ఎఫ్- 16 ను కూల్చివేశాం: ఐఏఎఫ్ చీఫ్

ఆపరేషన్ సిందూర్ తరువాత జరిగిన సైనిక ఘర్షణలో ఐదు యుద్ద విమానాలు, ఓ భారీ సైనిక రవాణా కూల్చినట్లు ప్రకటన;

Update: 2025-08-09 13:12 GMT
ఎయిర్ చీఫ్ మార్షల్ ఏ. పీ. సింగ్

ఆపరేషన్ సిందూర్ సమయంలో భారత వైమానిక దళం(ఐఏఎఫ్) పాకిస్తాన్ కు చెందిన ఐదు యుద్ధ విమానాలను కూల్చివేసినట్లు వైమానిక దళ అధిపతి, ఎయిర్ చీఫ్ మార్షల్ ఏపీ సింగ్ తెలిపారు.

అంతేకాకుండా ఓ భారీ మిలిటరీ ఎయిర్ క్రాఫ్ట్ కూడా కూల్చివేసినట్లు ప్రకటించారు. బెంగళూర్ లో హెచ్ఏఎల్ మేనేజ్ మెంట్ అకాడమీ లో జరిగిన ఒక కార్యక్రమంలో ఆయన పాల్గొని అనంతరం ప్రసంగించారు.

ఈ సందర్భంగా ఆపరేషన్ సిందూర్ తరువాత జరిగిన సైనిక ఘర్షణకు సంబంధించి కీలక సమాచారం వెల్లడించారు. అందులో భారత వైమానిక దళం పాక్ లోని కీలక స్థావరాలపై దాడి చేసినట్లు, అందులో ఎఫ్- 16 యుద్ధ విమానాలు ఉన్నట్లు చెప్పారు.

‘‘ ఆ ఏఈడబ్ల్యూసీ హ్యాంగర్ లో కొన్ని ఎఫ్-16 విమానాలు ఉన్నట్లు మాకు తెలిసింది. అవి అక్కడ నిర్వహణలో ఉన్నాయి. తరువాత జరిగిన దాడిలో ఇవి నాశనం అయ్యాయి. దాదాపు 300 కిలోమీటర్ల దూరం నుంచి దాడి చేశాము. ఇవి వాస్తవానికి ఇప్పటి వరకూ నమోదైన అతిపెద్ద సర్పేస్ టూ ఎయిర్ కిల్’’ అని సింగ్ చెప్పినట్లు ఏఎన్ఐ వార్తా కథనాలు ప్రసారం చేసింది.

‘‘షాబాజ్ జకోబాద్ ఎయిర్ ఫీల్డ్ దాడికి గురైన ప్రధాన ఎయిర్ ఫీల్డ్ లలో ఒకటి. ఇక్కడ ఎఫ్ -16 హ్యంగర్ ఉంది. హ్యంగర్ లో సగం నాశనం అయింది. లోపల కొన్ని విమానాలు దెబ్బతిన్నాయని నేను కచ్చితంగా అనుకుంటున్నాను.
మురిడే, చక్లాలా వంటి కనీసం రెండు కమాండ్, కంట్రోల్ సెంటర్ లను మేము నాశనం చేశాం. ఇందులో కనీసం ఆరు రాడార్లు, వాటిలో కొన్ని పెద్దవి, వాటిలో కొన్ని చిన్నవి. అన్ని నాశనం చేశాం’’ అని చెప్పారు.
ఎస్- 400 గేమ్ ఛేంజర్..
ఇటీవల రష్యా నుంచి కొనుగోలు చేసిన రష్యా నిర్మిత ఎస్-400 వైమానిక రక్షణ వ్యవస్థ వలన పాకిస్తాన్ వైమానిక దళం తమ దీర్ఘ శ్రేణి గ్లైడ్ బాంబులను భారత్ మీదకు ప్రయోగించలేకపోయిందని ఐఏఎఫ్ చీఫ్ అన్నారు.
‘‘మా వైమానిక రక్షణ వ్యవస్థలు అద్భుతంగా పనిచేస్తున్నాయి. మేము ఇటీవల కొనుగోలు చేసిన ఎస్- 400 వ్యవస్థ గేమ్ ఛేంజర్ గా నిలిచింది. ఆ వ్యవస్థ పరిధి నిజంగా వారి విమానాలను వారి ఆయుధాల మా నుంచి దూరంగా నిలబెట్టింది. వారి వద్ద ఉన్న దీర్ఘశ్రేణి గ్లైడ్ బాంబులను వేటీని ఉపయోగించలేకపోయారు. ఎందుకంటే వారు వ్యవస్థ దాటి ముందుకు రాలేకపోయారు’’ అని సింగ్ అన్నారు.
అరుదుగా నష్టం..
ఆపరేషన్ సిందూర్ సందర్భంగా మురిడ్కే లోని ఎల్ఈటీ ప్రధాన కార్యాలయంపై జరిగిన దాడికి ముందు, తరువాత చిత్రాలను చూపిస్తూ మాట్లాడారు. ‘‘ఇది వారి సీనియర్ నాయకత్వం నివాస ప్రాంతం.
ఇవి వారి కార్యాలయ భవనం, ఇక్కడ వారు సమావేశాలు నిర్వహిస్తారు. ఆ ప్రదేశం పరిధిలోనే ఉన్నందున మేము ఆయుధాల ప్రయోగం తరువాత వీడియోలు తీయగలిగాము’’ అని సింగ్ అన్నారు.
భారీ నష్టంతోనే పాక్ ముందుకు..
ఈ ఘర్షణలో పాకిస్తాన్ చాలా నష్టాన్ని చవిచూసిందని భారత డీజీఎంఓను సంప్రదించడం తప్ప వేరే మార్గం లేదని సింగ్ అన్నారు. చర్చలు జరపాలని పాక్ అభ్యర్థించిందని, పాకిస్తాన్ సైన్యం ఇంకా దుందుకుడుతనంగా వ్యవహరిస్తే మరింత నష్టం వాటిలే ప్రమాదం ఉందని గ్రహించారని ఆయన అన్నారు.
‘‘ఇది ఒక హైటెక్ యుద్ధం. 80 నుంచి 90 గంటల్లో మేము శత్రువుకు భారీ నష్టం చేశాము. వారు ఇలాగే కొనసాగితే, ఇంకా ఎక్కువ మూల్యం చెల్లించాల్సి వస్తుందని వారికి స్పష్టంగా అర్థమైంది.
కాబట్టి వారు ముందుకు వచ్చి మా డీజీఎంఓతో మాట్లాడాలనుకుంటున్నట్లు సందేశం పంపారు. దీనిని మా వైపు నుంచి అంగీకరించాము’’ అని సింగ్ అన్నారు.
‘‘మేము ఎయిర్ ఫోర్స్ లోనే పెరిగాము. ఇలాంటి రోజు గురించి కలలు కన్నాము. ఇది ఇప్పటికి నెరవేరింది. సర్గోదాను కూడా చేరుకున్నాం’’ అని సింగ్ వివరించారు. అయితే అణ్వస్త్రాలు కలిగిని కైరానా హిల్స్ పై దాడి జరిగిందా లేదా అనేది మాత్రం ఎయిర్ ఫోర్స్ ఎక్కడా వెల్లడించలేదు.
Tags:    

Similar News