కేరళ ప్రభుత్వాన్ని కుదిపేస్తున్న " ఎడిటెడ్‌ వీడియో "

కేరళలో ‘తప్పిపోయిన బాలుడి’ ఎడిటెడ్‌ వీడియో ఒకటి రాజకీయ దుమారం రేపుతోంది.

Update: 2023-12-14 11:27 GMT

శబరిమలలోని అయ్యప్ప(Ayyappa) దేవాలయం వద్ద గత కొద్దిరోజులుగా భక్తుల రద్దీ పెరిగింది. అదే సమయంలో సోషల్‌ మీడియాలో ఓ వీడియో వైరలయ్యింది. దాన్ని చూసిన వారంతా కేరళ ప్రభుత్వంపై ట్వీట్లు చేయడం మొదలుపెట్టారు.

పుణ్యక్షేత్రంలో భక్తులు గంటల తరబడి క్యూలైన్లలో నిలుచోవాల్సి వస్తుందని.. భక్తులకు కనీసం ఆహారం, నీళ్లు కూడా సమకూర్చడం లేదని పినరయి విజయన్‌ ప్రభుత్వాన్ని బీజేపీ నాయకులు విమర్శించడం మొదలుపెట్టారు. పదేళ్ల వయసున్న అయ్యప్ప భక్తుడు తన తండ్రి కోసం వెతుకుతున్న వీడియో ఒకటి తోడుకావడంతో అగ్నికి ఆజ్యం పోసినట్టుయ్యింది.

రద్దీగా ఉండే శబరిమల(Sabirimala)లో తన తండ్రిని కోల్పోయిన బాలుడు కన్నీరుమున్నీరుగా ఏడుస్తూ.. సాయం చేయాలని కోరుతున్న వీడియో గత రెండు రోజులుగా సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది. చివరకు పోలీసుల చొరవతో బాలుడు తన తండ్రిని కలిశాడని వార్తలు వచ్చినా.. కొంతమంది అదే పనిగా ఎల్‌డిఎఫ్‌ ప్రభుత్వాన్ని టార్గెట్‌ చేస్తూ ట్రోల్స్‌ కొనసాగిస్తున్నారు.

పెరుగుతున్న భక్తుల రద్దీ..

శబరిమలకు వచ్చే వారి సంఖ్య ఏడాదికేడాది పెరిగిపోతుంది. రోజూ లక్ష ఇరవై వేల మంది అయ్యప్పను దర్శించుకుంటారు. తమకు కనీస సౌకర్యాలు కల్పించడంలో ప్రభుత్వం విఫలమైందని భక్తులు ఆరోపిస్తున్నారు. గంటలపాటు క్యూలైన్లలో నిలుచోవాల్సి వస్తుందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కొన్నిసార్లు 18 గంటల వరకు నీళ్లు ఆహారం కూడా దొరకడం లేదంటున్నారు.

భక్తుల పట్ల ఎల్‌డిఎఫ్‌ ప్రభుత్వం ‘‘అనుచితంగా ప్రవర్తిస్తోందని’’ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

వైరలయిన ఎడిటెడ్‌ వీడియో..

వాస్తవానికి వీడియోలో కొంతభాగాన్ని ఎడిట్‌ చేశారు. బాలుడు తండ్రికి కలుసుకున్న భాగం, పోలీసులకు కృతజ్ఞతలు తెలుపుతున్న పార్ట్‌ను తొలగించారు. కేవలం బాలుడు తండ్రి కోసం ఏడుస్తున్న పార్ట్‌ను మాత్రమే చూయించి సోషల్‌ మీడియాలో పోస్టు చేయడంతో కేరళ ప్రభుత్వానికి తలనొప్పిగా మారింది.

ప్రభుత్వ ప్రతిష్టను దెబ్బతీశారు..

నిజనిర్ధారణ వెబ్‌సైట్‌లు, మహమ్మద్‌ జుబైర్‌ వంటి జర్నలిస్టులు వీడియో వెనుక ఉన్న నిజాన్ని బయటపెట్టినా.. ఎడిటెట్‌ వీడియో వల్ల రాష్ట్ర ప్రభుత్వ ప్రతిష్టకు తీవ్ర భంగం కలిగింది. వామపక్ష ప్రభుత్వం హిందూ భక్తుల పట్ల ‘‘శత్రువు’’లా వ్యవహరిస్తుందంటూ.. కొంతమంది మితవాద రాజకీయ నాయకులు వీడియోను ఉదాహరణగా చూపుతున్నారు.

‘‘కేరళ(Kerala)లో తప్ప మరెక్కడా ఇలాంటి దృశ్యాలు కనిపించవు. మీ చేతులను గంగలో ముంచినా పాపపు మరక పోదు’’ అని ముఖ్యమంత్రి విజయన్‌(Pinarayi Vijayan)ను ఉద్దేశించి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె సురేంద్రన్‌ ఫేస్‌బుక్‌లో రాశారు.

రాజకీయ పార్టీలు ఈ ఘటనను తమకు అనుకూలంగా మార్చుకునే పనిలో పడ్డాయి. బీజేపీ(BJP) ఈ ఘటనను పెద్దదిగా చూపాలనుకుంటుంది. కాంగ్రెస్‌(Congress) కూడా అదే ధోరణిలో ఉంది.  

Tags:    

Similar News