అంతరాలు

అమెరికా మోజు అప్పుడు ఇప్పుడు

Update: 2025-09-22 02:25 GMT
Image source: Shiyo Ohashi from scotscoop

మనలో మనమాట చెప్పుకోవాలి, భారతీయులకు, ముఖ్యంగా, తెలుగువారికి, సంబంధ బాంధవ్యాలలో అధికారం, అధికార దర్పం, హోదాల ప్రాముఖ్యత ఎక్కువ.


స్వగతం అయినా, సందర్భం కాబట్టి ఉద్ఘోషిస్తాను.


నేను ఏడు సంవత్సరాలు అహర్నిశలు (అక్షరాలా) శ్రమించి డాక్టరేట్ పొందిన కాలంలో (అంటే, అమెరికానుంచి ఎవరైనా ఫోన్ చేస్తే, మనలని పిలిచి మాట్లాడనిచ్చే ఇరుగుపొరుగువారు ఉన్న రోజుల్లో) అమెరికాలో అతి తక్కువమంది భారతీయులు ఉండేవారు. డాక్టర్లు, సైంటిస్ట్‌లు, కొంతమంది నిజనైపుణ్యం ఉన్న ఇంజనీర్లు ఉండేవారు. వారంతా, తమ తమ శక్తిసామర్థ్యాలను ఉపయోగించుకుని సంతృప్తికరమైన వృత్తి జీవితం, వ్యక్తిగత జీవితం గడిపే ఆలోచనతో అమెరికా వెళ్ళిన వారే.

అప్పుడు ఆస్ట్రేలియా అంతగా ఆకర్షణీయ గమ్యం కాదు (భారతీయులకు!). ఆ తరవాత కాలంలో డబ్బు సంపాదించే అవకాశాలు ఉన్న ఉపాధులలో ముందంజలో ఉన్న IT రంగంలోకి ఆకర్షితులైన యువత, ముఖ్యంగా తెలుగు యువత, అమెరికా, ఆస్ట్రేలియా వగైరా దేశాల్లోకి చొరబడి (నా మాట కాదు!) ఆయాదేశాల ఆర్థికవ్యవస్థలను పరిపుష్టం చేయడంతోపాటు భారత విదేశీమారక నిధుల పరిపుష్టకతకి కూడా దోహదపడ్డారు.


మా కాలంలో (అంటే H1 అంటే ఏమిటో తెలీని రోజుల్లో) డాక్టర్ల తో పెళ్ళిసంబంధం అంటే -- అబ్బో అపురూపంగా ఉండేది. ఎందుకంటే వాళ్ళు అరుదుగా ఉండేవారు. ఉన్నవాళ్ళలో కొంతమంది పుట్టకముందే మేనరికాలు స్థిరపరచుకుని పుట్టినవారు, మరికొంతమంది చదువుకునేటప్పుడు 'బందీలు' అయినవారు ఉండేవారు.

ఆ తరవాత కాలంలో, అమెరికా వెళ్ళాలంటే H1 వీసా గానీ, H1 ఉన్నవారితో సాహచర్యం కానీ ఉండడం సులువైన మార్గంగా మారడం నమ్మవలసిన సత్యం. Software ఉద్యోగం, H1 వీసాలే అర్హతగా వేలాది పెళ్ళిళ్ళు జరిగాయి, చాలామటుకు సనాతన సంప్రదాయ పద్ధతిలో, నాతిచరామి మార్గంలో; హోదాకి సరిపడా కట్నకానుకలు, లాంఛనాలతో సహా! పెళ్ళి నెపంతో అమెరికాకి రాజమార్గం.

Y2K యుగంనాటి ముచ్చట్లు చెప్పాలంటే సైబరాబాదు సంగతులు చెప్పాల్సిందే. 'అదిగో పులి ' అంటే, 'ఇదిగో తోక' అన్న చందాన ప్రపంచం అంతా 2000 సంవత్సర ఆగమనం మానవాళి మనుగడకి అంతిమ ఘడియ అని ఎవరో చెబితే నమ్మి ఆందోళనకి గురికావడం ఇంకా గుర్తు. వారిలో భారతీయులే అధికశాతం అని వేరే చెప్పాలా!!

ఈ ఆందోళనాయుత సమయంలో భగవద్గీత తిరగేసి కర్మయోగం గురించి ఆలోచించినవారికంటే, జ్యోతిష్యులని సంప్రదించి పిల్లల బాగుకోసం జపతపాలు చేయించినవారే ఎక్కువ. Y2K పుణ్యమా అని వేలాది మంది నాసిరకం ఇంజనీర్లు, అర్హతలు లేని తమ్ముళ్లు తండోపతండాలుగా అమెరికా ఎలిపొచ్చారు. వారిలో కొందరు 'IT కంపెనీల ' అధిపతులుగా మారారు. అంటే, 'నిపుణుల తార్పిడి' సంస్థలన్నమాట. ఈ వీరుల ఘనచరిత్ర తెలుగు జాతికి మచ్చ తెచ్చే చరిత.

ప్రేమ, అనురాగాల ప్రాతిపదికన జరగవలసిన వివాహాలు, అవసరాల మేరకు జరిగే ఒప్పందాల వ్యవహారంగా మారడం ప్రస్ఫుటంగా కనపడడం మొదలయింది.

అమ్మాయో, అబ్బాయో అమెరికాలో ఉంటే నయాగరా నయగారాలూ, న్యూయార్క్ వింతలు చూసి తీరిద్దామని కలలు కన్న పెద్దలు మనవలు, మనవరాళ్ల పాలనకి, పోషణకి పనికి వచ్చేవారిగా మారి మౌనంగా సహించే తరం తయారయింది. ప్రగల్భాలకోసం, పొరుగువారి మెప్పుకోసం, ఆదాయం కంటే ఎక్కువగా ఖర్చుపెట్టే సంస్కృతి విరాజిల్లింది. విరివిగా దొరికే అప్పులు తీసుకుని ఇళ్లు కొని షో చేసే యువకుల సంప్రదాయానికి నాంది పలికిన యుగం Y 2K.

ఇప్పుడు --

అమెరికా అనాకర్షణీయ దేశం. H1 వీసా వరుడు నిత్యబ్రహ్మచర్య అర్హుడు. హోదాలు, అర్హతలు, ఆస్తులు చూసి ప్రేమించేవారు, పిల్లని, పిల్లాడిని ఇచ్చే వారు మన దేశంలో ఎప్పుడూ ఉన్నారు, ఉంటారు. అంతస్తు, హోదా చూసి గౌరవించేవారు - బంధుమిత్రులు, అన్నదమ్ములు, అక్కచెల్లెళ్ళతో సహా, భారతదేశంలోనే ఎక్కువ అని నా అంచనా, అనుభవం.

సాంసారిక నిమ్నోన్నతాలకు అతీతంగా మనతో ఉండేవారే ఆత్మబంధువులు, ఒక్కరైనా చాలు, గంగిగోవు పాలు చందంగా.


Tags:    

Similar News