రాష్ట్రంలో మిగ్‌జాం తుపాన్ కారణంగా లక్షల హెక్టార్లలో పంట నష్టం జరిగింది. ప్రధానంగా వరి పంట నీటిపాలైంది. ఎక్కడ చూసినా వరి పంట నీటిలో మునిగి కనిపించిది. కల్లాల్లో ధాన్యం తడిసి ముదై్దంది. కోతకు వచ్చిన వరి పంట గాలికి నేలవాలటం, పొలాల్లోకి మోకాలిలోతులో నీరు వచ్చి మునిగిపోవడం, కోసిన వరి ఓదెలు పొలాల్లోలోనే నీటిలో మునిగి పోవడంతో పంటలు నీటిపాలై రైతులు తీవ్రంగా నష్టపోయారు. చాలా జిల్లాల్లో పంటలు నీటిలోనే ఉండటం వల్ల అధికారులు పంటలను పరిశీలించి నష్టాన్ని అంచనా వేసేందుకు సరైన అవకాశాలు లేకపోవడంతో కలెక్టర్‌ల ఆదేశాల మేరకు డిసెంబరు 9నుంచి సమగ్ర సర్వే నిర్వహించి పంట పొలాల్లోని నీటిని బయటకు పంపించి పంటనష్టం అంచనాలు రూపొందించాలని అధికారులను ఆదేశించారు. శ్రీకాకుళం, అల్లూరి సీతారామరాజు పార్వతీపురం జిల్లాలో 9వ తేదీ నుంచి ఎన్యుమరేషన్ చేపడతారు. నీరు చేరని పంట పొలాల్లో పర్యటించి 9లోపు నష్టపరిహారం వివరాలు అందించాలని అధికారులను కలెక్టర్‌లు ఆదేశించారు.
పంట పొలాల్లో నీటిని బయటకు పంపేందుకు చర్యలు
ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు కలెక్టర్‌లు అధికారులతో ప్రత్యేకంగా మాట్లాడి ఆయిల్ ఇంజన్ల ద్వారా ఎక్కడికక్కడ పంట పొలాల్లోని వరద నీటిని బయకు పంపించేందుకు ఏర్పాట్లు చేశారు.
తడిసి రంగుమారిన ధాన్యాన్ని కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నది. వరదల వల్ల పంటలకు ఫంగస్ బూజు తెగుళ్లు, పురుగులు ఎక్కువగా ఆశించే అవకాశం ఉంది. పూర్తిగా దెబ్బతిన్న పంటలను రాష్ట్రంలోని వ్యవసాయ విశ్వ విద్యాలయాల వారు కొనుగోలు చేస్తే బాగుంటుందనే అభిప్రాయాన్ని ప్రభుత్వం వ్యక్తం చేసింది. వర్షాలు పూర్తిగా తగ్గిన తరువాత వ్యవసాయ, ఉద్యానవన, రెవెన్యూ అధికారుల బృందాలు పంట నష్టాన్ని అంచనా వేసేందుకు చర్యలు తీసుకోవాలని ఇప్పటికే ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆదేశించారు.
గుంటూరు జిల్లాలో ప్రత్యేకించి 200 మిల్లీలీటర్ల వర్షం నమోదైనట్లు కలెక్టర్ ఎం వేణుగోపాల్ రెడ్డి తెలిపారు. వరుసగా రెండు రోజుల్లో 36 గంటల్లో ఇంత వర్షపాతం నమోదవడంతో వరి, మినుము, అరటి పంట పూర్తిగా పనికి రాకుండా పోయింది. ఎంత డబ్బు ఖర్చయినా పంట పొలాల్లోని నీటిని బయటకు పంపించేందుకు జిల్లా అధికారులు తగిన ఏర్పాట్లు చేస్తున్నారు.
నెల్లూరు జిల్లాలో 300 చేపల చెరువులు ధ్వంసం
నెల్లూరు జిల్లాలో 19 మండలాల్లోని గ్రామాలు తుపాన్ వల్ల పూర్తిగా దెబ్బతిన్నాయి. 144 పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసి సుమారు 8వేల మందికి పైగా బాధితులకు పునరావాసం కల్పించారు. తుపాన్ కారణంగా 300 వరకు చేపల చెరువులు దెబ్బతిన్నాయి. పంటలు పూర్తిగా దెబ్బతిన్న రైతులకు 80 శాతం సబ్సిడీతో విత్తనాలు రైతు భరోసా కేంద్రాల ద్వారా అందించేందుకు వ్యవసాయ శాఖ చర్యలు తీసుకున్నట్లు వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్థన్‌రెడ్డి వెల్లడించారు. విద్యుత్‌కు సంబంధించి దెబ్బతిన్న 27 విద్యుత్ సబ్‌స్టేషన్‌లను ప్రభుత్వం పునరుద్దరించ గలిగింది. మైనంపాడు సబ్ స్టేషన్‌ను ఇంకా రిపేరు చేయలేదు. విద్యుత్ సబ్ స్టేషన్ కింద గ్రామాలన్నీ అంధకారంలో ఉన్నాయి.
అల్లూరి సీతారామరాజు జిల్లాలో గురువారం కూడా విద్యా సంస్థలకు సెలవు ప్రకటించినట్లు కలెక్టర్ సుమిత్ కుమార్ తెలిపారు. మరో రెండు రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ఈ చర్యలు తీసుకున్నారు. జిల్లాలో వరి పంట సుమారు 600 హెక్టార్లలో వరద పాలైంది. పత్తి 250 హెక్టార్లు, మిర్చి 50ఎకరాల్లో పూర్తి స్థాయిలో నీట మునిగింది. ఈనెల 9 నుంచి ఎన్యుమరేషన్ చేపట్టాలని సీఎం టెలీకాన్ఫరెన్స్‌లో ఆదేశించారు.
పార్వతీపురం మన్యం జిల్లాలో 134 హెక్టార్లలో వరి పంటకు రూ. 1.50లక్షల విలువైన నష్టం, జంతునష్టం 1.29 లక్షలు ఉంటుంది.