జర్నలిస్టుగా డాక్టర్ అంబేడ్కర్...

రాజ్యాంగ నిర్మాతగా అంబేడ్కర్ కి వచ్చిన ప్రఖ్యాతి మాటున వందేళ్ల ప్రజాస్వామిక హక్కుల జర్నలిస్టు అంబేడ్కర్ విస్మరణకు గురయ్యారు.;

Update: 2025-04-12 23:15 GMT

- కృపాకర్ మాదిగ


బాబా సాహెబ్ అంబేడ్కర్ మార్కు సామాజిక ప్రజాస్వామ్య జర్నలిజం వందేళ్లు దాటింది.రాజ్యాంగ నిర్మాతగా అంబేడ్కర్ కి వచ్చిన ప్రఖ్యాతి మాటున వందేళ్ల ప్రజాస్వామిక హక్కుల జర్నలిస్టు అంబేడ్కర్ విస్మరణకు గురయ్యారు.

విదేశీ చదువుల నుండి తిరిగి వచ్చిన యువ అంబేడ్కర్ సామాజిక అసమానతలు నిండి ఉన్న భారతదేశాన్ని సంస్కరించడానికి తనదైన శైలిలో పోరాటం ప్రారంభించాడు.అంబేడ్కర్ కొలంబియాలో ఉన్నప్పుడే కులం పునాదిగా గల భారతదేశ సామాజిక అసమానతలపై విమర్శ ఎక్కుపెట్టాడు.కుల వ్యవస్థను సైద్దాంతికంగా, శాస్త్రీయంగా పరిశీలించడం ప్రారంభించాడు.ఈ క్రమంలో 1916లో " భారతదేశంలో కులాల పుట్టుక - వాటి అభివృద్ధి " అనే విశ్లేషణాత్మక పత్రాన్ని మానవశాస్త్ర సదస్సులో సమర్పించాడు. అంతర్జాతీయ సామాజిక శాస్త్రవేత్తల ప్రశంసలు అందుకున్నాడు.ఆ తర్వాత 1932లో తన విప్లవాత్మక గ్రంథమైన " కుల నిర్మూలన " ను తీసుకువచ్చాడు.

ప్రతీ దేశంలో మేధావి వర్గం పాలకవర్గంగా మారకపోయినప్పటికీ,భవిష్యత్తు సామాజిక పరిణామాల్ని ముందుగా దర్శించగలిగేదిగా, సరియైన సలహాలు ఇవ్వగలిగేదిగా, అత్యంత ప్రభావ వర్గంగా ఉంటుంది.ఈ విధంగా అంబేడ్కర్ తాను పొందిన విదేశీ విద్యతో, రచన నైపుణ్యాలతో, పాశ్చాత్య హేతువాద ప్రజాస్వామ్య భావాలతో, భారతదేశంలో కొనసాగుతున్న యధాతధవాద సామాజిక వ్యవస్థ విసురుతున్న పెను సవాళ్లను ఎదుర్కోవడానికి, అణగారిన సామాజిక వర్గాల ఉద్యమాలను నిర్మించడానికి కావలసిన సాహిత్య భూమికగా,ఉద్యమాల గొంతుకగా పత్రికా రంగాన్ని సాధనంగా మలచదల్చుకున్నారు.

1920 జనవరి 31న మూక్ నాయక్ (Mooknayak)  పత్రికను స్థాపించారు.ప్రారంభంలో ఈ పత్రికకు పశ్చిమ మహారాష్ట్రకు చెందిన కొల్హాపూర్ ప్రభువు ఛత్రపతి సాహూ మహరాజ్ ఆర్థిక సహకారం అందించారు.నేటి వార్తాపత్రికలు,న్యూస్ చానెళ్ళు మార్జినలైజ్డ్ సమూహాల వార్తలు,కథనాలకు తగిన చోటు ఇవ్వని పరిస్థితులు ఇప్పటికీ ఉన్నాయి.కాగా,బ్రిటీష్ వారి వలస వాద దోపీడీ అణచివేతల పరిపాలన ఒకవైపు,వర్ణ,కుల అణచివేతలు,సామాజిక మూఢాచారాలు మరో వైపు తీవ్రంగా కొనసాగుతున్న కాలంలోనే,డాక్టర్ అంబేడ్కర్ మూక్ నాయక్ పత్రికలో డజన్లకొద్దీ సంపాదకీయాలు, వ్యాసాలు, కథనాలు, వార్తాంశాలు రాసి, అంటరానితనం,అత్యాచారాలు, మహిళలపై దోపిడీ సామాజిక అణచివేతలకు వ్యతిరేకంగా ప్రజలను చైతన్యం చేయడానికి డాక్టర్ అంబేడ్కర్ పూనుకున్నారు. కుల నిర్మూలన వాద రాజకీయ దృక్పథంతో కూడిన సామాజిక రాజకీయ ఉద్యమ నిర్మాణానికి,అణగారిన సమూహాల ప్రజలను సన్నద్ధులను చేయడానికి అంబేద్కర్ సంపాదకీయాలు, పత్రిక రచన ఎంతగానో తోడ్పడ్డాయి.బాధలు వెల్లడించుకోలేని వారి గొంతుకగా, అంబేడ్కర్ స్థాపించిన పత్రికలు,రచనలు మారాయి. అణగారిన సామాజిక వర్గాలు తమ హక్కులను సాధించుకునే పోరాటంలో అంబేడ్కర్ పత్రికా రచన ముఖ్య భూమిక పోషించింది. రెండేళ్లకు పైగా నడిచిన మూక్ నాయక్ పత్రిక సాహూజి మహరాజ్ మరణం తర్వాత 1922లో ఆగిపోయింది. 

కృపాకర్ మాదిగ పొనుగోటి

ఆ తర్వాత సంవత్సరాల్లో అంబేడ్కర్ మరొక నాలుగు పత్రికలను స్థాపించారు.అవి వరుసగా బహిష్కృత భారత్ (Bahiskrut Bharat:1927), సమత (Samta:1928), జనత ( Janata:1930), ప్రబుద్ధ భారత్ ( Prabuddha Bharat:1956) ఇందులో జనత పత్రిక ఇరవై ఆరేళ్లు నడిచింది.ఈ కాలంలో అంబేడ్కర్ లోనూ, అణగారిన సామాజిక వర్గాల్లోనూ వచ్చిన సామాజిక, రాజకీయ పరిణితి,తాత్వికతలను యీ పత్రికలు ప్రతిబింబించాయి.అంబేడ్కర్ ఉపన్యాసాలన్నీ రాజ్యాంగ సభలో ఇంగ్లీషులోనే కొనసాగినప్పటికీ, అణగారిన ప్రజలను జాగృతం చెయ్యడానికి, కూడగట్టడానికి ఆయన వార్తాపత్రికల్లో మరాఠీ, భాషలోనే రాశారు. అంబేడ్కర్ తన సంపాదకీయాలను ముందు ఇంగ్లీషు భాషలోనే రాసుకొని,తర్వాత మరాఠీ భాషలోకి తర్జుమా చేసుకొని ప్రచురించేవారు.

శబరిమల దేవాలయ ప్రవేశం కేసు (2018) విచారణ సందర్భంలో జస్టిస్ చంద్రచూడ్ అంబేడ్కర్ పై చేసిన పరిశీలన, ప్రస్తావనలో " అంబేడ్కర్ సాగించిన అధ్యయనం,స్వాతంత్ర ఉద్యమ మరో కోణం మనకు చూపిస్తుంది.బ్రిటిష్ పాలన నుంచి స్వేచ్ఛ, స్వాతంత్ర్యాల కోసం పోరాటం ఒకవైపు సాగుతుండగా, సాంఘిక దాస్య విముక్తి కోసం శతాబ్దాల నిరంతర పోరాటం మరోవైపు కొనసాగుతోంది.న్యాయం, సమానత్వం కోసం జరుగుతున్న సాంఘిక పోరాటాల నుంచి వచ్చిన సభ్యుల స్వేచ్ఛ భావాలతో, అనుభవాలతో, రాజ్యాంగ నిర్మాణ సభ ఎంతో సంపద్వంతమైంది.ఇంకా నిర్దిష్టంగా చెప్పాలంటే, రాజ్యాంగ రచనా సంఘం అధ్యక్షుడు డాక్టర్ అంబేడ్కర్ గారి విశిష్టమైన ఆలోచనలు, ఉన్నతమైన విలువలు, పరిశోధనాత్మక శక్తి సంపన్నతలతో కూడిన అనేక పోరాటాలు, అనుభవాలను ఏక వ్యక్తిగా, సొంతంగా, రాజ్యాంగ నిర్మాణ సభలోకి వెంట తీసుకొచ్చారు." అని ఉటంకించడం డాక్టర్ అంబేడ్కర్ గారి ఉన్నతమైన వ్యక్తిత్వానికి మంచి ఉదాహరణగా చెప్పుకోవచ్చు.

భారత రాజ్యాంగం రూపుదిద్దుకునే క్రమానికి కూడా డాక్టర్ అంబేడ్కర్ పత్రికా రచన తోడ్పడింది అనడం అతిశయోక్తి కాదు. రాజ్యాంగ నిర్మాణ సభలో అంబేడ్కర్ చేసిన ప్రకటనలు, ఉపన్యాసాలను గనుక పరిశీలిస్తే, తన రచనల నుండి ఆయన సేకరించుకున్న అనేక అంశాల ప్రస్తావన,ముఖ్యంగా హక్కుల, న్యాయ, రాజ్యాంగ పారిభాషిక పదాల స్వీకారం కూడా ఆయన మహోన్నత సామాజిక,రాజనీతి తత్వజ్ఞాన,పాత్రికేయ రచనా పరంపర నుండి స్వీకారం పొందినవే అనే అంశాల్ని మనం గమనించగలం.

భారత దేశ పునర్నిర్మాణానికి ఇప్పటి పాత్రికేయులు, మీడియా సంస్థలు, మానవ హక్కుల కార్యకర్తలు, ఉద్యమ సంస్థలు, ఆయా ప్రభుత్వాల మీడియా సంస్థలు,రచయితలు సైతం ఆధునిక భారత ప్రజాస్వామ్య వ్యవస్థల నిర్మాణ శిల్పి,నిబద్దత కలిగిన పాత్రికేయుడు అయిన డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ జర్నలిజం నుంచి స్ఫూర్తి పొందవలసిన అవసరం ఎంతైనా ఉంది.

(కృపాకర్ మాదిగ వ్యాస రచయిత పాత్రికేయుడు,సామాజిక విశ్లేషకుడు,ఎమ్మార్పీఎస్ ఉద్యమ సహ వ్యవస్థాపకుడు)


Tags:    

Similar News