ప్రణాళికా లోపమే శబరిమలలో సమస్యలకు కారణమా?

శబరిమల మాస్టర్‌ ప్లాన్‌ కొంత ఉపశమనం కలిగించవచ్చు. అయితే భక్తుల రద్దీని క్రమబద్దీకరించడం కూడా అవసరమే..

Update: 2023-12-15 12:15 GMT

కేరళ(Kerala)లోని శబరిమల పుణ్యక్షేత్రం(Sabarimala Temple)లో చాలా సమస్యలకు భారీగా వస్తున్న యాత్రికులే కారణం కావచ్చు. కానీ చాలా ఏళ్ల నుంచి ఇక్కడకు వస్తున్న భక్తులు మాత్రం శబరిమలలో నిర్వహణ సరిగా లేదని ఆరోపిస్తున్నారు. సరైన సౌకర్యాలు లేవంటున్నారు. పంపా, నిలక్కల్‌ బేస్‌ క్యాంపుల్లో రవాణ, మౌలిక సదుపాయాల లేకపోవడం స్పష్టంగా కనిపిస్తుంది. సౌకర్యాలు కల్పనలో ప్రభుత్వం విఫలమైందని భక్తులు ఆరోపిస్తున్నారు. ఆహారం, నీళ్లు కూడా దొరకడం లేదని, దర్శనం కోసం 18 గంటల పాటు క్యూల్లో నిలబడాల్సి వస్తుందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

పొరుగు రాష్ట్రాలైన తమిళనాడు, తెలంగాణ నుంచి అధిక సంఖ్యలో వచ్చే భక్తుల విషయంలో పోలీసులకు, ట్రావెన్‌కోర్‌ బోర్డుకు మధ్య వాగ్వాదం జరిగినట్లు సమాచారం. తిరుపతి మోడల్‌ క్యూ కాంప్లెక్స్‌లాగా తీర్చిదిద్దే విధానంపై చర్చ జరుగుతోంది.

కాలానుగుణ తీర్థయాత్ర..

శబరిమల తీర్థయాత్ర కాలానుగుణంగా జరిగేది. దక్షిణ భారతదేశంలోని తిరుపతి లేదా ఇతర దేవాలయాలకు పూర్తి భిన్నంగా ఉంటుంది.

పతనంతిట్ట జిల్లాలో ఉన్న శబరిమల ఆలయం తిరువనంతపురం నుంచి 170 కి.మీ దూరంలో ఉంది. ఇది పెరియార్‌ టైగర్‌ రిజర్వ్‌లోని 18 కొండల మధ్య ఉంటుంది. ఈ కొండల్లో నిర్మాణాల చేపట్టడం చాలా కష్టం.

శబరిమల మాస్టర్‌ ప్లాన్‌లో భాగమైన పైప్‌లైన్‌ నిర్మాణం కొంత ఉపశమనం కలిగించినా.. భక్తుల రద్దీని తగ్గించడం చాలా అవసరమని అధికారులు చెబుతున్నారు.

2005 నుంచి ప్రభుత్వం పరిశీలనలో ఉన్న మాస్టర్‌ ప్లాన్‌లో వివిధ అంశాలున్నాయి. ట్రాఫిక్‌, రవాణ, ఘన వ్యర్థాలు, పారిశుధ్యం, బేస్‌ క్యాంపుల అభివృద్ధి, యాత్రికుల కోసం లాజిస్టిక్స్‌, ఆరోగ్య సంరక్షణ, ఆసుపత్రి వంటివి ఉన్నాయి. అలాగే భక్తులకు సౌకర్యాలు, కమ్యూనికేషన్‌ మౌలిక సదుపాయాలు, విపత్తు నిర్వహణ అందులో భాగమే.

సమస్యలు అనేకం..

పెరిగిపోతున్న యాత్రికులకు సరిపడా వసతులు లేవు. సమస్యల పరిష్కారానికి మాస్టర్‌ ప్లాన్‌ పూర్తిగా అమలు చేయాల్సి ఉంది. కొన్నింటిని అమలు చేయగా.. మరికొన్ని వివిధ దశల్లో ఉన్నాయి. నిలక్కల్‌, ఎరుమేలి, ఉప్పుపర వద్ద అదనపు బేస్‌ క్యాంపులను అభివృద్ధి చేయడం, వండిపెరియార్‌ వద్ద రవాణా సౌకర్యం కల్పించడం, శబరిమల పుణ్యక్షేత్రానికి వెళ్లే ట్రెక్కింగ్‌ మార్గాన్ని అభివృద్ధి చేయాల్సి ఉంది.

శబరిమలలో కార్యకలాపాలను సమన్వయం చేయడానికి శబరిమల డెవలప్‌మెంట్‌ అథారిటీని రూపొందించడానికి ప్రభుత్వం చట్టాన్ని రూపొందించే ఆలోచనలో ఉంది.

‘‘బేస్‌ క్యాంప్‌లో అన్ని సౌకర్యాలు కల్పించినా.. గర్భగుడిలోకి ప్రవేశించే 18 ఇరుకైన మెట్ల వద్ద భక్తులు ఇబ్బంది పడుతున్నారు. నిమిషానికి 70-75 మంది కంటే ఎక్కువ మంది అనుమతించడం అసాధ్యం.’’ అని చాలా సంవత్సరాలుగా మెట్ల దగ్గర విధులు నిర్వహిస్తున్న ఒక పోలీసు అధికారి చెప్పారు. ‘‘మేము భక్తుల సంఖ్యను పెంచేందుకు ప్రయత్నిస్తే.. అది తొక్కిసలాటకు దారితీయవచ్చు’’ అని పోలీసు అధికారి పేర్కొన్నారు.

ఆలయాన్ని చేరుకోవడానికి ట్రెక్కింగ్‌ చేయడం ఒక్కటే మార్గం. సంప్రదాయ కాలిబాట ద్వారా మాత్రమే అక్కడికి చేరుకోవచ్చు. ఈ కాలిబాట రెండు భాగాలుగా ఉంటుంది.

మొదటిది.. ఎరుమేలి-పంపా కాలిబాట. ఇది దాదాపు 40 కి.మీ.లు ఉంటుంది. దీనిని ‘‘పెరియ పతై’’ (సుదీర్ఘ కాలిబాట)గా పేర్కొంటారు. రెండో మార్గంలో పంపా నుంచి శబరిమల దేవాలయం మధ్య ఐదు కిలోమీటర్ల దూరం ఉంటుంది. బాగా ఎత్తుమీదకు నడవాల్సి ఉంటుంది.

రోజుకు 1,20,000 మంది భక్తులు శబరిమలకు వస్తారని, సుమారు 20,000 మంది స్పాట్‌ బుకింగ్‌ను ఉపయోగించుకోగా 5,000 మంది భక్తులు ట్రెక్కింగ్‌ మార్గం ద్వారా చేరుకుంటారని ఆలయ వ్యవహారాల విభాగం (దేవాస్వామ్‌) అధికారులు చెబుతున్నారు.

చెన్నైలో వరదలు, తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల కారణంగా భక్తుల సంఖ్య కొంత తగ్గినా ప్రస్తుతం వారి సంఖ్య పెరిగిందని ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ పేర్కొన్నారు. పెరిగిన రద్దీ దృష్ట్యా దర్శన సమయాన్ని గంట పొడిగించినట్లు ఆయన తెలిపారు.

ప్రతి గంటకు 4,200 మంది భక్తులు 18 మెట్ల గుండా వెళతారు. వాస్తవంగా గంటకు 3,800 నుంచి 3900  భక్తులు వెళ్లాలి. ఈ సారి భక్తులలో 30 శాతం మంది వృద్ధులు, పిల్లలు ఉండడమే ఈ వ్యత్యాసానికి కారణమని చెప్పవచ్చు. ఫలితంగా నిలక్కల్‌ పంపా వద్ద రద్దీ పెరిగిపోయిందని మందిరంలో సౌకర్యాలను పరిశీలిస్తున్న దేవస్వామ్‌ మంత్రి కె రాధాకృష్ణన్‌ చెప్పారు. ఆలయంలో ఇలాంటి సమస్య రావడం ఇదే మొదటిసారి కాదని తెలిపారు.

2015లో యాత్రికులు 15 గంటల పాటు నిరీక్షించారని గుర్తు చేశారు. ‘‘ఎన్నికలు సమీపిస్తున్నందున కొంతమంది వ్యక్తులు, మీడియా సమస్యను భూతద్దంలో చూపుతోందని మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు.



దేవదాయ శాఖా మంత్రి కె. రాధాకృష్ణన్‌ కె.ఎస్‌.ఆర్‌.టి.సి బస్సులో నిలక్కల్‌ నుంచి పంబకు వెళుతున్న దృశ్యం 

కేరళ ప్రభుత్వంపై విమర్శలు..

క్యూ కాంప్లెక్స్‌లో సౌకర్యాల లేమిపై పలువురు భక్తులు అసంతృప్తి వ్యక్తం చేశారు. ‘‘నేను గత 40 సంవత్సరాలుగా ఇక్కడికి వస్తున్నాను. ఈ రకమైన హడావిడి మునుపెన్నడూ చూడలేదు’’ అని మలప్పురం జిల్లాకు చెందిన కుమార గురుక్కల్‌ అన్నారు. ‘‘అధికారులు ముందుగానే ఊహించి, భక్తుల రద్దీని నియంత్రించడానికి ప్లాన్‌ చేసి ఉండాలి.’’ అని చెప్పారు.

స్వామి దర్శనానికి వెళ్తూ మార్గం మధ్యలో గుండె, కిడ్నీ సంబంధిత వ్యాధులతో బాధపడుతున్న 10 ఏళ్ల బాలికతో సహా ముగ్గురు భక్తులు ప్రాణాలు కోల్పోయారు.

యాత్రికులకు తగిన సౌకర్యాలు కల్పించడంలో రాష్ట్ర ప్రభుత్వం, ట్రావెన్‌కోర్‌ దేవస్థానం బోర్డ్‌ విఫలమైందని కాంగ్రెస్‌ నాయకుడు వీడీ సతీశన్‌ ఆరోపించారు. భక్తుల సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వం లేదా బోర్డు బాధ్యతగా వ్యవహరించడం లేదన్నారు.

‘‘అధిక రద్దీ కారణంగా అనేక మంది యాత్రికులు తమ తీర్థయాత్రను తగ్గించుకుంటున్నారు. దేవదాయ శాఖ మంత్రి 44 రోజుల పర్యటనలో ఉన్నందున పరిస్థితి అదుపు తప్పిన ఐదు రోజుల తర్వాత ముఖ్యమంత్రి (Pinarayi Vijayan) ఆన్‌లైన్‌ సమావేశానికి పిలుపునిచ్చారని’’ సతీశన్‌ పేర్కొన్నారు.

కాంగ్రెస్‌(Congress) ఎంపీ షషీ థరూర్‌ (MP Shashi Tharoor) స్పందించారు. ‘‘శబరిమల భక్తులకు సౌకర్యాలు కల్పించడంలో ముఖ్యంగా రవాణ, వైద్యం, ఆహారం, నీళ్లు సమకూర్చడం, పటిష్ఠ బందోబస్తు కల్పించడంలో కేరళ ప్రభుత్వం విఫలమైందని’’ పేర్కొన్నారు.

Tags:    

Similar News