కర్నాటక దసరా మహత్తర సన్నివేశం... తెలుగు రాష్ట్రాల్లో సాధ్యమా?

దసరా ఉత్సవాలను ప్రారంభిస్తున్న ముస్లిమ్ రచయిత్రి బాను ముష్తాక్

Update: 2025-09-21 01:33 GMT
Banu Mushtaq, Kannada-language writer

ఆగస్టులో కొన్ని వారాలు పాటు బెంగుళూరులో ఉన్నప్పుడు పత్రికల్లో వార్త చూశాను.  కన్నడ రచయిత, సామాజిక కార్యకర్త, న్యాయవాది- ‘బుకర్ ప్రైజ్’ గ్రహీత బాను ముష్తాక్ (Banu Mushtaq 77) ఈ ఏడాది మైసూర్ దసరా ఉత్సవాలను (Dasara Celebrations) ప్రారంభిస్తారని ముఖ్యమంత్రి సిద్దరామయ్య (కాంగ్రెస్) ప్రకటన అది. బాను ముస్టాక్ రాసిన ‘హార్ట్ ల్యాంప్’ (Heart Lamp) చిన్న కథల సంకలనానికి ఆమెకు అంతర్జాతీయ ‘2025- బుకర్’ (International Booker Prize) పురస్కారం దొరికింది.

ఆ వార్త చూశాక, మనవద్ద కూడా ఇటువంటి సంప్రదాయం మన తెలుగు ప్రభుత్వాలు అనుసరిస్తే బాగుంటుంది కదా అనిపించింది. రాజ్యాంగ పదవిలో ఉన్నవారే దాన్ని చేయాలి అనే నియమం లేని సందర్భాలలో, ఎవరికైనా అటువంటి అరుదైన గౌరవం ఇచ్చే ‘ఛాయిస్’ ప్రభుత్వానికి ఉన్నప్పుడు, సాహితీ, సాంస్కృతిక రంగాల్లోని ప్రముఖులకు ఆ గౌరవం ఇవ్వడం వల్ల వారికే కాకుండా వారి కార్య క్షేత్రానికి విలువ పెరుగుతుంది కదా... అని అనిపించింది.

అయితే, కన్నడ సమాజంలో మేధావులు, రచయితలు, కళాకారులు ప్రభుత్వాలకు సమాంతర ప్రజలపక్షంగా వ్యవహరిస్తూ ఒక ఒత్తిడి గుంపు పాత్రను సమర్ధవంతంగా వారు మొదటి నుంచి పోషిస్తున్నారు. అలా గిరీష్ కర్నాడ్ వంటివారు జాతీయ రాజకీయాలపై స్పందించిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. గౌరీ లంకేష్, కలిబురగి వంటి వారి అకాల మరణాలు హత్యలుగా ముగియడం, అవి ఎప్పటికీ పూర్తి కాని దర్యాప్తులు కావడం కూడా తెలిసిందే. అక్కడ నుంచి సినీ నటుడు ప్రకాష్ రాజ్ స్పందనలు తరుచూ మనం చూస్తున్నవే. ఎటొచ్చీ మన వద్ద తెలుగునాటనే ఈ స్థాయి ‘వైబ్రెన్సీ’ ఎంత వెతికినా కనిపించదు.

తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా విడిపోవడాన్ని సమర్ధిస్తూ 27 జులై 2010 న డా. సి. నారాయణ రెడ్డి బహిరంగ ప్రకటన చేశాక, ఈ వ్యాస రచయిత కవి శివారెడ్డికి ఫోన్ చేసి, “అది మాకు కూడా సమ్మతమే...” అంటూ ఆంధ్రుల వైపు నుంచి ఒక సీనియర్ సాహిత్యకారుడిగా ఒక ప్రకటన చేయడానికి మనకు ఏపీ నుంచి మీకంటే ‘సీనియర్’ ఎవరున్నారు? అని అడిగితే, శివారెడ్డి- “అవి రాజకీయాలు కదా..” అన్నారు.

“కర్ణాటకలో గిరీష్ కర్నాడ్ రాజకీయాలు మాట్లాడడం లేదా?” అంటే.. అటువైపు మౌనం. అయినా భాషా ప్రయుక్త రాష్ట్రంగా ఏర్పడి ఇన్నాళ్ళూ నవంబర్ ఒకటిన రాష్ట్రావతరణ జరుపుకుంటున్న ఆంధ్రప్రదేశ్ లో జగన్మోహన్ రెడ్డి వైసీపీ ప్రభుత్వం దాన్ని కొనసాగిస్తుంటే, చంద్రబాబు నాయుడి టిడిపి ప్రభుత్వం ఆ తేదీని అలా గుర్తించడం లేదు.

మొదటి నుంచి ఇదే మన ధోరణి. జలగం వెంగళరావు ముఖ్యమంత్రిగా ఉండగా మండలి వెంకట కృష్ణారావు విద్యా, సాంస్కృతిక శాఖ మంత్రిగా హైదరాబాద్ లో మొదటి ప్రపంచ తెలుగు మహాసభలు 1975 ఉగాది నాడు జరిగాయి. అవి జరిగిన యాభై ఏళ్ల తర్వాత 2025 నాటికి విడిపోయిన ఆంధ్రప్రదేశ్ అధికార భాషా సంఘానికి ‘మండలి వెంకట కృష్ణారావు’ పేరు పెట్టించడానికి ఆయన కుమారుడు మాజీ కాంగ్రెస్ మంత్రి బుద్దప్రసాద్ కాంగ్రెస్ నుంచి తెలుగుదేశం మీదుగా చివరికి ‘జనసేన’ ఎమ్.ఎల్. ఏ. కావలసి వచ్చింది. ఇది భాషా సాంస్కృతిక రంగం పట్ల ప్రభుత్వానికి మనకున్న శ్రద్ద. అంతెందుకు ‘నంది’ ఏపీలో ఉంది, అంటూ కళాకారులకు ఇచ్చే అవార్డులకు’ తెలంగాణలో ‘గద్దర్’ అవార్డ్స్ అని పేరు పెట్టడంలో కూడా అక్కడి ప్రభుత్వం లోతులు ఎరుగని తడబాటు స్పష్టంగా కనిపిస్తుంది.

ఇప్పటి విషయానికి వస్తే, కాంగ్రెస్ ముఖ్యమంత్రి సిద్ద రామయ్యకు ఇటువంటి నిర్ణయాలు తీసుకోవడం ఇది మొదటి సారి కాదు. ఆయన 2013-18 మధ్య ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా 2017లో ప్రతిష్ఠాత్మక దసరా ఉత్సవాల ప్రారంభానికి సుప్రసిద్ద కన్నడ కవి నశీర్ అహ్మద్ ను ప్రభుత్వ అతిధిగా ప్రకటించి, ఆయన్ని ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న మైనారిటీ మత సమాజాన్ని కూడా సిద్ద రామయ్య సముచితంగా గౌరవించారు.

అయితే, గడచిన ఎనిమిదేళ్లలో దేశంలో మతం విషయంలో వచ్చిన మన దృక్పధ సంబంధమైన మార్పులు మునుపటి మన సంయమనంలో తీవ్రమైన మార్పులు తెచ్చింది. కర్ణాటకకు చెందిన హెచ్. ఎస్. గౌరవ్ ప్రభుత్వం నిర్ణయంపై అభ్యంతరం తెలుపుతూ హైకోర్టులో కేసు వేశారు. బాను ముస్టాక్ ముస్లిం అటువంటప్పుడు, ఆమె చేతులు మీదుగా మైసూర్ పట్టణంలోని పర్వతం మీద ఉండే చాముండేశ్వరి ఆలయంలో మొదలయ్యే ప్రతిష్టాత్మక మైసూర్ దసరా ఉత్సవాలను ఎలా ప్రారంభిస్తారు? అనేది ఆయన అభ్యంతరం.

రాజకీయ దృష్టితో చూసినప్పుడు, ఆయాచితంగా ‘వెతకకుండానే తీగ దొరకడం’ అంటే ఇదే. నెల క్రితం రాహుల్ గాంధీ బెంగుళూరు పార్లమెంటు నియోజకవర్గంలోని మహాదేవపుర అసెంబ్లీ నియోజకవర్గంలో 2024 ఎన్నికల్లో అవకతవకలు జరిగాయి అంటూ ‘డేటా’తో సహ ఎన్నికల కమీషన్ అధికారుల ‘పనితనాన్ని’ జాతీయ మీడియా దృష్టికి తీసుకెళ్లారు.

నెల తిరిగేసరికి అక్కడి నుంచే మైసూర్ దసరా ఉత్సవాల అతిధి ఎవరు? అనేది కోర్టు సమస్య చేసిన హెచ్.ఎస్. గౌరవ్ దాన్ని హైకోర్టు నుంచి చివరికి సుప్రీం కోర్టు దాకా తీసుకెళ్ళి, కాంగ్రెస్ పార్టీని దాని ‘సెక్యులర్’ దృక్పధం చుట్టూ దేశం దృష్టి తిప్పుతున్నారు. మరో రెండు రోజుల్లో పండగ ఉత్సవాలు మొదలవుతాయి అనగా, అలా దాన్ని దక్షణాది ఆంగ్ల పత్రికల పతాక శీర్షికలు చేశారు.

శనివారం బ్యానర్ స్టోరీల్లో బాను ముస్టాక్ పేరు చూస్తే, ఆమెకు ‘బుకర్ ప్రైజ్’ వచ్చినప్పుడు కూడా ఇంత ప్రచారం లేదుకదా... అనిపించేట్టుగా మన అసహనం ఈ విషయాన్ని అంతటి పతాక స్థాయికి తీసుకెళ్లింది. అది చాలదు అన్నట్టుగా ఈ కేసును పరిశీలిస్తున్న ఈ బెంచ్ లోని న్యాయ మూర్తులు జస్టిస్ విక్రమ్ నాధ్, జస్టిస్ సందీప్ మెహతా పిటీషనర్ తరపున కోర్టు ముందు హాజరైన అడ్వకేట్ పి. బి. సురేష్ ను “రాజ్యాంగం పీఠికలో ఏముంది?” అని అడిగారు. “మైసూరు దసరా ఉత్సవాలు ‘స్టేట్ ఫంక్షన్’ దాన్ని రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్నది. ‘స్టేట్’కు ఉండే ‘సెక్యులర్’ స్వభావంలో ‘ఏ’ ‘బి’ ‘సి’ అని వేర్వేరు మతాలను అది విడగొట్టదు” అని వారు అన్నారు.

సరైన సమయంలో సర్వోన్నత న్యాయస్థానం నుంచి సరైన వ్యాఖ్యకు దారితీసిన ఈ కేసు, గతంలో 1991 ఆగస్టులో క్రైస్తవుడు అయిన నేదురుమిల్లి జనార్ధన రెడ్డి ముఖ్యమంత్రి హోదాలో రాజమండ్రి వద్ద గోదావరి పుష్కరాలను లాంఛనంగా ప్రారంభించాల్సి వచ్చినప్పుడు, వచ్చిన వివాదం, అలాగే 1978-83 మధ్య అప్పటి మన రాష్ట్ర గవర్నర్ గా కే. సి. అబ్రహాం తిరుమల దర్శనానికి వెళ్ళినప్పుడు జరిగిన మీమాంస ఇవన్నీ కూడా వారు ఒక రాజ్యాంగ పదవిలో పనిచేస్తున్న హోదాలో వాటికి హాజరయ్యారు, ఇప్పుడీ ఈ మైసూర్ దసరా అతిధి వివాదం చూసినప్పుడు, మనవద్ద జరిగిన ఇటువంటి గత చరిత్ర సంఘటనల మరోసారి గుర్తు చేసేవి అవుతున్నాయి.



Tags:    

Similar News