ఉద్యమాల నేపథ్యంలో తెలంగాణ తల్లి ఎలా రూపొందిందంటే...

ప్రముఖ రచయిత, తత్వవేత్త బిఎస్ రాములు చెబుతున్న విశేషాలు

Update: 2024-12-08 11:15 GMT

బి.యస్. రాములు 


తెలంగాణా భాషా సంస్కృతి , అస్థిత్వ రూపకల్పనలో ఎన్నో ప్రయత్నాలు చేశాను. అందులో తెలంగాణా తల్లి రూపకల్పన ఒకటి. తెలంగాణా రాష్ట్రం ఏర్పడేదాక ప్రతి నెలా ఒక పుస్తకం తెస్తానని 2005 నుండి 42 పుస్తకాలు ప్రచురించి పంచడం జరిగింది. నేను తెలంగాణ తల్లి రూపకల్పనలో ఎదుర్కొన్న సవాళ్ళు తక్కువేమీ కాదు. విప్లవోధ్యమం దశాబ్దాలుగా తెలంగాణాలో ప్రభావం వేస్తున్నది. వీరోచిత రూపంతో తెలంగాణ తల్లి ఉండాలని , తెలంగాణ ఉద్యమంలో పాల్గొంటున్న విప్లవాభిమానులు బలంగా భావించారు.

తెలంగాణ తల్లికి అసలు ఒక రూపం ఎందుకని అన్నవాళ్ళు కూడా ఉన్నారు. తెలంగాణ తల్లి అని విప్లవ పాటల్లో , మలి తెలంగాణ ఉద్యమ పాటల్లో అనేకమంది రాశారు. కీర్తించారు. వారందరి ఉద్దేశాలు వేరు. ఒక కథ , నవలలోని పాత్రలు సదువుకున్నప్పుడు పాఠకుడు తమకిష్టమైన రూపాన్ని ఊహించుకుంటారు. దాన్ని ఒక సినిమాగానో , టీవీ ఏపిసోడ్గానో తీసినప్పుడు నిర్ధిష్టమైన పాటలు , హావభావాలు చూపాల్సి ఉంటుంది. ఆ కథ , నవల చదివిన పాఠకుల ఊహలకు అనుకూలంగా ఉండకపోవచ్చు.

ప్రతి ఒక్కరూ ఒక్కొక్క రకంగా ఊహించి ఉండవచ్చు. ఊహల్లో చిత్రానికి నిర్ధిష్ట రూపానికి మధ్య చాలా అంతరం ఉంటుంది. రచయిత కూడా తనలో ఒక రూపాన్ని ఊహించుకుంటాడు. తన కథను సినిమాగా తీశాక , దాన్ని చూసి అసంతృప్తికి గురికావచ్చు. అది సహజం. ఇలాంటి సమస్య తెలంగాణ తల్లి రూపకల్పనలో ఎదుర్కోవడం జరిగింది. ఎన్ని రకాల చర్చలు జరిగాయో సంక్షిప్తంగా పేర్కొంటాను. ఇవన్నీ ఆలోచించి ఒక రైతు తల్లి , పల్లెటూరి తల్లి రూపాన్ని మొదట తయారు చేయించాను.

ఒక కష్టజీవిగా , సంపద సృష్టించే తల్లిగా కాస్త ఆవేశం , ఆత్మవిశ్వాసం కలగలసిన ఉద్యమ స్వరూపం ఉండాలనుకున్నాను. నాకు దొరికిన చిత్రకారుడు అసలు చిత్రకారుడు కాడు. అతడొక శిల్పాలు చేయడం నేర్చుకున్నవాడట. నాకు ఆ విషయం ముందు తెలియదు. ఆయనకు చేత్తో డ్రాయింగ్ వేయడం రాదు. ఎన్ని రకాలుగా చెప్పినా , ఆయనకు నేను అనుకున్నది కంప్యూటర్లో రూపం యివ్వడం సాధ్యం కాలేదు. చివరికి కంప్యూటర్ సహాయంతో ఏదో ఒక రూపం యిచ్చాడు. దానికే తెలంగాణతల్లి అని పేరు పెట్టి పుస్తకాలమీద వేశాను. పత్రికల్లో వేశాను. ప్లెక్సీల్లో వేశాను. చాలామంది మొమెంటోలమీద కూడా వేసుకున్నారు. విశాల సాహిత్య అకాడమి కార్యాలయం శివం చౌరస్తాలో మూడో అంతస్థు నుండి 20 ఫీట్ల ఫ్లెక్సీ బ్యానర్ని వేలాడదీశాను. 

వ్యాస రచయిత బిఎస్ రాములు

కరీంనగర్ , సిరిసిల్ల , జగిత్యాల కేసిఆర్ 2006 ఉప ఎన్నికల సభల్లో ఆవిష్కరించాము. ఇది జరిగినప్పుడు అనేకమంది అభ్యంతరాలు చెప్పారు. పాశం యాదగిరి సిరిసిల్లలో ఆవిష్కరిస్తూ ఇదేమి తెలంగాణ తల్లి అన్నాడు. గద్దర్ ఆవిష్కరిస్తూ తెలంగాణ తల్లి గిట్లుందేంది ? మా అవ్వ తీరుగ ఉండాల అన్నాడు. నేను అన్నాను. మీ అమ్మలాగ ఉండదు. విమలక్క లాగ కూడా ఉండదు. నీ కూతురు వెన్నెల లాగా ఉంటుంది. తెలంగాణ తల్లి అంటే 18 , 20 యేళ్ళకు పెళ్ళయితే 25 యేళ్ళకు ఇద్దరు పిల్లల మాతృమూర్తి అవుతుంది. అందువల్ల 25 యేళ్ళ వయస్సులో ఉండే తెలంగాణ తల్లిని రూపకల్పన చేశాను అని చెప్పడం జరిగింది.

రాజా రవివవర్మ కూడా దేవతల బొమ్మలను 25 , 30 యేళ్ళ వయస్కురాలుగానే చిత్రించి దేశానికి అంకితం చేశారు. ఆ మాటతో గద్దర్ విభేదిస్తూనే గొణుకున్నాడు. జగిత్యాల మీటింగ్కు పోతూ పోతూ బెల్లయ్య నాయక్ తెలంగాణ తల్లి రూపకల్పన గురించి మా లంబాడ తల్లి తీరుగ ఉండాలి అన్నాడు. ఇదేమి తల్లి అన్నాడు. నేనన్నాను నువ్వు రూపొందించుకో , మీ ఊరులో మీ తండాలో తెలంగాణ తల్లి అని లంబాడ తల్లిని తెలంగాణా తల్లిగా పెట్టు. ఎవరు వొద్దన్నారు. ఇలా కులానికి ఒక తల్లి గురించి తమ కులం వాళ్ళ లాగా ఉండాలని అనుకున్నారు. దీనికి అంతులేదు.

కంచ ఐలయ్య అందమైన ఆడపిల్లలాగా ఉందని , బాగా గ్లామర్ ఉందని వ్యాఖ్యానించాడు. కేసిఆర్ బిడ్డ కవిత లాగా కనపడుతుందని కూడా అన్నారు. ఆయన పెళ్లి గాని వాడు కదా ! ఆయన చూపు అటు పోయింది. ఆయనకు కూడా జవాబిచ్చాను. కొందరు అన్నా మనకు బతుకమ్మ తల్లి ఉంటే బాగుంటుంది కదా అని అన్నారు. అలా కొంత కాలానికి బతుకమ్మను చేతిలో పెట్టి బొమ్మ గీయించాను. ఈ చిత్రకారుడు కాని చిత్రకారుడు కంప్యూటర్లో గీకి గీకి బక్కపలచని బొమ్మ వేశాడు.

ఆయనకు డ్రాయింగ్ రాదు. ఏం చేయాలి. ఏలె లక్ష్మణ్ వంటి వాళ్ళను అడిగితే ఆరు చేతులు గల బొమ్మ ఒకటి వేశాను. దాన్ని తెలంగాణ తల్లి కింద చెప్పవచ్చు కదా ! అని అన్నాడు. ఆ ఆరు చేతుల్లో అనేక పనిముట్లు తెడ్డుతో సహా ఉన్నట్టున్నాయి. ఆరు చేతుల తల్లి తెలంగాణా తల్లి ఎట్లవుతుంది ? ఇంకో బొమ్మ వేయరాదా అంటే నాతో కాదన్నాడు. దుర్గం రవీందర్ , నేను చర్చించి , చర్చించి చివరికి ఒక చిత్రకారుడు ఉన్నాడు. ఆయన్ని అడుగుదాము అని అన్నాడు. అప్పటిదాకా వేయించిన పది , పదిహేను రకాల బొమ్మలను ఆయనకు యిచ్చాను. ఆయన ఒక బొమ్మ తయారు చేసి యిచ్చాడు. ఈ లోపు కేసిఆర్ అందరిని పిలిచి తెలంగాణ తల్లి రూపకల్పన గురించి మీటింగు పెట్టాడు.

అట్ల మూడు నాలుగు మీటింగులయ్యాయి. ఎక్కా యాదగిరిరావు , కాపు రాజయ్య , ఏలె లక్ష్మణ్ , జెఎన్టియు చిత్రకారుడు లెక్చరర్ గంగాధర్ తదితరులు మాతోపాటు పాల్గొన్నారు. ఒక సైద్ధాంతిక తాత్విక చర్చ సాగింది. భరతమాత రాజ మాతా కదా !. భరతమాత రాజమాత గనుక కిరీటం పెట్టడం జరిగింది. మరి మన తెలంగాణా తల్లికి కూడా కిరీటం ఉండాలి. మన తెలంగాణాను దోచుకుపోవడం వల్ల ఇవాళ పేద తల్లిగా కనపడుతున్నది. రేపు మనం సంపన్నం అవుతాము కదా !. అప్పుడు తల్లిని మార్చుకోలేము కదా !. అందుకని తెలంగాణా తల్లిని భరతమాతా లాగా కిరీటంతో సహా తీర్చిదిద్దాలి అని ప్రతిపాదించాడు కేసిఆర్. అందరు ప్రతిపాదన బాగానే ఉందని అనుకున్నారు.

నేను ఒక మంచి కిరీటం వెతికి పెట్టించాను. తొమ్మిది జిల్లాల ఆనవాళ్ళను తెలంగాణ తల్లి భరతమాత ముద్దుబిడ్డగా , రాజమాతగా రూపొందించాను. దీనికోసం కూడా బృందం అనేక సూచనలు చేసింది. కిరీటంలో ప్రపంచ  ప్రఖ్యాతి గాంచిన కోహినూర్ వజ్రం పెట్టడం జరిగింది. అది నైజాం రాజ్యానికి ప్రతీక. అలాగే నైజాం గణుల్లో లభించిన జాకబ్ వజ్రాన్ని వజ్రాణంలో ఇమర్చడం జరిగింది. గద్వాల చీరను అలంకరించాను. సంపన్నమైన బంగారు నగలను తెలంగాణ తల్లులు ధరిస్తుంటారు. ' కంటె ' అనేది చిన్నప్పటినుంచి మా అమ్మ మెడలో ఉండేది. చేతికి బంగారు దండ కడియం ఉండేది. కాళ్ళకు వెండి కడియాలు ఉండేవి. వెండి కడియాలు , మట్టెలు కరీంనగర్ వెండి పని తనానికి చిహ్నంగా తీసుకోవడం జరిగింది. నగలు నిజామాబాద్ నుండి తీసుకోవడం జరిగింది.

మన నీళ్ళన్నీ ఇతరులు తరళించుకుపోయారని మక్క కంకి , జొన్న కంకి మెట్ట పంటలకు ప్రతీకగా తీసుకున్నాము. అన్ని జిల్లాల్లో ఈ పంటలున్నాయి. ఇలా పది జిల్లాల ఆనవాళ్ళను తెలంగాణా తల్లిలో పొందుపర్చడం జరిగింది. ఒక కిరీటం పెట్టాము. అంతా ఓకే అయిపోయింది. ఆకుపచ్చ చీరతో సశ్యశ్యామలంగా కనపడుతున్న తెలంగాణ తల్లి కిరీటం ధరించి కొత్తరూపం సంతరించుకుంది. అంతా అయిపోయిన తర్వాత ఆలె నరేంద్ర అటుగా వచ్చాడు. తెలంగాణ తల్లి రూపకల్పన గురించి వివరించిన తర్వాత విన్నాడు. అయితే భరతమాత మజెంతా కలర్ చీర కట్టింది కదా ! తెలంగాణ తల్లి భారతమాత ముద్దుబిడ్డనే కదా !. కనుక చీర కలర్ మారిస్తే బాగుంటుంది అని అన్నాడు.

అలా టిఆర్ఎస్ రంగు కూడా కావడంతో చాలామంది మౌనంగా అంగీకరించారు. అట్లా ఆకుపచ్చ చీరపై మజెంతా రంగు చీర వచ్చింది. ఈ మార్పులన్నీ ఎప్పటికప్పుడు నేను వేస్తున్న పుస్తకాలమీది బొమ్మల్లో చూడవచ్చు. తొలుత కొంగు నడుముకు చుట్టి పనిచేసే గ్రామీణ తల్లి. ఆ తర్వాత బతుకమ్మ ఎత్తుకున్న తల్లి , ఆ తర్వాత ఆకు పచ్చ చీర తెలంగాణ తల్లి , ఆ తర్వాత మజెంతా కలర్ చీరతో , కిరీటంతో తెలంగాణా తల్లి ఇలా ముందుకు వచ్చింది. ఈ రూపకల్పనలో శివం చౌరస్తాలో గల విశాల సాహిత్య అకాడమీలో ఎందరో చర్చల్లో పాల్గొన్నారు. ముఖ్యంగా నంది నిర్మాలారెడ్డి , గెల్లు శ్రీనివాస్ , దుర్గం రవీందర్ తదితరులు రెగ్యులర్గా పాల్గొన్నాడు. మొదటివి తెలంగాణ తల్లి విగ్రహం మనమే పెట్టించాలి అనుకున్నాము. నేను పెట్టిస్తాను అని వరంగల్ రూట్లోని తిరుమలగిరి చౌరస్తాలో పెట్టిస్తానని నంది నిర్మలారెడ్డి అన్నారు.

 సిద్ధిపేటకు చెందిన శిల్పి నరసింహులును పిలిచి పని అప్పగించాను. అడ్వాన్సు యిచ్చాను. ఆయన చక్కని శిల్పి. ఆ విగ్రహం తయారయింది. ఇప్పుడు క్యాలెండర్లో కిరీటంతో తెలంగాణా తల్లి ఎలా ఉందో , అచ్చం అలాగే తీర్చిదిద్దాడు. నంది నిర్మలారెడ్డి నా దగ్గర పైసలు లేవు అని తప్పుకుంది. మరి శిల్పికి డబ్బులివ్వాలిగా , కొన్ని యిచ్చి తర్వాత యిస్తాను అని అన్నాను. ఈలోపు గోదావరి ఖని నుంచి సింగరేణి కార్మికులందరు వారి పనిమీద నన్ను కలిశారు. వాళ్ళకు ఒక కరపత్రం రాసి యిచ్చిన తర్వాత తెలంగాణ తల్లి విగ్రహం పెట్టవచ్చు కదా అని ప్రతిపాదన చేశాను. వాళ్ళు చాలా బాగుంటుంది అని అన్నారు. విగ్రహం నెలకొల్పే బాధ్యత వాళ్ళకు అప్పగించాను. గోదావరిఖని బస్టాండ్కు ఎదురుగా పెద్ద బొంద ఉంది. ఆ బొందలో 60 , 70 లారీల మొరం మట్టి పోస్తే భూమి లెవల్ అవుతుంది. ఆ పనికి పూనుకున్నారు.

ఆ విషయం తెలిసి స్థానిక ఎమ్మెల్యేనైన నన్ను కాదని వేరేవాళ్ళను తెలంగాణా తల్లి విగ్రహం పెడితే నా పదవి ఏం కావాలి ? అని కొప్పుల ఈశ్వర్గారు అడ్డుకున్నారు. ఆయన బస్టాండ్లో ఒక తెలంగాణ తల్లి విగ్రహాన్ని పెట్టించాడు. అది పూర్తయిన తర్వాత ముందు అనుకున్నట్టుగా బస్టాండ్కు ఎదురుగా ఉన్న బొంద నింపి అక్కడ అద్భుతంగా చాలా ఎత్తయిన తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించడం జరిగింది. ఈ ఆవిష్కరణకు నాగం జనార్ధన్రెడ్డి , బి.ఎస్. రాములు , కవితతో సహా 50 మంది వేదికమీద కొలువు తీరారు. ఆ కార్మిక మహానాయకులు విగ్రహం రూపశిల్పి బి. ఎస్. రాములు అనే పేరును వాళ్ళందరి పేర్లు అయిపోయినాక అట్టడుగున చేర్చారు. నా పేరు ఎక్కడుందో నాలుగు వైపులా పెట్టిన పలకాల్లో వెతగ్గా వెతగ్గా కనపడింది. అది వాళ్ళ సంస్కారం.

అలా మొదట పెట్టాల్సిన విగ్రహం చాలా ఆలశ్యంగా నంది నిర్మలారెడ్డి వల్ల , కొప్పుల ఈశ్వర్ వల్ల ఆలశ్యం అయిపోయింది. మొట్టమొదటగా తెలంగాణా తల్లి క్యాలెండర్ను కళాజ్యోతి ప్రెస్సులో పెద్ద సైజులో వేయించడం జరిగింది. దానికి కేసిఆర్ , ఎన్నెం శ్రీనివాసరెడ్డిని బిల్లు చెల్లించమన్నాడు. ఎన్నెం శ్రీనివాసరెడ్డి దాని ఖర్చులు భరించాడు. ఆ క్యాలెండరిని ఇప్పుడు తెలంగాణా తల్లి విగ్రహం పెట్టిన తెలంగాణా భవన్ స్థలంలో ఆ  క్యాలెండర్ను ఆవిష్కరించడం జరిగింది. తెలంగాణా జాతి ఉన్నంత కాలం బి.ఎస్.రాములు అన్న పేరు చరిత్రలో సువర్ణ అక్షరాలతో లిఖించబడుతుంది అని ఆ సభలో కేసిఆర్ ప్రశంసించారు. ఆ తర్వాత నిజాం కాలేజి గ్రౌండ్లో జరిగిన తెలంగాణ సంబురాల్లో కేసిఆర్ తెలంగాణ తల్లి రూపకర్తగా నాకు బంగారు కడియం తొడిగారు. నాతోపాటు తుదిరూపం యిచ్చిన గంగాధర్కు కూడా బంగారు కడియం తొడగడం జరిగింది. అలా విగ్రహాలను పెట్టుకుంటూ పోవడం జరిగింది.

ఆ తర్వాత తెలంగాణ తల్లి విగ్రహాన్ని తెలంగాణా భవన్లో నెలకొల్పడం జరిగింది. ఇలా తెలంగాణా తల్లి రూపకల్పన ఏకబికిన సాగింది కాదు. ఒకే రూపంలో ముందుకు రాలేదు. ఎందరో ఎన్నో రకాలుగా సూచనలు చేశారు. విమర్శలు చేశారు. కొందరు చిత్రకారులు కేసిఆర్ ముందు మేం వేస్తాము అంటూ పోటీ పడ్డారు. నేను వారిని జాగ్రత్తగా కట్ చేశాను. ఎనిమిది నెలల నుంచి తెలంగాణా తల్లి రూపకల్పన కోసం ఇన్ని తిప్పలు పడుతుంటే ఇంకొకరికి ఎందుకు అప్పగించాలి నేను ?. అలా ప్రారంభం నుండి చివరి దాకా అనేక రూపాలలో తెలంగాణా తల్లిని రూపొందించడంలో అన్నీ నేనై నిర్వహించడం జరిగింది. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం సచివాలయంలో పెడుతున్న తెలంగాణా తల్లి విగ్రహం నేను రూపొందింపజేసిన తొలి రూపమే తప్ప వేరు కాదు. ఈ విషయం ఆ గంగాధర్ , రేవంత్రెడ్డిగారికి చెప్పాడా ? చెప్పడు.

అన్ని రూపాలను ఆయనకు ఆనాడే సీడీలతో సహా , పెన్న్డ్రైవ్ తో సహా అప్పగించాను. అయినా ఒక్కనాడు కూడా ఆయన నోట బి.ఎస్. రాములుగారు నా చేత రూపొందింప జేశారు అని చెప్పలేకపోయాడు. ఇది ఆ చిత్ర విచిత్రకారుల మనస్తత్వం. ప్రభుత్వం తెలంగాణా తల్లి రూపకర్త అయిన బి.ఎస్. రాములుగారిని సముచితంగా ఆహ్వానించి గౌరవించుకోకపోతే అది చరిత్రలో ఒక మచ్చగా మిగిలిపోతుంది అని
గమనించడం అవసరం.


(బి.యస్. రాములు, సామాజిక తత్వవేత్త )

Tags:    

Similar News