మహారాష్ట్ర ఎన్నిక పవన్ కల్యాణ్ కు గేమ్ ఛేంజర్ అవుతుందా?
పవన్ కళ్యాణ్ నేషనల్ పాలిటిక్స్ బాట పడతాడా!
By : శృంగవరపు రచన
Update: 2024-11-24 03:29 GMT
మొన్న ఆంధ్ర ప్రదేశ్ ఎన్నికల ఫలితాలు వచ్చే వరకూ ఈ వ్యక్తి ఎదుర్కున్న వ్యతిరేకత, ట్రోలింగ్ బహుశా ఈ మధ్య కాలంలో ఏ సినిమా స్టార్, రాజకీయ నాయకుడికి ఎదురై ఉండదు. సినిమా స్టార్స్ పై ఆరాధన ఉన్నా; సినిమాలు వేరు -రాజకీయాలు వేరు అని అనేకసార్లు ఓటర్లు ఎప్పుడో తేల్చేసారు. స్వయంగా రాజకీయాల్లో ఎదగాలంటే ప్రజలకు మేలు కలిగే పరిణామం ఏదో రాష్ట్ర చరిత్రలో నమోదు కావాలని తెలంగాణలో కెసి ఆర్ నిరూపించారు. అటువంటి సానుకూలత కూడా పవన్ కళ్యాణ్ కి లేదు.
కష్టంగా మారిన రాజకీయ ప్రవేశం:
ముందు రాజకీయాల్లో ప్రవేశించడమే సవాలుతో కూడిన పని. ఎలాగో సినీ స్టార్ ఇమేజ్ తోనో, కొంత పలుకుబడితోనో ఎమ్ ఎల్ ఏ గానో, ఇతర పదవుల్లోనో నామమాత్రంగా ఉండటం కూడా పెద్ద విషయం కానీ రోజులివి. కానీ పవన్ కళ్యాణ్ నామమాత్రపు వ్యక్తి కాదు. వ్యతిరేకతనైనా, సానుకూలతనైనా ప్రకంపనాలు పుట్టించే స్థాయిలోనే అందుకునే ఒక ప్రభావశీల వ్యక్తి. రాజకీయాలలో అడుగు పెట్టిన నాటి నుండి ఎన్నో ఎదురుదెబ్బలు. సిద్ధాంతాల్లో అస్పష్టత, అనేకసార్లు మాటల్లో గందరగోళం! ఆ సమయంలో సినిమా సక్సెస్ ట్రాక్ కూడా అద్భుతంగా అయితే లేదు. అయినా దేనికి తగ్గని నైజం. అందుకే ఎంతోమంది సినిమా స్టార్స్ కి సులువైన దశగా సాధ్యమైన రాజకీయ ప్రవేశం పవన్ కు మాత్రం క్లిష్టతరంగా మారింది.
కొత్త వ్యూహంతో సన్నద్ధత:
‘జనసేన’ అనే సొంత పార్టీ ఉన్నా, మెజారిటీ పక్కన పెడితే పోటీ చేసిన వాటిల్లో కూడా మినిమమ్ గారంటీ లేని పరిస్థితి ఓ వైపు. ఇంకోవైపు వ్యక్తిగత జీవితాన్ని ట్రోల్ చేస్తూ, పవన్ రాజకీయ నాయకుడిగా ఎలా అనర్హుడో తేల్చేసే సోషల్ మీడియా బులియింగ్ ఇంకో వైపు! ఈ సందర్భంలో పవన్ ఏం చేసినా విమర్శించడానికి సిద్ధంగా ఉన్న బృందాలు మరోవైపు! రాజకీయాల్లో వ్యక్తిగత పట్టుదలల కన్నా లౌక్యం, రాజకీయ సమీకరణాలను అర్థం చేసుకుని నడవడమే ఉత్తమం అని పవన్ కల్యాణ్ గ్రహించాకే కూటమి ప్రభుత్వానికి తన మద్ధతుని ఇచ్చాడు.
ఒక అండ లేకపోవడం వల్ల వెనుకబడినా, ఒక్క భరోసా ఉంటే మాత్రం ఎంతవరకైనా దూసుకుపోయే వ్యక్తి పవన్ కల్యాణ్. రాజకీయాలకు కావాల్సింది విపరీతమైన విషయ పరిజ్ఞానం, గంభీరమైన మనస్తత్వం కాదు; ఒక ఆవేశం, ప్రజల్లో కూడా అదే ఆవేశం పుట్టించగల భావోద్వేగ ప్రకటన అని రాజకీయాల్లో నిరూపించాడు పవన్ కల్యాణ్. తన రాజకీయ పద్ధతులు మారాయి కానీ వ్యక్తిగా అతను విషయాలపై స్పందించే తీరు, ఎనర్జీ మాత్రం మారలేదు. అందుకే ఎవరూ ఊహించని రీతిలో ఆంధ్రాలో అటు పాతుకుపోయిన టిడిపి,ఇటు బిజెపి సమిష్టి సక్సెస్ కి మూల కారణమయ్యాడు. పవన్ కల్యాణ్ మనస్తత్వానికి ఇది కొంత విరుద్ధం అని అనిపించినా, రాజకీయాల్లో ఎంతో నేర్చుకుంటూ ఎదుగుతున్న పరిణతి మాత్రం కొంత కనిపిస్తుంది.
మహారాష్ట్రలోనూ గేమ్ ఛేంజర్:
పవన్ కల్యాణ్ అధికరంలోకి వచ్చాక కల్తీ లడ్డు విషయంలో హఠాత్తుగా సనాతనిగా మారిపోవడం; కొంత వివాదాన్ని సృష్టించినా; ఆంధ్ర ఎన్నికల సక్సెస్ కి కారణంగా ఇండియా మొత్తం గుర్తింపు పొందిన పవన్; ఈ అంశంతో మళ్ళీ నేషన్ అటెన్షన్ ని ఆకర్షించాడు. ఇప్పుడు మహారాష్ట్ర ఎన్నికల నేపథ్యంలో మహారాష్ట్రలోని తెలుగు ప్రజలు ఉన్న నియోజకవర్గాల్లో పవన్ కల్యాణ్ ఈ నవంబర్ 16,17 తేదీల్లో పర్యటించి ‘మహాయుతి కూటమి’ పార్టీ కోసం ర్యాలీలు నిర్వహించారు, ప్రచారము చేశారు. అక్కడి తెలుగు ప్రజలు కూడా భారీ సంఖ్యలో ఆయన సభలకు రావడం విశేషం. ఇక్కడ తెలుగు వాళ్ళతో ఆయన కనక్ట్ ఇక్కడ ఆంధ్ర ఎన్నికల్లో లానే ఆయన ప్రచారం చేసిన నియోజకవర్గాల్లో మాత్రం గొప్ప విజయాన్ని సాధించింది.
సోలాపూర్ ఎం.ఎల్. ఏ పవన్ కల్యాణ్ కి కృతజ్ఞతలు తెలుపుతూ, తన విజయానికి పవన్ ప్రచారం కారణమని తెలపడం గమనార్హం. ఆంధ్రాలో ‘వై నాట్ 175?’ కి బలమైన సమాధానంతో మొదలైన పవన్ సృష్టించిన సక్సెస్ ట్రాక్ మహారాష్ట్రలోనూ నిలబడింది.
తమిళనాడులోనూ పవన్ హవా కొనసాగవచ్చా?
జయలలిత మరణం తర్వాత బలంగా స్థిరపడిపోయిన డీ ఎం కె పార్టీతో తలపడి విజయం సాధించడం మిగిలిన ఏ ప్రాంతీయ లేదా కేంద్ర స్థాయి పార్టీకి కూడా అంత సులువైన విషయం కాదు. కానీ తెలుగు జనాభా ఉన్న దక్షిణ రాష్ట్రాల్లో మాత్రం పవన్ కల్యాణ్ ప్రభావం తప్పక ఉంటుందని మహారాష్ట్ర ఎన్నికలతో స్పష్టం అయిపోయింది. కనుక ఈ సందర్భంలో ఈ అసాధ్యాన్ని కూడా పవన్ కల్యాణ్ సుసాధ్యం చేయొచ్చని కొందరు విశ్లేషకుల అభిప్రాయం.
‘మద్రాస్ లో దాదాపు మూడు కోట్ల తెలుగు జనాభా ఉంది. చెన్నైలోనే 16 నియోజకవర్గాల్లో అధిక సంఖ్యలో తెలుగు ప్రజలు ఉన్నారు. అలాగే పవన్ కల్యాణ్ ఈ మధ్య ఒక తమిళ చానల్ కి ఇంటర్ వ్యూ ఇవ్వడం, తమిళనాడు ఉపముఖ్యమంత్రి ఉదయానిధి స్టాలిన్ ఆయనను కామెంట్ చేయడం, విజయ్ పార్టీ పెట్టడం , విజయ్ కూడా కొంత పవన్ ను అనుకరించే అవకాశం ఉండటం; ఇవన్నీ తమిళ ప్రజలు గమనిస్తూ ఉంటారు. త్వరలో ప్రచారం మొదలయ్యే అవకాశం ఉంది. పవన్ కల్యాణ్ కి తమిళ్ రావడం కూడా గొప్ప ప్లస్ పాయింట్. ఆయన ఇక్కడ ప్రచారం చేస్తే అక్కడ తెలుగు వారు పవన్ కళ్యాణ వల్ల ఏకం అయ్యే అవకాశం ఉంటుంది.అది కూడా తమిళనాడు రాజకీయ సమీకరణాలను ప్రభావితం చేయొచ్చు’అని రాజకీయ విశ్లేషకులు సుబ్రహ్మణ్యం అభిప్రాయపడ్డారు.
విభిన్నంగా రాజకీయాల్లో ఎదుగుతున్న నాయకుడు:
ఈ నేపథ్యంలో పవన్ కల్యాణ్ మిగిలిన రాజకీయ నాయకుల కన్నా భిన్నగా ఎదుగుతున్నాడు అన్నది మాత్రం ఒప్పుకోవాల్సిన విషయం. సాధారణంగా ఒక రాష్ట్రానికో, పదవికో పరిమితమయ్యే మంత్రి పదవిలో ఉన్నా కూడా; దేశ రాజకీయాలపై ప్రభావం చూపే నాయకుడిగా గుర్తింపు పొందడం మామూలు విషయం కాదు. దీనికి ఉన్న కారణం ఆయన అధికారంలో ఉండటం కన్నా కూడా ‘ ఒక ఇంటెన్సిటితో కనక్ట్ అవ్వడం.’ అలాగే కరప్ట్ కానీ నాయకుడిగా పేరు ఉండటం. ఒక వ్యక్తిగా రాజకీయాల్లో ప్రస్తుతం ఎదుగుతున్న ఒకే నాయకుడు పవన్ కల్యాణ్ అనడంలో సందేహం లేదు. ఆయన చరిష్మా ఇలాగే కొనసాగితే బహుశా ఆయనకు పార్టీ మెజారిటీ లెక్కలు కూడా అవసరం లేనంత ‘విశ్వరూపంగా’ ఈ ఐదేళ్లలో ఎడగవచ్చు. బిజెపి దృష్టి తన మీద పడేలా చేసుకుని; ఒక నేషనల్ పొలిటీషియన్ గా ఎదుగుతున్న పవన్ కల్యాణ్ సృష్టించబోయే కొత్త చరిత్ర రాజకీయాలను ఇంకా ఎలాంటి మలుపులు తిప్పుతుందో వేచి చూడాల్సిందే!