తెలంగాణ గ్రూప్-1 మెయిన్స్ మీద జీవో 29 నీలినీడలు

విద్యార్థుల బలిదానం మీద ప్రత్యేక రాష్ట్రం ఏర్పడినా నియామకాల విషయంలో జరుగుతున్న తంతు పట్ల యువకులు, తల్లితండ్రులు ఆవేశంతో ఉన్నారు.

Update: 2024-10-20 11:00 GMT

అయితే ఎస్పీ (సూపరింటెండెంట్ అఫ్ పోలీస్) లేకపోతే డీ ఎస్ పీ (డిప్యూటీ సూపరింటెండెంట్ అఫ్ పోలీస్).

ఖమ్మం జిల్లాకు చెందిన పవన్ చిన్ననాడే తీసుకున్న నిర్ణయం ఇది. మొక్కవోని దీక్షతో సివిల్స్ కు ప్రిపేర్ అవుతోనే గ్రూప్-1 కోసం కూడా చదివాడు. 14 ఏళ్ల తర్వాత వచ్చిన గ్రూప్-1 నోటిఫికేషన్ పవన్ ను ఉత్సాహపరిచింది. అందులో వంద డీఎస్పీ పోస్టులు ఉండడంతో దాని మీద సహజంగానే దృష్టిపెట్టాడు. గ్రూప్-1 లో ముందుగా విజయం సాధించి డీ ఎస్పీ అయితే బాగుంటుందని అన్ని సబ్జెక్టులతో పాటు పరీక్షకు అనుగుణంగా తెలంగాణ చరిత్ర అవపోసన పట్టాడు. వివిధ కారణాల వల్ల మూడు సార్లు ప్రిలిమ్స్ రాయాల్సి రావడం నిరాశ పరిచింది. అయినా ప్రిలిమ్స్ లో విజయం సాధించాడు. ఉత్తమమైన కోచింగ్ ఇప్పించడం కోసం కుటుంబం హైదరాబాద్ కు మకాం మార్చింది. అశోక్ నగర్ లో రాత్రిబగళ్లు మెయిన్స్ కోసం కుస్తీ పడుతుంటే ఎంతకూ హాల్ టికెట్ రాదే! ఆర్ధిక కారణాల వల్ల హైదరాబాద్ రాలేకపోయిన పవన్ స్నేహితులు ఇంకా ఆందోళనలో ఉన్నారు. హాల్ టికెట్ వస్తేనే కదా పరీక్ష కేంద్రం ఎక్కడో తెలిసేది, అందుకు అనుగుణంగా ఏర్పాటు చేసేది.

రేపు (అక్టోబర్ 21, 2024) పరీక్ష అనగా ఎట్టకేలకు ఈ నెల 14 న హాల్ టికెట్ వచ్చింది. హమ్మయ్య అనుకునే లోపు జీవో 29 వివాదం ముందుకు వచ్చి రాజకీయ రంగు పులుముకుని కోర్టుకెక్కింది. హై కోర్టులో ఊరట రాని బాధిత విద్యార్థులు సుప్రీంకోర్టు తీర్పు కోసం ఎదురుచూస్తున్నారు. "మనం ఎంత దారుణమైన పరిస్థితుల్లో ఉన్నామో అన్న మాట చెప్పుకోవడానికి గ్రూప్-1 నిర్వహణ ఒక మచ్చుతునక. రేపు పరీక్ష అనగా పరీక్ష జరుగుతుందా? జరగదా? తీరా పరీక్షకు బయలుదేరి వెళ్ళాక సుప్రీం కోర్టు పరీక్షను రద్దు చేస్తే/వాయిదా వేస్తే ఎట్లా? వంటి ప్రశ్నలు వేధించడం అభ్యర్థులకు నరకంగా ఉంది. ప్రభుత్వం తిక్కతిక్కగా వ్యవహరిస్తూ ఇబ్బంది పెడ్తోంది. ప్రాక్టికల్ సమస్యలు ఉన్నప్పుడు ప్రభుత్వం మొండిగా వ్యవహరించడం అవసరమా?," అని పవన్ ప్రశ్నించాడు.

నరాలు తెగే ఈ అనిశ్చితి పవన్ తో పాటు 31,000 మంది విద్యార్థులను, వారి కుటుంబ సభ్యులను దారుణంగా వేధిస్తోంది. నీళ్లు-నిధులు-నియామకాలు అన్న నినాదంలో ఎమోషన్స్ చొప్పించి 1500 మంది విద్యార్థుల బలిదానం మీద ప్రత్యేక రాష్ట్రం ఏర్పడినా నియామకాల విషయంలో జరుగుతున్న తంతు పట్ల వారు ఆవేశంతో ఉన్నారు. రెండో సారి పరీక్ష రద్దు అయినప్పుడు, ప్రత్యేక నోటిఫికేషన్ ఇవ్వకుండా 60 పోస్టులు కలపడమేమిటి? 1:50 లెక్కకన్నా ఎక్కువ మందిని మెయిన్స్ కు పిలవడమేమిటి? జీవో 29 తో పరీక్షను ఒక ప్రహసనం చేయడమేమిటని వారు ప్రశ్నిస్తున్నారు. బీ ఆర్ ఎస్ ప్రభుత్వం 2022లో జారీ చేసిన గ్రూప్‌-1 నోటిఫికేషన్‌ను కోర్టు తీర్పుతో 2024 రేవంత్‌రెడ్డి ప్రభుత్వం రద్దు చేసింది. ఆ సమయంలో కొత్త నోటిఫికేషన్‌ను జారీ చేస్తూ..జీవో 29 బైటికి వచ్చింది. "పాత ప్రభుత్వం అమలు చేసిన జీవో 55లో 1:50 నిష్పత్తిలో మెయిన్స్‌లో అభ్యర్థులను ఎంపిక చేస్తారు. దానివల్ల 40 శాతం అభ్యర్థులను మెరిట్‌ ప్రకారం, 60 శాతం అభ్యర్థుల ఎంపికలో రిజర్వేషన్లను వర్తింపు చేస్తారు. దీంతో మెరిట్‌ ఉన్న రిజర్వుడు అభ్యర్థులు ఓపెన్‌ కోటాలో ఎంపికవుతారు. మెరిట్‌ తక్కువ ఉన్న అభ్యర్థులకు..రిజర్వుడు కేటగిరిలో అవకాశం లభిస్తోంది. దీనివల్ల అటు ఓపెన్‌ కోటాలోనూ..ఇటూ రిజర్వుడు కోటాలో కూడా రిజర్వేషన్లు ఉన్న అభ్యర్థులకు ప్రయోజనం కలుగుతుంది. అది ఇప్పుడు మార్చడం వివాదానికి కారణం," అని సివిల్స్ కోచింగ్ ఇచ్చే సంస్థ ప్రతినిధి ఒకరు చెప్పారు.

జీవో 29 ప్రకారం, రిజర్వేషన్లతో సంబంధం లేకుండా మెయిన్స్‌లో మెరిట్‌ ప్రకారం అభ్యర్థుల ఎంపిక ఉంటుందని ఆందోళన చెందుతున్నారు. "ఉద్యోగాల కేటాయింపులోనే రిజర్వేషన్లు వర్తింపజేయడం వల్ల ఓపెన్ కేటగిరీలో ఎంపికైన రిజర్వుడు అభ్యర్థులను కూడా రిజర్వేషన్ కేటగిరీ కిందనే పరిగణిస్తున్నారు. దీనివల్ల రిజర్వుడ్ కేటగిరీలో ఉన్నవారికి తీవ్ర అన్యాయం జరుగుతోంది," అని అభ్యర్థులు వాదిస్తున్నారు.

జీవో 29 వివాదం అటు బీజేపీ, ఇటు బీఆర్ ఎస్ లకు అందివచ్చిన అవకాశం అయ్యింది. అభ్యర్థులకు బీజేపీ ఎంపీ బండి సంజయ్ బాసటగా నిలవగా, పదేళ్ల పాలనలో విద్య వ్యవస్థను భ్రష్టు పట్టించి యువతను నిర్లక్ష్యం చేశారన్న విమర్శ ఎదురుకొంటున్న బీ ఆర్ ఎస్ కూడా రేవంత్ ప్రభుత్వంపై దాడి పెంచింది. ఈ నేపథ్యంలో అభ్యర్థులు కాంగ్రెస్ అధినాయకత్వానికి కూడా లేఖలు రాస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా రాహుల్ గాంధీని కొందరు లక్ష్యంగా చేసుకున్నారు. నిరుద్యోగుల అడ్డా అశోక్ నగర్ కు ఎన్నికలప్పుడు వచ్చి తియ్య మాటలు చెప్పి ఇప్పుడు మొహం చాటేసారేమిటని వారు అంటున్నారు. ఆ వివాదాస్పద జీవో ను రద్దుచేయాలని నిన్న (అక్టోబర్ 19, 2024) హైదరాబాద్ లో యువకులు భారీ స్థాయిలో జరిపిన నిరసన సెగ ప్రభుత్వానికి తగిలినట్లు కనిపిస్తోంది.

"ఓపెన్ కేటగిరీ లో దళిత గిరిజన బడుగు వర్గాల కు ప్రవేశం లేదంటూ,సామాజిక న్యాయానికి తూట్లు పొడుస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం విడుదల చేసిన రాజ్యాంగ వ్యతిరేక జీవో 29 ను రద్దు చేయాలని అణచివేయబడ్డ వర్గాలకు చెందిన నిరుద్యోగులు వేసిన స్పెషల్ లీవ్ పిటీషన్ ను వెంటనే విచారణకు స్వీకరించిన సుప్రీంకోర్టు కు ధన్యవాదాలు. తెలంగాణ నిరుద్యోగుల తరపున ప్రముఖ న్యాయవాదులు కపిల్ సిబల్, మోహిత్ రావు తదితరులు వచ్చే సోమవారం నాడు వాదించనున్నారు," అని ఇప్పుడు బీ ఆర్ ఎస్ నాయకుడిగా ఉన్న మాజీ సివిల్ సర్వెంట్ డా. ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ ఎక్స్ వేదికగా పేర్కొన్నారు. ప్రభుత్వం సమస్యను లోతుగా విశ్లేషించడం లేదని, ప్రశ్న పత్రాలు దిద్దటంలో కూడా లోపాలు ఉన్నాయని, తెలుగు అకాడమీ పుస్తకాంశాలను బేఖాతరు చేశారని పార్టీ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్ వాదిస్తున్నారు. "జీవో 29 కేవలం గ్రూప్-1 సమస్య మాత్రమే కాదు, భవిషత్తు అన్ని ప్రభుత్వ రిక్రూట్మెంట్ల విషయంలో ఇది ఎస్సీ, ఎస్టీ, బీసీ లకు ప్రతిబంధకమే. సోమవారం సుప్రీంకోర్టు తీర్పు వచ్చే లోపే మీరు భేషజాలకు పోకుండా విద్యార్థి నిరుద్యోగుల కోరిక మేరకు పరీక్షను వాయిదా వేసి స్పష్టంగా కనపడుతున్న తప్పులను సరిదిద్దండి," అని ఆయన అన్నారు.

వీటిని పట్టించుకోకుండా, అపోహలు సృష్టించే సంఘం ట్రాప్ లో పడకుండా 21 నుంచి పరీక్షలు రాయాలని ముఖ్యమంత్రి కోరారు. ఏదిఏమైనా, సుప్రీం కోర్టు తీర్పుతో పరీక్ష వాయిదా పడినా పడకున్నా గ్రూప్-1 విషయంలో రేవంత్ ప్రభుత్వం ఇరుకున పడినట్లు కనిపిస్తోంది.

Tags:    

Similar News