరిష్కారం చూపాలని కూడా కోరారు.
27. డ్రగ్ కార్టెల్‌లను విదేశీ ఉగ్రవాద సంస్థలుగా గుర్తించారు.
28. 90 రోజులపాటు విదేశీ సహాయాలను నిలిపివేసి, సమీక్షలు నిర్వహించాలన్నారు.
29. మరణదండన అమలు కోసం లెథల్ ఇంజెక్షన్ డ్రగ్స్ ను రాష్ట్రాలకు అందించడంలో సాయం చేయాలని అటార్నీ జనరల్‌కు ఆదేశించారు.
30. అక్రమంగా అమెరికాలో ఉంటూ పిల్లల్ని కన్నవారిని తిరిగి వారి సొంత ప్రాంతాలకు పంపేటపుడు వచ్చే ప్రభావంపై సమీక్షచేయాలని ఆదేశించారు.
పౌరసత్వ హక్కు రద్దు అంత సులభమా?
పౌరసత్వ హక్కు రద్దు విధానం అమలైతే ఇది చట్టపరంగా, సామాజికంగా, రాజకీయంగా తీవ్ర ప్రభావాలను కలిగించవచ్చు. పౌరసత్వ హక్కు రద్దు అమెరికా రాజ్యాంగంలోని 14వ సవరణకు వ్యతిరేకంగా ఉండవచ్చు. 14వ సవరణ ద్వారా అమెరికాలో జన్మించిన ప్రతి ఒక్కరికి పౌరసత్వం వచ్చింది. వందేళ్లుగా ఇది అమల్లో ఉంది. ఇప్పుడు ఇది రద్దు అయితే సుప్రీం కోర్టు లో దీర్ఘకాలిక చట్టపరమైన వివాదాలకు దారితీయవచ్చు.