రాయలసీమను ఎండబెట్టినందునే విజయవాడ వరదల్లో మునిగిందా?

కరువుపీడిత ప్రజల నీటి ఇక్కట్ల నటుంచి, నీళ్లన్నీ మాకే అనేలా ఎప్పుడూ సస్యశ్యామలంగా వుండే డెల్టా ప్రాంతాలు వ్యవహరిస్తే నష్టపోతారనేది ప్రకృతి గట్టిగా చెప్పింది

Update: 2024-09-19 08:40 GMT

-అరుణ్

నేడు కృష్ణా డెల్టా ప్రాంతాల్లో, ముఖ్యంగా విజయవాడ ప్రాంతంలో  వరదలతో  జన జీవనం అతలాకుతలమైంది.  ఇంకా ఈ ప్రాంతం ప్రమాదంలోనే వుందని వార్తలు వస్తున్నాయి.జనజీవనం స్థంభించి,లక్షలాదిమంది  సర్వస్వం కోల్పోయి పునరావాస కేంద్రాలలో నివసించారు. ఈ విషాదం తెలుగు ప్రజలoదరిది. కేవలం ప్రభుత్వ సహాయంతోనే వారు ఈ దుస్థితి నుండి బయట పడలేరు. అందరం తలొకచేయి అందించాలి. .ఏ విపత్తులోనైనా ప్రధాన భాదితులు పేదలే. మరి ఈ విపత్తు కారణం- ప్రధానంగా బుడమేరు వరదలను ముందుగా ఊహించి, తగిన చర్యలు తెసుకోకపోవడమేనని సర్వత్రా వినబడుతూ ఉంది.  కృష్ణా వరదజలాలను, కొంతమేరకైనా పైభాగాన వున్న రాయలసీమ ప్రాంత జలశయాలకు మళ్ళించే అవకాశాలున్నా, తగిన ఏర్పాట్లు చేయకుండా అంటే  అక్కడి కాలువుల,రిజర్వాయర్ల రిపేరు చేపట్టకపోవడంతో, కృష్ణా వరద జలాలు నాగార్జున సాగర్ ద్వారా విజయవాడకు ముంచెత్తింది. ఇది బుడమేరును అడ్డుకోనడంతో ఈ విపత్తు కలిగిందని విజ్ఞులంటున్నారు.  ఇక రాజకీయపార్టీలు ప్రజల కష్టాలలోను లబ్ది పొందాలని చూస్తాయి. పాలక,ప్రతిపక్ష పార్టీలు త్వం శుంఠ అంటే త్వం శుంఠ అని నిందించుకోవడం లో వింతేమి లేదు. వరదలు వచ్చాయి విజయవాడ మునిగి పోయింది ,ఇది కళ్ళెదుటున వున్న సత్యం.

అయితే ఆ కాలంలోనే శ్రీశైల జలాశయం ఆరుమార్లు నిండి నీరంతా కిందికి చేరిoదంటున్నారు. అదే వరద కాలంలో  రాయలసీమ లోని చిన్నా చితక జలాశయాలు పూర్తిగా నిండకపోవడానికి కారణమేమిటి? రెండేళ్ళకిందట కొట్టుకపోయిన అన్నమయ్య ప్రాజెక్టు(2.24 టిఎం సి), ఏడేండ్లనుండి రేపెర్లకు నోచుకోలేదు. పూర్తిగా సమతల ప్రదేశంగా మారిన అలగనూరు రిజర్వాయర్(2.97 టిఎం సి ) విషయం పక్కకు పెడితే, కేవలం ఒక టిఎంసి లోపు నిల్వ సామర్థ్యం గల అనేక రిజర్వార్లు (జుర్రేరు,గోద్దుమర్రు, కల్యాణి డ్యాం, పెద్దేరు, బహుద, మల్లిమడుగు, చేన్నరాయస్వామి గుడి ప్రాజెక్ట్, దామోదర సాగరం, క్రిష్ణగిరి, బుగ్గవంక, మారాల, ఫించ, యోగివేమన)  నీళ్ళకు నోచుకోక పోవడానికి కారణాలేమిటో ఆలోచించాలి.


విపత్తులపుడే ప్రజలకు గుర్తుకు వస్తారా?

మన పాలకులకు మొదటి నుండి విపత్తులేర్పదడినప్పుడే ప్రజలు జ్ఞప్తికి వస్తారు. తాత్కాలిక ఉపశమన చర్యలతో ప్రభుత్వాలు చేతులు దులుపుకుంటాయి. అయితే, భాదాకరమైనా, ఇలాంటి విషాదసమయంలో వివిధ ప్రాంతాల మధ్య నీటి పంపిణీలో అసామనతలే గాక, వాటిని సక్రమంగా అందించే విషయం లో రాయలసీమ లాంటి ప్రాంతాల పట్ల ప్రభుత్వాలు జూపుతున్న వివక్షతను ఎత్తి చూపక తప్పదు. తాము కష్టాల బారిపదినప్పుడే ఇతరుల కష్టాలు అర్థం జేసుకొనే మనస్తత్వం మనది. ఈ వివక్షత వల్ల నిత్యమూ కరువుపీడిత ప్రజల ఇక్కట్ల నటుంచి, ఎప్పుడూ సస్యశ్యామలంగా వుండే డెల్టా ప్రాంతాలు నష్టపోతాయని ప్రకృతి గుణపాటం నేర్పుతుంది.

కొన్ని చెడువాస్తావాలను చూద్దాం. రాష్ట్ర విస్తీర్ణంలో 42% భూభాగం గల రాయలసీమ కు గత 10 బడ్జెట్లో కేటాయించింది కేవలం 15% నిధులే. అదేవిధంగా రాష్ట్రంలోని వ్యవసాయయోగ్యమైన భూమిలో రాయలసీమలో 42% ఉండగా నీటి కేటాయింపులు కేవలం 10%. సరే, అవైనా సక్రమంగా అందుతున్నాయా అంటే, ప్రభుత్వ గణాంకాల ప్రకారం గత పదేండ్ల లో సీమకు అందినది కేవలమ 5% మాత్రమే. మరి మిగటా నీరంతా ఏమయినట్టు. గత కొన్ని సంవత్సరాలుగా వందలాది టిఎం సి ల నీరు సనుద్రం పాలవుతున్నట్టు ప్రభుత్వమే చెబుతుoడిగా! నీటికేటాయిoపులలో ప్రభుత్వ ప్రమేయం ఏమీ లేదని వాటిని ట్రిబ్యూనల్లు కేటాయించాయని వాదించవచ్చు. మరి ఈ ప్రభుత్వాలు బచావత్ కేటాయింపులను అమలుజేస్తూ ఉన్నాయా?


బచావత్ ప్రకారం ,కృష్ణా డెల్టాకు కేటాయించిన కృష్ణా జలాలు 181.2 టిఎంసి లు. కాగా,వాటిలో కేవలం 80టిఎంసి లు మాత్రమే శ్రీశైలం నుండి, సాగర్ ద్వారా కృష్ణా డెల్టాకు కేటాయించిననది. మిగిలిన 101.2 టిఎంసిలు సాగర్-ప్రకాశం బ్యారేజి మధ్యన సమకూరే మూసి, మున్నేరు లాంటి నదుల జలాలు. అంటే శ్రీశైలం నుoడి కృష్ణా డెల్టాకు అందవలసినది కేవలం 80టిఎంసి లు మాత్రమే. (ఇప్పుడు పట్టిసీమ ఎత్తిపోతల పథకం ద్వారా 80టిఎంసి ల గోదావరి జలాలు డెల్టాకు అందుతున్నాయి. కాబట్టి, వాస్తవంగా కృష్ణా డెల్టాకు శ్రీశైలం నుండి ఒక చుక్క నీరు వదలాల్సిన పనిలేదు.).


కడుపు నిండిన వాళ్ల వేదాంతం


అయితే, అభివృద్ధిని రుచిచూసిన ప్రాంతాల వారి ఆలోచనలు వేరుగా వుంటాయి. తమకు సాగర్-ప్రకాశo బ్యారేజి మధ్య ప్రాంతం నుండి సమకూరే నీటిని నిలవజేసుకోవాలంటే, తమ ప్రాంతంలో రిజర్వాయర్ల నిర్మించుకోవాలి. అలా చేయాలంటే కొంత భూమిని వదులు కోవాలి. దానికి వారెందుకు సిద్హపడుతారు? అదీ, కీలుబోమ్మలాంటి ప్రభుత్వాల అండదండ వుండగా. (వారేమైనా సీమ వాసులా దాదాపు 50 వేల ఎకరాలు సాగునీటి భూమిని, అదీ కేసి కాలువ కింద, కోల్పోతూ వందలాది గ్రామాలను ముంపుకు గురవుతూ సాగర్ కు ఓవర్ హెడ్ ట్యాంక్ గా, శ్రీశైలం రిజర్వాయర్ నిర్మాణానికి అంగీకరించడానికి). దాంతో, రహస్యంగా డిల్లీలో జూన్ 18 - 19, 2015 న జరిగిన కృష్ణా నది నిర్వహణ బోర్డు సమావేశంలో ఒక తీర్మానం ఆమోదిoపజేసుకున్నారు. సాగర్-ప్రకాశం బ్యారేజి మధ్యప్రాంతంలో లభ్యమయ్యే జలాలు కేవలం 20టిఎంసి లు మాత్రమె నని అందుకై మొత్తం నీటిని శ్రీశైలం నుoడే కృష్ణా డెల్టాకు సరఫరా జేయాలని నిర్నయంయ్యింది. ఈ విషయం కనీసం ప్రజాప్రతినిదులకైనా తెలుసా? అయినా తెలిసినా సీమ ప్రాంత రాజకీయనాయకులంతా కోస్తా ప్రాంత బానిసలే కదా! ఇదీ బచావత్ నిర్ణయం అమలు. వడ్డించే వాడు మనవాడైతే, పంక్తిలో చివర కూర్చున్నా నష్టమేమీ వుండదు - అనే సామేత కృష్ణా జలాల వాడుకంలో సరిగ్గా సరిపోతుంది.

ఇక రెండవది శ్రీశైలం నుండి సాగర్ కు కేటాయించిన నీరు విడుదల జేస్తున్నప్పుడు విద్యుత్ ను ఉత్పత్తిని జేయాలని బచావత్ ఆదేసిస్తుంది. కానీ, గత పది సం.లుగా ఇరు రాష్ట్ర ప్రభుత్వాలు సాగర్ కు నీటి అవసరం లేకున్నా విద్యుత్ అవసరాల పేరుతొ వందలాది టిఎంసి లను సనుద్రం పాలు జేసాయన్నది కాదనలేని వాస్తవం. అంతేకాదు కనీస నీటిమట్టాన్ని 834 అడుగులకు కుదించి పోతిరెడ్డిపాడుకు నీరందకుండా సీమను ఎండబెట్టి నీటిని కిందికి తరలించిన ప్రభుత్వాలు మనవి. అంతేకాదు తాను నిర్దేశించిన కనీసనీటి మట్టం 834 అడుగుల నిబంధనలూ ఉల్లంఘిస్తూ శ్రీశైల నీటిమట్టం 789 అడుగులు చేరేదాక సాగర్ కు నీరు తరలించిన ప్రభుత్వాలు మనవి. మరి ఇవన్నీ బచావత్ తీర్పు ఉల్లంఘనలు కాదా? శ్రీశైలం నుండి కిందికి వెళ్ళిన వరద నీరంతా కృష్ణా జలాలే కాదు. అందులో తుంగభద్రా జలాలు వున్నాయి. తుంగభద్రా డ్యాం పూడికవల్ల దాని నిల్వ సామర్థ్యం తగ్గడంతో నీరంతా కేటాయించిన వారికందక, కృష్ణలో కలిసి వరదను పెంచడం జరిగిందనేది వాస్తవం.


కేసి కాలువకు కేటాయించిన నీటిని నిలుపుకునేందు గుండ్రేవుల జలాశయం నిర్మించాలని దశాబ్దాలుగా సీమవాసులు డిమాండ్ చేస్తున్నా ఏ పార్టీ పట్టించుకోలేదు. 2019ఎన్నికల ముందు చంద్రబాబు నిర్మాణానికి పాలనా అనుమతులిచారు. ఇప్పుడు ఆ ఊసేలేదు.శఇక మూడు దశాబ్దాలకు పైగా నిర్మాణంలో వున్నా హంద్రీ-నీవా, గాలేరు-నగరి, తెలుగుగంగ, వెలిగొండ ప్రాజెక్టులు ఇంకా నిర్ధాణ దశలోనే వున్నాయి. కొన్నింటికి పంట కాలువుల ఊసే లేదు. అవన్నీ పూర్తయివుంటే కృష్ణా జలాలు వాటికి తరలించివుంటే నేటి వరద పరిస్థితి అంత ఘోరంగా వుండేది కాదు. అంతెందుకు ఎప్పుడో ముగ్గురు ఇంజనీరింగ్ చీఫ్ లు సిఫారసు జేసినా సిద్దేశ్వరం అలుగు నిర్మాణ జేసివుంటే శ్రీశైలం పై వరద ఒత్తిడి తగ్గి వుండేది. సీమ కరువు బారినుండి కాపాడబడేది. అదేవిధంగా తుంగభద్రా సమాంతర కాలువ వేదవతి ప్రాజెక్టులను పట్టిసీమ లాగా నిర్మించి వుంటే కృష్ణపై వరద వత్తిడి తగ్గేది.


సీమపట్ల వివక్షత,బచావత్ తీర్పు ఉల్లంఘనలు వెరసి నేది విజయవాడా వరదబారిన పడడానికి ఒక కారణంగా చెప్పవచ్చు. గతంలో ఎన్నడూ జరగలేడుగా అనవచ్చు. వయనాడు భీభత్సం గతం లో ఎన్నడూ జరగలేదు. విపత్తు సంభావించాకనయినా దానికి కారణాలను నిస్పక్షపాతంగా విశ్లేషిస్తే భవిష్యత్తులో ఇలాంటివి జతగాకుండా నివారించవచ్చు. ఇప్పుడు జరిగిన నష్టం కన్నా మూసి, మున్నేరు నీటిని నిలుపుకునేందుకు అవసరమైన జలాశయాల నిర్మాణం ఎక్కువ నష్టం జేయదు. ఆ విధంగా శ్రీశైలం నుండి కృష్ణా డెల్టా నీటి అవసరాల తప్పిస్తే (పట్టిసీమ 80 టిఎంసి+ నాగార్జునసాగర్-ప్రకాశం బ్యారేజి మధ్యన లభ్యమయ్యే 101.2 టిఎంసి=181.2 టిఎంసి) రాయలసీమకు మేలు జరుగుతుంది, కృష్ణా డెల్టాకు నష్టం వుండదు. “స్వంత లాభము కొంత మానుక/పొరుగువారి తోడుపడవోయ్” అన్నాడు గురుజాడ. ఇక్కడ స్వంతలాభము మానుకోవలసిన అవసరం లేదు. సీమ రాజకీయనాయకు లెవ్వరూ పట్టించుకొనే పరిస్థిలో లేరు, కనీసమాన్ని ప్రాంతాల ప్రజాస్వామ్య వాడులైనా ప్రభుత్వం ఒత్తిడి తేవాలని కోరుతున్నాను.


(అరుణ్, రాయలసీమ యాక్టివిస్టు, కర్నూలు)


Similar News