ఆసరా పెన్షన్లలో రేవంత్ కంటే చాలా ముందున్న చంద్రబాబు

ఆంధ్రాలో చంద్రబాబు ప్రభుత్వం ఏప్రిల్ నుండీ పాత పెన్షన్ మూడు నెలల బకాయి చెల్లిస్తూనే జులై 1 నుండీ కొత్త పెన్షన్ లు కూడా మంజూరు చేసింది. రేవంత్ గమనిస్తున్నారా?

Update: 2024-06-28 05:31 GMT


తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వాలు అమలు చేస్తున్న సాంఘిక బధ్రత పథకాలలో ఆసరా పెన్షన్ లు అత్యంత ముఖ్యమైన పథకం. 2023 రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ అభయహస్తం మానిఫెస్టో పేరుతో ఇచ్చిన 6 గ్యారంటీలలో ప్రస్తుతమున్న 2016 రూపాయల ఆసరా పెన్షన్ ను ఇకపై చేయూత పథకం క్రింద నెలకు 4000 రూపాయలుగా పెంచి ఇస్తామని హామీ ఇచ్చింది. సీనియర్ సిటిజెన్స్ సంక్షేమం క్రింద ఇచ్చిన హామీలో కూడా 57 సంవత్సరాలు పై బడిన వృద్ధులందరికీ వృద్ధాప్య పెన్షన్ క్రింద నెలకు 4000 రూపాయలు ఇస్తామని ప్రకటించింది.

2023 డిసెంబర్ 7 న రేవంత్ నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువు తీరింది. 6 నెలల సమయం గడిచింది. జులై నెలలో మళ్ళీ పూర్తి స్థాయి బడ్జెట్ సమావేశాలు జరగబోతున్నాయి. ప్రభుత్వం ఏర్పడిన కొత్తలో ప్రజా పాలన పేరుతో, గ్రామ, బస్తీ స్థాయి సమావేశాలలో ఆసరా పెన్షన్ కోసం పేదల నుండీ దరఖాస్తులు కూడా తీసుకున్నారు.

2014-2015 లో 33, 87, 730 మంది ఉన్న ఆసరా పెన్షన్ లబ్ధిదారులు, 2022 జనవరి 31 నాటికి 37, 34, 342 మందికి పెరిగారు. ఆసరా పెన్షన్ లకు అర్హతగా వయో పరిమితిని 65 సంవత్సరాల నుండీ 57 సంవత్సరాలకు తగ్గించిన అప్పటి రాష్ట్ర ప్రభుత్వం అర్హులకు కొత్త పెన్షన్ లు మంజూరు చేయడానికి దరఖాస్తులు మాత్రం తీసుకోలేదు. తీవ్రమైన ప్రజాందోళనల తరువాత 2022 ఆగస్ట్ 31 నాటికి దరఖాస్తు చేసుకున్న మరి కొంతమందికి ఆసరా పెన్షన్ లు మంజూరు చేసింది. కానీ దీనిని రెగ్యులర్ గా కొనసాగించకుండా మళ్ళీ దరఖాస్తులు తీసుకునే ప్రక్రియను ఆపేసింది.

2022 సెప్టెంబర్ నుండీ ఇప్పటి వరకూ వివిధ క్యాటగిరీల క్రింద పెన్షన్ మార్గ దర్శకాల ప్రకారం అర్హులైన లక్షలాది మంది పేదలు తమకు ప్రతి నెలా హక్కుగా రావాల్సిన పెన్షన్ కోసం ఎదురు చూస్తూనే ఉన్నారు.

ఈ దరఖాస్తులను పరిశీలించి, గ్రామీణ పట్టణ ప్రాంతాల పేద కుటుంబాలలో అర్హులైన వ్యక్తులకు జనవరి 2024 నుండీ పెన్షన్ ఇవ్వాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉంది. అలాగే పాత ఆసరా పెన్షన్ లబ్ధిదారులకు 2024 జనవరి నుండీ చేయూత పథకం క్రింద 4000 రూపాయల ప్రకారం పెన్షన్ బకాయిలు చెల్లించాలి.

ఆంధ్ర ప్రదేశ్ లో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం జూన్ 12 న ప్రభుత్వం కొలువు తీరినప్పటికీ, ఏప్రిల్ 2024 నుండీ పాత లబ్ధిదారులకు పెంచిన పెన్షన్ మొత్తాన్ని(మూడు నెలల బకాయిని కూడా ) చెల్లిస్తున్న విషయం, జులై 1 నుండీ కొత్త పెన్షన్ లు కూడా మంజూరు చేస్తున్న విషయం దృష్టిలో ఉంచుకోవాలి.

తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వాలు గొప్పగా చెప్పుకునే పథకాలలో పెన్షన్ ల పథకం ముఖ్యమైనది. ఈ పథకం తప్పకుండా , అర్హులైన వారికి ఉపయోగ పడే మాట నిజం . అత్యంత కష్ట కాలంలో కూడా పేద కుటుంబాలు కొంత నగదును చేతుల్లో ఉంచుకోవడానికి ఈ పథకం ఉపయోగపడుతుంది. ముఖ్యంగా వికలాంగులకు, వృద్ధులకు ఎంతో భరోసా ఇచ్చే పథకం ఇది.




 రాష్ట్రంలో గ్రామీణ ,పట్టణ ప్రాంతాలలో అన్ని కుటుంబాలు తగిన ఆదాయాలు పొందేలా జీవనోపాధి అవకాశాలు ప్రభుత్వాలు కల్పించాలి. ఆ బాధ్యత వదిలి పెట్టి, పెన్షన్ ఇచ్చేసి చేతులు దులుపుకోవాలని చూస్తున్నాయి. ఆరోగ్యకరంగా పని చేసుకోగలిగిన వయసులో ఉన్న వారికి నెల నెలా నిర్ధిష్ట ఆదాయమొచ్చే పనిని ప్రభుత్వాలు చూపంచకుండా మార్గదర్శకాలలో వృద్ధాప్య పెన్షన్ కు వయో పరిమితిని 65 సంవత్సరాల నుండీ 57 సంవత్సరాలకు తగ్గించడం ఇందుకో నిదర్శనం .

సమాజంలో సగం కుటుంబాలలో కుటుంబానికి ఒకరికి చొప్పున 2000 రూపాయల పెన్షన్ ఇచ్చేస్తే, ప్రజలు జీవనోపాధులకు గ్యారంటీ ఇచ్చే భూమి,నీళ్ళు,అడవులు, ఖనిజ సంపద లాంటి సహజ వనరులపై తమ హక్కులను అడగరని ప్రభుత్వాలు భావిస్తున్నాయి. అలాగే జీవనోపాధుల కల్పనకు బడ్జెట్ లో తగిన నిధులు కేటాయించాల్సిన అవసరం ఉండదని ఆయా ప్రభుత్వాల భావన. కానీ ఇది తప్పుడు ఆలోచన. ప్రజలకు జీవనోపాధుల రక్షణ , నూతన జీవనోపాధి అవకాశాల కల్పన ఎప్పుడైనా సుస్థిర సమాజ అభివృద్ధికి తోడ్పడుతుంది.

తెలంగాణ రాష్ట్రంలో వృద్ధులు, వికలాంగులు , వితంతువులు , ఒంటరి స్త్రీలు, గీత కార్మికులు, బీడీ కార్మికులు, చేనేత కార్మికులు, బోదకాలు బాధితులు, ఎయిడ్స్ బాధితులు ఈ ఆసరా పెన్షన్ లకు అర్హులు. వీరు పెన్షన్ పొందడానికి అర్హతలను నిర్దేశిస్తూ విడివిడిగా మార్గదర్శకాలు కూడా రూపొందించారు.

పెన్షన్ మొత్తాన్ని 2016 రూపాయలకు పెంచుతూ అప్పటి ప్రభుత్వం 2019 మే 28 న జీవో నంబర్ 34 విడుదల చేసింది. వృద్ధాప్య పింఛన్ వయో పరిమితిని 65 సంవత్సరాల నుండి 57 సంవత్సరాలకు తగ్గిస్తూ 2021 ఆగస్ట్ 4 న జీవో నంబర్ 36 ను కూడా అప్పటి ప్రభుత్వమే విడుదల చేసింది. రాష్ట్ర స్థాయిలో గ్రామీణ పేదరిక నిర్మూలనా సంస్థ (SERP) అర్హుల నుండి దరఖాస్తులు స్వీకరించి, అర్హుల జాబితాను తయారు చేయాలని ఈ జీవోల లో పేర్కొంది. కానీ ఈ జీవో లు వాటి స్పూర్తితో అమలు కావడం లేదు.

కుటుంబంలో 57 సంవత్సరాల వయసు నిండిన ఎక్కువమంది వృద్ధులు ఉన్నా, గత ప్రభుత్వ కాలంలో అందులో ఒక్కరికే పెన్షన్ ఇవ్వడం జరిగింది.ఈ ప్రభుత్వం అర్హులైన వృద్ధులందరికీ (వారి సంతానం ప్రభుత్వ ఉద్యోగులయినప్పటికీ) పెన్షన్ ఇస్తామని హామీ ఇచ్చింది కానీ, పథకాన్ని పూర్తి స్థాయిలో అమలు చేసే నాటికి ఈ విషయాన్ని తప్పకుండా గుర్తుంచుకోవాలి. అలాగే కేవలం పెన్షన్ కే పరిమితం కాకుండా మానిఫెస్టోలో హామీ ఇచ్చిన విధంగా అన్ని జిల్లా కేంద్రాలలో వృద్ధాశ్రమాలు నిర్మించాలి. కేంద్ర చట్టాన్ని అనుసరించి, వృద్ధుల సంరక్షణ కొరకు ప్రత్యేక బడ్జెట్ ను జులై నెలలో జరిగే బడ్జెట్ సమావేశాలలో ప్రవేశ పెట్టాలి.

ప్రావిడెంట్ ఫండ్ అకౌంట్ లేని బీడీ కార్మికులకు పెన్షన్ రాకపోవడం లాంటి సమస్యలు ఉన్నాయి. ఎక్కువమంది బీడీ కార్మికులకు కంపెనీలు ప్రావిడెంట్ ఫండ్ అమలు చేసేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి.

బీడీ కార్మికులకు 2014 పి. ఎఫ్ . కటాఫ్ తేదీని తొలగించి, చేయూత పెన్షన్ అందిస్తామని ఎన్నికల మానిఫెస్టో లో ఇచ్చిన హామీకి అనుగుణంగా ప్రభుత్వం కొత్త వారిని నమోదు చేయాలి.

నెలవారీ పెన్షన్ కోసం ఎక్కువగా ఎదురుచూస్తున్న వారిలో సమాజంలో అత్యంత వెనుకబడిన సామాజిక వర్గాల కుటుంబాలకు చెందిన శ్రమ జీవులు ఉన్నారు. చేనేత, గీత లాంటి కుల వృత్తులు ధ్వంసమై పోతున్నాయి. సంవత్సరం పొడవునా సరైన జీవనోపాధి లేక గ్రామీణ పేద కుటుంబాలు ఆర్ధిక సంక్షోభంలో పడి పోతున్నాయి.

శరీరంలో శక్తి ఉడిగిపోయి , స్వయంగా పని చేసుకోలేక , కనీస ఖర్చులకు కూడా వృద్ధుల చేతిలో చిల్లి గవ్వ ఉండడం లేదు . స్వయంగా కదల లేని స్థితిలో ఉన్న వికలాంగుల పరిస్థితి కూడా మరింత దారుణంగా ఉంది. మద్యం దుర్వ్యసనంగా మారి, అనేక మంది మగవాళ్ళు చిన్నవాయస్సులోనే మరణిస్తుంటే, ఆయా కుటుంబాలలో స్త్రీలు వితంతువులుగా మారుతున్నారు. కుటుంబాలలోని వృద్ధులను, పిల్లలను పోషించలేక ఇబ్బంది పడుతున్నారు. వీరికి అందించే పెన్షన్ లు ఆయా కుటుంబాలు ఆర్ధికంగా నిలదొక్కుకోవడానికి తోడ్పడతాయి. ఈ ఒంటరి, వితంతు మహిళలకు కేవలం పెన్షన్ ఇచ్చి సరిపెట్టడం కాకుండా, ఆ మహిళలు స్వయం ఉపాధి క్రింద పని చేసుకునేలా అవసరమైన పెట్టుబడి సహాయం అందించాలి. శిక్షణలను ఇప్పించాలి.

సామాజిక బధ్రత క్రింద ప్రభుత్వాలు అందించే పెన్షన్ లు, ఏదో దయతో విసిరే భిక్ష కాదు . సామాజిక బధ్రత పొందడం ప్రజల హక్కు. కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజల సంక్షేమం ధ్యేయంగా పరిపాలన చేయాలని భారత రాజ్యాంగం స్పష్టంగా నిర్దేశించింది . సమాజంలో బలహీన , వెనుకబడిన వర్గాలకు అందించే పథకాలు కానీ , లేదా కొన్ని తరగతుల ప్రజలకు అందించే పెన్షన్ లు లాంటివి కానీ చరిత్రలో అనేక ప్రజా ఉద్యమాల ఫలితంగా సమకూరినవి . అన్ని సామాజిక వర్గాల , తరగతుల ప్రజలు గౌరవ ప్రదంగా, ఆరోగ్యంగా, సంతోషంగా జీవించే పరిస్థితులను కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉంది.

రాష్ట్రంలో ఆసరా పెన్షన్ మార్గదర్శకాలు సవరించి, అర్హులైన ప్రతి ఒక్కరికీ చేయూత పెన్షన్ ఇవ్వాలి. చేయూత పెన్షన్ మార్గదర్శకాల ప్రకారం అర్హత పొందిన ప్రతి ఒక్కరికీ పింఛన్ అందించేలా , ఎప్పటికప్పుడు క్షేత్ర స్థాయిలో దరఖాస్తులను తీసుకోవడం, అధికారుల కమిటీ పరిశీలించి ఆమోదించడం అనే ప్రక్రియను సంవత్సరం పొడవునా నిరంతరం కొనసాగించాలి. నగరాలలో ఇళ్ళు లేని నిరాశ్రయులకు, ట్రాన్స్ జండర్ వ్యక్తులకు కూడా పెన్షన్ చేయూత పెన్షన్ అందించడానికి మార్గదర్శకాలు రూపొందించాలి.

పెరుగుతున్న నిత్యావసర సరుకుల ధరలు దృష్టిలో ఉంచుకుని , ప్రతి 6 నెలల కొకసారి వినియోగదారీ ధరల సూచీ ప్రకారం( CPI +VDA లాగా ) పెన్షన్ మొత్తాన్ని సవరించి చెల్లించాలి.


Tags:    

Similar News