అరెస్టును ఒక ఆయుధంగా రేవంత్ రెడ్డి మార్చుకుంటున్నారా?
ప్రజల ఉద్యమానికి మద్దతుగా మైలారం వెళుతున్న ప్రొఫెసర్ హరగోపాల్ ను అరెస్టు చేయడం దీనినే సూచిస్తుంది అంటున్నారు TPJAC కో కన్వీనర్ కన్నెగంటి రవి.;
ప్రజాఉద్యమాలతో తెలంగాణ ప్రభుత్వం వ్యవహరించే తీరు ఎలా ఉండాలి?
రాష్ట్ర ప్రజలందరికీ ఒక విషయం గుర్తుండే ఉంటుంది. 2023 లో రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఒక టీవీ చానల్ చర్చలో అప్పటి PCC అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారు పాల్గొంటూ, చర్చలో భాగంగా ఉన్న ప్రొఫెసర్ హరగోపాల్ ని “ తెలంగాణ లో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక, మా ప్రజా ప్రతినిధులకు, పోలీసులకు ప్రజా స్వామిక హక్కులు, పౌరహక్కులపై క్లాసులు చెప్పాలని" కోరాడు.
తాజాగా జనవరి 20 న నాగర్ కర్నూల్ జిల్లా మైలారంలో మైనింగ్ పేరుతో, గుట్టలను ధ్వంసం చేయడం ఆపాలని డిమాండ్ చేస్తూ స్థానిక గ్రామస్తులు, ప్రారంభిస్తున్న రిలే నిరాహార దీక్షల శిబిరాన్ని ప్రారంభించడానికి వెళుతున్న ప్రొఫెసర్ హరగోపాల్ ని, పౌరహక్కుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గడ్డం లక్ష్మణ్ ని దారిలోనే అరెస్టు చేసి , వెల్దాండ పోలీసు స్టేషన్ కు తరలించారు. రాష్ట్ర ప్రభుత్వ తాజా ధోరణికి ఇది నిదర్శనం.
ఇలాంటిదే మరో ఘటన రెండు రోజుల క్రితం జరిగింది. రంగారెడ్డి జిల్లా యాచారం మండలం లో రాష్ట్ర ప్రభుత్వం నెలకొల్పుతానంటున్న గ్రీన్ ఫార్మా సిటీ కి వ్యతిరేకంగా పోరాడుతున్న ఫార్మా సిటీ వ్యతిరేక పోరాట కమిటీ ఇటీవల రైతులకు, గ్రామీణ ప్రజలకు ఫార్మా సిటీ విషయంలో గత, ప్రస్తుత ప్రభుత్వ విధానాలు, భూ సేకరణ సమస్యలు, ఫార్మా సిటీ తో మొత్తం ప్రజలకు,పర్యావరణానికి వచ్చే ముప్పు పై అవగాహన కల్పించడానికి గ్రామాలలో పాద యాత్రలు, సమావేశాలు నిర్వహించాలని తలపెట్టింది. ఒకటి రెండు గ్రామాలలో సమావేశాలు పెట్టగానే పోలీసులు సమావేశాలను అడ్డుకున్నారు. గ్రామాలలో సమావేశాలు పెట్టడానికి వీలు లేదని ఆదేశించారు. స్థానిక ACP కూడా ఈ మేరకు రాత పూర్వక ఆదేశాలు జారీ చేశారు. ఈ ఆదేశాలను ఛాలెంజ్ చేస్తూ ఫార్మా సిటీ వ్యతిరేక పోరాట కమిటీ రాష్ట్ర హైకోర్టు ను ఆశ్రయించింది.
కోర్టు ACP ఇచ్చిన ఆదేశాలను కొట్టి వేస్తూ , ప్రజలకు ఉండే భావ ప్రకటనా స్వేచ్ఛ హక్కును ఎత్తి పడుతూ వివరమైన తీర్పు ఇచ్చింది. ఈ తీర్పు అనంతరం పోరాట కమిటీ , జనవరి 18 న యాచారం మండలం నానక్ నగర్ లో నాలుగు గ్రామాల రైతులతో సమావేశం ఏర్పాటు చేసుకున్నారు. సమావేశానికి పర్యావరణ వేత్త డాక్టర్ కె. బాబూరావు, TPJAC కో కన్వీనర్ కన్నెగంటి రవి, రాజగోపాల్, హై కోర్టు న్యాయవాది సాదిక్ అలీ, NAPM నాయకులు మీరా సంఘమిత్ర, మానవ హక్కుల వేదిక నాయకులు సంజీవ్ ,రోహిత్, రాజేష్ హాజరయ్యారు. పోరాట కమిటీ కన్వీనర్ సరస్వతి కవుల అధ్యక్షతన సమావేశం ప్రారంభం అవుతుండగా, సమావేశాన్ని చెదర గొట్టడానికి పోలీసులు వచ్చారు, స్థానిక CI, SI నేతృత్వం లో వచ్చిన పోలీసులు సమావేశ నిర్వహకులతో వాగ్వాదానికి దిగారు. రాష్ట్ర హై కోర్టు తీర్పు ను చదివి వినిపించినా, ఏదో రకంగా , సమావేశాన్ని ఆపడానికి పోలీసులు ప్రయత్నం చేశారు. కానీ రైతులు, స్థానిక ప్రజలు ధృడం గా నిలబడి జవాబు ఇవ్వడంతో వెనక్కు తగ్గారు.
గత ప్రభుత్వం లాగే, ఈ ప్రభుత్వం కూడా ప్రజలు లేవనెత్తే సమస్యల పరిష్కారానికి సరైన పద్ధతులు అనుసరించకుండా, పోలీసులపై ఆధారపడడం ఇది మొదటి సారి కాదు. ప్రజాస్వామిక పాలన అందిస్తామని ఏడవ గ్యారంటీగా రేవంత్ ప్రభుత్వం ప్రకటించినా, దాని అమలులో ఇంకా పోలీసు పోకడలు కనపడుతున్నాయి.
2023 డిసెంబర్ లో ఈ ప్రభుత్వం అధికారం చేపట్టిన కొద్ది రోజులకే, 2024 జనవరిలో నారాయణ పేట జిల్లా మరికల్ మండలం పరిధిలో జూనియర్ కాలేజీ లెక్చరర్ బందరి లక్ష్మయ్య, రిటైర్డ్ టీచర్ చంద్రశేఖర్ తో పాటు, మరో ఆరుగురు రైతులపై అన్యాయంగా రౌడీ షీట్ ఓపెన్ చేయడంతో ఈ పోలీసు పోకడలు మొదలయ్యాయి. నిర్మల్ జిల్లా దిలావర్ పూర్ మండలం లో పదుల కొద్దీ రైతులపై కూడా ఇదే విధంగా కేసులు నమోదు చేశారు. ఈ రెండు ప్రాంతాల ప్రజలు చేసిన నేరం – తమ తమ ప్రాంతాలలో ఏర్పాటు చేస్తున్న ఇథనాల్ పరిశ్రమలకు ఇచ్చిన అనుమతులను రద్ధు చేయాలని పోరాడడమే.
దిలావర్ పూర్ లో ఇథనాల్ కంపనీ ఏర్పాటుకు వ్యతిరేకంగా పోరాడుతున్న ప్రజలకు సంఘీభావం తెలియ చేసిన పభూత్వా స్కూల్ ప్రధానోపాధ్యాయడు , ఆరేపల్లి విజయ్ కుమార్ పై కూడా ఆగస్ట్ 14 న ఒక తప్పుడు కేసు బనాయించారు. నిజానికి ఆ రోజు ఆయన స్కూల్ లో మరుసటి రోజు జరపాల్సిన స్వాతంత్ర్య దినోత్సవ ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఆగస్ట్ 14 న పెట్టిన కేసు ఆధారంగా ఆయనను ఉద్యోగం నుండీ సస్పెండ్ చేశారు. పోలీసులు ఇచ్చిన తప్పుడు నివేదిక ఆధారంగానే ఈ సస్పెన్షన్ జరిగింది. రాష్ట్ర వ్యాపితంగా వచ్చిన నిరసనలు , స్థానిక రైతుల ఆందోళనల కారణంగా ఆయన సస్పెన్షన్ ను జనవరి 2 న ఎత్తేసినా , కక్ష సాధింపుగా ఆయనను వేరే స్కూల్ లో తన కంటే చాలా జూనియర్ అయిన హెడ్ మాస్టర్ కు రిపోర్ట్ చేయాలని ఆదేశించారు. ఆయనను వ్యక్తిగతంగా అవమానించడం, భయపెట్టడం లక్ష్యంగా ఇది జరిగిందనేది వాస్తవం.
మరో వైపు నిర్మల్ జిల్లా పోలీస్ సూపరెండెంట్ , స్థానిక ప్రజా ఉద్యమానికి నాయకత్వం వహించిన ఒక యువకుడిని ( స్థానికంగా తాను జర్నలిస్టు కూడా) ఎస్పి కార్యాలయంలో కూర్చోపెట్టి బెదిరించింది. “స్థానికంగా ఇథనాల్ పరిశ్రమను రద్ధు చేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించగానే , మీరు సంబర పడుతున్నారని, మంత్రుల ప్రకటనలు పట్టుకుని ఎగిరి పడుతున్నారని, ఇది ఎంతో కాలం ఉండదని, 2024 లాగా, 2025 ఉండదని, స్థానిక ASP కి మీ కేసు అప్పగించానని, ఆయన మీ విషయం చూస్తాడని, ఇకపై ఆందోళనలు చేస్తే , పోలీసులు వజ్ర వెహికిల్ తో వస్తారని “ హెచ్చరించింది. మొదటి నుండీ జిల్లా ఉన్నత పోలీసు అధికారులు, అక్కడి ప్రజా ఉద్యమం పట్ల వ్యతిరేకంగానే ఉన్నారు. చీటికి మాటికి కేసులు బనాయించారు. యాజమాన్యం పక్షాన నిలబడి ప్రజా ఉద్యమాన్ని అణచి వేయడానికి అనేక ప్రయత్నాలు చేశారు. గ్రామాలలో కూడా పోలీసు నిఘా పెంచారు.
తాజాగా ఇథనాల్ కంపెనీకి వ్యతిరేకంగా మరోసారి ప్రజలను సమీకరించడానికి చిత్తనూరు ప్రాంతంలో చుట్టూ గ్రామాలలో స్థానిక పోరాట కమిటీ కరపత్రాలతో ప్రచారం సాగించింది. జనవరి 28 న మహబూబ్ నగర్ లో ఒక సమావేశం కూడా ఏర్పాటు చేసుకున్నది. కానీ ఈ కదలికలను అడ్డుకోవడానికి స్థానిక మరికల్ SI, 2024 జనవరి లో రౌడీ షీట్ లో పేర్లు ఉన్న అందరినీ మళ్ళీ ఫోన్ లు చేసి పోలీసు స్టేషన్ కు వచ్చి కలవాలని ఆదేశిస్తున్నాడు. రౌడీ షీట్ ను రెన్యువల్ చేస్తానని బెదిరిస్తున్నాడు. తమంతట తాము రాకపోతే, పోలీసులు వచ్చి తీసుకు వస్తారని కూడా హెచ్చరిస్తున్నాడు.
సమస్యలు ఎదుర్కునే ప్రజలు , తమ సమస్యల పరిష్కారం కోసం ఉద్యమాలు చేయడం సహజం. సమావేశాలు, సభలు, ర్యాలీలు, ధర్నాలు, పికెటింగ్ లు, కరపత్రాలు పంచడాలు, పాదయాత్రలు , సమ్మెలు, రాస్తా రోకో లు, -ఇవన్నీ ప్రజలు ఉద్యమ రూపాలుగా తమ నిరసనను ప్రకటించడానికి ఎంచుకునే మార్గాలు.
రాజ్యాంగ బద్ధంగా పాలన సాగిస్తామని , ప్రజల సమస్యలను పరిష్కరిస్తామని, ప్రజాస్వామ్యయుతంగా ప్రజలతో వ్యవహరిస్తామని ప్రకటించే అధికారం చేపట్టే ప్రభుత్వాలు , ప్రజా ఉద్యమాలతో వ్యవహరించే పద్ధతి ఎలా ఉండాలి? ప్రజల గొంతు వినడానికి ఏ పక్రియ మెరుగైనది ? ఏ పార్టీ ప్రభుత్వం అధికారంలో ఉన్నా ఆ ప్రక్రియను అనుసరిస్తున్నాయా? అంటే లేదనే చెప్పాలి.
ప్రజలెప్పుడూ ఒకే రకంగా ఉంటారు. తమ సాధారణ జీవితాలను మెరుగు పరుచుకోవడానికి నిత్యం శ్రమ చేస్తారు. తమ జీవనోపాధులను కాపాడుకోవడానికి, తమ చేతుల్లో ఉన్న సహజ వనరులను రక్షించుకోవడానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తారు. ఇతరులతో సఖ్యంగా, సహకార స్పూర్తితో ఉండడం ద్వారా, ప్రజల మధ్య సుహృద్భావ సంబంధాలను ఉంచుకోవడానికి ప్రయత్నం చేస్తారు. సమాజ జీవనానికి అవసరమైన ఉత్పత్తులను, సేవలను అందించడానికి కృషి చేస్తారు. స్వయంగా సహజ వనరులు చేతుల్లో లేక, శారీరక శ్రమపై ఆధారపడి జీవించే వేతన జీవులు , కనీస సాంఘిక బధ్రతను , ప్రభుత్వ పథకాల నుండీ సహాయాన్నీ కోరుకుంటారు.
వీటన్నిటినీ సమకూర్చాల్సిన బాధ్యత, ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాల మీద ఉంటుంది కనుక, కొన్ని డిమాండ్లను, ఆకాంక్షలను ప్రభుత్వాల ముందు పెడతారు.ఎందుకంటే, ప్రజల చేతుల్లో పన్నుల వసూళ్ల ద్వారా సమకూర్చుకున్న నిధులు ఉంటాయి. ప్రజలకు సేవలు అందించడానికి అవసరమైన అధికార గణం ప్రభుత్వ చెప్పు చేతుల్లో ఉంటుంది.
ప్రజాస్వామిక పాలన అంటే, రాజ్యాంగ బద్ధంగా , చట్టబద్ధంగా పరిపాలించడం. ప్రజల తో వ్యవహరించడంలో పోలీసులను ముందు పెట్టకుండా ప్రభుత్వం ప్రజాస్వామికంగా వ్యవహరించాల్సి ఉంటుంది. ప్రజల సమస్య ముందుకు వచ్చినప్పుడు, స్థానిక ప్రజా ప్రతినిధుల నుండీ, రాష్ట్ర ప్రజా ప్రతినిధుల వరకూ జోక్యం చేసుకుని ప్రజలతో, ప్రజా సంఘాలతో మాట్లాడాలి. ప్రభుత్వం దృష్టికి సమస్య తీవ్రతను తీసుకు వెళ్ళాలి.
స్థానిక, రాష్ట్ర అధికారులు కూడా రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి సమస్యను తీసుకు వెళ్ళడానికి, ఉన్న చట్టబద్ధ అవకాశాలను ప్రభుత్వం ముందు ఉంచాలి. అంతే తప్ప పరిశ్రమల యజమానులు, కాంట్రాక్టర్ల కోసం పని చేయకూడదు. ప్రజాస్వామిక పాలనలో కీలకమైన ఈ పని తీరును ప్రభుత్వం మిగుల్చుకోవాలి. లేనట్లయితే తెలంగాణలో ప్రభుత్వం పోలీసు రాజ్యాన్ని నడుపుతుందన్నబీజేపీ , BRS లాంటి ప్రతిపక్ష పార్టీల విమర్శలను ప్రజలు విశ్వసించే రోజులు ఎంతో దూరం లేవు.