మంత్ర తంత్రాల మధ్య ఆంధ్రా ఎన్నికల ఎత్తులు, పొత్తులు !

చంద్రబాబు నాయుడు మూడు రోజుల చండీయాగం, క్రతువులు ముగిశాయి. ఇక వైఎస్‌ జగన్మోహనరెడ్డి ఏ యాగాలు చేస్తారో, ఏ పీఠాధిపతిని సందర్శిస్తారో చూడాలి.

Update: 2023-12-26 11:20 GMT


మన్నెం కోటేశ్వరరావు

వర్తమాన ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాల్లో 2024 ఎన్నికల పూర్వరంగంలో ఒక మానసిక తంత్ర క్రీడ(మైండ్‌గేమ్‌) ప్రారంభమైంది.రాష్ట్ర బాగు కోసమంటూ నారా చంద్రబాబు నాయుడు మూడు రోజుల పాటు నిర్వహించిన చండీయాగం,హౌమాలు ముగిశాయి. రానున్న రోజుల్లో వైఎస్‌ జగన్మోహనరెడ్డి ఏ యాగాలు చేస్తారో, ఏ పీఠాధిపతిని సందర్శిస్తారో చూడాలి.

రాష్ట్రంలో వర్తమాన, భవిష్యత్‌ పరిణామాల గురించి జనంలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. తెలంగాణాలో జరిగిన ఎన్నికల ప్రభావం అన్ని పార్టీల మీదా పడింది. అధికార ప్రతిపక్షాలు రెండూ గుణపాఠాలు తీసుకొని ఎత్తుగడలను రూపొందించేందుకు పూనుకున్నాయి. బిజెపి తమతో కలవాలని అంటున్న తెలుగుదేశం-జనసేన కూటమి దానితో నిమిత్తం లేకుండానే సీట్ల సర్దుబాటు, సంయుక్తంగా సభల నిర్వహణ తదితర అంశాల గురించి కసరత్తు ప్రారంభించింది.

ఎన్నికల సంబంధిత అంశాలపై సలహాలు ఇచ్చే, సర్వేలు నిర్వహించే సంస్థను ఏర్పాటు చేసి ప్రస్తుతం వాటితో సంబంధం లేదని గతంలో ప్రకటించిన ప్రశాంత కిషోర్‌ తెలుగుదేశం నేత నారా చంద్రబాబు నాయుడితో భేటీ కావటం చర్చనీయాంశమైంది.

మరోవైపు జనంలో, సొంత పార్టీ కార్యకర్తల నుంచి వ్యతిరేకతను ఎదుర్కొంటున్నట్లు భావిస్తున్న మంత్రులు, ఎంపీలు, ఎంఎల్‌ఏలలో కొందరికి ఉద్వానస పలికేందుకు సామాజిక సమీకరణాల పేరుతో కొందరి నియోజకవర్గాల మార్పు,ఎంపీలుగా ఉన్నవారిని ఎంఎల్‌ఏలుగా, ఎంఎల్‌ఏలను ఎంపీలుగా పోటీ చేయించేందుకు కసరత్తు ప్రారంభించారు. అభ్యర్థులు అనకపోయినా నియోజకవర్గ బాధ్యుల పేరుతో చేసిన మార్పులు వారితో అక్కడ పోటీ చేయించేందుకే అన్న చర్చ సర్వత్రా జరుగుతోంది.

ఇలాంటి మార్పులు చేర్పులు 90కిపైగా నియోజకవర్గాలలో జరుగుతాయని తెలుగుదేశం నేతలు చెబుతున్నప్పటికీ 50 చోట్ల ఉండవచ్చని పేరు ప్రచురించటానికి ఇష్టపడని రాష్ట్ర వైసిపి నేత ఒకరు చెప్పారు. ముఫ్పై మందికి ఉద్వాసన ఉంటుందని, ఇరవై మందిని అటూ ఇటూ మార్చవచ్చన్నారు.

టీ కప్పులో తుపాను !

తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ యువగళం పాదయాత్ర ముగింపు సందర్భంగా విజయనగరం జిల్లా పోలిపల్లిలో తెలుగుదేశం పార్టీ భారీ బహిరంగసభను ఏర్పాటు చేసింది.ఈ సభకు హాజరు కావాలని జనసేన నేత పవన్‌ కల్యాణ్‌కు ఆహ్వానం పలుకగా తిరస్కరించినట్లు వార్తలు వచ్చాయి. దాంతో తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడే స్వయంగా హైదరాబాదులోని పవన్‌ కల్యాణ్‌ ఇంటికి వెళ్లి ఆహ్వానించటంతో అంగీకరించినట్లు చెబుతున్నారు.

ఈ వార్తలకు సంబంధించి సామాజిక మాధ్యమాల్లో, మీడియాలో ఊహాగానాలే తప్ప ఎవరూ అధికారికంగా ఎలాంటి ప్రకటనా చేయలేదు. చివరికి పవన్‌ కల్యాణ్‌ ఆ సభకు వెళ్లటంతో ఈ అంశం టీకప్పులో తుపానులా ముగిసింది.ఈ సభ బ్రహ్మాండంగా విజయవంతమైందని తెలుగుదేశం చెబితే, ఘోరంగా విఫలమైందని వైసిపి వర్ణించింది.

ఎన్నికల గోదాలో దిగిన పార్టీలు !

ఇంకా ఎన్నికల ప్రకటన జరగకపోయినా ఒక విధంగా అధికార వైసిపి, ప్రతిపక్ష తెలుగుదేశం-జనసేన కూటమి ఎన్నికల గోదాలోకి దిగాయి. రెండు ప్రధాన జాతీయ పార్టీలైన బిజెపి, కాంగ్రెస్‌ రెండూ నామమాత్రంగా మారటం విశేషం. అవి 2019 అసెంబ్లీ ఎన్నికలలో నోటా కంటే తక్కువ ఓట్లు తెచ్చుకున్నాయి. గతంలో వైసిపిలో చేరేందుకు ఆసక్తి చూపిన వాసగిరి వెంకట ( జెడి) లక్మీనారాయణ దానికి భిన్నంగా జై భారత్‌ నేషనల్‌ పార్టీ పేరుతో సొంత దుకాణం తెరిచారు. అన్ని నియోజకవర్గాలలో పోటీ చేస్తున్నట్లు ప్రకటించారు.

వైఎస్‌ జగన్‌ మీద నమోదైన కేసులను విచారించిన అధికారిని పార్టీలో ఎలా చేర్చుకుంటారనే ప్రశ్నకు సమాధానం చెప్పలేక వైసిపి తిరస్కరించి ఉండవచ్చన్నది ఒక అభిప్రాయమైతే, ఆయనతో ఒక పార్టీని పెట్టించి ప్రభుత్వ వ్యతిరేక కాపు ఓట్లను చీల్చేందుకు చూస్తున్నట్లు మరొక ప్రచారం జరుగుతోంది. దేన్నీ కొట్టివేయలేము.ప్రధాన పార్టీలలో అవకాశం రాని వారు అనేక మంది తమ బలాన్ని పరీక్షించుకొనేందుకు, ప్రచారం కోసం ఇలాంటి కొత్త పార్టీల తరఫున పోటీ చేశారు.

పవన్‌ కల్యాణ్‌కు రోడ్‌ మాప్‌ పంపని బిజెపి !

బిజెపి తమకు రోడ్‌ మాప్‌ ఇవ్వాలని జనసేన నేత పవన్‌ కల్యాణ్‌ బహిరంగంగానే పార్టీ ఆవిర్భావ సభలో కోరిన సంగతి తెలిసిందే.నిజానికి పెద్ద పార్టీగా ఉన్న జనసేన మిత్రపక్షమైన బిజెపికి రోడ్‌ మాప్‌ ఇవ్వాలి. రెండు పార్టీలు కలసి ఎన్నికల్లో పోటీ చేయాలని 2020లోనే నిర్ణయించుకొని ఒప్పందం కూడా చేసుకున్నందున వారిద్దరూ కూర్చుని రోడ్‌ మాప్‌ను తయారు చేసుకోవాలి. అలాంటిదేమీ జరగలేదు.

స్కిల్‌డెవలప్‌మెంట్‌ కేసులో చంద్రబాబు అరెస్టయి రిమాండ్‌ జైల్లో ఉన్నపుడు తెలుగుదేశం పార్టీతో సీట్లు సర్దుబాటు చేసుకోవాలని పవన్‌ కల్యాణ్‌ ప్రకటించారు. మిత్రపక్షంగా ఉన్న బిజెపితో ఎలాంటి సంప్రదింపులు లేకుండానే ఇది జరిగింది. జనసేనతో తామింకా భాగస్వామ్య పక్షంగా ఉన్నామని చెబుతూనే ఈ పరిణామం గురించి బిజెపి ఇప్పటి వరకు మౌనంగా ఉంది. జనసేన పార్టీ ఎన్‌డిఏలో చేరింది. తెలంగాణా ఎన్నికల్లో బిజెపితో సీట్లు సర్దుబాటు చేసుకొని ఎనిమిది చోట్ల పోటీ చేసి డిపాజిట్లు పొగొట్టుకుంది. చివరి క్షణంలో తెలుగుదేశం-జనసేన కూటమితో చివరి క్షణంలో చేరవచ్చనే ఒక అభిప్రాయం కూడా ఉంది. అదే జరిగితే వచ్చే లాభనష్టాలు ఏమిటన్నది తెలుగుదేశంలో చర్చ జరుగుతోంది.

పక్కనే ఉన్న కర్ణాటకలో బిజెపి అధికారాన్ని పోగొట్టుకుంది. తెలంగాణాలో తమదే అధికారం అన్నట్లుగా ప్రచారం చేసుకున్నప్పటికీ అక్కడ దరిదాపుల్లో లేదు. దాని సిఎం అభ్యర్ధులుగా ప్రచారం జరిగిన ఈటెల రాజేందర్‌,బండి సంజరు ఇద్దరూ ఓడిపోయారు.గత అసెంబ్లీ ఎన్నికలతో పోల్చితే బిజెపి బలం 6.98 నుంచి 13.9శాతానికి పెరిగినా తెలంగాణాలో 2019లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో వచ్చిన 19.65 శాతం ఓట్లతో పోల్చుకుంటే 5.75శాతం తగ్గాయి.

బిజెపిని కలుపుకుంటే లాభమా ! నష్టమా !!

ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం-జనసేన కూటమిలో బిజెపి కలిస్తే కలిగే లాభం కంటే జరిగే నష్టమే ఎక్కువ అనే అభిప్రాయాలు వెలువడుతున్నాయి. గత ఎన్నికల్లో వివిధ పార్టీల ఓట్ల శాతాలు ఇలా ఉన్నాయి. వైసిపి 49.96 , తెలుగుదేశం 39.17, మూడవ కూటమిగా పోటీసిన పార్టీలలో జనసేన(137) 5.53,సిపిఎం(7)0.32, బిఎస్‌పి(21)0.28, సిపిఐ(7)0.11 శాతాలు తెచ్చుకున్నాయి. నోటాకు 1.28 ,కాంగ్రెస్‌కు 1.17, బిజెపికి 0.84 శాతం వచ్చాయి.

బిజెపితో ఎలాంటి సంబంధాలు లేని 2014 అసెంబ్లీ ఎన్నికల్లో వైసిపి ముస్లిం మైనారిటీల్లో 66శాతం ఓట్లు పొందగా, 2019 ఎన్నికలకు ముందు బిజెపితో సంబంధాల కారణంగా అది 49శాతానికి తగ్గినట్లు, తెలుగుదేశం పార్టీ బిజెపితో పొత్తు పెట్టుకున్నపుడు వారి మద్దతు తగ్గిందని లేనపుడు పెరిగిందని '' పీపుల్స్‌ పల్స్‌ '' పరిశోధకుడు ఐవి.మురళీ కృష్ణ శర్మ తన విశ్లేషణలో పేర్కొన్నారు. ఇప్పుడు కూడా అదే జరుగుతుందేమోనని తెలుగుదేశంలో కొందరు భయపడుతున్నారు.

వైసిపి నవరత్నాలతో గ్రామీణ ప్రాంతాలలో గతం కంటే కొంత మద్దతు పెంచుకున్నట్లు చెబుతున్నా పట్టణాల్లో మద్దతు తగ్గిందని, మొత్తంగా మధ్యతరగతి ఉద్యోగులు, టీచర్లు, ఇతర స్కీముల సిబ్బంది, కార్మికులలో మద్దతు కోల్పోయినట్లు, ఆ మేరకు తెలుగుదేశం, జనసేన బలపడినట్లు ఒక అంచనా.ఈ పూర్వరంగంలో ప్రతి ఓటునూ అధికార, ప్రతిపక్ష పార్టీలు పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంది. కేవలం 4,81,868 లేదా 2.05శాతం ఓట్ల తేడాతో బిఆర్‌ఎస్‌ పార్టీ తెలంగాణాలో అధికారం కోల్పోయిన సంగతి తెలిసిందే.పైకి ఏమి చెప్పినప్పటికీ ఈ కారణంగానే ఆంధ్రప్రదేశ్‌లో ప్రధాన పార్టీలు జాగ్రత్తలు పడుతున్నాయి. తెలుగుదేశం- జనసేన కూటమితో బిజెపి సంబంధాలు, రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ పరిణామాల గురించి సిపిఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి వంకాయలపాటి శ్రీనివాసరావు స్పందించిన తీరు ఇలా ఉంది.

వామపక్షాల వైఖరేంటి !

'' బిజెపితో ప్రత్యక్ష, పరోక్ష సంబంధాలు పెట్టుకున్నపార్టీలతో ఎన్నికల్లో ఎలాంటి సర్దుబాట్లకు మేము సిద్దం కాదు. తెలుగుదేశం-జనసేన కూటమి బిజెపితో సంబంధాల గురించి స్పష్టత ఇచ్చినపుడు, రాజకీయంగా దానికి వ్యతిరేక వైఖరి తీసుకుంటే పరిస్థితిని బట్టి ఒక నిర్ణయం తీసుకుంటాం.లేనట్లయితే ఇండియా కూటమిలోని పార్టీలతో కలసి లేదా అవసరమైతే ఒంటరిగానే పోటీ చేస్తాం. జెడి లక్ష్మీనారాయణ ప్రారంభించిన పార్టీ వివిధ అంశాలపై తీసుకొనే వైఖరి ఏమిటో ఇంకా స్పష్టం కానందున దాని గురించి ఇప్పుడేమీ చెప్పలేం. మేము ఒంటరిగా పోటీ చేయాల్సి వస్తే ఎవరికి మద్దతు ఇచ్చేదీ ఎన్నికలకు ముందు వెల్లడిస్తాం.''

సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె. రామకృష్ణ ఇలా చెప్పారు.'' బిజెపితో సంబంధాలు పెట్టుకోవద్దని అనేక ఉద్యమాలలో కలసి పని చేస్తున్న తెలుగుదేశం పార్టీతో చెబుతున్నాం. ఒక వేళ పెట్టుకుంటే ఆ కూటమితో ఎలాంటి సంబంధాలు ఉండవు. ఎన్‌డిఏ కూటమిలోని జనసేన బిజెపితో సంబంధం లేకుండా తెలుగుదేశంతో సర్దుబాటు చేసుకుంటే తెలుగుదేశంతో సర్దుబాటుకు అవకాశం ఉంటుంది. జనసేనను లౌకిక పార్టీగానే పరిగణిస్తున్నాం.జెడి లక్ష్మీనారాయణ పార్టీని వ్యతిరేకించాల్సిన అవసరం లేదు. ఎలాంటి విధానాలను అనుసరిస్తుందో వేచి చూస్తాం ''

ప్రశాంత్ కిషోర్‌ కలయిక్‌ మైండ్‌ గేమ్‌లో భాగమా !

ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత కిషోర్‌ హైదరాబాదు నుంచి ప్రత్యేక విమానంలో తెలుగుదేశం ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌తో కలసి వచ్చి చంద్రబాబు నాయుడిని కలుసుకొని చర్చలు జరిపారు. మర్యాదపూర్వకంగా కలిసి వెళ్లేందుకు వచ్చానని మాత్రమే ముక్తసరిగా ఆయన చెప్పారు. దాన్ని ఎవరూ విశ్వసించటం లేదు. ప్రశాంత కిషోర్‌ గెలిచే పార్టీలకే సలహాలు చెబుతారనే ఒక అభిప్రాయం ఉంది.(బిఆర్‌ఎస్‌ నేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఎన్నికలకు ముందు ప్రశాంత కిషోర్‌తో చర్చలు జరిపినప్పటికీ ఆ పార్టీ ఓడిపోయింది. కొందరు మంత్రులు, ఎంఎల్‌ఏలను పక్కన పెట్టాలన్న సలహాను కెసిఆర్‌ విస్మరించినందునే అలా జరిగిందని చెప్పేవారు లేకపోలేదు.)

ఎన్నికలకు ఇంకా వంద రోజులు కూడా లేని స్థితిలో చంద్రబాబుతో ప్రశాంత కిషోర్‌ భేటీ ఒక మైండ్‌ గేమ్‌లో భాగమని, దాని వలన తెలుగుదేశం కూటమికి కలసి వచ్చేదేమీ లేదని వైసిపి రాష్ట్ర సంయుక్తకార్యదర్శి కారుమూరి వెంకట రెడ్డి వ్యాఖ్యానించారు. ప్రశాంత కిషోర్‌ ప్రస్తుతం అలాంటి సలహాలు ఇవ్వటం లేదని, అతనికి ఎలాంటి బృందాలు కూడా లేవని అన్నారు.జెడి లక్ష్మీనారాయణ పార్టీ వెనుక తమ పార్టీ హస్తం వుందనటం వాస్తవం కాదన్నారు.

(ఎం కోటేశ్వరరావు సీనియర్ జర్నలిస్టు, రాజకీయ విశ్లేషకుడు, హైదరాబాద్)

Tags:    

Similar News