రెండు పార్టీలకు పెద్దన్నపవనేనా!

జన సేన,తెలుగుదేశం పార్టీలకు పవన్ కళ్యాణ్ పెద్ద దిక్కుగా మారారు

Byline :  The Federal
Update: 2023-12-18 13:18 GMT
Pavan Kalyan and Chandrababu Naidu

(జి.గణపతి, విజయవాడ)

జన సేన,తెలుగుదేశం పార్టీలకు పవన్ కళ్యాణ్ పెద్ద దిక్కుగా మారారు. చంద్రబాబు అరెస్టు తర్వాత పవన్ రెండు పార్టీలకు పెద్దన్న పాత్ర పోషిస్తున్నారని చెప్పవచ్చు. ఏపీ రాజకీయాల్లో ఈ ఏడాది చంద్రబాబు అరెస్టు పెద్ద ఘటనగా భావించాలి. రాష్ట్ర విభజన తర్వాత అయితే చంద్రబాబు లేకుంటే జగన్ గా సాగుతున్న ఏపీ రాజకీయాల్లో ఈ ఏడాది పవన్ కళ్యాణ్ పేరు ప్రాచుర్యం పొందింది. ఈ ప్రభావంతో జనసేన పార్టీని దూకుడుగా ముందుకు నడపడంలో, ఎన్నికలకు భారీ ఎత్తున సన్నద్ధం చేయడమో, ప్రభుత్వం మీద అలుపెరగని పోరాటాల విషయం లోనూ కాదు తోటి విపక్ష నేత చంద్రబాబుకు ప్రత్యామ్నాయంగా జనం హృదయాల్లో కి వెళ్లడంలో పవన్ విజయవంతం అయ్యారనీ చెప్పవచ్చు.
వారాహి యాత్రతో జనంలోకి...
ఈ ఏడాది వారాహి విజయ యాత్ర పేరుతో జనంలోకి వెళ్లిన పవన్ కళ్యాణ్ సీఎం పదవికి తానూ పోటీ దారుననే సంకేతం ఇచ్చారు. అప్పటికే వైసీపీ టీడీపీ-జనసేన కూటమి గెలిస్తే సీఎం ఎవరన్న ప్రశ్నను పదే పదే సంధిస్తున్న తరుణంలో పవన్ చేసిన ఈ ప్రకటన వైసీపీలో ఆలోచనలను రేకెత్తించింది. ఇన్నాళ్లూ పవన్ ను ఆయన వెనక ఉన్న సామాజిక వర్గం ఆధారంగా రాజకీయంగా వాడుకుని 2014 తరహాలోనే అధికారంలోకి వద్దామని లెక్కలు వేసుకుంటున్న టీడీపీకి పవన్ సీఎం రేసులోకి రావడం అంతర్గతంగా ఇష్టం లేదనే ప్రచారం కూడా సాగింది.
విపక్షాలను ఏకం చేసే యత్నం...
అయితే ప్రభుత్వం మీద పోరాటం పేరుతో విపక్షాలను ఏకం చేస్తానన్న గత ప్రకటనకు కొనసాగింపుగా పవన్ కళ్యాణ్ ఈ ఏడాది వారాహి యాత్ర మొదలుపెట్టారు. తనకు కాస్తో కూస్తో బలం ఉందని భావిస్తున్న ఉమ్మడి గోదావరి జిల్లాల నుంచి పవన్ ప్రకటించిన వారాహి యాత్ర అప్పటికే మొదలైన నారా లోకేష్ యువగళం యాత్రను మించి జనాన్ని ఆకర్షించింది. ముఖ్యంగా పవన్ పేల్చిన సినిమా డైలాగ్స్ ప్రభుత్వానికి గుచ్చుకున్నాయి. ఫలితంగా కాపు సామాజిక వర్గ మంత్రులు, పవన్ వారాహి యాత్ర చేసిన నియోజకవర్గాల్లో వైసీపీ ఎమ్మెల్యేలు దూకుడు పెంచారు.
మూడు దఫాలు వారాహి యాత్ర ముగించుకుని హైదరాబాద్ వెళ్లిపోయిన పవన్ కళ్యాణ్ కు చంద్రబాబు అరెస్టు రూపంలో మళ్లీ ఏపీకి పిలుపు వచ్చింది. హైదరాబాద్ నుంచి ఏపీకి బయలుదేరేందుకు సిద్ధమైన పవన్ విమానానికి ప్రభుత్వం అనుమతి ఇవ్వకుండా అడ్డుకుంది. రోడ్డు మార్గాన బయలుదేరిన పవన్ ను రాష్ట్ర సరిహద్దుల్లో పోలీసులు అడ్డుకున్నారు. దీంతో హైడ్రామా తర్వాత పవన్ ఎట్టకేలకు విజయవాడ చేరుకున్నారు. అనంతరం చంద్రబాబును రాజమండ్రి జైలుకు వెళ్లి కలిసిన పవన్ బయటికి వచ్చి ఎవరూ ఊహించని విధంగా టీడీపీ-జనసేన పొత్తు ప్రకటన చేశారు.
ఇరు పార్టీల హర్షం
చంద్రబాబు జైల్లో ఉన్న తరుణంలో పవన్ చేసిన పొత్తు ప్రకటన ఇరు పార్టీల శ్రేణుల్లోనూ భవిష్యత్తుపై నమ్మకం సడలిపోకుండా చేసింది. ఆ తర్వాత కూడా ఇరు పార్టీల సమన్వయ కమిటీల భేటీలు, జనసేన మీటింగ్స్ రెగ్యులర్ గా నిర్వహించడం ద్వారా వచ్చే ఎన్నికలకు వారిని సిద్ధం చేసేందుకు పవన్ ప్రయత్నిస్తున్నారు. అయితే చంద్రబాబు అరెస్టు ఘటన మాత్రం పవన్ కళ్యాణ్ ను పెద్దన్నగా మార్చేసింది. చంద్రబాబుకు ప్రత్యామ్నాయంగా సీఎం అయ్యే అవకాశం ఉందన్న చర్చను ప్రజల్లోకి తీసుకెళ్లింది. అయితే అందుకు తగ్గట్టుగా క్షేత్రస్ధాయిలో వ్యవహారాలను చక్కబెట్టడంలో జన సేన విఫలమైంది ఆన్న అభిప్రాయాలు జన శ్రేణులు నుంచే వినిపిస్తున్నాయి.


Tags:    

Similar News