రైతు ఆత్మహత్య అంటే బురద జల్లుకునే రాజకీయ అవకాశమా?

సమాజంలో చర్చకు దారి తీయాలి, ప్రభుత్వంలో కదలిక తేవాలి;

Update: 2025-02-01 10:37 GMT

సమాజంలో ప్రజలందరి కోసం ఆహారం పండించే రైతు ఆత్మహత్య చేసుకోవడం నిజానికి మీడియా లో సాధారణ వార్త గా మిగిలిపోకూడదు. రైతు ఆత్మహత్యల సంఖ్య అధికార , ప్రతిపక్ష పార్టీల మధ్య బురద జల్లుకునే అంశంగా కూడా మారిపోకూడదు. వందల్లో కాదు, ఒక్క రైతు ఆత్మహత్య జరిగినా , అది ప్రభుత్వంలో కదలిక తేవాలి. సమాజంలో చర్చకు దారి తీయాలి.

ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ లో వ్యవసాయ కుటుంబాల సంక్షోభం, రైతు ఆత్మహత్యలపై అధ్యయనానికి వేసిన ప్రొఫెసర్ జయతీ ఘోష్ కమిషన్, జస్టిస్ రామ చిన్నారెడ్డి కమిషన్, జాతీయ స్థాయిలో UPA ప్రభుత్వం నియమించిన ఎం. ఎస్. స్వామినాథన్ కమిషన్ చేసిన అనేక విలువైన సూచనలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేసిన పాపాన పోలేదు. వ్యవసాయ రంగ అభివృద్ధికి, రైతుల సంక్షేమానికి ఉపయోగపడే అనేక చట్టాలు ఉనికిలో ఉన్నా, వాటిని చిత్తశుద్ధితో అమలు చేయడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పూనుకోలేదు. ఈ కారణాల వల్ల కూడా రైతుల, వ్యవసాయ కూలీల ఆత్మహత్యలు కొనసాగుతూనే ఉన్నాయి.

గత మూడు దశాబ్ధాలుగా, రైతు ఆత్మహత్యలకు లోతైన కారణాలను అధ్యయనం చేసి, సరైన పరిష్కారాలను ప్రభుత్వాల ముందు రైతు సంఘాలు డిమాండ్ల రూపంలో ఉంచుతున్నా,ఆందోళనలు సాగిస్తున్నా, ప్రభుత్వాలు వాటిని పట్టించుకుని, చర్చించి, ఆత్మహత్యల నివారణ చర్యలు తీసుకోవడానికి పూనుకోవడం లేదు. రైతు ఆత్మహత్య బాధిత కుటుంబాలను ఆదుకోవడానికి ఉన్న జీవోలను అమలు చేయడం లేదు.

రైతు ఆత్మహత్యలపై మిగిలిన సమాజం కూడా కేవలం దానిని వార్తగా చదివి, విని పక్కకు పెట్టే పరిస్థితిలో ఉంది. ప్రింట్ మరియు ఎలక్ట్రానిక్ మీడియాలో కూడా ప్రస్తుతం రైతు ఆత్మహత్య వార్త ప్రాధాన్యతను కోల్పోయింది.

తెలంగాణ రాష్ట్రం కూడా ఈ విషయంలో ఇదే ఒరవడి కొనసాగిస్తున్నది. 1995లో ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ లో ప్రారంభమైన రైతు ఆత్మహత్యలు, 2014 లో తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడి 11 ఏళ్లు గడుస్తున్నా ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. సంవత్సరాలు గడుస్తున్న కొద్దీ రైతు ఆత్మహత్యల సంఖ్యలో తేడాలు ఉండవచ్చు కానీ, ఆత్మహత్యలు మాత్రం ఆగడం లేదు. ఇంకా ఇప్పటికీ ప్రతి సంవత్సరం వందల్లోనే రైతులు, కౌలు రైతులు, వ్యవసాయ కూలీలు, మహిళా రైతులు బలవన్మరణాలకు పాల్పడుతూనే ఉన్నారు. గత దశాబ్ధ కాలంలో రైతు ఆత్మహత్యలకు కారణాలు మారాయి కానీ, వ్యవసాయ కుటుంబాల సంక్షోభానికి మూల కారణాలు మాత్రం అలాగే ఉన్నాయి. మూల కారణాలను పరిష్కరించడానికి ప్రభుత్వాలు సుముఖంగా లేకపోవడమే, రైతు ఆత్మహత్యలు కొనసాగడానికి ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు.

జాతీయ నేర నమోదు సంస్థ ( NCRB) గణాంకాల ప్రకారం 1995 నుండీ 2013 వరకూ తెలంగాణ రాష్ట్ర పరిధిలో కనీసం 15,000 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. ఇదే సంస్థ ప్రతి సంవత్సరం విడుదల చేసే నివేదికల ప్రకారం తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన 2014 లో 1347 మంది, 2015 లో 1400 మంది, 2016 లో 645 మంది 2017 లో 851 మంది, 2018 లో 908, 2019 లో 499, 2020 లో 471,2021 లో 303, 2022 లో 178 మంది రైతులు, వ్యవసాయ కూలీలు ఆత్మహత్య చేసుకున్నారు. 2023, 2024 సంవత్సరాల NCRB నివేదికలు ఇంకా వెలువడలేదు.

అయితే మొదటి నుండీ రైతు ఆత్మహత్యలపై కేంద్రీకరించి కృషి చేస్తున్న రైతు స్వరాజ్య వేదిక సేకరించిన మీడియా కథనాల ప్రకారం 2023 లో 271 మంది, 2024 లో 268 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. 2023 లో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం చేపట్టిన డిసెంబర్ 7 నుండీ 2025 జనవరి 31 వరకూ 281 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు (వీటి వివరాలు సంస్థ దగ్గర అందుబాటులో ఉన్నాయి).

2014 నుండీ 2024 వరకూ రైతు ఆత్మహత్యల గణాంకాలను పరిశీలిస్తే, తెలంగాణ రాష్ట్రంలో క్రమంగా ప్రతి సంవత్సరం రైతుల ఆత్మహత్యలు తగ్గుతున్నట్లు కనిపిస్తుంది.

తగ్గుతున్న క్రమాన్ని, అందుకు కారణాలను అర్థం చేసుకోవచ్చు కానీ, 2018 తరువాత రైతుల ఆత్మహత్యలు తగ్గుతున్నట్లు కనిపించడానికి మరో కారణం కూడా ఉంది. 2018 నుండీ తెలంగాణ రాష్ట్రంలో 18-59 సంవత్సరాల మధ్య వయస్సు వారిలో భూమిపై పట్టా హక్కులు కలిగిన రైతులు మరణించినప్పుడు, వారికి రైతు బీమా గా కుటుంబానికి 5 లక్షల రూపాయలు చెల్లిస్తున్నారు. ఈ కారణం చేత, చాలా మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నప్పుడు, వారి కుటుంబ సభ్యులు దానిని ఆత్మహత్యగా పోలీసులకు ఫిర్యాదు చేసి, ప్రత్యేకంగా FIR నమోదు చేయించడం లేదు.

గతంలో అలా రైతు ఆత్మహత్యగా నమోదు చేయించినప్పుడు, ప్రభుత్వం విచారణ చేసి, రైతు ఆత్మహత్యగా నిర్ధారించి, కుటుంబానికి జీవో 173,194 ల ప్రకారం 5 లక్షల రూపాయల ఎక్స్ గ్రేషియా చెల్లించేవారు. కాకపోతే, రైతు ఆత్మహత్య అని రుజువు చేయడానికి, బాధిత కుటుంబాల సభ్యులు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ కాళ్లరిగేలా తిరగాల్సి వచ్చేది. అప్పటికీ , గ్యారంటీగా ఎక్స్ గ్రేషియా వస్తుందన్న భరోసా ఉండేది కాదు. ఈ పరిస్థితుల్లో రైతు ఆత్మహత్య బాధిత కుటుంబాల సభ్యులు , ప్రత్యేకించి, ఎక్స్ గ్రేషియా కోసం ప్రయత్నాలు చేయడం మానేశారు. రైతు బీమా ద్వారా వచ్చిన 5 లక్షల రూపాయలతో సంతృప్తి చెందుతున్నారు. కాకపోతే ఈ కుటుంబాలు కూడా జీవో 173,194 ప్రకారం కుటుంబ అప్పులు తీర్చుకోవడానికి వన్ టైమ్ సెటిల్ మెంట్ క్రింద రావలసిన లక్ష రూపాయల సహాయాన్ని కోల్పోతున్నారు.

రైతు బీమా అమలు ప్రారంభమయ్యాక, జీవో ప్రకారం రైతు ఆత్మహత్యను నిర్ధారించాల్సిన డివిజన్ స్థాయి ముగ్గురు అధికారుల బృందం (ఆర్డీవో, ADA, DSP), ఆయా కుటుంబాల దగ్గరకు వెళ్లడమే మానేసింది. కాబట్టి 2018 నుండీ ఇప్పటి వరకూ రైతు ఆత్మహత్యలను అధికారికంగా గుర్తించి నివేదికలు ఇవ్వడం లేదు.

ఈ పరిణామంతో నష్ట పోయింది, స్వంత భూమి లేని కౌలు రైతులు, భూమిపై పట్టా హక్కులు లేని ఇతర గ్రామీణ కుటుంబాల వారు, ఆదివాసీ ప్రాంతాలలో పోడు రైతులు.

వీరు ఆత్మహత్య చేసుకుంటే, భూమిపై పట్టా హక్కు కలిగిన రైతులకు అందినట్లుగా రైతు బీమా అందడం లేదు. అదే సమయంలో రైతు ఆత్మహత్య బాధిత కుటుంబానికి రావలసిన ఎక్స్ గ్రేషియా కూడా రావడం లేదు. కుటుంబానికి స్వంత భూమి ఉన్నా, ఆ భూమి తమ పేరు మీద లేనప్పుడు, కుటుంబంలో అటువంటి వ్యక్తులు ఆత్మహత్య చేసుకుంటే రైతు బీమా కానీ, ఎక్స్ గ్రేషియా కానీ రావడం లేదు. గ్రామీణ వ్యవసాయంలో కీలక పాత్ర పోషిస్తున్న మహిళలు, ఆత్మహత్య చేసుకున్నప్పుడు కూడా భూమిపై పట్టా హక్కులు వారి పేరుతో లేనప్పుడు, వారికి రైతు బీమా కానీ, ఎక్స్ గ్రేషియా కానీ రావడం లేదు. వ్యవసాయ కూలీల పరిస్థితి కూడా ఇదే.

అంటే రైతు బీమా పథకం , తప్పకుండా భూమి పట్టా హక్కులు కలిగిన రైతులు సహజ మరణానికి గురైనా అందుతుంది కానీ, భూమి పై పట్టా హక్కులు లేని వారు ఆత్మహత్య చేసుకున్నా, వారికి ఎటువంటి పరిహారం అందడం లేదు. అందుకే గ్రామీణ ప్రాంత లేదా ఆదివాసీ ప్రాంత అనేక కుటుంబాలలో మగవారు, లేదా కుటుంబ పెద్దగా ఉన్న మహిళలు ఆత్మహత్య చేసుకున్నప్పుడు, ఆ కుటుంబాలు పూర్తిగా సంక్షోభంలో పడుతున్నాయి. ఆత్మహత్య చేసుకున్న వారు చేసి పోయిన అప్పులు తీర్చడానికి కూడా ఈ కుటుంబాలు ఇబ్బంది పడుతున్నాయి.

“కాంగ్రెస్ పార్టీ సంవత్సర పాలనలో 400 కు పైగా రైతు ఆత్మహత్యలు జరిగాయని BRS పార్టీ ప్రకటించింది. రైతు ఆత్మహత్యలపై మాజీ వ్యవసాయ శాఖ మంత్రి నిరంజనరెడ్డి నేతృత్వంలో పార్టీ అధ్యయన కమిటీ వేసింది. రైతు ఆత్మహత్య బాధిత కుటుంబాలకు 10 లక్షల రూపాయల ఎక్స్ గ్రేషియా చెల్లించాలని, మాజీ ఆర్ధిక మంత్రి హరీష్ రావు డిమాండ్ చేశారు”. ఇలాంటి వార్తలు చదివినప్పుడు, నవ్వాలో, ఏడవాలో , రాజకీయ పార్టీల హిపోక్రసీ చూసి అసహ్యించుకోవాలో అర్థం కాదు.

పదేళ్ళ BRS పాలనలో రైతు ఆత్మహత్యలను గుర్తించడానికి అప్పటి ప్రభుత్వం నిరాకరించింది. 2014 నుండీ 2022 వరకూ మొత్తం 6800 రైతు ఆత్మహత్యలు జరిగితే , కేవలం 1200 మందికి మాత్రమే పరిహారం చెల్లించారు. అది కూడా రైతు స్వరాజ్య వేదిక, మానవ హక్కుల వేదిక లాంటి సంస్థలు ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలకు జీవో ప్రకారం చెల్లించాల్సిన ఎక్స్ గ్రేషియా చెల్లించాలని, కోరుతూ రాష్ట్ర హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యాలు దాఖలు చేస్తేనో, లేదా, మండలం, జిల్లా, రాష్ట్ర రాజధానిలో బాధిత కుటుంబాలు ధర్నాలు చేస్తేనో, అనేక మీడియా కథనాలలో బాధితులు తమ గోడు చెప్పుకుంటేనో, పబ్లిక్ హియరింగ్ లాంటివి నిర్వహించి, సమాజంలో పెద్దల ముందు తమ బాధలు వెళ్ల బోసుకుంటేనో ఈ మాత్రం కుటుంబాలకు పరిహారం అయినా అందింది.

రైతు ఆత్మహత్య బాధితుల గురించి పదే పదే తమ వాదన వినిపించిన రైతు స్వరాజ్య వేదిక సంస్థను, BRS నాయకులు బహిరంగం గా ప్రెస్ మీట్ పెట్టి, “ RSV వాళ్ళను ఉరికిచ్చి తంతామని “ బెదిరించిన సంఘటనలు ఉన్నాయి.

పదేళ్ళలో రైతు సంఘాలతో ఒక్కసారి కూడా చర్చించని BRS పార్టీ నాయకులు,అప్పటి ప్రభుత్వ పెద్దలు ఇప్పుడు, రైతుల గురించీ, రైతుల ఆత్మహత్యల గురించీ గగ్గోలు పెడుతుంటే అసహ్యంగా ఉంది. జరిగిన ఆత్మహత్యల కంటే సంఖ్య పెంచేసి చెబుతూ, కాంగ్రెస్ పార్టీని రాజకీయంగా బదనామ్ చేయాలనే యావ తప్ప, నిజంగా రైతు ఆత్మహత్యా బాధిత కుటుంబాలకు న్యాయం చేయాలన్న అభిప్రాయం BRS పార్టీ నాయకులకు ఎంత మాత్రమూ లేదు. కౌలు రైతులను గుర్తించడానికి నిరాకరించి, వారి ఆత్మహత్యలకు కారణమైన BRS పార్టీ, ఇప్పుడు ఆత్మహత్యల గురించి అధ్యయనం చేయడం కూడా హాస్యాస్పదమే. వారి అధ్యయనంలో కౌలు రైతుల ప్రస్తావన ఉంటుందో లేదో చూడాలి. రాబోయే కాలంలో కౌలు రైతుల గురించి నిజంగా BRS పార్టీ పోరాడుతుందో లేదో చూడాలి.

కొందరు కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా ఈ విషయంలో అదే ధోరణిని వ్యక్తం చేస్తున్నారు. తమ సంవత్సర పాలనలో రైతు ఆత్మహత్యలు జీరో కు వచ్చాయని ఒక మంత్రి గారు సెలవిస్తారు. కాంగ్రెస్ పార్టీ పాలన సంవత్సర కాలంలో 281 రైతు ఆత్మహత్యలు జరిగినా , ఒక్క కుటుంబం దగ్గరకు కూడా త్రిసభ్య కమిటీ సభ్యులను పంపలేదంటే, రైతు ఆత్మహత్యల విషయంలో ఈ ప్రభుత్వ వ్యవహార శైలి కూడా అన్యాయంగా ఉందని చెప్పక తప్పదు.

పాత ప్రభుత్వ పాలనా కాలంలో జరిగిన రైతు ఆత్మహత్యలకు , పరిహారం చెల్లించాలని 100 కుటుంబాలకు సంబంధించి రైతు స్వరాజ్య వేదిక రాష్ట్ర హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేసింది. రాష్ట్ర హై కోర్టు విచారణ జరిపి, ఈ కుటుంబాల విషయంలో రీ ఎంక్వైరీ జరపాలని ఆదేశించింది. ఈ ఆదేశాలతో ఐదు జిల్లాలలో అధికారులు 82 కుటుంబాల దగ్గరకు వెళ్ళి రీ ఎంక్వైరీ జరిపారు. అందులో 70 రైతు ఆత్మహత్యలు వ్యవసాయ సంబంధిత కారణాలతో జరిగిన నిజమైన ఆత్మహత్యలేనని, రాష్ట్ర రెవెన్యూ కార్యదర్శికి నివేదిక పంపినట్లు, రాష్ట్ర హైకోర్టుకు జిల్లా అధికారులు జవాబు చెప్పారు.

కానీ ఈ నివేదికలపై రాష్ట్ర ప్రభుత్వం స్పందించి చర్యలు తీసుకోలేదు. పరిహారం చెల్లించాలని కోర్టు ఆదేశించిన గడువు 2024 నవంబర్ లోపు ఈ ప్రభుత్వం ఆయా కుటుంబాలకు పరిహారం చెల్లించలేదు. చివరికి రైతు స్వరాజ్య వేదిక నాలుగు జిల్లాల కలెక్టర్స్ పై కోర్టు ధిక్కార కేసు వేయడంతో, అనివార్యంగా 2025 జనవరి 9 న 141 కుటుంబాలకు ఎక్స్ గ్రేషియా విడుదల చేస్తూ , జీవో నంబర్ 15 విడుదల చేసింది. మానవ హక్కుల వేదిక సభ్యులు, న్యాయవాది వసుధా నాగరాజ్ సహకారంతో రైతు స్వరాజ్య వేదిక నాయకులు బి. కొండల్ రెడ్డి పిటిషన్ దారుగా సాగించిన ఈ పోరాటం అద్భుతమైనది. అభినందనీయమైనది.

ఆయా జిల్లాల నుండీ నివేదిక పంపడంలో ఆలస్యం అయిన కారణంగా, నిజమైన రైతు ఆత్మహత్యలుగా నిర్ధారణ అయిన మరో 49 కుటుంబాలకు కూడా ఇంకా పరిహారం అందాల్సి ఉంది. ఇందులో 19 రైతు ఆత్మహత్యలు నల్గొండ జిల్లా నుండే ఉన్నాయి. విచిత్రం ఏమిటంటే, మొదట ఈ 19 ఆత్మహత్యలను న్యాయమైనవి కావని అధికారులు ఒక నివేదిక పంపారు. కోర్టు ఆదేశంతో, జిల్లా కలెక్టర్ చొరవతో, స్థానిక ప్రజా సంఘాల ఒత్తిడితో, రీ ఎంక్వైరీ జరిపిన అధికారులు మొత్తం 19 ఆత్మహత్యలను న్యాయమైనవిగా గుర్తించి నివేదిక పంపారు. అధికారుల పని తీరుకు దీనిని నిదర్శనంగా చెప్పవచ్చు. బాధిత రైతు కుటుంబాల పక్షాన పోరాడే సంఘాలు లేకపోతే ఇలాంటి ఫలితాలు రానే రావు. గతంలో కూడా రైతు స్వరాజ్య వేదిక , మానవ హక్కుల వేదిక ఇలాగే రాష్ట్ర హైకోర్టు లో పోరాడి, వందల కొలదీ బాధిత కుటుంబాలకు పరిహారం సాధించాయి.

రాష్ట్రంలో జరుగుతున్న రైతు ఆత్మహత్యలపై జనవరి 18, 31 తేదీలలో రాష్ట్ర వ్యవసాయ మరియు రైతు సంక్షేమ కమిషన్ సమావేశాలు నిర్వహించింది. అనేక మంది ఈ సమావేశాలలో పాల్గొని తమ తమ అభిప్రాయాలు చెప్పారు. గత పదేళ్లుగా జరుగుతున్న పరిణామాలను, రైతు ఆత్మహత్య బాధిత కుటుంబాలకు జరుగుతున్న అన్యాయాన్ని, పరిహారం చెల్లించదంలో కాంగ్రెస్ ప్రభుత్వం కూడా నిర్లక్ష్యంగా వ్యవహరించడాన్ని, డివిజన్ స్థాయి త్రి సభ్య కమిటీ సభ్యులు, ఆయా బాధిత కుటుంబాలను కలసి విచారణ జరిపి నివేదికలు ఇవ్వక పోవడాన్ని రైతు స్వరాజ్య వేదిక ప్రతినిధులు ఎత్తి చూపారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో జరిగిన 281 రైతు ఆత్మహత్యలపై మాత్రమే కాక, 2014 నుండీ జరిగిన అన్ని ఆత్మహత్యలపై ( ఇప్పటికే ఎక్స్ గ్రేషియా చెల్లించిన కుటుంబాలను మినహాయించి) విచారణ చేయించాలని, న్యాయమైన ఆత్మహత్యలను నిర్ధారించి, ఆయా కుటుంబాలకు పరిహారం అందించేలా ప్రభుత్వాన్ని కమిషన్ ఆదేశించాలని కోరారు. జీవోల ప్రకారం రైతు ఆత్మహత్య బాధిత కుటుంబాలకు అందించాల్సిన ఇతర సహాయాలు కూడా ( ఇందిరమ్మ ఇల్లు కేటాయింపులో ప్రాధాన్యత, తెల్ల రేషన్ కార్డు, ఆసరా పెన్షన్ , పిల్లల చదువుకు సహకారం) అందించాలని కోరారు.

రైతు ఆత్మహత్యలను నివారించడానికి చేపట్టాల్సిన చర్యలను కూడా రైతు స్వరాజ్య వేదిక ప్రతినిధులు నిర్ధిష్టంగా సూచించారు. ముఖ్యంగా వాస్తవ సాగు దారులను ( కౌలు రైతులు సహా) గుర్తించి పెట్టుబడి సహాయం అందించాలని, పంటల బీమా పథకం ప్రవేశ పెట్టి అమలు చేయాలని , నాణ్యమైన విత్తనాలు రైతులకు అందేలా చూడాలని, రైతుల పంటలకు గిట్టుబాటు ధరలు అందేలా చూడాలని, ఇందుకోసం కనీస మద్ధతు ధరలకు చట్టబద్ధత దక్కేలా కేంద్రం పై ఒత్తిడి చేయాలని, నిజమైన రైతులకే పంట రుణాలు అందేలా బ్యాంకు అధికారులతో చర్చించాలని, భూమి లేని కౌలు రైతులకు, వ్యవసాయ కూలీలకు రైతు బీమా పథకాన్ని విస్తరించాలని, వ్యవసాయంలో ఖర్చులు తగ్గేలా, పర్యావరణం బాగుండేలా, సేంద్రీయ వ్యవసాయాన్నిప్రోత్సహించాలని, శాస్త్రీయ పంటల ప్రణాళిక రూపొందించాలని, సమగ్ర వ్యవసాయ విధానం తయారు చేయాలని, అటవీ హక్కుల చట్టం, 2011 భూ అధీకృత సాగుదారుల చట్టాలను అమలు చేయాలని, పంట నష్ట పరిహారం కూడా వాస్తవ సాగు దారులకే అందించేలా ప్రభుత్వానికి కమిషన్ సిఫారసులు చేయాలని కోరారు.

రాష్ట్ర ప్రభుత్వం పై నిర్ధిష్ట చర్యలు చేపట్టకపోతే, రాష్ట్రంలో రైతు ఆత్మహత్యలు ఆగవు. కొనసాగుతాయి. మరిన్ని పెరుగుతాయి. ఆ పరిణామాన్ని మనం కోరుకోవడం లేదు. రైతు ఆత్మహత్యలు కొనసాగడం రాష్ట్రానికి, సమాజానికి మంచిది కాదు.

కేవలం ప్రతిపక్షాల నోరు మూయించడానికి చూడకుండా, రైతు ఆత్మహత్యలను తక్కువ చేసి చెప్పకుండా, రాష్ట్రంలో జరుగుతున్న ప్రతి రైతు ఆత్మహత్యను రాష్ట్ర ప్రభుత్వం గుర్తించాలి. ఆ మేరకు నిర్ధిష్ట మెకానిజం ఏర్పాటు చేసుకోవాలి. ఈ విషయంలో ఇప్పటికే ఉన్న జీవోలను అమలు చేయాలి. ఆయా బాధిత కుటుంబాలకు భరోసా ఇవ్వడంతో పాటు, పరిహారం కూడా చెల్లించాలి. మొత్తంగా వ్యవసాయ కుటుంబాలు ఎదుర్కుంటున్న సంక్షోభ పరిష్కారానికి ప్రత్యేక దృష్టితో, రాష్ట్ర ప్రభుత్వం కృషి చేయాలి. వ్యవసాయ రంగానికి బడ్జెట్ లో నిధులు పెంచడ మొక్కటే సరిపోదు. అవి నిజమైన అర్హులకు మాత్రమే అందేలా చూడాలి. లేకపోతే, ఋణ మాఫీ, రైతు భరోసా పేరుతో వేల కోట్లు ఖర్చు చేసినా ఫలితముండదు.

Tags:    

Similar News