ఢిల్లీలో తొలిసారి ‘‘విజయ్ దివస్’’
1971లో విజయాన్ని పురస్కరించుకుని బీఎస్‌ఎఫ్ తొలిసారి ఢిల్లీలో ‘‘విజయ్ దివస్ పరేడ్’’ నిర్వహించింది. ఈ కార్యక్రమంలో అమర వీరులకు సైనికులు నివాళి అర్పించారు.;
బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (బీఎస్‌ఎఫ్) ఢిల్లీలో తొలిసారిగా ‘‘విజయ్ దివస్ పరేడ్ (Vijay Diwas parade)’’ నిర్వహించింది.1971 - బంగ్లాదేశ్ విముక్తి యుద్ధంలో పాకిస్తాన్‌పై భారత సాయుధ దళాల చారిత్రాత్మక విజయ స్మారకార్థం ఈ కార్యక్రమాన్ని చేపట్టారు.
నైరుతి ఢిల్లీలోని సరిహద్దు రక్షక దళానికి చెందిన చావ్లా శిబిరం వద్ద నిర్వహించిన ఈ పరేడ్‌లో బీఎస్‌ఎఫ్ (Border Security Force) డైరెక్టర్ జనరల్ నితిన్ అగర్వాల్ గౌరవ వందనం స్వీకరించి అమరవీరుల స్మారక స్థూపం వద్ద నివాళి అర్పించారు. 1971 యుద్ధంలో తమ ప్రాణాలను అర్పించిన సిబ్బందికి నివాళి అర్పించేందుకు ఆయా బెటాలియన్లు, యూనిట్లు వారి పరిధిలో కార్యక్రమాలను నిర్వహించాయని సీనియర్ అధికారి ఒకరు పీటీఐకి తెలిపారు. యుద్ధం ఫలితంగా డిసెంబరు 16, 1971న 90 వేల మంది పాకిస్తానీ సైనికులు లొంగిపోయిన తర్వాత బంగ్లాదేశ్ స్వతంత్ర దేశంగా ఆవిర్భవించింది. అప్పటి నుంచి భారతదేశం డిసెంబర్ 16ను విజయ్ దివస్‌గా జరుపుకుంటుంది.
యుద్ధంలో బీఎస్‌ఎఫ్ కీలక పాత్ర..
2021లో యుద్ధం 50వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని.. ‘‘బంగ్లాదేశ్(Bangladesh) విముక్తిలో బీఎస్‌ఎఫ్ (BSF) కీలక పాత్ర పోషించింది’’ అని విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ అన్నారు. 1971లో చరిత్ర సృష్టించిన జవాన్లకు దేశం సెల్యూట్ చేస్తుందన్నారు.మార్చి 1971లో బంగ్లాదేశీయులపై పాకిస్థానీ బలగాలు ప్రారంభించిన మారణహోమాన్ని మనం ఎవ్వరూ ఎప్పటికీ మరచిపోలేమని మంత్రి తన ఉపన్యాసంలో చెప్పారు.
దేశ తూర్పు, పశ్చిమ సరిహద్దులలో బీఎస్‌ఎఫ్ బెటాలియన్లు ప్రదర్శించిన అసాధారణమైన ధైర్యసాహసాలు దేశానికి సత్ఫలితానిచ్చింది.
2013లో లోక్‌సభ మాజీ స్పీకర్ మీరా కుమార్ డిసెంబర్ 1వ తేదీన జరిగిన బీఎస్‌ఎఫ్ ఆవిర్భావ దినోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆ సందర్భంలో ఆమె ఇలా అన్నారు. ‘‘1971లో బంగ్లాదేశ్ విముక్తి యుద్ధం జరిగినప్పుడు మా నాన్న రక్షణ మంత్రిగా ఉన్నారు. యుద్ధంలో సైన్యం సహకారం ఉంటే, అందులో బీఎస్‌ఎఫ్ పాత్ర తక్కువేమీ కాదు’. అని చెప్పేవారు. జవాన్ల ధైర్యసాహసాలను నాన్న గారు ఎంతో మెచ్చుకునేవారు’’ అని తెలిపారు.
అధికారిక రికార్డుల ప్రకారం.. మొత్తం 125 మంది బీఎస్‌ఎఫ్ సిబ్బంది మరణించారు. 392 మంది గాయపడ్డారు. 133 మంది యుద్ధం తర్వాత తప్పిపోయినట్లు పేర్కొన్నారు.
సుమారు 2.65 లక్షల మంది సిబ్బందిని కలిగి ఉన్న బీఎస్‌ఎఫ్ 1965లో ఏర్పడిరది. తూర్పున బంగ్లాదేశ్, పశ్చిమాన పాకిస్తాన్ నుంచి దేశాన్ని నిత్యం కాపాడుతున్నారు బీఎస్‌ఎఫ్ సైనికులు.