రాష్ట్రాలు కేంద్రానికి మోకరిల్లేలా చేయడమే మోడీ విధానమా?
దీర్ఘ కాలంగా బీజేపీ రాజకీయాలను తిరస్కరిస్తున్న దక్షిణాది ప్రజల గొంతు నొక్కే ప్రయత్నం జరుగుతున్నది.;
బీజేపీ విస్తరణ వాద కాంక్ష భారత దేశంలో అనేక వివాదాలతో పాటు, ఉత్తరాది, దక్షిణాది రాష్ట్రాల ప్రజల మధ్య కూడా విద్వేషాలు, మానసిక దూరం పెరిగేలా చేస్తున్నది. ఇప్పటికే కేంద్రం వసూలు చేస్తున్న పన్నులలో, దక్షిణాది రాష్ట్రాల నుండీ వశూలవుతున్న పన్నులు ఎక్కువగా ఉంటున్నాయి. కానీ ఈ రాష్ట్రాలకు కేంద్రం నుండీ వెనక్కు వస్తున్న పన్నుల వాటా తగ్గిపోయి అన్యాయానికి గురవుతున్నాయి.
ఇప్పటికే, ముస్లిం ప్రజల పట్ల మత విద్వేషాన్ని పెంచే రాజకీయాలతో, దేశమంతా విస్తరించిన బీజేపీ తాజాగా పార్లమెంటు స్థానాలను అమాంతం పెంచే “డీ లిమిటేషన్” ఆలోచనలతో, శాశ్వతంగా దక్షిణాదిపై , ఉత్తరాదికి ఆధిపత్యం ఉండేలా పన్నాగం పన్నుతున్నది. తద్వారా , సుదీర్ఘ కాలంగా బీజేపీ రాజకీయాలను తిరస్కరిస్తున్న దక్షిణాది ప్రజల గొంతు నొక్కేయాలని ప్రయత్నం చేస్తున్నది.
భారతదేశం ఒక సమాఖ్య (ఫెడరల్) వ్యవస్థను అనుసరిస్తుంది, ఇందులో కేంద్రం, రాష్ట్రాల మధ్య ఆర్థిక అధికారాలు స్పష్టంగా విభజించబడ్డాయి. కేంద్ర ప్రభుత్వం పన్నులు వసూలు చేయడం,వాటిని రాష్ట్రాలతో పంచుకోవడం రాజ్యాంగంలోని నిబంధనల ద్వారా నిర్దేశించబడింది. కానీ మోడీ ప్రభుత్వం ఫెడరల్ స్పూర్తికి పూర్తి భిన్నంగా వ్యవహరిస్తూ, రాష్ట్రాల హక్కులను, అధికారాలను హరిస్తున్నది. రాష్ట్రాలు అనివార్యంగా కేంద్రం సహాయం కోసం చూసేలా విధానాలను రచిస్తున్నది. అమలు చేస్తున్నది.
ఇప్పటికే దక్షిణాది రాష్ట్రాలు (తమిళనాడు, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కేరళ) భారతదేశ GDPలో గణనీయమైన భాగాన్ని సమకూరుస్తున్నాయి. ఈ రాష్ట్రాలు పారిశ్రామికీకరణ, సేవా రంగ విస్తరణ , ఇతర వాణిజ్య కార్య కలాపాల ద్వారా కేంద్ర ప్రభుత్వానికి ఎక్కువ పన్నులు చెల్లిస్తాయి.
ఉత్తరాది రాష్ట్రాలలో (ఉత్తరప్రదేశ్, బీహార్, మధ్యప్రదేశ్ వంటివి) జనాభా ఎక్కువగా ఉన్నప్పటికీ, ఆర్థిక ఉత్పాదకతలో తక్కువ వాటాను కలిగి ఉంటాయి, దీని వల్ల వాటి పన్ను వసూళ్లు తక్కువగా ఉంటాయి.
కేంద్ర ప్రభుత్వం ఆర్థిక సంఘం సిఫారసుల ఆధారంగా రాష్ట్రాలకు నిధులను కేటాయిస్తున్నది. నిధుల కేటాయింపు కోసం రాష్ట్ర జనాభా, పేదరికం, రాష్ట్రాల ఆర్థిక అవసరాలు వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుంటారు.
ఫలితంగా జనాభా ఎక్కువగా ఉన్న ఉత్తరాది రాష్ట్రాలకు ఎక్కువ నిధులు అందుతున్నాయి. దక్షిణాది రాష్ట్రాలకు తక్కువ నిధులు అందుతున్నాయి. ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాలు,కేంద్రానికి చెల్లిస్తున్న పన్నుల మొత్తంతో పోల్చినప్పుడు, ఆయా రాష్ట్రాలకు పన్నుల వాటాగా కేంద్రం నుండీ తక్కువ నిధులు తిరిగి వస్తున్నాయి.
ఉదాహరణకు, కేంద్రానికి ఒక రూపాయి పన్ను చెల్లించిన దక్షిణాది రాష్ట్రాలకు కేంద్రం నుండీ సగటున 40 పైసల కంటే తక్కువ పన్నుల వాటాగా తిరిగి వస్తున్నది. బీహార్ వంటి రాష్ట్రాలు కేంద్రానికి 1 రూపాయి పన్ను చెల్లించి, పెరిగిన జనాభా సంఖ్య , పేదరికం కారణంగా సగటున కేంద్రం నుండీ 7 రూపాయలు పొందుతున్నాయి.
15వ ఆర్థిక సంఘం (2021-2026) తన సిఫారసుల అమలుకు జనాభా సంఖ్య కు సంబంధించి 1971 జనాభా గణాంకాలకు బదులు, 2011 జనాభా గణాంకాలను ప్రామాణికంగా తీసుకోవడం వల్ల దక్షిణ రాష్ట్రాలు నష్ట పోతున్నాయి. దక్షిణాది రాష్ట్రాలు గత 50 ఏళ్లలో జనాభా నియంత్రణ పద్ధతులు పాటించాయి. తద్వారా జనాభా వృద్ధి రేటు తక్కువగా ఉండి, జనాభా తగ్గింది. ఇదే కాలంలో ఉత్తరాది రాష్ట్రాల్లో జనాభా నియంత్రణ పద్ధతులు సీరియస్ గా పాటించకపోవడం వల్ల జనాభా వృద్ధి రేటు ఎక్కువగా ఉండి, ఆయా రాష్ట్రాలలో జనాభా గణనీయంగా పెరిగింది.
కేంద్రం దగ్గర జమయ్యే పన్నుల చెల్లింపు నిధుల నుండి మాత్రమే పన్నుల వాటాగా రాష్ట్రాలు నిధులు పొందుతున్నాయి. కానీ 2014 తరువాత మోడీ ప్రభుత్వం ప్రజలపై విధించే వివిధ రకాల సెస్ లు, సర్ చార్జీల ద్వారా భారీగా ఆదాయం పొందుతున్నది. కానీ ఈ నిధులను రాష్ట్రాలకు కూడా వాటాగా పంచడం లేదు. దీనివల్ల దక్షిణ రాష్ట్రాలు తమ ఆదాయంలో గణనీయమైన భాగాన్ని కోల్పోతున్నాయి. .
2014-2024 మధ్య కాలంలో దక్షిణాది రాష్ట్రాలు రాష్ట్రాల వారీగా కేంద్రానికి చెల్లించిన పన్నులు, కేంద్రం నుండి అందుకున్న ఆర్థిక సహాయం ఇలా ఉన్నాయి.
భారత దేశ స్థూల ఆర్ధిక ఉత్పత్తిలో (GDP) లో సుమారు 8-9 శాతం వాటా కలిగి ఉంది. 2014-15లో ఈ రాష్ట్రం నుండీ సుమారు రూ. 1.5 లక్షల కోట్ల రూపాయల పన్నులు కేంద్రానికి అందగా, 2022-23 నాటికి ఇది సంవత్సరానికి రూ. 3.5 లక్షల కోట్ల రూపాయలకు పెరిగింది (GST, ఆదాయపు పన్ను, కార్పొరేట్ పన్ను). అంటే 10 సంవత్సరాలలో తమిళ నాడు నుండీ కనీసం 25-28 లక్షల కోట్ల రూపాయలు, పన్నుల రూపంలో కేంద్రానికి అందాయి.
కానీ 14వ ఆర్థిక సంఘం (2015-20 )కాలంలో తమిళనాడుకు,కేంద్రం ద్వారా సంవత్సరానికి సుమారు రూ. 40,000 నుండీ 50,000 కోట్ల రూపాయల నుధులు మాత్రమే అందాయి. 15వ ఆర్థిక సంఘం (2021-24) కాలంలో తమిళనాడుకు సంవత్సరానికి రూ. 50,000 నుండీ 60,000 కోట్ల రూపాయల నుధులు మాత్రమే అందాయి. అంటే పదేళ్ళ కాలంలో (2014-24) తమిళ నాడు కు అందిన నిధులు రూ. 5-6 లక్షల కోట్లు మాత్రమే. అంటే తమిళనాడు చెల్లించిన పన్నులతో పోలిస్తే 20-25 శాతం మాత్రమే తిరిగి ఆ రాష్ట్రం పన్నుల వాటాగా పొందుతోంది.
భారత దేశ GDP లో కర్ణాటక రాష్ట్రం 7-8 శాతం వాటా కలిగి ఉంది. 2014-15 లో కేంద్రానికి పన్నుల రూపంలో రూ. 1. 2 లక్షల కోట్లు చెల్లించిన కర్ణాటక, 2022-23లో రూ. 3 లక్షల కో ట్లు చెల్లించింది. అంటే 2014-2024 సంవత్సరాల మధ్య మొత్తం రూ. 20-23 లక్షల కోట్లు చెల్లించిందన్నమాట.
కానీ, 14వ ఆర్థిక సంఘ సిఫారసుల కాలంలో సంవత్సరానికి కేంద్రం నుండీ కర్ణాటక సంవత్సరానికి కేవలం 40,000 నుండీ 45,000 కోట్లు మాత్రమే పన్నుల వాటాగా పొందింది. అదే 15వ ఆర్థిక సంఘం కాలంలో కర్ణాటక సంవత్సరానికి రూ. 45,000 నుండీ 55,000 కోట్లు మాత్రమే పన్నుల వాటాగా పొందింది. మొత్తంగా కర్ణాటక 2014-2023 మధ్య కాలంలో కేంద్రం నుండీ రూ. 4.5 నుండీ 5.5 లక్షల కోట్లు మాత్రమే (20-25 శాతం) పన్నుల వాటాగా పొందింది.
దేశ GDP లో ఆంధ్రప్రదేశ్ వాటా 4-5 శాతం. 2014-15లో కేంద్రానికి ,ఆంద్ర ప్రదేశ్ చెల్లించిన పన్నులు రూ. 80,000 కోట్లు కాగా, 2022-23 నాటికి అవి సంవత్సరానికి రూ. 1.8 లక్షల కోట్లకు పెరిగాయి. అంటే 2014-2023 మధ్య కాలంలో మొత్తం రూ. 12 నుండీ 15 లక్షల కోట్లు పన్నుల రూపంలో కేంద్రానికి చెల్లించింది.
కానీ 14వ ఆర్థిక సంఘం సిఫారసుల ప్రకారం పన్నుల వాటాగా సంవత్సరనికి కేవలం రూ. 40,000 కోట్లు మాత్రమే ఆంధ్ర ప్రదేశ్ పొందింది . విభజన తర్వాత కొన్ని ప్రత్యేక గ్రాంట్లు అందుకుంది.
అదే 15వ ఆర్థిక సంఘం సిఫారసుల ప్రకారం సంవత్సరానికి రూ. 50,000 నుండీ 60,000 కోట్లు మాత్రమే పన్నుల వాటాగా అందుకుంది. అనే 2014-2023 మద్య కాలంలో కేంద్రానికి మొత్తం: రూ. 5-6 లక్షల కోట్లు మాత్రమే ( 35-40 శాతం) ఆంధ్ర ప్రదేశ్ పన్నుల వాటాగా పొందింది.
భారత దేశ జీడీపీ లో తెలంగాణ వాటా 4-5 శాతం. 2014-15 లో కేంద్రానికి రూ. 70,000 కోట్లు పన్నులు చెల్లించిన తెలంగాణ 2022-23 లో రూ. 2 లక్షల కోట్లు కేంద్రానికి పన్నుగా చెల్లించింది. .అంటే 2014-2023 మధ్య కాలంలో కనీసం 12 నుండీ 14 లక్షల కోట్ల పన్నులు చెల్లించిందన్నమాట. 14వ ఆర్థిక సంఘం సిఫారసుల ప్రకారం సంవత్సరానికి : రూ. 25,000 నుండీ 30,000 కోట్లు పన్నుల వాటాగా పోయిందిన తెలంగాణ 15వ ఆర్థిక సంఘం సిఫారసుల ప్రకారం 35,000 నుండీ 40,000 కోట్లు.పన్నుల వాటాగా పొందింది. అంటే మొత్తం 2014-2023 మధ్య కేవలం 3.5 నుండీ 4 లక్షల కోట్లు (25-30 శాతం) మాత్రమే పన్నుల వాటా పొందిందన్నమాట.
భారత దేశ జీడీపీ లో కేరళ వాటా 3-4 శాతం. 2014-15లో కేంద్రానికి రూ. 50,000 కోట్లు పన్నులు చెల్లించిన కేరళ, 2022-23లో రూ. 1.2 లక్షల కోట్లు చెల్లించింది. అంటే 2014-2023 మధ్య కాలంలో సుమారు 8-10 లక్షల కోట్ల పన్నులు చెల్లించింది .
కానీ 14వ ఆర్థిక సంఘం సిఫారసుల ప్రకారం 25,000 నుండీ 30,000 కోట్లు పన్నుల వాటా పొందిన కేరళ, 15వ ఆర్థిక సంఘం సిఫారసుల ప్రకారం సంవత్సరానికి రూ. 20,000 నుండీ 25,000 కోట్లు మాత్రమే పన్నుల వాటాగా పొందుతున్నది. వాటా తగ్గడం వల్ల). 2014-2023 మధ్య కాలంలో మొత్తం 2.5 నుండీ 3 లక్షల కోట్లు (25-30 శాతం) మాత్రమే పన్నుల వాటాగా పొందింది.
2014-2024 కాలంలో కేంద్రం సెస్ , సర్‌చార్జీల పేరుతో ఎంత వసూలు చేసింది ?
దక్షిణాది రాష్ట్రాల (తమిళనాడు, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కేరళ) నుండి రాష్ట్రాల వారీగా వసూలు చేసిన సెస్, సర్ చార్జీల మొత్తాన్ని ఖచ్చితంగా నిర్ధారించడానికి అధికారిక డేటా అవసరం. అయితే, కేంద్ర పన్నులు, సుంకాల శాఖ లేదా ఆర్థిక మంత్రిత్వ శాఖ నుండి రాష్ట్రాల వారీగా విభజన డేటా సాధారణంగా ప్రచురించదు. సెస్ లు, సర్ చార్జీలను, కేంద్రం పన్ను ఆదాయంగా కాకుండా విడిగా వసూలు చేస్తున్నది. ఈ మొత్తాలను కేంద్రం రాష్ట్రాలతో పంచుకోవడం లేదు. ఈ సెస్ లు, సర్ ఛార్జీలు (ఆర్టికల్ 270 ప్రకారం డివైడబుల్ పూల్‌లో చేరవు). అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మొత్తం దేశం నుండి వసూలైన సెస్, సర్‌చార్జీ ల డేటాను పరిశీలించి, దక్షిణాది రాష్ట్రాల GDP వాటా ఆధారంగా ఈ రాష్ట్రాల నుండే ఒక అంచనా వేయవచ్చు.
సెస్: విద్యా సెస్, స్వచ్ఛ భారత్ సెస్, కృషి కల్యాణ్ సెస్ (GSTకి ముందు), ఆరోగ్య, విద్యా సెస్ (2018 నుండి) వంటివి ఉన్నాయి.
సర్‌చార్జ్: ఆదాయ పన్ను, కార్పొరేట్ పన్నుపై విధించబడే అదనపు ఛార్జీలు, ఉదాహరణకు, 10 శాతం లేదా 15 శాతం సర్‌చార్జ్ (ఆదాయం ఆధారంగా).
2014-15 లో సెస్, సర్‌చార్జీల ద్వారా వసూలైన మొత్తం రూ. 1 లక్ష కోట్లు కాగా, కేంద్ర బడ్జెట్ గణాంకాల ప్రకారం 2022-23 నాటికి ఇది రూ. 5 లక్షల కోట్లకు పైగా పెరిగింది.
దక్షిణాది రాష్ట్రాలు భారత దేశ GDP లో సుమారు 30-32 వరకూ వాటా అందిస్తాయి. (2014-2024 సగటు). ఈ సగటు వాటా ఆధారంగా, సెస్ మరియు సర్‌చార్జీలలో దక్షిణాది రాష్ట్రాల వాటా ఇదే శాతం లో ఉంటుందని అంచనా వేయవచ్చు.
ఈ క్రింది గణాంకాలు 2014-2024 మధ్య కాలంలో దేశంలో వసూలైన సెస్ మరియు సర్‌చార్జీల మొత్తం ఆధారంగా దక్షిణాది రాష్ట్రాలకు సంబంధించిన అంచనాలను తెలియ చేస్తాయి.
దేశవ్యాప్తంగా మొత్తం సెస్, సర్‌చార్జ్ వసూళ్లు 2014-15 :లో రూ. 1.05 లక్ష కోట్లు కాగా 2017-18 నాటికి . 2.5 లక్ష కోట్లకు పెరిగాయి. (GST ప్రవేశం తర్వాత సెస్‌లు తగ్గాయి, సర్‌చార్జ్ పెరిగింది). ఇది 2022-23 నాటికి సంవత్సరానికి రూ. 5.2 లక్షల కోట్లకు పెరిగింది. అంటే 2014-2024 మధ్య కాలంలో సుమారు రూ. 25-30 లక్షల కోట్లు సెస్,సర్ ఛార్జీ ల వసూళ్లు ఉన్నట్లు అంచనా వేయవచ్చు. (10 సంవత్సరాల సగటు ఆధారంగా) దక్షిణాది రాష్ట్రాలు 30 శాతం సహకారం అందిస్తాయని భావిస్తే, దక్షిణాది చెల్లించిన మొత్తం సెస్, సర్ ఛార్జీలు సుమారు రూ. 7.5 నుండీ 9 లక్షల కోట్లు ఉండవచ్చు. అవుతుంది. దక్షిణాది రాష్ట్రాల GDP వాటా ఆధారంగా 2014-2024 మధ్య ఆయా రాష్ట్రాలు చెల్లించిన సెస్,సర్ ఛార్జీల అంచనా ఇది.
1. తమిళనాడు (GDP వాటా - 8-9 శాతం ) : అంచనా: రూ. 2 నుండీ 2.5 లక్షల కోట్లు
2. కర్ణాటక (GDP వాటా - 7-8శాతం ): అంచనా: రూ. 1.8 నుండీ 2.2 లక్షల కోట్లు
3. ఆంధ్రప్రదేశ్ (GDP వాటా - 4-5 శాతం ): అంచనా: రూ. 1.2 నుండీ 1.5 లక్షల కోట్లు
4. తెలంగాణ (GDP వాటా - 4-5 శాతం ): అంచనా : రూ. 1.2 నుండీ 1.5 లక్షల కోట్లు
5. కేరళ (GDP వాటా - 3-4 శాతం ): అంచనా: రూ. 0.8 నుండీ 1 లక్ష కోట్లు
రాష్ట్రాల వారీగా సెస్ మరియు సర్‌చార్జ్ వసూళ్ల ఖచ్చితమైన డేటా అధికారికంగా అందుబాటులో లేదు. ఈ అంచనాలు GDP వాటా మరియు మొత్తం పన్ను సహకారం ఆధారంగా ఈ అంచనాలు తయారయ్యాయి.
కానీ ఈ సెస్, సర్ ఛార్జీ ఆదాయంలో రాష్ట్రాలకు వాటా దక్కడం లేదు కాబట్టి , ఆయా రాష్ట్రాల ఆర్ధిక వనరుల కొరతను ఎదుర్కుంటున్నాయి. రాష్ట్రంలో వసూలయ్యే కొన్ని ప్రత్యేక పన్నులు, GST సహా కేంద్ర పన్నులలో వాటా మాత్రమే రాష్ట్రాల ఆదాయంగా ఉంది. లేదా రాష్ట్రాలు తాను ఇచ్చిన హామీలను అమలు చేయడానికి కొత్తగా భారీగా అప్పులను చేయవలసి వస్తున్నాయి. ఈ అప్పులు చేయడానికి కూడా FRBM నిబంధనల వల్ల కొన్ని పరిమితులు ఏర్పడుతున్నాయి. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వాలు, తమ ఆర్ధిక అవసరాలు తీర్చుకోవడానికి, ప్రభుత్వాల చేతుల్లో ఉండే భూమి లాంటి సహజ వనరులను అమ్ముకుని ఆదాయం పెంచుకోవాలని చూస్తున్నాయి. విలువైన వేలాది ఎకరాల ప్రభుత్వ భూములను, వాణిజ్య ప్లాట్లుగా మార్చి, అమ్ముకోవడానికి తెలంగాణ రాష్ట్ర గత ప్రభుత్వం కానీ, ఇప్పటి రేవంత్ సర్కార్ కానీ చేసిన ప్రయత్నాలను మనం చూస్తున్నాం.
భూమి లాంటి సహజ వనరులను అమ్ముకోవడం కాకుండా, పన్నుల వసూళ్లు, పంపిణీలో దక్షిణాది రాష్ట్రాలు ఎక్కువ స్వయంప్రతిపత్తి కోసం డిమాండ్ చేయాలి. పన్నుల వాటాను నిర్ణయించడానికి ఆర్థిక సంఘం తీసుకుంటున్న జనాభా ప్రాతిపదికను, ఇతర ప్రాతిపదికలను ప్రశ్నించాలి. పన్నులలో ఎక్కువ వాటా, సెస్‌ల ఆదాయంలో కూడా రాష్ట్రాలకు పంపిణీ లాంటివి తప్పకుండా డిమాండ్ చేయాలి. దక్షిణాది రాష్ట్రాలు కేంద్రంపై రాజకీయ ఒత్తిడి తెచ్చినిధుల పంపిణీకి 1971 జనాభా లెక్కలను ప్రాతిపదికగా తీసుకోవాలని డిమాండ్ చేయాలి. ఇందుకు దక్షిణాది రాష్ట్రాలు ఉమ్మడిగా ఉద్యమాలు నిర్మించాలి. ఈ ఉద్యమాలలో ప్రజలను భాగస్వాములను చేయాలి.